ఒకటై పోదామా.. ఊహల వాహినిలో- 32 - అచ్చంగా తెలుగు

ఒకటై పోదామా.. ఊహల వాహినిలో- 32

Share This

 ఒకటై పోదామా.. ఊహల వాహినిలో- 32

 కొత్తపల్లి ఉదయబాబు 




హరిత వచ్చి గదిలో మంచం మీద కూర్చుంది.

 

మంత్రింపబడిన వాడిలా హరిత కళ్ళలోకి అలా చూస్తూనే ఉండిపోయాడు విరాజ్. తన ముందు అంత ధైర్యంగా కూర్చున్నది హరితేనా?  అని అతను నమ్మలేకపోతున్నాడు.

 

" ఏమిటి విరాజ్..ఏమిటలా చూస్తున్నావ్?

ఇదంతా కలా నిజమా అని ఆలోచిస్తున్నావా? " అని అడిగింది.

 

" కాదా మరి... మీ అమ్మగారు నిన్ను ఒంటరిగా.... నా దగ్గర... ఇలా..... వదిలి వెళ్లారంటే  చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏది ఒకసారి గిల్లు. " అని హరిత ముందు నిలబడ్డాడు.

హరిత నవ్వుతూ అతని పొట్ట మీద గిల్లింది.

" కల నిజమైనప్పుడు సమయం వృధా చేసుకోకుండా దానిని అనుభవించడంలోనే ఆనందం ఉంది.  ఏమంటావ్?"

 

ఆమె అన్న మాటలకు  అతను ఆశ్చర్యంగా చూశాడు.

 

" నీతో ఇలా అంటున్నది నేనేనా అని ఆలోచిస్తున్నావా... "

దానికి విరాజ్ ఏదో చెప్పబోయాడు. అతని నోరు తన చేతితో సున్నితంగా మూసి అంది హరిత.

" నన్ను ఇప్పుడు మనసు విప్పి మాట్లాడనీ. మా అమ్మ ముందు  నువ్వు ప్రమాణం చేసి 'నేను హరితని  మీ పాదాలసాక్షిగా  ప్రేమిస్తున్నాను...' అని చెప్పిననాడు నేను లోలోపల ఎంత పొంగిపోయానో తెలుసా విరాజ్. కానీ అప్పటికీ నేను సందిగ్ధంగానే ఉన్నాను... ఎందుకంటే మీ నాన్నగారు పెట్టిన నియమం నా ముందు లక్ష్మణరేఖలా నిలబడింది. దాన్ని దాటాలా వద్దా? అన్న ప్రశ్నకు నువ్వు మా అమ్మ మీద వేసిన ఒట్టే నాకు సమాధానంగా నిలిచింది.

 

ఆ రోజు మీ నాన్నగారు నన్ను పిలిపించి పెళ్లి కాకుండానే బిడ్డని కనడం  నీకు ఇష్టమేనా? అని అడిగినప్పుడు నిర్మొహమాటంగా అవును అని సమాధానం చెప్పాను.

 

ప్రతి ఆడదానికి కన్న తల్లిదండ్రుల ప్రేమ తర్వాత ఈ ప్రపంచంలో జీవితాంతం ఆలంబనగా  నిలిచేది ప్రేమించిన వాడి ప్రేమ. ఆ ప్రేమించిన వాడే భర్త అయితే  ఆ ఇల్లాలికి అంతకన్నా అదృష్టంగా ఏం ఉంటుంది?

 

నువ్వు '' అంటే వరుసలో నిలబడే ఆడపిల్లలు బోలెడుమంది ఉంటారు. అయినా మూడు ఏళ్లుగా నీ ప్రేమను పరోక్షంగా పొందగలిగాను అంటే నేను ఎంత అదృష్టవంతురాలినో విరాజ్.

అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.

సిగ్గు విడిచే అడుగుతున్నాను..

నీతో నేను బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నాను. పాపో,బాబో పుట్టాక బిడ్డని మీ నాన్నగారికీ నీ సమక్షంలో అప్పగించేస్తాను.

ఆ తర్వాత ఆయన రూపంలో దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను.

 

ఇన్నాళ్ళకి నీ ముందు నా మనసంతా  నిర్మలంగా పరిచాను. ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు విరాజ్. "

అని అతని ముందు లేచి నిలబడింది హరిత.

 

విరాజ్ ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయదల్చుకోలేదు.

 

హరితను ఒక్కసారిగా గాఢంగా కౌగిలించుకుని  ఆమె నుదుటి మీద, కళ్ళ మీద, బుగ్గల మీద, కంఠం కింద తమకంతో  చుంబించి అమాంతం ఆమెను ఎత్తుకొని అపురూపంగా మంచంమీద పడుకోపెట్టాడు.

 

అనంతరం ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె చేతులు తన చుట్టూ వేసుకుని ఆమె మెడ ఒంపులో తలదాచుకున్నాడు విరాజ్.

అతనిని తన బలం కొద్దీ దగ్గరకు లాక్కుంది హరిత.

 

గత మూడేళ్లుగా  వారిలో ఒకరిపట్ల ఒకరికి అంతర్గతంగా దాగున్న అనంత ప్రేమ భావం ఆ ప్రశాంత వాతావరణంలో  చైతన్య ప్రవాహంలా ప్రారంభమై  మూడేళ్ల  వసంతాల కలలన్నీ నిజం చేసుకుంటూ ఒకరిలోకి ఒకరు ప్రవహిస్తూ మధ్య మధ్యలో గాలి జొరబడి వారికి అంతరాయం కలుగచేద్దామని ప్రయత్నం చేసినా,ఇన్నేళ్లుగా విరహంలో బతికిన తామద్దరి మధ్య  నిర్దాక్షిణ్యంగా ప్రవేశిస్తే అంతకన్నా నిర్ధాక్షిణ్యంగా బయటికి గెంటివేసి అర్హత ఒక ప్రేమికుల మాత్రమే ఉంది అన్నంత అనురాగ సంగమంలో  వారి దేహాలు  మమేకమయ్యాయి.

 

అలా ఎంతసేపు అలా ఉండిపోయారో వారికి తెలియలేదు.

 

అలసట వలనో, అంతరంగాలు సంతృప్తి చెందిన  భావన వల్లనో కొన్ని నిమిషాల సేద తీసినప్పటికీ, ఆ కాస్త సమయమే మళ్లీ యుగాలుగా ఎక్కడ మారిపోతుందో అనే భయంతో వారి ఆత్మానునుసంధానం జరుగుతూనే ఉంది.

 

గదిలో ఏసి, ఫ్యాను  కాలగమనంతో పాటు  పనిచేస్తున్నా కూడా  ఒకటి స్వేదాన్ని ఒకరు అనురాగపు చర్యగా అద్దుకుంటూ  మళ్లీ మళ్లీ ఆచర్యకే పునరంకితం  కావడం  చూసి కాలానికి కన్నుకుట్టిందేమో... కాలింగ్ బెల్ మోగింది.

 

తమ లోకం నుంచి ఇద్దరు ఉలిక్కిపడి సర్దుకున్నారు ఇద్దరు.

 

మూడు నిమిషాల అనంతరం కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది.

 

తలుపు తెరవబడి  లోపలికి వచ్చిన శకుంతల, హరీష్ లకు నలగని పక్క మీద దుప్పటి కప్పుకుని  ప్రశాంతంగా బోర్లా పడుకుని గాఢ నిద్రలో చిన్నగా గుర్రు తీస్తున్న విరాజ్ కనిపించాడు.

 

కుర్చీ మీద అస్తవ్యస్తంగా ఉన్న ఒక దుప్పటి,  దాని ఎదురుగా కాళ్లు పెట్టుకొని పడుకోడానికి వీలుగా ఉన్న టీపాయ్, దానికి బాగా దూరంగా రెండవ కుర్చీ కనిపించాయి.

 

అప్పుడు సమయం చూసింది హరిత. దాదాపు రాత్రి 11:30 గంటల సమయం.

 

గదినంతటిని  ఒక్కసారి పరిశీలించింది శకుంతల.

 

" విరాజ్... విరాజ్... అమ్మ, మావయ్య వచ్చారు " అని గట్టిగా పిలిచింది హరిత.

 

విరాజ్ చటుక్కున లేచి కూర్చున్నాడు.

 

" సారీ ఆంటీ. బాగా నిద్ర పట్టేసింది.  నువ్వు పడుకోలేదా హరిత?ఇంకా మెలకువగానే ఉన్నావా? " అన్నాడు

 

" అమ్మ వాళ్లు వెళ్లిన వెంటనే నువ్వు ఇలా నిద్రలోకి  జారిపోయావు మహానుభావా.. ఏం లేపను?ఎక్కడ పడుకోను? నీ గుర్రుకి నిద్ర పట్టక  ఈ కుర్చీలో దుప్పటి కప్పుకుని  పడుకున్నాను. అమ్మ వెళ్దామా నాకు బాగా నిద్ర వస్తోంది. " అంది తల్లికి దగ్గరగా వెళుతూ.

 

" చాలా చాలా థాంక్స్ బాబు. కొంచెం లేట్ అయింది.  మీ నిద్ర పాడు చేసాం." అంది శకుంతల నొచ్చుకున్నట్టుగా.

 

" మీరు చిన్న చిన్న విషయాలకి అంత పెద్ద పెద్ద థాంక్స్ చెప్పేస్తారు ఏంటి ఆంటీ? ఈ మాత్రం సహాయం ఒకరికి ఒకరు చేసుకోపోతే ఇంకెందుకు? సరే ఇంతకీ వెళ్లి పని ఏమైంది? "

 

" పిల్లని చూసి వచ్చాం సార్. అక్కతో చర్చించి వాళ్లకి  సమాధానం చెప్పాలి. సరే మీరు పడుకోండి సార్. మేము వెళ్లి వస్తాం. "

అని హరీష్ చెప్పి వెళ్లడానికి ఉద్ద్యుక్తులు కావడంతో  తలుపు గడియ పెట్టుకోవడానికి లేచాడు విరాజ్.

 

శకుంతల, హరీష్  వెనుక నడుస్తున్న హరితకు విరాజ్ విసిరిన  గాలి ముద్దులు అందేసాయి.

 

*****

 

మరునాటి ఉదయం తాము స్వామి దర్శనానికి వస్తున్నామని, మీరు కూడా హాయిగా స్నానం చేసి తయారయి రండి అని

హరిత మెసేజ్ పెట్టింది విరాజ్ కు.

 

విరాజ్, బబిత, హరిత,  శకుంతల నలుగురు మురుడేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అష్టోత్తర పూజ చేయించుకున్నారు.

 

ఆంటీ. నేను వచ్చి నాలుగు రోజులైంది. ఈలోగా నాన్న రోజుకి పది సార్లు చొప్పున నా కాల్ చేస్తూనే ఉన్నారు. నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేక అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఆయన కన్న అమ్మ ఎక్కువగా  కంగారుపడే అవకాశం ఉంది.  అందుకని ఇవాళ సాయంత్రం ఫ్లైట్ కి నేను బయలుదేరుతాను.

మళ్లీ మనం అందరం ఎప్పుడొస్తామో తెలియదు. కాబట్టి సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకి  రాజగోపురం ఎక్కి మొత్తం అంతా కూడా మన అందరితో సహా వీడియో తీసుకుందాం. ప్లీజ్. " అన్నాడు శకుంతలతో  విరాజ్.

 

" అలాగే బాబు తప్పకుండా. "అంది శకుంతల.

 

" అయితే ఈ మధ్యాహ్నం మీ భోజనం మా ఇంట్లోనే. ఏమంటారు? "అడిగింది బబిత.

 

" దేశం కానీ దేశంలో ఇంత ఆత్మీయంగా పిలిచి భోజనం పెడతాను నాయనా అంటే ఎవరు మాత్రం ఆ అదృష్టం వదులుకుంటారు ఆంటీ. తప్పకుండా వస్తాను. "

 

" ఇల్లు మీకు గుర్తుందా? "

 

" మీ ఇంటికి వచ్చినప్పుడు గుర్తుంది కానీ తిరిగి వచ్చినప్పుడు గుర్తులేదు ఆంటీ. అందుకని హరితను పంపించండి." అన్నాడు విరాజ్.

 

" సరే బాబు" అంది సబిత.

 

******

 

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages