నేటి తరం ఒంటరి తనంలో కూరుకొని పోతున్నదా?
(వ్యాసం )
టి. వి. యెల్. గాయత్రి.

ప్రస్తుతం ప్రపంచం మన అరచేతిలో ఇమిడిపోయింది. రోజు రోజుకూ సాంకేతిక విప్లవం క్రొత్త పుంతలు తొక్కుతోంది. A I దెబ్బతో ఏది నిజమో ఏది మాయయో తెలుసుకోలేని స్థితి. మొబైల్ ఫోన్లతో మనుషుల వైఖరిలో చెప్పలేనంత మార్పు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ సహాయంతో నేటి తరం ఇల్లు కదలకుండా ఎన్నో విద్యలు నేర్చుకుంటోంది. మానసికంగా తమని తాము సర్వతో ముఖంగా చైతన్యంగా ఉంచుకోవటంలో సఫలీకృతమవుతోంది.
కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించటం, ఇతరులపై ఆధారపడకుండా జీవిస్తూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవటం లాంటివి నిజంగా ఉత్తేజకరమైన విషయాలు.
అయితే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో సానుకూలమైన ఫలితాలే వస్తాయనుకుంటే పొరబాటే అవుతుంది.
ప్రజలు బాహ్య ప్రపంచాన్ని వదిలేసి ఒంటరితనంలో కూరుకొని పోతున్నారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లు మన జనుల శైలిని పూర్తిగా మార్చి వేశాయి.
ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వ్వాట్సాప్ వంటి యాప్స్ చాలా మంది స్నేహితులను అందిస్తున్నప్పటికీ నిజమైన అనుబంధాలు మనుషుల మధ్య సన్నగిల్లి పోతున్నాయనటం వాస్తవం.
కుటుంబ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధువుల రాకపోకలు, పెద్దవాళ్లతో కలిసి ఉండటం వలన మనుషుల మధ్య పటిష్ఠమైన బంధం ఉండేది. దాని వలన ఒకరికొకరు అండగా ఉన్నారన్న భావన అందరిలో విశ్వాసాన్ని కలుగచేసేది.
నేడు అన్నీ న్యూ క్లియర్ కుటుంబాలు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. తీరిక దొరికితే స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం. నేడు బిజీ షెడ్యూల్స్ లో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటమే గగనమవుతోంది. దాంతో కుటుంబ సభ్యుల మధ్య అవగాహనా లోపంతో బంధాలు విచ్ఛిన్న మవుతున్నాయి. తల్లి దండ్రులకు బిడ్డలకు మధ్య, భార్యాభర్తల మధ్య దూరం పెరగటానికి ఇదొక ప్రధానమైన కారణమవుతోంది.
కుటుంబ సభ్యులనే కాదు నేటి తరం సమాజాన్ని కూడా మరచిపోయే పరిస్థితికి వచ్చింది. పక్కింట్లో ఏమి జరిగినా ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఐలా అయితే నేటి తరానికి సంఘజీవనం అంటే ఎలా తెలుస్తుంది? నా లక్ష్యాలు, నా జీవితం అనే భావన కొంత వరకు వ్యక్తి అభివృద్ధికి తోడ్పడినా సామాజిక బంధాలపై మాత్రం పెద్ద దెబ్బే కొడుతోంది. ప్రస్తుతం విద్యార్థులు ర్యాంకుల కోసం నిరంతరం శ్రమించాల్సి రావటం, ఉద్యోగస్తులు తమ పనుల్లో తాము అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి రావటంతో ఎంతో వత్తిడికి గురవుతున్నారు.
వ్యక్తిగత విజయాలు, డబ్బు మాత్రమే ప్రధానమైన. ఈ రోజుల్లో పరస్పర సంబంధాలకు ఎవ్వరూ విలువనివ్వటం లేదు. నేడు ఒంటరితనం అన్నది ఎక్కువ మందిని పీడిస్తున్న సమస్య. బలహీనమైన బంధాల మధ్య తమ భావాలను ఎవ్వరితోనూ పంచుకోకుండా కొంతమంది డిప్రెషన్ కు గురవుతున్నారు. అనేక ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ ఒక్కోసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.
ఇతరులతో మాట్లాడటం, స్నేహాలను , బంధుత్వాలను నిలుపుకోవటం ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని నేటి తరం కోల్పోతోంది. ఒంటరి తనం వలన కొంతమంది త్వరగా వ్యసనాల బారిన పడటం జరుగుతోంది.
మరి ఈ సమస్యలకు పరిష్కారాలే లేవా? ఉన్నాయి!
స్మార్ట్ ఫోన్ ను కాసేపు ప్రక్కన పెట్టి కుటుంబ సభ్యులతో గడపాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి దగ్గరగా బ్రతకటం నేర్చుకోవాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా స్పందించటం కనీస ధర్మంగా భావించాలి. ఇంకా కుదిరితే వలసినంత సహాయాన్నందించాలి. పుస్తకాలు చదవటం, లలిత కళలను సాధన చేయటం లాంటివి ఒంటరి తనాన్ని దగ్గరికి చేరనివ్వవు. ప్రతి సమస్యను సానుకూల ధృక్పథంతో చూడటం అలవాటు చేసుకోవాలి.
ఎంతో చైతన్యవంతమైన నేటి తరం ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నప్పటికీ దానిని అధిగమించే సామర్ధ్యాన్ని కలిగి ఉండే దిశగా అడుగులు వేయాలి. ఒంటరితనం మనుషులను బలహీనంగా మార్ఛకూడదు. ఎట్టి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడ గలిగే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. భావోద్వేగాలను పంచుకొనే తోడు మనుషులకు ఎప్పుడూ అవసరం. సరియైన సంబంధాలతోనే జీవితం సజావుగా సాగుతుందని అందరూ తెలుసుకోవాలి.//
(సమాప్తం )


No comments:
Post a Comment