పుణ్యవతి (నవల) - 12
గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
(సృజన పెళ్ళిచూపుల తతంగాన్ని రవి కిటికీలోంచి చూస్తాడు. అది గమనించిన రంగనాధం కోపంగా అతని గదికి వెళ్తాడు. సృజన ద్వారా రవి గురించి విన్న ఆమె పిన్ని తన భర్త జగన్నాధాన్ని రవి దగ్గరకు వెళ్ళి మాట్లాడి రమ్మంటుంది. తరువాత.....)
@@@@@@
"వెళ్తాను లేవే! ఇదమ్మా మీ పిన్ని వరస. నోట్లో మాట నోట్లో ఉండగానే పరుగులు పెట్టిస్తుంది. ఈ వయసు మళ్ళిన ఆడవాళ్ళు ఉన్నారే! ఎవడైనా పెళ్ళి కాని కుర్రాడు కనిపిస్తే చాలు, వాణ్ణి తమ బంధువుల్లో కలిపేసుకొనేవరకూ నిద్రపోరు. దీని సంగతి సరె! నీ ఉద్దేశం ఏమిటి?" జగన్నాధం ప్రశ్నకు సిగ్గుపడింది సృజన.
"ఏం చెప్పను బాబాయి! రవిగారు చాలా మంచివారు. సాటి మనిషి మనస్తత్వానికి తగ్గట్లుగా మసలుకుంటారు."
"అంటే. . .నీకు ఇష్టమే కదా! విషయం మాకొదిలేయరా! అంతా మీ బాబయ్య చూసుకుంటారు" అంటున్న పిన్ని గుండెల్లో ముఖం దాచి కన్నీళ్ళు పెట్టుకొంది సృజన.
"పిచ్చిపిల్ల! నువ్వు వాడికే కాదురా! మాకూ కూతురివే! సుధకి జరిగినట్లే నీకూ జరుగుతుందని ఎందుకనుకోవాలి? రవి సరెనంటే చాలు. మీ నాన్న ఒప్పుకోకపోతే, బలవంతంగా ముందు నేను నిన్ను దత్తత తీసుకొని, పీటలపై కూర్చుని ఈ పెళ్ళి నా చేతులతో జరిపిస్తాను. సరేనా? లోపలికి వెళ్ళి ముఖం కడుక్కో! మీ నాన్న చూస్తే ఏమైందోనని బాధపడతాడు" జగన్నాధం చెప్పగానే, సృజన పెరట్లోకి వెళ్ళింది.
పెళ్ళివారిని గేటు వరకూ దించి వెనుదిరిగిన రంగనాధానికి, కిటికీలోంచి తన ఇంటివైపు చూస్తున్న రవి కనిపించి చిరాకేసింది. తమ్ముణ్ణి ఇంటికెళ్ళమని చెప్పి, తను రవి ఇంటి వైపు వెళ్ళాడు. ఆడపిల్లకి వచ్చిన సంబంధాన్ని ఇలాంటి కుర్రనాయాళ్ళే చెడగొడతారని అతని అభిప్రాయం. అందుకే దొంగచాటుగా తమ ఇంటి వైపు కన్నేసిన రవిని నాలుగు చివాట్లు పెట్టాలని రంగనాధం అటు వెళ్ళాడు. ఆయన తన ఇంటి వైపు రావటం గమనించిన రవి దినపత్రిక ముందేసుకుని కూర్చున్నాడు. రంగనాధం తలుపులు తోసి లోనికి రాగానే చదువుతున్న పేపర్ని మూసి, ముసలాయనకి రవి వినయంగా నమస్కరించాడు.
"ఏం చేస్తున్నావయ్యా?" రంగనాధం కోపాన్ని అణచుకుంటూ అడిగాడు.
"ఈరోజు వార్తాపత్రిక చదువుతున్నానండి" రవి బదులిచ్చాడు.
"ఆహా! దేశంలో అంతా క్షేమమే కదా! అదిసరె! కిటికీలోంచి చూస్తున్నావేమిటి?"
కొన్నాళ్ళుగా ఆయన తత్వానికి అలవాటు పడ్డాడు గనుక, రవి ఏ మాత్రం కంగారుపడకుండా నెమ్మదిగా బదులిచ్చాడు.
"గేటు చప్పుడయితే, ఎవరొచ్చారో అని చూసాను."
"ఈరోజు ఆఫీసుకి వెళ్ళలేదా?"
"ఈరోజు ఆదివారం. ఆఫీసుకి సెలవండీ!"
"సరె! మా ఇంటికి పెళ్ళివారొచ్చారు, తెలుసా?"
"టిఫిన్ తిని వస్తుంటే మీ ఇంట్లోకి ఎవరో రావటం కనిపించింది. మళ్ళీ ఇప్పుడు గేటు చప్పుడైంది. ఎవరో మీ బంధువులు అనుకొన్నా. పెళ్ళివారా సార్?" రవి అమాయకంగా అడిగాడు.
"ఎవరైతే నీకు ఎందుకయ్యా? నీ పేపరు సంగతి నువ్వు చూసుకో!" అంటూ బయటికి నడిచాడు రంగనాధం.
"రంగనాధంగారు ఎందుకు వచ్చి వెళ్ళినట్లు?" అనుకొంటూ గుమ్మం దగ్గరకు వచ్చిన రవికి తన యింటి వైపు కొత్తమొహం రావటం కనిపించింది.
"నువ్వు మా పుణ్యకి చుట్టానివట!" రవిని సమీపిస్తూ అడిగాడు జగన్నాధం.
"కజిన్నండీ!. . . మీరూ?"
"ఇప్పుడూ వచ్చి వెళ్ళాడే. . .రంగనాధమనే శాల్తీ! వాడికి తమ్ముణ్ణి. ఇటీవలే స్టేటు సర్వీసునుంచి రిటైరయ్యాను. కాలక్షేపానికి పెళ్ళిళ్ళ పేరయ్యగా ఫ్రీ సర్వీసు చేస్తున్నాను. నీకు పెళ్ళి కాలేదని తెలిసి, ఏదైనా సంబంధం చూడాలని అడుగుతున్నాను. ఒక మంచి సంబంధం ఉంది. చేసుకుంటావా?" పాఠం అప్పచెప్పినట్లు జగన్నాధం చెప్పాడు.
"లేదండీ! నేను ఆల్రెడీ ఒక సంబంధాన్ని ఖాయపరచుకొన్నాను" రవి మాటలకు జగన్నాధం హతాశుడయ్యాడు. ఆయన ముఖంలో రంగులు మారటం గమనించి రవి చిరునవ్వు నవ్వాడు. "కానీ ఆ పిల్లకి ఈ విషయం ఇంకా తెలియదు లెండి!"
అతని మాటలకు జగన్నాధం విస్తుపోయాడు. "అదేంటయ్యా? నువ్వు మా అన్నయ్య కన్నా చిత్రంగా మాట్లాడుతున్నావు. అమ్మాయికి తెలియకుండా సంబంధం ఖాయపరచుకోవటం ఈరోజుల్లో సాధ్యమయ్యే పనేనా?"
"సాధ్యమేనండీ! నాకీ అమ్మాయి భార్య అయితే బాగుంటుంది అని మనసులో అనుకోవటం తప్పులేదుగా!"
"కాదనుకో! కానీ ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పేస్తే తన ఉద్దేశం కూడా తెలుస్తుంది. వెంటనే నలుగురి చేత ఇద్దరూ అక్షింతలేయించుకొని ఒక ఇంటివాళ్ళు కావచ్చు."
"నిజమే! కానీ ఇక్కడో చిక్కు ఉందండీ! విషయం చెబితే ఇద్దరి మీద ఏమో కానీ, నా మీద అక్షింతలు పడటం ఖాయం. అందుకే ఇన్నాళ్ళూ ఆగాను. ఆ పిల్ల చదువు కూడా ఇటీవలే పూర్తయ్యింది గనుక ఇంక విషయం కదపొచ్చని అనుకుంటున్నాను."
"ఆ పిల్ల వివరాలు చెప్పు. మధ్యవర్తిగా ఉండి, ఆ చెప్పుదెబ్బలేవో నేనే తింటాను."
జగన్నాధం మాటలకు రవి చిన్నగా నవ్వాడు. "పెద్దలను శ్రమ పెడతానా? విషయం నేనే తేల్చుకుంటాలెండి. ఆ అమ్మాయి అభిప్రాయం నేనే సూటిగా అడిగి, తరువాత విషయం మా అమ్మకి చెబుతాను. ఆ తరువాతే మధ్యవర్తులకు అవకాశం."
"ఈ మధ్యలో ఆ పిల్లకి పెళ్ళయిపోతే?"
"అది నా దురదృష్టం అనుకుంటాను. కానీ కాదనే అనిపిస్తోంది. మా ఇద్దరినీ కలపటానికే ఆ దేవుడు నన్నిక్కడకు ఈడ్చుకొచ్చాడు. . . అదే. . .నాకీ ఊళ్ళో ఉద్యోగం ఇప్పించాడు. " రవి వేదాంతానికి జగన్నాధానికి తల తిరిగినట్లయింది.
"ఏంటోనయ్యా! ఈకాలం కుర్రకారు ఒక పట్టాన అర్థం కారు. పెద్దలతో ప్రమేయం లేకుండా తిన్నగా రంగంలోకి దిగిపోతామంటారు. ఎదురుదెబ్బ తగిలితే అఘాయిత్యం చేసుకొంటారు. ఆ కాలంలో మేము ఏ పని చేయాలన్నా, పెద్దల అనుమతి తప్పనిసరి. అందులో జీవితభాగస్వామిని ఎంచుకోవటమంటే. . . సరేనయ్యా! నా సాయం కావాలనిపిస్తే పిలు. తప్పకుండా వస్తాను" అంటూ ఆ యింట్లోంచి బయటకు నడిచాడతను. అతని తత్తరపాటుకి రవి లోపల నవ్వుకున్నాడు.
"తమ్ముడు ఆ యింటిలోకి వెళ్ళాడేంటమ్మా?" రవి ఇంటి నుంచి వచ్చిన రంగనాధం మరదల్ని అడిగాడు.
"ఏంలేదు బావగారు! నిన్న పుణ్య వీధిలో కనిపించి, రవికి ఏదైనా సంబంధం చూడమని చెప్పిందట! ఈయన పెళ్ళిళ్ళ పేరయ్య కదా! అతనికి ఎలాంటి అమ్మాయి కావాలో అడగటానికి వెళ్ళారు!" అందమైన అబద్ధమాడిందామె.
"అలాగా? మంచి కుర్రాడు. సంబంధం చూడొచ్చు. ఆ! మా అమ్మాయికి వచ్చిన సంబంధం గురించి అతనికి చెప్పకండి. చెబితే చెడగొట్టవచ్చు. ఈ కాలంలో ఎవరు ఎలాంటివారో చెప్పలేము. కలవారి సంబంధం. ఎలాగైనా దీన్ని కుదర్చమని తమ్ముడికి చెప్పమ్మా! ఇది కుదరకపోతే, నేను దీని పెళ్ళి చూడలేనేమోనని భయంగా ఉంది."
తండ్రి మాటలకు సృజన కన్నీళ్ళు పెట్టుకుంది. "చూడు పిన్నీ! ఇలాంటి మాటలతోటే నాన్న నన్ను భయపెడుతున్నాడు."
"నువ్వుండమ్మా!" సృజీకి చెప్పి, ఆమె రంగనాధం వైపు తిరిగింది. "బావగారూ! అమ్మాయికి సంబంధం కుదురుతుందనే పెళ్ళిచూపులు చూపిస్తాం. అది కుదరకపోతే మరొకటి. పెళ్ళి కుదిరేవరకూ ఏ సంబంధం మీద మనం ఆశలు పెట్టుకోకూడదు. మనం ఆడపిల్లవాళ్ళం. ఇది కాకపోతే మరొకటి అని సర్దుకుపోతుండాలి గానీ, అతిగా ఆశ పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకోకూడదు. దీనికి మంచి సంబంధమే అవుతుంది."
"తండ్రినమ్మా! నా బాధ మీకెలా తెలుస్తుంది?"
"ఒక్క విషయం చెప్పండి. ఆ ముసలావిడ వెళ్ళే ముందు ఏమి చెప్పింది? అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారంది. మీరు పురాణాలు బాగా చదివారు కదా! పెళ్ళికొడుకు లక్ష్మణుడిలా అన్నగారి సేవలో ములిగిపోతే, అమ్మాయి ఆశలు ఊర్మిళాదేవిలా నిద్రపోతాయేమో! ఆలోచించండి!" మరదలి మాటలకు రంగనాధం ముఖం చిన్నబోయింది.
"అమ్మాయి పెళ్ళి కావటం ముఖ్యం కాదండీ! అయిన సంబంధం నాలుగు కాలాల పాటు నిలిచేలా కూడా ఉండాలి. ఆ విషయం ఆలోచించకే, చాలామంది ఆడపిల్లని కన్నవాళ్ళు ఎవడో ఒకడని ఇచ్చి కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నారు" అంటున్న మరదలి ముఖంలోకి సూటిగా చూడలేక, రంగనాధం అక్కడినుంచి తప్పుకోవాలనుకున్నాడు.
"మరిచిపోయాను. పూజారి అనంతశయనంగారు రేపు గణపతి గుళ్ళో కుజ, రాహువులకు అభిషేకం చేస్తానన్నారు. ఏర్పాట్లు చూసుకోవాలి. వస్తా" అంటూ రంగనాధం వీధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే రవి ఇంటి నుంచి తలపట్టుకొని జగన్నాధం వచ్చాడు.
"అబ్బాయితో మాట్లాడేరా?" జగన్నాధాన్ని భార్య అడిగింది.
(ఇంకా ఉంది)



No comments:
Post a Comment