పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు - అచ్చంగా తెలుగు

పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు

Share This

 పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు

 కాశీవిశ్వనాథం పట్రాయుడు 



ఒకరోజు సాయంత్రం మురళి తన ఇంటి వరండాలో కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. పక్కనే మనవడు జున్నుబాబు బొమ్మలకు రంగులు వేస్తున్నాడు. 


అంతలో మురళి స్నేహితుడు వెంకన్న ఆందోళనగా అక్కడికి వచ్చాడు.

"ఏమైంది వెంకన్నా? అంత ఆందోళనగా ఉన్నారు?" అని మురళి అడిగారు.


"ఏం చెప్పమంటారు మురళీ! ఈరోజు రాముడి కొడుకులు కిట్టు, చంటి స్నానానికని పెద్ద చెరువుకి వెళ్లారట. కిట్టు నీళ్లలో మునిగిపోతుంటే, ఈత సరిగ్గా రాని చంటి తన అన్నను కాపాడాలనే ఆత్రుతతో వెంటనే చెరువులోకి దూకేశాడట. అయితే, భయంతో కిట్టు తన తమ్ముడు చంటిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీట మునిగిపోయారట.

ఈతగాళ్లు వచ్చేసరికి ఆలస్యమైంది..." అని వెంకన్న కన్నీటి పర్యంతమయ్యాడు.


మురళి దిగులుగా తల ఊపి, "సాయం చేయాలనే మంచి మనసు ఉండటం గొప్ప విషయమే వెంకన్నా. కానీ, పరిస్థితిని అంచనా వేయకుండా సాహసం చేయడం ప్రమాదకరం” అని వివరించారు తాతయ్య.


అది విన్న జున్నుబాబు ఆశ్చర్యంగా, "తాతయ్యా! ‘పుణ్యానికి పోతే పాపం’ అంటే ఏంటి?" అని అడిగాడు.



“ఎవరికైనా సహాయం చేసి తద్వారా సమస్యల్లో  చిక్కుకునే  సందర్భంలో  ‘పుణ్యానికి పోతే పాపం ఎదురైంది’ అనే సామెత వాడుతారు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది విను. 


పూర్వం ఉదంకుడు అనే శిష్యుడు, తన గురువు కోరిక మేరకు గురుదక్షిణగా పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు. మహారాజు అందుకు అంగీకరిస్తాడు. అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యం కలుగుతుందని భావించి, ఉదంకుడిని భోజనానికి ఆహ్వానిస్తాడు పౌష్య మహారాజు.


భోజనం  వడ్డించిన విస్తరిలో ఉదంకుడికి ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో ఆగ్రహించిన ఉదంకుడు, మహారాజును 'నీవు గుడ్డివాడివవుదువు గాక' అని శపిస్తాడు. ఆ అకారణ శాపానికి పౌష్య మహారాజు కోపంతో, 'నీకు మంచి చేయాలనే ఉద్దేశంతో విస్తరి వేయిస్తే, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నాకు శాపం ఇస్తావా? నీవు కూడా సంతానాన్ని కోల్పోదువు గాక' అని ప్రతి శాపం ఇస్తాడు. తర్వాత ఇద్దరూ బాధపడతారు.


అందుకే, ఏ మంచి పని చేయాలన్నా విచక్షణ, జాగ్రత్త చాలా అవసరం. ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా తెలివితేటలతో వ్యవహరించాలి. పుణ్యానికి పోతే పాపం ఎదురవ్వడమంటే ఇదే" అని చెప్పారు మురళీ.


"అర్థమైంది తాతయ్యా! ఇకపై ఏ పని చేసినా ఆలోచించి చేస్తాను" అన్నాడు జున్నుబాబు


***

No comments:

Post a Comment

Pages