ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 30 - అచ్చంగా తెలుగు

ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 30

Share This

 ఒకటై పోదామా.. ఊహల వాహినిలో - 30 

కొత్తపల్లి ఉదయబాబు 




సరిగ్గా అక్కడ అదే సమయంలో విరాజ్ ఇంట్లో...!

 

పిల్లాడు మధ్యాహ్నం కూడా భోజనానికి రాలేదండి. అలా రాకపోతే అమ్మ రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తాడు. రాత్రి 10 గంటలు దాటింది. ఈ రెండో షాపు పెట్టాక ఎట్టి పరిస్థితులలోను 9గంటలకు  ఇంటికి వచ్చేస్తుండేవాడు.

 

షాప్ లో ఉన్నప్పుడైనా కనీసం 'అమ్మా ఏం చేస్తున్నావ్ అని ఫోన్ చేసేవాడు' వాడు ఇంతవరకు రాలేదంటే నాకు చాలా కంగారుగా ఉండండి. " భర్తకి టిఫిన్ పెడుతూ అంది విశాలాక్షి.

 

" కుర్ర వయసు. ఏ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాడు"

అని తేలికగా తేల్చేసి మాట్లాడకుండా టిఫిన్ ముగించాడు గవర్రాజు.

 

డైనింగ్ టేబుల్ దగ్గర కబుర్లు అస్సలు అతనికి నచ్చవని అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షికి.

 

టీవీ ముందు సోఫాలో కూలబడ్డ గవర్రాజు వార్తలు చూడసాగాడు. విశాలాక్షి మందులు పెట్టె తీసుకొచ్చి అతను ముందు పెట్టి కూర్చుంది.

 

అతను మందులు పెట్టి తెరిచాడు.

అందులో పైనే నాలుగు మడతలుగా అసోసియేషన్ లెటర్ హెడ్ కాగితం.

 

" నాన్న నాకోసం వెతక వద్దు. రావాలనిపిస్తే ఇంటికి వస్తాను. ఎప్పుడో తెలీదు - విరాజ్ "

 

" వీడికి మధ్య ఏదో రిమ్మ తెగులు పుట్టిందే. మీ మీ రాజ్యం పెద్దమ్మ కొడుకు క్షితిజని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పెద్దవాళ్లు చూపించిన సంబంధం చూసుకోక  ప్రేమో అంటూ తగిలిపోతున్నాడు. ఆ పిల్ల వాళ్ళ అమ్మ వాడికేదో మందో మాకో పెట్టేశారు. దాని వెనకాల తిరుగుతున్నాడు. వాడితో మోజు తీరిపోయాక పొమ్మందేమో... ఇంకేముంది మనసు పాడై ఏ పబ్బులోనో తాగి పడి ఉంటాడు. అంతా నా ఖర్మ." అని ఆ కాయితాన్ని విశాలాక్షి ముఖాన విసిరేశాడు గవర్రాజు.

 

ఆ కాగితం చదివిన విశాలాక్షి దాదాపు ఏడుపు కంఠంతో అంది.

 

" నాకోసం వెతకొద్దు ఇంట్లోంచి పోతున్నాను అని వాడు రాస్తే... ఏ పబ్బులోన తాగి పడి ఉంటాడులే అంటారేమిటి. నిక్షేపం లాంటి కుర్రాడి మీద నిఘా పెట్టి ఆ వెధవలు ఎవరికో ఊరికే డబ్బులు పోస్తున్నారుగా... అర్జెంటుగా  వాళ్ళకి ఫోన్ చేసి పిల్లాడు ఎక్కడున్నాడు కనుక్కోమనండి. తెల్లవారేలోపుగా పిల్లాడు ఇంట్లో ఉండకపోతే రేపటి నుంచి పచ్చి గంగ ముట్టను... ఆ" అనేసి ఏడుస్తూ పడక గదిలోకి వెళ్ళిపోయింది విశాలాక్షి.

 

" నా కర్మ కాల! ఈ అర్ధరాత్రి మద్దెల దరువు ఏమిటిరా బాబు?

నేను ఇంట్లో ఆడది కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టమే అని లక్ష సార్లు చెప్పాను. ఎవరు నా మాట వింటారు కనుక. ఈ ఆస్తి ఈ కోట్లు నేను కట్టుకు పోతాను మరి.. అంతా నా కర్మ  " అనే సెక్యూరిటీ గార్డ్స్ కి ఫోన్ చేశాడు గవర్రాజు.

 

అయితే విరాజ్ వచ్చే స్థితిలో లేడని, అతని దృష్టిలో అరిష్టం అనుకుంటున్నా దానికి శ్రీకారం జరగబోతుందని తెలియని గవర్రాజు ఆ రాత్రంతా ఫోన్లు చేస్తూ జాగారం చేస్తూనే ఉన్నాడు.

 

*******

 

మర్నాడు ఉదయం 7 గంటలకే ఫ్రెష్ అప్ అయ్యి,  టిఫిన్ చేసి హోటల్ రిసెప్షన్లో పేపర్ చదవసాగాడు విరాజ్.

 

అప్పటికే ఒకసారి దైవ దర్శనం పూర్తి చేసుకుని టిఫిన్ బయట చేద్దాం అనే ఉద్దేశంతో  హోటల్ కి ఎదురుగా బీచ్ మొదట్లో ఉన్న చిన్న రెస్టారెంట్లోకి అడుగు పెట్టారు బబిత, శకుంతల, హరిత.

 

సరిత ఉదయమే ఎవరికో పెళ్లికూతురు మేకప్ చేయడానికి వెళ్ళిపోయింది.

 

విరాజ్ దగ్గర నుంచి ఏ క్షణమైనా సందేశం రావచ్చన్న ఉద్దేశంతో ఫోన్ సైలెంట్ లో పెట్టింది హరిత.

 

ఆమె ఊహించినట్టుగానే విరాజ్ దగ్గరికి మెసేజ్ వచ్చింది.

" ఏమిటి రాత్రి నన్ను నడిపించి వెళ్లి హాయిగా పడుకున్నావా? నిద్ర పట్టలేదు తెలుసా? "

" బావుంది నన్నేం చేయమంటావ్ విరాజ్. ఒంటరిగా దొరికినప్పుడు ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా. నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో నీకు తెలుసా" తల్లి చూడకుండా మెసేజ్ పెట్టింది  హరిత.

 

" ఈ వేళ చెప్తానుగా నీ పని... ఇంతకీ ఎక్కడున్నావ్? "

 

" మేము ఆరింటికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని తమరు విడిది చేసిన ఖరీదైన ఆ పూటకూళ్ల  ఇల్లు  ఎదురుగా, సరిగ్గా బీచ్ మొదట్లో ఉన్న రెస్టారెంట్ లో  ఉన్నాం. సరదాగా బైట టిఫిన్ తిందామని ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చున్నాం. " అని మెసేజ్ పెట్టింది హరిత.

" ఓర్నీ.. ఇంకా లేవలేదు అనుకుంటున్నా నేను . మూడు నిమిషాల్లో నీముందు ఉంటా" అంటూ తిరుగు సందేశం పెట్టి మూడు నిమిషాల్లో  వారి ముందు ఉన్నాడు విరాజ్.

 

అతను వచ్చే లాగానే తన ఫోన్లోని మెసేజ్లు అన్ని డిలీట్ చేసేసింది హరిత.

 

" హాయ్ ఆంటీ. ఇద్దరికీ శుభోదయం. ఇంత తొందరగా దర్శనం చేసుకున్నారా? " అడిగాడు వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ.

 

" మళ్లీ వంట పని ఉంటుందని ఉదయం ఆరింటికి ఒకసారి దర్శనం తీసేసుకుంటాను బాబు.ఆ అలవాటు ప్రకారమే ఈవేళ అక్కయ్య, హరితలను కూడా తీసుకువచ్చేసాను. మీరేం తింటారు?చెప్పండి ఆర్డరిస్తాను. "అడిగింది శకుంతల.

 

" నేను మీలాగే ఆరింటికి లేచాను ఆంటీ. ప్రశాంతంగా స్నానం చేసి టిఫిన్ చేసి పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను.  మీరు ఎనిమిదింటికి కలుద్దాం అన్నారు కదా. అందుకని." అన్నాడు విరాజ్.

 

" అదేం కుదరదు మాతోపాటు ఏదో ఒకటి తినండి.  ప్లీజ్"

 

" అయితే హిమక్రిములు తింటా ఆంటీ. నాకు ఉదయమే అలా తినడం  ఇష్టం"

 

సర్వర్ ని పిలిచి అతనికి ఇష్టమైన ఫ్లేవర్ తెలుసుకొని ఆర్డర్ చేసింది శకుంతల.

 

పావుగంట అనంతరం  ఆ క్యాంటీన్ నుంచి బయటకు వచ్చారు నలుగురు.

 

" సరదాగా బోట్ షైర్ చేసొద్దామా... ఈ

నీరెండలో  సూర్యుడికి కిరణాలు నీటి అలల మీద పడి మెరుస్తుంటే.. అది చూడ్డానికి ఎన్ని కళ్ళు చాలవు. రండి  ఆంటీ...వెళ్దాం" అన్నాడు విరాజ్.

 

" నాకు నీళ్లంటే భయం బాబు. మీరు వెళ్ళండి. "అంది హరిత.

 

" ఆంటీ.. మీది ఏమీ అనుకోనంటే హరిత పక్కన నేను కూర్చుంటాను. బోట్ అతను జాకెట్స్ ఇస్తాడు. బోట్లో కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. మనకేం భయం లేదు. అయినా నేను ఉన్నాను. ఏమంటారు ఆంటీ. మీకు ఎవరికి ఇష్టం లేకపోతే వద్దు. " అన్నాడు  విరాజ్.

 

" హరిత. భయం అనేటువంటిది మొదలైతే

ప్రతి విషయంలోనూ మనకు తెలియకుండానే

దాంట్లో చిక్కుకుపోతాం. అప్పుడు ఏ విషయంలోనూ ముందడుగు వేయలేం. చెట్టు అంత మగాడు విరాజ్ మన దగ్గర ఉండగా మనకి భయం ఏంటి... అదిగో చూడు... చిన్న చిన్న పిల్లలందరూ ఆ జాకెట్స్ వేసుకుని బోట్ ఎక్కడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో " బబిత.

 

ఆ మాటలతో ఉత్సాహం వచ్చిన హరిత "పదండి వెళ్దాం" అనడంతో బీచ్ వరకు నడిచి బోస్ షైర్ కి సిద్ధమయ్యారు నలుగురు.

 

లైఫ్ జాకెట్స్ తొడుక్కున్న తర్వాత, అక్క చెల్లెలు ఇద్దరు  ఒకరు చేయి ఒకరు పుచ్చుకుని బోట్లోకి ఎక్కారు. ముందుగా విరాజ్ బోట్లోకి ఎక్కి, హరితకు చేయి  అందించాడు.

 

(ఇంకా ఉంది)

 

No comments:

Post a Comment

Pages