ధ్యానయోగం
(సి.హెచ్.ప్రతాప్)
ధ్యానం అనేది ఒక పద్ధతి కాదని, అది ఏ మతానికో లేదా ఆచారాలకో సంబంధించినది కాదు. ధ్యానం చేయడానికి దేవుడి బొమ్మనో లేక మరేదైనా గుర్తునో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధ్యానం అంటే ఏదో ఒక వస్తువుపై దృష్టి పెట్టడం కాదు; అది మనలో మనం కలిసిపోయే ఒక స్థితి. దీనినే సూఫీలు ‘బేఖుదీ’ అంటారు. అంటే మనలోని ‘నేను’ అనే అహంకారం కరిగిపోయి, మన పరిమితులను మనం మర్చిపోయే స్థితి. ఈ స్థితిలో ఎటువంటి కోరికలు ఉండవు, దేనినీ సాధించాలనే తాపత్రయం ఉండదు.
నిజానికి చుట్టూ ఉన్న వెలుగును, చెట్ల నీడను, నీటి మెరుపును లేదా ఒక మెత్తని ఆకును ఆస్వాదించలేకపోతున్నామంటే మనం ధ్యానంలో లేనట్టే. మన మనస్సు ఎప్పుడూ పాత జ్ఞాపకాలతోనో, భవిష్యత్తు కోరికలతోనో నిండి ఉండటం వల్ల ఈ అందాలను చూడలేకపోతున్నాం. ధ్యానం మన కష్టాలను మాయం చేయదు, కానీ జీవితం ఎంత సరళంగా, స్పష్టంగా ఉందో మనకు చూపిస్తుంది. ఆ స్పష్టత కావాలంటే, మనస్సు ఎటువంటి లాభాన్ని ఆశించకుండా తన మీద ఉన్న ఆలోచనల భారాన్ని దించుకోవాలి.
మనకు తెలిసిన పాత విషయాలనే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. "నేను ధ్యానం చేస్తున్నాను" అనే ఆలోచన ఉన్నంత వరకు అక్కడ అహంకారం ఉన్నట్టే. మనకు తెలియని కొత్త స్థితిలోకి వెళ్లాలంటే ఈ అహం ఆగాలి. ఆ స్థితి గాలిలా వస్తుంది, పోతుంది; దానిని మనం బలవంతంగా పట్టుకోలేము. అది మనకు ఏదో ఒక లాభం చేకూర్చకపోవచ్చు, కానీ అది లేకపోతే జీవితం వెలితిగా అనిపిస్తుంది.
"ధ్యానం ఎలా చేయాలి?" అని ప్రశ్నించుకోవడం కంటే "ధ్యానం అంటే ఏమిటి?" అని ప్రశ్నించుకోవడం ముఖ్యం. ఏదైనా ఒక పద్ధతిని పాటిస్తే ఆ పద్ధతి ఇచ్చే ఫలితం మాత్రమే వస్తుంది. కానీ ధ్యానం అంటే ఏమిటో మనసులో లోతుగా ఆలోచిస్తే, అదే నిజమైన ధ్యానానికి దారి తీస్తుంది. ఈ ప్రయాణంలో వెతికే వస్తువు కంటే, వెతికే మనిషి (మనస్సు) ముఖ్యం. మన కోరికలన్నీ ఆగిపోయినప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
భగవద్గీత ఈ స్థితిని ఇలా వివరిస్తుంది:
“నిశ్చలతన్మనో యోగీ యుంజతో యోగమాత్మనః
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ”
దీని అర్థం ఏమిటంటే, మనస్సును నిశ్చలంగా ఉంచి, తన ఆత్మను యోగంలో నిలిపిన వ్యక్తి పరమశాంతిని, మోక్షాన్ని పొందుతాడు.
ప్రశాంతమైన మనస్సు ఒక ఖాళీ పలక లాంటిది. దానిపై మనం ఏమైనా రాయవచ్చు, అవసరమైతే తుడిచేయవచ్చు. అలాంటి మనస్సు మాత్రమే కొత్త విషయాలను గ్రహించగలదు. ఏదో ఒక లాభం కోసం చేసే ఏకాగ్రత ధ్యానం అనిపించుకోదు. ధ్యానంలో ఎటువంటి ప్రయత్నం గానీ, ఏదో సాధించాలనే ఆత్రుత గానీ ఉండదు. ఎప్పుడైతే అనుభవం కోసం ప్రాకులాడటం ఆగిపోతుందో, అప్పుడే నిజమైన ధ్యానం మొదలవుతుంది.
ఉపనిషత్తులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి:
“యదా సర్వే ప్రముచ్యంతే కామా యేऽస్య హృది శ్రితాః
అథ మర్త్యోऽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే"
మనస్సులోని కోరికలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో, అప్పుడు మనిషి అమరత్వాన్ని పొంది, దైవత్వాన్ని అనుభవిస్తాడు అని పై శ్లోకం భావం.
ధ్యానం అనేది అన్నిటికంటే పవిత్రమైనది. సూఫీ కవి జామీ చెప్పినట్లు, అది ఆత్మ తనను తాను మర్చిపోయి పరవశించే స్థితి. ఆ స్థితి మనలో లేకపోతే, మనం బయట ప్రపంచంలో ఎంత సంపాదించినా లోపల మాత్రం ఎప్పుడూ ఏదో వెలితిగానే ఉంటుంది.
***




No comments:
Post a Comment