పుణ్యవతి - 8
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
@@@@@@@@@
(చాలాకాలం తరువాత ఆ కాంపౌండ్ లో అడుగుపెట్టిన పుణ్యకు చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి. బయటనుండి వచ్చిన సృజన చేతిలోని ఫొటోని, దానిపై కవితని చూసి ఆమె మెచ్చుకుంటుంది. మాటల మధ్యలో ఆనందరావుతో పుణ్య స్నేహాన్ని చూసి భయంగా ఉందని సృజన చెప్పింది. జీవితంలో దెబ్బ తింటే తను సుధలా ఆత్మహత్య చేసుకోనని పుణ్య చెబుతుంది. తరువాత.....)
@@@@@@@@@@@ …
"ఏరా! ఇంతకాలానికి ఈ నాన్న గుర్తొచ్చాడా?" అన్న మాటలు వినిపించి తలతిప్పిన పుణ్యవతికి గుమ్మంలో నిలబడ్డ రంగనాధం కనిపించాడు.
"నాన్నగారూ!" అంటూ అతని కాళ్ళకు నమస్కరించింది పుణ్యవతి.
"నా ఆయుష్షు కూడా పోసుకొని పదికాలాలు చల్లగా జీవించరా!" అంటూ అతను పుణ్యవతి తలను నిమిరాడు.
"అక్కయ్య పోయాక ఈ ఇంటికి రాకూడదనుకున్నావా?" అతని గొంతు గద్గదమైంది.
"ఛ ఛ! అది కాదండీ! శేఖర్ అన్నయ్య ఎం.బి.ఏ. చేస్తున్నాడు. ఉదయాన్నే ఉద్యోగానికి పోయి, అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళి రాత్రి పది గంటలకు ఇల్లు చేరుతున్నాడు. ఒక్కోసారి పెందరాళే వస్తుంటాడు. వాడు ఏ వేళకు ఇంటికొస్తాడోనని కాలేజీనుంచి ఇంటికొచ్చాక, ఎక్కడికీ వెళ్ళటం లేదు" నొచ్చుకొంటూ సంజాయిషీ ఇచ్చింది పుణ్యవతి.
"ఏమోరా! హడావిడి చేసే సుధ పోయాక జీవచ్ఛవాన్ని అయిపోయాను. మా ఇద్దరి మధ్య చెప్పలేని నిశ్శబ్దం. నువ్వు కనిపిస్తుంటే, సుధ లేని లోటు తెలియదు. మీరిల్లు మారిపోయాక, నువ్వు కనిపించక ఏదో వెలితి, మరేదో భయం. ఈమధ్య ఒంట్లో కూడా బాగుండటంలేదు. దీన్ని ఒక అయ్య చేతిలో పెట్టేవరకూ ఉంటానో, లేదో. ." రంగనాధం మాటలకు సృజన అడ్డు తగిలింది.
"ఇదే వరస! ఈ మాటలతోనే రోజూ నన్ను భయపెడుతున్నారు. ." ఇంకా చెప్పబోతున్న ఆమెను ఆగమని సైగచేసింది పుణ్యవతి.
"నాన్నగారూ! సృజికి బంగారు భవిష్యత్తు ఉంది. గంపెడు పిల్లల్ని కని మీకు చేతినిండా పని పెడుతుంది. సరేనా?. . నేను ఈ యింటికి రాకపోవటం మీకింత బాధ కలిగిస్తుందని నేను అనుకోలేదు. ఇకపై సెలవురోజున తప్పకుండా కనిపిస్తాను. కానీ మీరు నాకు ఒక సాయం చేసిపెట్టాలి" పుణ్యవతి రంగనాధంతో అంది.
"ఏంట్రా అది?"
"రవి అని . . . మా దూరపు బంధువు ఒకడున్నాడు. నాకు వరుసకు అన్నయ్య అవుతాడు" పుణ్య ప్రారంభించగానే, సృజన వంటింట్లోకి వెళ్ళిపోయింది. "గత వారం మీ యింటికొచ్చి ఆ మూల గదిని అద్దెకు అడిగాడట. మీరు అద్దెకివ్వను పొమ్మనారట."
"ఎవర్రా? ఆ బ్రహ్మచారి కుర్రాడా?. . .ఆ గుర్తొచ్చింది. పట్టుకుంటే ఒక పట్టాన వదిలే రకంలా కనిపించలేదు. మాటల్లో నీ గురించి కూడా ఏదో చెప్పినట్లు గుర్తు."
"అతనే నాన్నా! వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గుంటూరులో ఉంటున్నారు. తనిక్కడ గవర్నమెంటు ఆఫీసులో నౌకరీ. ఇక్కడ కొడుకెలా ఉంటున్నాడోనని పిన్ని భయం. మొదట మిధిలానగర్‌లో ఇల్లు కుదిర్చాను. వాళ్ళకేదో అవసరమొచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నారట! మాకు దగ్గరలో ఇల్లు తీసుకోవాలని తిరుగుతుంటే మీ ఇల్లు కనిపించిందట! తను ఇంటికి తాళం పెట్టి ఆఫీసుకెళ్ళినా, రక్షణగా ఈ ప్రహారీ గోడ ఉందిగా! అందుకే ఆ ఔట్‌హౌస్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. మీరు అతనికి ఇల్లు ఇస్తున్నారు. "
"అది కాదురా! సృజనకి పెళ్ళి కాలేదు."
"చూడండి. దాని పెళ్ళికి, ఇల్లు అద్దెకు ఇవ్వకపోవటానికి సంబంధం ఏమిటి? ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదని మీరే అంటున్నారు. ఏదైనా అవసరమొచ్చి, నాకు కబురు పెట్టాలన్నా సృజి ఒక్కర్తి మాత్రం ఏమి చేయగలదు? పెళ్ళయిన వాళ్ళకు ఇల్లిస్తే, అవసర సమయంలో మాకు వేరే పనులు ఉన్నాయని తప్పుకోరా? బ్రహ్మచారులైతే, త్వరగా స్పందించి సాయం చేస్తారు. ఆడపిల్లని ఆకట్టుకోవాలనే దుర్గుణం మనిషి నైజాన్ని బట్టి ఉంటుంది కానీ, బ్రహ్మచర్యాన్ని బట్టి కాదండీ! ఒక్కసారి మీరే ఆలోచించండి."
"నువ్వింత భరోసా యిచ్చాక ఇవ్వనంటానా? సరేనా?"
"నా మీద మీరుంచిన నమ్మకాన్ని నేనూ నిలబెట్టుకుంటాను" చెబుతున్న పుణ్యవతి తలపై ఆప్యాయంగా తట్టి పెరటివైపు వెళ్ళాడాయన.
@@@@@@
ఉదయం నుంచి రవి అలికిడి లేక సృజన మనసంతా అదోలా ఉంది. పుణ్యవతి మాట కాదనలేక రంగనాధం రవికి ఆ పర్ణశాలలాంటి కొంపను అద్దెకిచ్చాడు. అద్దెకు దిగిన కొత్తలో గాలి కోసం రవి గుమ్మం బయట బల్బు తగిలించి, కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదివేవాడు. రంగనాధం వెళ్ళి గొడవ చేయటంతో అలా బయట కూర్చోవటం మానుకున్నాడు. ఆఫీసుకెళ్ళినప్పుడు తప్ప అతను సృజనకు కనపడటం లేదు. అలా వెళ్తున్నప్పుడు కూడా అతను తల పైకెత్తి వాళ్ళ ఇంటి వైపు చూడటం లేదు. సృజన మాత్రం అతని రాకపోకలను గమనించటం అలవాటు చేసుకుంది. రంగనాధం మాత్రం అతని ఇంటికి అకస్మాత్తుగా తనిఖీకి వెళ్తున్నాడు. ఆయన నిఘా రవికి కొంత ఇబ్బందిగానే ఉంటోంది. తండ్రి లేనప్పుడు మాత్రం పుణ్యతో కలిసి సృజన అతని ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళే ధైర్యం చేస్తోంది. వాళ్ళిద్దరూ చలాకీగా మాట్లాడుతుంటే, సృజి మూగ ప్రేక్షకురాలిగా ఉండటం తప్ప, కలుపుగోలుగా ఉండలేకపోతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు రవితో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది. కానీ అతను ఎదురుపడితే ఏదో భయం. ఈ భయానికి కారణం ఆమె అక్కయ్య జీవితం తాలూకు నీలినీడలు కావచ్చు, తండ్రి ఆశలపై నీళ్ళు చల్లకూడదన్న ఆలోచన కావచ్చు. పుణ్య చెప్పింది నిజమే! తను మెల్లిగా ప్రేమలో పడుతున్నట్లుంది. ఒకప్పుడు ఆనందరావు వల్ల పుణ్యకి ఏమి జరుగుతుందోనని భయపడే సృజన, రోజంతా రవిని గురించే ఆలోచించటం అనుకోని పరిణామం. అనాకారిని కూడా అదే పనిగా చూస్తే, అందంగా కనిపిస్తుందంటారు. ఆనందరావు చాల మంచివాడని పుణ్య చెప్పినా, నిత్యం సృజన ఆలోచనల్లో రవి నిండిపోయినా, అది వయసుతో వచ్చిన మార్పని తెలుస్తూనే ఉంది. గత నెలరోజులుగా డిగ్రీ పరీక్షలు కావటంతో రవి ఆమె ఆలోచనల్లోకి రాలేదు. ఈరోజు నుంచి కాలేజీ అనే వ్యాపకం లేకపోవటంతో, ఆమె మనసు కుప్పిగంతులు మొదలెట్టింది. ఉదయం నుంచి ఇంట్లోనుంచి రవి బయటకొచ్చిన అలికిడి లేదు. చదువులు పూర్తవటంతో రవి వ్రాసిన కవితల పుస్తకాన్ని పుణ్య ఆమెకు ఇచ్చింది. అది చదివాక సృజనకు అతనిపై ఇష్టం రెట్టింపైంది. ఆ కవితల్లో అతని సునిశిత ఆలోచనా సరళి వెల్లడి అవుతోంది. అనాకారి విద్యార్థి కూడా కనిపించిన ప్రతి అందగత్తెను ఆకర్షించాలని పడే తాపత్రయాన్ని రవి చాలా చమత్కారంగా చెప్పాడు. .
"కలలందున సుందరులు - మదిని మదన మంజరులు
బ్రదర్! బ్రదర్! విద్యార్థులు మాటలలో మహరాజులు!"
మరొక చోట వేశ్యకు, కన్నెపిల్లకు మధ్య తేడాను ఆనపకాయకు, కొబ్బరికాయకు మధ్య ఉండే తేడాగా విశ్లేషించాడు.
"నీటుగున్న సొరకాయలో నీటి డాబె హెచ్చు!
గట్టిగుండే టెంకాయే మమకారపు మచ్చు!"
"నిజమే! ఏమాత్రం కష్టపడకుండా చిన్నచాకుతో ఆనపకాయను ముక్కలుగా కోసినట్లే, వేశ్యను సులువుగా ముగ్గులోకి దించవచ్చు. కానీ కొబ్బరికాయ, కన్నెపిల్ల అలా కాదు. చాకచక్యంగా ఒడిసిపట్టుకుని కొడితే తప్ప కొబ్బరికాయలో ఏముందో చెప్పలేము. కన్నెపిల్ల చేతిలో కొబ్బరిబొండాంతో పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టడంలో ఇద్దరి మధ్య ఉన్న ఆ భావ సారూప్యమే కారణం కావచ్చు. ఎంత భావుకత!"
రంగనాధం బయటకు వెళ్ళటంతో సృజన ఉండబట్టలేక, ఇంటికి తాళం పెట్టి రవి ఇంటి వైపు బయల్దేరింది. అతని ఇంటికి తాళం లేదంటే, రవి ఆఫీసుకి వెళ్ళలేదని అర్థమైంది. తటపటాయిస్తూనే ఆమె తలుపుని తట్టింది.
"తలుపు తీసే ఉంది" అన్న మాట వినిపించి తలుపుని తోసి లోనికి అడుగుపెట్టింది.
గుమ్మంలో ఆమెను చూసి చేతిలోని పుస్తకాన్ని మూసి ఎదురెళ్ళాడతను.
"ఏదో వ్రాస్తున్నట్లు ఉన్నారు. మళ్ళీ వస్తాను" అంటూ ఆమె వెనుదిరిగింది.
"అమ్మకి ఉత్తరమే లెండి. తరువాత వ్రాస్తాను. మీరు రండి."
"సారీ! మీకు, అమ్మగారికి మధ్య నేను వచ్చినట్లున్నాను" నొచ్చుకొంది సృజన.
"మానవుడు సంఘజీవి. ఎప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి అప్పుడిచ్చేస్తే ఏ సమస్య ఉండదు" నవ్వుతూ అన్నాడతను.
"ఈరోజు సెలవు పెట్టారా?" అడిగింది.
"ఔనండీ! ఒంట్లో బాగు లేదు. కష్టకాలంలో దేవుడు గుర్తుకొచ్చినట్లు, రోగమొచ్చిన ఇప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది. అందుకే ఉత్తరం" సంజాయిషీ ఇచ్చాడతను.
"అంతేలెండి. ఏమిటది?... ఆ! వయసులో ఉన్నప్పుడు వర్ణనలు, వాదాలు.. . రోగమొచ్చి మూలబడితే వల్లింతురు వేదాలు. ."
సృజన మాటలకు త్రుళ్ళిపడ్డాడు రవి.
"ఆ పుస్తకం మీకెవరిచ్చారు?" కంగారుపడ్డాడు అతను.
"పుస్తకమా? పుస్తకమేంటి?"
"మరీ అంత నటించకండీ! నా కవితనే నా ముందు కొటేషనుగా కొట్టి. . ." రవి మాటలకు ఆమె నవ్వింది.
"ఏం? మీ పుస్తకం పుణ్య తప్ప నేను చదవకూడదా?"
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment