జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 27 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 27
చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  

“ఇదంతా మీకెవరు చెప్పారు” ఇలాంటి గాలి కబుర్లు మోసుకు రావడం మంచిది  కాదనే ధోరణిలో అడిగాను.
“నేను ఒకరు  చెప్తే నమ్మే దాన్ని కాను సార్... స్వయంగా ఏకాంబరం పెండ్లామే చెప్పింది. మా ఇంటికెదుర్గానే వాళ్ళ షాపు అన్నానుగా. అప్పుడప్పుడు వచ్చి తన కష్ట సుఖాలు చెప్పుకుంటుంది.. ఏకాంబరం ఏమైనా అయిపోతే తన గతేంగాను” అంటూ కన్నీరు పెట్టుకుంది.
బిత్తర పోయాను..ఇలాంటి భార్యలూ ఉన్నారంటే నమ్మశక్యం గాలేదు.
కాని మరో వారంలో జరిగిన సంఘటన నమ్మక తప్పదని నిరూపించింది.
ఆరోజు శనివారం.. కాలేజీ సమయమై పోయింది. పిల్లంతా వెళ్ళిపోయారు. స్టాఫ్ కూడా బయలుదేరుతోం దని గమనించి కంప్యూటర్ గదికి తాళమేస్తుంటే కొండయ్య పరుగెత్తుకుంటూ వచ్చి “సార్.. ఏకాంబరం సారు  రైలు కింద పడి సత్తనని పట్టాల పొంటి పోతాండట. పిల్లలుర్కచ్చి ప్రిన్సిపాల్‍కు చెబ్తాండ్లు” అంటూ స్టాఫ్ కెదురు పరుగెత్తాడు.
ప్రిన్సిపాల్ గదినుండి నలుగురు పిల్లలు నా వద్దకు పరుగెత్తుకు వచ్చారు. విషయం తెలిసిందన్నట్లుగా పిల్లతో బాటు నేనూ పట్టాల వైపు పరుగుతీసాను.
ఏకాంబరం పట్టాలపై కూర్చొని పిచ్చి వాడిలా కంకరరాళ్ళను  తలపై తలంబ్రాలుగా పోసుకుంటున్నాడు.
ఏకాంబరం భార్య ప్రేమరాయబారం ఫెయిలయ్యిందని  నాకర్థమయ్యింది.
పిల్లలు రైల్వేస్టేషన్లో ఉప్పందించారనుకుంటాను.. ఇద్దరు రైల్వే పోలీసులు వచ్చారు. “మీరంతా ఎందు కొచ్చారు?.. పనీ పాటాలేదా..? హ్హహ్హహ్హా...” అంటూ ఉన్మాదిలా కేకలు వేయసాగాడు ఏకాంబరం. నన్ను చూడగానే గతుక్కుమన్నాడు.
“సునీత నాతో మాట్లాడ్డం మానేసింది.. నేను బతుకను.. ఛస్తా హ్హహ్హహ్హా..” ఛాతి గుద్దుకుంటూ పట్టాలపై అడ్డంగా పడుకోబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా లేపి దూరంగా చెట్టు కింద కూర్చోబెట్టారు. నాకంతా నాటకీయంగా కనబడుతోంది.
కొండయ్య నన్ను పక్కకు పిలిచి ఏకాంబరం ఇంట్లో జరిగే గొడవలు స్టాఫ్ రూంలో చర్చించుకోవడం.. సునీత ఈ రోజు ఉదయం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వరకు పూస గృచ్చినట్లు చెప్పాడు.
యాదగిరి ప్రిన్సిపల్ మన కాలేజీ సమస్య కాదన్నట్లుగా వెళ్లి పోయాడట..
కొంత మంది స్టాఫ్, నలుగురు విద్యార్థులు.. దూరంగా చర్చించుకుంటున్నారు.
ఎలాగైనా ఏకాంబరాన్ని వారింటికి తీసుకెళ్లాలని ప్రయత్నంలో నేనున్నాను. 
ఇంతలో సునీత  లోకల్  పోలీసులను తీసుకొని వచ్చింది.
రైల్వే పోలీసులు తమ పని సులువైందని వెళ్లి పోయారు.
మేమంతా వింతగా చూస్తున్నాం. పోలీసులు ఏకాంబారాన్ని జీపులో ఎక్కించుకొని ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్లి పోయారు. గోడకేసి కొట్టిన బంతిలా..
 సునీత మమ్మల్ని గమనించనట్లు అద్భుతంగా నటించింది. 
***
ఆ మరునాడు ఉదయమే కాలేజీకి వెళ్లి హాజరు రిజిస్టర్లో సంతకం పెట్టి.. యాదగిరి ప్రిన్సిపల్ ఏదైనా సలహా అడుగు తాడేమోనని ఎదురుగా కూర్చున్నాను. అతడి ముఖంలో  చలనం లేదు. 
కాలేజీలో సమస్య ఉన్నట్లు యాదగిరి  భావించడం లేదని అర్థమయ్యింది.. కాని నామనసు ఆరాట పడ్తోంది. నెమ్మదిగా కదిలించాను.
“ప్రిన్సిపాల్ సార్.. మీరు ఇలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే కాలేజీ భ్రష్టుపట్టి పోతుంది. మీకూ చెడ్డ పేరు వస్తుంది. బోర్డు మిమ్మల్ని వివరణ అడుగక ముందే.. మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇది పోలీసు కేసు.. ఆలోచించండి” అంటూ హెచ్చరికలా వివరించాను.
యాదగిరి కాసేపు ఆలోచించాడు.
“అయితే ఏంచేద్దామంటారు..?” అన్నాడు.
“సార్.. ముందుగా అత్యవసర స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు రికార్డు చేసి బోర్డుకు పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం” అన్నాను.
యాదగిరి మరికాసేపు ఆలోచించాడు.
కాలేజీ నోటీసు రిజిస్టర్ తెప్పించి నాతో రాయించి సంతకం చేసి కొండయ్యతో సర్క్యులేషన్‍కు పంపించాడు         
***

No comments:

Post a Comment

Pages