శ్రీథరమాధురి - 139 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 139

Share This

 శ్రీథరమాధురి - 139

(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)




నేడు అందరూ హృదయంతో తక్కువగా, బుద్ధితో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మనకు విజ్ఞాన శాస్త్రం తెలుసు, కానీ మౌనం తెలియదు. మౌనం అనేది హృదయం యొక్క భాష, విజ్ఞాన శాస్త్రం బుద్ధికి సంబంధించిన భాష. బుద్ధికి అన్నిటికీ కారణాలు వెతకడం అలవాటు. హృదయం అన్నింటినీ అనుభూతి చెందాలని తపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది బుద్ధి, హృదయాల మధ్య ఒక సంగ్రామంలా అనిపిస్తుంది. మీరు దేనిని ఎక్కువగా పోషిస్తే అది యుద్దంలో గెలుస్తుంది. జ్ఞాని వీటన్నింటినీ చూసి నవ్వుతారు.
 

***

ఒక‌ స్త్రీని మీ మేధస్సు ద్వారా అర్థం చేసుకోవడం అసాధ్యం, ఎందుకంటే ఆమె ఎక్కువగా హృదయంతో, తక్కువగా తెలివితేటలతో అనుసంధానమై ఉంటుంది.
ఒక స్త్రీ యొక్క భావనలకు అనుకూలంగా ఒక పురుషుడు స్పందించడం అనేది అసాధ్యం, ఎందుకంటే పురుషుడు ఎక్కువగా మేధస్సుతో, తక్కువగా హృదయంతో అనుసంధానమై ఉంటాడు. ఒక స్త్రీ కలకాలం నిలబడే ఉద్వేగపరమైన ప్రేమకోసం, బాగుకోసం తపిస్తుంది. కానీ పురుషుడు క్షణికమైన శృంగారాన్ని కోరుకుంటాడు. 

ఈ గొడవ కొనసాగుతుంది. ‌స్త్రీ అధికంగా హృదయానికి సంబంధించి ఉంటుంది కనుక, ఆమె దైవానికి దగ్గరగా ఉంటుంది. ఆమె‌కు న్యాయంగా దక్కాల్సిన గౌరవాన్ని, చోటును ఇవ్వడాన్ని ఒక పురుషుడు నేర్చుకోవాలి.

***
హృదయానికి దగ్గరగా ఉన్నదాన్ని స్వంతం చేసుకోలేము, ఎందుకంటే హృదయానికి స్వార్థం తెలీదు. కేవలం బేషరతుగా అది ప్రేమించగలదు, కానీ స్వంతమవదు.
 
స్వార్థం, బుద్ధికి సంబంధించిన అంశం.‌ దాని ద్వారా మీరు పొందగలరు, కానీ ప్రేమించలేరు.
 
ప్రకృతి లేదా జ్ఞానం లేక దైవాన్ని స్వంతం చేసుకునే వీలు లేదు. ఇది హృదయానికి సంబంధించిన అంశం కనుక, ఇది కేవలం ప్రేమే!
 
మీరు దేన్నైనా పొందినప్పుడు, దానిని కోల్పోయే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి.
 
కాబట్టి బుద్ధి పొందినదాన్ని లేక పొందబోయేదాన్ని కోల్పోతుందన్న భయంతో ఉంటుంది. కాబట్టి బుద్ధి పొందిన దాన్ని భద్రంగా తాళమేసి ఉంచేందుకు తపిస్తుంది. 
 
నేడు 'ప్రేమికులు' గా చెప్పుకునే చాలామంది తమ అనుబంధాన్ని కోల్పోతామన్న భయంతో ఉంటారు. ఎందుకంటే, ఆ బంధం పట్ల‌వారి దృక్పథం మేధస్సుతో‌ కూడుకుని ఉంటుంది, అందులో హృదయం, ప్రేమ యొక్క పాత్ర పెద్దగా ఉండదు. నిజానికి, అలౌకికమైన ప్రేమను ఇలా లౌకికంగా భావించడం చాలా బాధాకరం.
 
***

No comments:

Post a Comment

Pages