మట్టిలో మాణిక్యం
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఏడేళ్ళ రాజుని చూస్తే కడుపు తరుక్కుపోతోంది వాడి తల్లి ఎల్లమ్మకి.
వాడు సరిగ్గా అన్నం తిని రెండు రోజులౌతోంది.
"ఏరా, వెళ్దామా?" అంది.
వెళదాం అన్నట్టుగా తలూపాడు.
ఇంట్లోంచి ఇద్దరూ బయటపడ్డారు.
ఎల్లమ్మ అసలు పేరు దుర్గ. గుంటూరు దగ్గర్లోని ఓ పల్లెటూరిలో ఉండేది. తల్లి చనిపోవడంతో, హైదరాబాదు వచ్చి ఒక మేస్త్రి దగ్గర పనికి కుదిరి తండ్రితో పాటు కూలిపని చేయసాగింది. మేస్త్రి చాలా మంచివాడు. కష్టం సుఖం తెలిసున్నవాడు. కొంతకాలం తర్వాత పోలిగాడు ఆ మేస్త్రి దగ్గరే పనికి కుదిరాడు. అతడికి దుర్గ ఎందుకో బాగా నచ్చింది. ఆమెకి పనిలో సహాయం చేయసాగాడు. అందరి మగాళ్లలా అక్కడిక్కడ ముట్టుకోడాలు, రెండర్థాల మాటలు మాట్లాడకపోవడం వల్ల వాడంటే ఆమెకి కూడా అభిమానం ఏర్పడింది. వాళ్లిద్దరు ఆడుతు పాడుతూ సరదాగా పనంతా ఇట్టే చేసేస్తుంటే, మేస్త్రికి కూడా వాళ్లంటే ప్రత్యేక అభిమానం కలిగింది. ఇదిలా ఉండగా దుర్గ తండ్రి విషజ్వరం వచ్చి కన్నుమూశాడు. తండ్రి చనిపోయాక దుర్గకి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ సమయమంతా పోలిగాడే ఆమెకి సహాయ సహకారాలు అందించాడు.
దుర్గ మళ్ళీ పనిలోకి వచ్చింది.
ఒక మంచిరోజు మేస్త్రి పోలిగాణ్ని దుర్గ గుడిశెకి తీసుకొచ్చి"దుర్గా! మీ నాయన తర్వాత ఈ పోలిగాడే నిన్ను అంతలా కళ్లలో పెట్టుకు చూసుకున్నాడే! నువ్వు వీణ్ని మనువాడవే. మీ ఇద్దరూ నా దగ్గరే పని చేసుకుంటూ హాయిగా ఉందురుగాని" అన్నాడు.
"అవునే, నిన్ను పువ్వుల్లో ఎట్టి చూసుకుంటా, ఎక్కడో గుంటూర్లో ఉండే నిన్ను మా ఎల్లమ్మ, కనకదుర్గమ్మతో మాట్లాడి నా కోసమే ఈడికి తెచ్చినాది. నిన్ను ఇగనుంచి ఎల్లమ్మా అని ముద్దుగ పిలుచుకుంటా, ఒప్పుకోవే" అన్నాడు.
మంచి ముహూర్తం చూసి వేణుగోపాలస్వామి గుడిలో వాళ్లిద్దరికీ మూడుముళ్ళేయించాడు.
కాలం సునాయసంగా కరిగిపోతోంది. రాజు కడుపులో పడి, బయటకొచ్చి, ఐదేళ్ళు వచ్చాయి.
పోలిగాడికి రాజు చక్కగా చదువుకుని పైకి రావాలని కోరికుండేది. అదే విషయం సమయం దొరికినప్పుడల్లా ఎల్లమ్మ దగ్గర చెప్పి, వాడి చదువుకు మాత్రం ఏ లోటూ కలగకుండా మనం చూసుకోవాలనేవాడు. ఒకరోజు పొద్దుగుంకుతున్నప్పుడు ఆరో అంతస్తులో పని చేస్తూ, పై నుండి జారి కిందపడి మరణించాడు పోలిగాడు.
ఎల్లమ్మ రాజు ఒకరికొకరుగా మిగిలారు.
కాలం మారింది.
మేస్త్రి, పని మానేసి వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎల్లమ్మ పనిచేస్తున్న మేస్త్రిది కరకు మనస్తత్వం. పనెక్కువ తీసుకుంటాడు, ఓ పద్ధతి లేకుండా ఎప్పుడో కూలి డబ్బులిస్తాడు, అదీ తక్కువగా!
ఎల్లమ్మ ఎలాగో జీవితాన్ని నెట్టుకొస్తోంది.
రాజు ఏనాడూ ఏదీ అడగడు. చదువంటే ప్రాణం. స్కూల్లో కూడా స్కాలర్ షిప్ ఇప్పించారు దయగల మాస్టార్లు.
కళ్లలో చిప్పిల్లుతున్న నీళ్లతో రాజుగాడిని ఆపి వాడి చొక్కా ఎత్తి పొట్ట చూస్తూ, "కడుపు సూడు ఎట్టా లోపలికి పోయిందో. ఇట్టా నీర్సంతో సదువెట్టా సదువుతున్నావయ్యా"అంది.
"పొట్టదేముందమ్మా, గాలూదితే బెలూనుబ్బినట్టు, గిన్ని నీళ్ళు తాగితే పొట్ట ఉబ్బుతాది. అన్నం లెక్క నీళ్లేం కొనుక్కోనక్కర్లేదు కదా! నువ్వేం బాద పడమాక"అన్నాడు నవ్వుతూ.
"ఓరయ్యా, గింత చిన్న వయసులో ఎంత బాగా మాట్టాడుతున్నావు, నేనే నీకేం చెయ్యలేకపోతున్నాను" అని లేచి కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుని, కొడుకుతో ముందుకు కదిలింది.
వాడు ఎడంవైపు బడిబాట పడితే, ఎల్లమ్మ జాలిగా వాడివంక చూస్తూ కుడివైపు పనిబాట బట్టింది.
కొంతదూరం వెళ్ళాక "ఒసే, ఎల్లమ్మా, ఇట్రావే! చనిపోయిన మా నాన్నగారి పేరు మీద ఏదన్నా చేయమని మా అమ్మ ప్రతిరోజూ సతాయిస్తోంది. మీ అబ్బాయి బాగా చదువుతాడు, మట్టిలో మాణిక్యం. వాడికి నెలకు పదిహేనొందలు ఇస్తానే, వాడు చెయ్యవల్సిందల్లా మా నాన్న తిథినాడు వచ్చి ఆయనకి దణ్నం పెడితే చాలు, అదీ నేను చేస్తున్నానని ఈ లోకంలోని మా అమ్మకి, పై లోకంలోని మా నాన్నకి తెలియజేయడానికి, సరేనా! ఇదిగో ఈ నెల డబ్బు. పిల్లాన్ని ఇలాగే చక్కగా చదివించు"అంటూ డబ్బు ఎల్లమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ధర్మారావు.
ఆమె కళ్ళనీళ్ళతో ఆయనకి దణ్నం పెట్టి కొడుకు స్కూలు వైపుగా పరిగెత్తింది, వాడికి కడుపు నిండా ఏమన్నా పెట్టించాలన్న తాపత్రయంతో!
***


No comments:
Post a Comment