మధుర మధురము నీ మురళీ గానము - అచ్చంగా తెలుగు

మధుర మధురము నీ మురళీ గానము

Share This

మధుర మధురము నీ మురళీ గానము  

విజయ రాజేశ్వర రావు 






మధుర మధురము నీ మురళీ గానము

 మురళీధరా మోహన వంశీ కృష్ణా

 వినినంత జనులు మోహ పరవశులవుదురు,

 అట్టి పరవశము ఉన్నది దేనిలోన ధ్వనిలోనా

 ఆ మధురిమ నీ ఆధరములోనా నీ మాయలోనా

 వినిపింపుము నా వంటి నిర్భాగ్యులకు సదా సర్వదా                                         

 జగన్నాథా  కారుణ్య నిథామా పురుషోత్తమా


 అమ్మ పెట్టిన వెన్న ముద్దలు తిని నీవు చేసిన అల్లరి కథలు

 విన్నంత సేపు, నా మనము బృందావనములో

 అటు ఇటు పరుగులు తీసినది, అట్టి పరవశములో

 ఆనందమును గ్రోలి పెన్మత్తులో ఓలలాడినది

 చిరుత ప్రాయమున నీవు దునిమిన రాక్షసులకు కూడా

 మోక్ష మొసగితివట కదా కారుణ్య సింధు

 అల్లరి వాడివని అనునిత్యము నీపై అపవాదములు వేసిన సర్వజనులు                                           

 కాళిందిని అణచి దానిని తరిమిన నీ ప్రతిభను ఏమందురు

 వెన్న దొంగవని నీవు తిన్న చిన్న వెన్నముద్దల కొరకందురు

 గోవర్ధన గిరిని ఏడు పగళ్ళు రాత్రులు మోసిన చిరుచేతులనేమందురు

 అదియేమో నిన్ను నమ్మిన వారికి నిన్ను శరణన్న వారికి నీ భక్తులకు

 నీ మొదటి ప్రసాదమన్నటులు తొలుత కష్టములను కడగండ్లను తనివితీర నిచ్చెదవు

 పిచ్చివాడిని నేను, వెర్రి వాడను నేను, జ్ఞాన రహితుడను, పరీక్షల పేరిట

 నీవు ఇచ్చు శ్రమకరములగు కర్మలకు నను రక్షించవలసినది కూడా నీవే కదా ప్రభూ

 లేనిచో నిన్ను నమ్మిన వారికి ఓటములు తప్పవని

 నిను దూషింతురు విమర్శకులు నిజముగా కృష్ణా

 

నిన్ను తలచనా నిన్ను వలచెదనా నిన్ను కొలిచెదనా

 నాకు తెలియదు నీతో ఎట్లు ప్రవర్తించ వలెనో

 వృద్ధుడ నైతిని నాలో అహంభావం ముగిసినది

 నాలో ఏ భావము లేదు 

నేను శూన్యమైన “తెల్లని కాగితాన్ని” దానిలో నీవు వ్రాయదలచినది వ్రాసుకో

గీయవలసినది చిత్రమును, గీతలను గీసుకో

 

నేనో మట్టిని దానిలో నేను అనే మకిల మట్టిభావం కడుగగా పోయింది

 అదే నేను ఇప్పుడు శుభ్రమైన                         

 కడిగిన ఇసుకను దీనిని నీ కరుణాగంగతో తడిపి

 గుజ్జన గూళ్ళగా కట్టుకో ఆడుకో నీ పాదాల చెంత

 

నీ చేతిలో మెదిగిన నా జన్మ ధన్యము కన్నా 

చేయుటకు పని లేదు, చేయు ఓపికా లేదు 

నిష్క్రియా స్థితిలో నిష్కారణంగా తిని వసించుటకు

మనస్కరించుటలేదు వృథాగా 

భూమికి భారమై జీవించుటకు ఇచ్చయు లేదు

 

మరల మరల జనించుటకు

 నీ సేవకుడినైన నాకవసరం లేదు నీకది అవమానము

హరి హరి గోవిందా జయ ముకుందా మురారి

 ముగియింపుమా చివరి అధ్యాయము

 గోవింద హరే గోపాల హరే – రాధే ముకుంద హరే – రాధే గోపాల హరే

***


No comments:

Post a Comment

Pages