ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 31 - అచ్చంగా తెలుగు

ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 31

Share This

ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 31

                                                                                                            కొత్తపల్లి ఉదయబాబు 

 



అరేబియా సముద్రంలో... పెద్ద సూర్య గోళం ఆకాశంలో క్రమేపి పైకి వెళ్తుంటే, సూర్యుని కిరణాలు పడి... నీలం రంగులో ఉన్న కెరటాల అంచులు వెండిలా తళ తళ కాంతులతో మెరిసిపోతుంటే, తమ ఒంటి మీద ఉన్న లైఫ్ జాకెట్లు తమకు వింత శోభను కలిగిస్తుంటే, రివ్వున వేస్తున్న చల్లని స్వచ్ఛమైన గాలి వద్దన్నా గుండెల్లోకి చేరిపోతుంటే... అంతటి ఆహ్లాద  వాతావరణంలోనూ  శివయ్య ప్రశాంతంగా అర్థనిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకుని  ఆ కొండమీద  ధ్యానముద్రలో ఉన్న దృశ్యం మనసును రంజింప చేస్తుంటే..

ఆహా ఎంత అద్భుతంగా ఉంది... ఎంత కమనీయంగా ఉంది... అందులో తన ప్రేమికుడు తన పక్కనే కూర్చున్నప్పుడు ఆ ప్రేయసిలో కలిగే ఆనందపరంపరను బోట్ షైర్ కొనసాగుతున్నంతసేపు  అనుభవిస్తూ మనసులో ముద్రించుకుంటూనే ఉంది హరిత.

 

బోట్ షైర్  పూర్తి అయి, బోట్లోంచి దిగిన  తర్వాత " ఎలా ఉంది హరిత? భయం వేస్తే చెప్పు ఇంకో ట్రిప్ వేద్దాం " అన్నాడు నవ్వుతూ.

 

" భయం వేస్తే రెండో ట్రిప్ ఎందుకు వేయడం? " అడిగింది అమాయకంగా

 

" ఆ భయం పోవడానికి. నువ్వు ఎన్నిసార్లు భయం అంటే అన్నిసార్లు టిప్స్ వేసుకోవడమే  "

 

" దానికన్నా ఇక్కడే ఒక బోట్ కొనుక్కొని తిప్పుకోవడం మంచిది బాబు. " అన్న శకుంతల మాటలకి అందరూ ఫక్కున నవ్వేశారు.

 

" సరే బాబు మరి మేము వెళ్ళిరామా? "

 

" అలాగే ఆంటీ చాలా చాలా థాంక్స్. నేను అడిగిన వెంటనే వచ్చినందుకు. నీకు కూడా థాంక్స్ హరితా? " అన్నాడు విరాజ్

 

" ఎందుకు రెండో ట్రిప్పు వేయించి నీకు డబ్బులు నష్టపరచనందుకా? " అంది హరిత.

 

" ఇంకెప్పుడైనా భయం అని చెప్పు. కాళ్లు చేతులు కట్టేసి నిన్ను ఒక్కదాన్ని బోట్లో కూర్చోబెట్టి  ఆగకుండా పాతిక  రౌండ్లు లో వేయించేస్తాను."

 

" నా నా భయం ఎప్పుడో తగ్గిపోయింది. " అంది హరిత నవ్వుతూ.

 

ఇంతలో శకుంతల, బబిత " నువ్వు చెప్పు అక్క "... అంటే "నువ్వు చెప్పు చెల్లి " అని ఒకరినొకరు గుసగుసలాడుకోవడం వినిపించింది విరాజ్ కి.

 

" ఏమైంది ఆంటీ.. నావల్ల ఏమైనా సమస్య వచ్చిందా? వస్తే చెప్పండి ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేస్తాను. " అన్నాడు విరాజ్ నవ్వుతూ.

 

చివరికి అక్క గారి కనుసైగతో  బబిత సున్నితంగా చెప్పసాగింది.

 

" ఏం లేదు బాబు. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో 5 గంటలకు పూజ ఉంది. మీరు ఆ పూజకు తప్పనిసరిగా రావాలి. పూజ అయ్యాక మళ్ళీ మీరు మీ రూమ్ కి వెళ్ళిపోవచ్చు. డబ్బున్న మీ వంటి కోటేశ్వరులు మా ఇంటికి వస్తారో రాదో అని సందేహ పడుతుంటే " పర్వాలేదు. ఆ బాబు ఏమీ అనుకోరు చెప్పు అంటోంది అక్క"

 

" మనసు మంచివైనప్పుడు డబ్బు ఉండడానికి, లేకపోవడానికి సంబంధం ఏముంది ఆంటీ. అంతస్తులు వేరైనా మనసులు మంచివైతే, ఆ మనసులు ఎప్పుడూ మంచి స్నేహానికి అర్హమైనవే. సాయంత్రం నేను తప్పకుండా వస్తాను. అయితే ఎలా రావాలి ఎక్కడికి రావాలి? " అడిగాడు విరాజ్.

 

" ఆ నేను సాయంత్రం నాలుగు గంటలకి  హరితని, హరీష్ ని మీ రూంకి పంపిస్తాను. హరీష్ అంటే మా తమ్ముడు. అతను, హరిత మిమ్మల్ని దగ్గరుండి తీసుకొస్తారు. సరేనా? "

 

"తప్పకుండా ఆంటీ. హరిత నువ్వు మెసేజ్ చెయ్ నేను రెడీగా ఉంటాను." హరిత తల ఊపింది. విరాజ్  తన రెసిడెన్స్ వైపు, మిగిలిన ముగ్గురు తమ ఇంటి వైపు దారి పట్టారు.

 

******

 

బోట్ షైర్ అయి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తనకు రూమ్లో బోర్ కొట్టి టాక్సీ మాట్లాడుకుని  మురుదేశ్వర్ మార్కెట్, మురుదేశ్వర్ కోట   అనే రెండు ప్రదేశాలు తిరిగేసాడు. దారిలో దొరికిన చిరుతిళ్ళు తినేసి,మధ్యాహ్నం  రూమ్ కి వచ్చేసరికి మూడు గంటల సమయం దాటిపోయింది.

 

నాలుగు గంటలు దాటిన తర్వాత హరిత, హరీష్ తో  201 కి వచ్చింది. హరీష్ ని విరాజ్ కి పరిచయం చేసింది హరిత.

 

అతను తయారయ్యాక పిలవమని  వాళ్లు రిసెప్షన్ లో కూర్చున్నారు.

 

మరో పావుగంటలోనే విరాజ్ కిందకి వచ్చేసాడు.

 

ముగ్గురు కలిసి బబిత అంటే ఇంటికి వచ్చారు.

 

పంతులుగారు ఎవరో పూజ ఏర్పాట్లు చేస్తున్నారు.

" హరీష్. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని పూజ డ్రెస్ కట్టేసుకో." అని బబిత చెప్పిన వెంటనే " సరే అక్క." అని అతను లోపలికి వెళ్లి పది నిమిషాలు తయారై వచ్చేసాడు.

" బాబు విరాజ్. హరీష్ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. మీరు కూడా ఎలాగా వ్యాపారం చేస్తున్నారు కదా. ఇది పవిత్రమైన శైవ క్షేత్రం. ఇక్కడ మీరు కూడా ఈ పూజ చేసుకుంటే, మీరు మీ కుటుంబం వ్యాపారం అభివృద్ధిలోకొస్తారు. మీకు అభ్యంతరం లేకపోతేనే. " అంది శకుంతల.

 

" సరే ఆంటీ. పూజ చేసుకోవడం  వల్ల ఎప్పుడు మంచి ఫలితం వస్తుంది కానీ చెడు ఫలితం  రాదు కదా. మరి దానికి కావాల్సినవి ఏవీ  నేను తెచ్చుకోలేదే "

" మరి ఏం పర్వాలేదు. పంతులుగా దగ్గర ఈ పూజలకు కావలసిన  దుస్తులు, సామాగ్రి ఎప్పుడు ఒక సెట్ సిద్ధంగానే ఉంటాయట  ఇక్కడ. దాని ఖరీదు ఇస్తే సరిపోతుంది" అంది బబిత.

 

" అలాగే ఆంటీ తప్పకుండా."

 

" అయితే మీరు పక్క గదిలోకి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కుని పంతులుగారు ఇచ్చిన బట్టలు  మార్చుకుని  వచ్చేయండి."

 

" అలాగే ఆంటీ" అని పంతులుగారు ఇచ్చిన బట్టలు తీసుకుని 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వచ్చేసాడు.

 

మగవాళ్ళ ఇద్దరి చేత జ్యోతి ప్రజ్వలన చేయించి ఆచమానం చేయించారు పంతులు గారు. పూజ మొదలైంది.

*******

 

మర్నాడు ఉదయం 9 గంటలకు గాని మెలకువే రాలేదు విరాజ్ కి. రాత్రి తను రూమ్ కి ఎలా వచ్చాడో తనకే గుర్తులేదు. తాను ఇప్పుడు పంతులుగారు కట్టుకోమని ఇచ్చిన బట్టల్లోనే ఉన్నాడు. లేచి అద్దంలో మొహం చూసుకున్నాడు. ఇక తప్పదని స్నానం  ముగించాడు.

 

బద్ధకిస్తే బద్దకమే అనుకున్న అతను చక చక లేచి తయారైన అతను టాక్సీ మాట్లాడుకుని  దగ్గరలోని ప్రసిద్ధ క్షేత్రాలైన  గోకర్ణం, ఇడుగుంజి దేవాలయాలను సందర్శించి తిరిగి అయిదు గంటలకు తన రూమ్ కి చేరాడు. అతను మనసంతా ఏదో తెలియని ఆనందంతో

సంతోషంగా అనిపించింది. బాల్కనీలో నిలబడి కనుచూపు మేరలో కనిపిస్తున్న అద్భుత కమనీయ దృశ్యాలన్నిటిని ఫోన్లో వీడియో తీయసాగాడు. తీసిన వీడియోని పరిశీలిస్తుండగా  -

 

కాలింగ్ బెల్ మోగింది.

 

విరాజ్ వెళ్లి తలుపు తీశాడు.

 

ఎదురుగా శకుంతల  నిలబడిఉంది.

 

" సారీ బాబు రాత్రి  బాగా నిద్ర పట్టిందా... మీకు అలవాటు లేని పూజలు చేయించానేమో..

నిన్న మీతో పాటు కూర్చుని పూజ చేశాడే, హరీష్.... ఆ అబ్బాయికి అనుకోకుండా పెళ్లి సంబంధం వచ్చింది. ఈరోజు మంచిదని వాళ్లు పెళ్లి చూపులకు రమ్మన్నారు. సమయానికి మీరు గుర్తుకు వచ్చారు. ఆ కార్యక్రమానికి

నేను, మా చెల్లెలు, పంతులుగారు, హరీష్ వెళ్తున్నాం.మీకు ఏమి అభ్యంతరం లేకపోతే.. "

 

" విషయం ఏంటో చెప్పండి ఆంటీ? "

 

"అదీ... అదీ..."

 

" మీరు నిర్భయంగా చెప్పండి ఆంటీ డబ్బేమైనా కావాలా? "

 

" హరితకు ఈ వాతావరణం కొత్త. మేమందరం వెళ్తే ఆ ఇంట్లో తను ఒక్కత్తే ఉండాలి. అందుచేత మేము వచ్చేంతవరకు హరితను మీ రూమ్ లో ఉండనిస్తారేమోనని... "

 

వికాస్ మనసులో ఒక్కసారిగా జల పొంగినంత ఆనందంగా సంతోషం వెల్లివిరిసింది. అయితే దాన్ని కనిపించనీయకుండా అన్నాడు

 

" పెళ్ళి కాకుండా హరిత, నేను ఒకే గదిలో ఉండటం మంచిది కాదేమో. " అనుమానంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు.

 

" మూడేళ్ల స్నేహం మీది. మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు తనకి మంచి స్నేహితుడు. ఎంత రాత్రి అయినా తిరిగి వస్తూనే హరితని నేను తీసుకువెళ్ళిపోతాను. మీకు ఏమి ఇబ్బంది లేదు కదా? " ఇబ్బంది పడుతున్నట్టుగా అడిగింది శకుంతల.

 

" మీకు నామీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటే చాలు. హరిత ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మనసులో ఎటువంటి శంక పెట్టుకోకుండా మీరు హాయిగా వెళ్ళి రండి. " అన్నాడు విరాజ్.

 

" సరే బాబు. " అని కారిడార్ లో సోఫాలో కూర్చున్న హరితను  తీసుకువచ్చి అతను ముందు నిలబెట్టింది శకుంతల.

 

" ఎంతసేపు హరితని పరాయిదానిలా కారిడార్ లో కూర్చోబెట్టారా? ఏంటి ఆంటీ మీరు.. సరే మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి."

 

" తల్లిగాడు జాగ్రత్త. ఎంత రాత్రి అయినా మేము  వచ్చేస్తాం. జాగ్రత్త బాబు వెళ్ళొస్తాను. లేట్ అయిపోతున్నట్టుంది "అనేసి శకుంతల వెళ్ళిపోయింది.

 

" మా హృదయరాణిగారికి మా సామ్రాజ్యంలోకి స్వాగతం " అంటూ గుమ్మంలో నిలబడిన హరితకు చేయి అందించాడు విరాజ్.

 

" ధన్యవాదాలు తమరికి " నవ్వుతూ నమస్కరిస్తూ లోపలికి అడుగుపెట్టింది హరిత.

 

( ఇంకా ఉంది)

 

No comments:

Post a Comment

Pages