పుణ్యవతి (నవల) - 5 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 5

Share This

 పుణ్యవతి (నవల) - 5

రచన :గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)





(శ్యామల మాటలు గుర్తుకు వచ్చి కలవరపడే సుధాకర్ తన తండ్రి తన గురించి హారికకు చెప్పే మాటలను విని ఒళ్ళు మండిపోతుంది. వెంటనే ఆఫీసుకి వెళ్ళి, శ్యామల ఇచ్చిన డైరీ చదవటం మొదలెడతాడు. అద్దె ఇంటి కోసంఅడగడానికి వచ్చిన రవిని సృజన కేకలేసి పొమ్మంటుంది. తరువాత.....)
@@@@@@@@

వాళ్ళ కన్నీటి మర్మం తెలియని సుధ గోడకున్న ఫొటోలోంచి అమాయకంగా నవ్వుతోంది. 
@@@@@@@@@@@

"తీయని హృదయం  నదిది - ఉప్పుకి నిలయం కడలి!
కలిసే నదము కడలిని సాంద్రము చూడదు గుడ్డిది ప్రేమ!
ప్రేమకు లేదు ఎదురు - ప్రేమకు లేదు బెదురు!
కలసిన మనసుల కలలు- పారే నదిలో అలలు!

నమ్మకమన్నది పెంచు - నయవంచనలను తుంచు!
మోడు బ్రతుకున మోదము పూచే వసంతగీతమే ప్రేమ!
ప్రేమకు లేదు ఎదురు - ప్రేమకు లేదు బెదురు!
కలసిన మనసుల కలలు - పారే నదిలో అలలు!"

కూనిరాగం తీస్తూ ఇంటిని శుభ్రం చేస్తోంది పుణ్యవతి.

"ఏంటమ్మా! కాలేజీలో పాటలపోటీ గానీ ఉందేమిటి? నేను వ్రాసిన పాటను బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు" అన్న మాటలు గుమ్మంలోంచి వినిపించి తలెత్తి చూసింది. గుమ్మంలో రవిని చూడగానే ఆనందంతో "నువ్వా? రా!" అంటూ ఆహ్వానించింది. "ఏమిటీ మధ్య నల్లపూస అయిపోయావ్?" లోనికొచ్చి కూర్చున్న అతన్ని అడిగింది పుణ్యవతి.

"ఏ ఆడపిల్లయినా మెచ్చి మెళ్ళో వేసుకుంటుందని. . ." చిరునవ్వుతో చెప్పాడతను. "కానీ నల్లపూసలు అవుటాఫ్ ఫాషన్. నెక్లెస్ అయితేనే యస్ అంటున్నారు ఆడపిల్లలంతా!"  

రవి మాటలకు పుణ్యవతి పగలబడి నవ్వింది. "ఏమి చేయమంటావు? భారత స్త్రీకి భర్త కన్నా బంగారం మీదే మక్కువ ఎక్కువ. ఆనాడు సీతాదేవి కూడా, ప్రమాదమని మరిది చెబుతున్నా, బంగారు జింకను తెమ్మని బంగారంలాంటి భర్తనే పంపింది."

"నువ్వూ పురాణం మొదలెట్టావా? నిన్ననే రెండు వీధుల అవతల ఒకాయన్ని ఇల్లడిగితే వామనావతారం చూపించాడు" అన్నాడు రవి.

"ఇల్లడగటమేంటి? ఆల్రెడీ నువ్వు పరంధామయ్యగారి ఇంట్లో ఉన్నావు కదా!" పుణ్య ప్రశ్నించింది.

"ఏం చెప్పనమ్మా? కవిగాణ్ణి కదా! నోరూరుకోక పిచ్చాపాటీలో పరంధామయ్యగారి దగ్గర ఒక కొటేషన్ కొట్టాను."

"ఏమన్నావేంటి?"

"కన్నుల కూరిమి నిండిన వేళ 
కననగు నంతయు ప్రియముగనే!
కలగిన మనసుకు కననగుగా 
భువనమంతయు ఒక చెరగా!"

"బాగుంది."

"ఏం బాగు? ఈ పాడు అలవాటుని నేను మానుకోక తప్పదు. నా తాత్పర్యాన్ని ఆయన అపార్థం చేసుకొన్నట్లుంది. 'నా ఇల్లు చెరసాలగా ఉంటే అంతఃపురంలాంటి కొంప వెతుక్కుపోవయ్యా' అన్నాడు. క్షమించమని బ్రతిమాలాను. పూర్వకాలం మునుల శాపాల్లా తన మాటకు తిరుగులేదట! ఎంత బతిమాలినా లాభం లేక, ఇళ్ళ వేటలో పడ్డాను. నిన్న గేటు ముందు 'టులెట్' బోర్డు చూసి ఒక ఇంట్లోకెళ్ళాను. 'పెళ్ళయిందా' అని అడిగారు. కాలేదన్నాను. వెంటనే ఆయన యింటికి బదులు వామనావతారం చూపించాడు. ఆయన్ని కాళ్ళావేళ్ళాపడి ఒప్పించే లోపు, వాళ్ళ అమ్మాయి దూకుడుగా బయటకొచ్చి, 'గెటౌట్' అంది. ఆమె పిక్నిక్‌లో నువ్వు పరిచయం చేసిన అమ్మాయే! అందుకే నీ దగ్గరకొచ్చాను."

రవి మాటలకు పుణ్యవతి త్రుళ్ళిపడింది. "నేను పరిచయం చేసిన అమ్మాయా? ఎవరబ్బా? కొంపదీసి సృజన కాదు కదా?" అడిగిందామె.

"కొంపదీయక పోయినా, పేరదే అనుకుంటాను. ఇంటి చుట్టూ పెద్ద పూలతోట ఉంది. వాళ్ళు ఉంటున్న ఇల్లు గాక, ఆ కాంపౌండులో దూరంగా ఒక మూలకి ఔట్‌హౌస్‌లా ఒక గది ఉంది. ఒంటరోణ్ణి. నాకు సరిపోయేలాగే ఉంది. చుట్టూ ప్రహారీ ఉంది గనుక తాళం వేసుకుని ఆఫీసుకెళ్ళినా, ఇంటికి భద్రత ఉంటుంది అనిపించింది. నగరంలో దొంగల భయం కదా! అక్కడికీ నీ పేరు కూడా చెప్పాను. లాభం లేకపోయింది."

రవి మాటలకు ఆమె గంభీరంగా మారిపోయింది. "ఆయనలా ప్రవర్తించటానికి కారణం ఉందన్నయ్యా!  ఆయన పేరు రంగనాధంగారు. ఆయనకు సృజన గాక, జయసుధ అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ చిన్నతనంలోనే భార్య చనిపోయినా, మరొక  పెళ్ళి చేసుకోకుండా,  ఉన్న ఇద్దరి కూతుళ్ళను పెంచి పెద్దచేశారాయన.  జయసుధంటే ఆయనకు పంచప్రాణాలు. ఆ అమ్మాయి కూడా పసితనం నుంచి తండ్రిని అంటిపెట్టుకునే ఉండేది. తండ్రికి చేదోడుగా ఉండేది. చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. పసిపిల్లల్ని తల్లిలా సాకి, ముస్తాబు చేసేది. అన్నం తినే ముందు మొదటి ముద్దను కళ్ళకద్దుకొని తినేది. ఈకాలం ఆడపిల్లల్లో అరుదుగా ఉండే మనస్తత్వం ఆమెది. అలాంటి సుధ, సరిగ్గా రెండేళ్ళ క్రితం, నువ్వు చెప్పిన ఔట్‌హౌస్‌లో అద్దెకున్న కుర్రాణ్ణి ప్రేమించింది. రంగనాధంగారు కూడా కూతురి ఇష్టాన్ని కాదనలేక వాళ్ళ పెళ్ళి జరిపించారు. పెళ్ళయిన కొత్తలో అలాంటి భర్త దొరకటం తన అదృష్టంగా మాతో చెప్పుకొనేది. పెళ్ళయిన రెండు నెలలకే వాడు విశ్వరూపం చూపించాడు. చేస్తున్న ప్రయివేటు ఉద్యోగం మానేసి సోంబేరిలా తిరిగేవాడు. ఏమన్నా అంటే మామగారి సంపాదనంతా నాదే కదా అనేవాడు. చివరికి సుధ చదువుతున్న డిగ్రీ చివరి సంవత్సరం చదువు మానేసి, ఏదో చిన్న ఉద్యోగంలో చేరి భర్తను పోషించేది. అయినా వాడి ఆశ తీరలేదు. ఏడాది క్రితం ఒకరోజు తన తల్లిదండ్రులను రంగనాధంగారు తీర్థయాత్రలకు పంపాలని గొడవపెట్టాడు. పిల్లని ఇచ్చుకున్నాక అల్లుడి కోరికను తీర్చక తప్పదన్నారు మధ్యవర్తులు. అప్పుడు జరిగిన వాగ్వాదంలో సుధ భర్త రంగనాధంగారిని నడివీధిలో కొట్టాడు. దాన్ని తట్టుకోలేని సుధ వారం రోజులు మౌనంగా తనలోనే బాధపడింది. తరువాత తను పని చేస్తున్న స్కూలు దగ్గర ఊబిలో ప్రమాదవశాత్తూ పడినట్లు నటించి చనిపోయింది. తనను నరికిన గొడ్డలికి కూడా సుగంధాన్ని ఇస్తుంది గంధపుచెట్టు. సుధ కూడా అలాంటిదే! తన సంపాదనలో నెలకు కొంత డబ్బుని భీమా పాలసీ వర్తించే బాంక్ సేవింగ్స్ ఖాతాలో దాచుకొనేది. దానికి నామినీగా భర్త పేరునే పెట్టటం వల్ల, ఆమె భర్తకు అరవై వేల రూపాయలు ఇన్సూరెన్సుగా ముట్టాయి. కానీ తన కూతురు ప్రమాదవశాత్తూ పోలేదని, ఆత్మహత్య చేసుకొందని రంగనాధంగారి మనసులో ప్రగాఢ నమ్మకం. అదే బాధ ఆయన్ని బాగా కుంగదీసింది. అప్పటినుంచే ఆయన ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఉన్న ఒక్క కూతురినీ కాపాడుకోవాలన్న తాపత్రయంలో ఆయన అప్పుడప్పుడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటారు" చెబుతున్న పుణ్యవతి తలెత్తగానే, గుమ్మంలో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డ సృజన కనిపించింది. 

"నువ్వు ఎప్పుడొచ్చావే?" నవ్వుతూ అడిగింది పుణ్యవతి.

"అక్కయ్య కథ చెబుతుంటే వచ్చాను" చెబుతున్న సృజన గొంతు బొంగురుపోయింది. పుణ్యవతి ఆమెను తీసుకొచ్చి రవి ముందు కూర్చోబెట్టింది. 

"నిన్న నాన్న మాటలకు కోపమొచ్చి మిమ్మల్ని కసురుకొన్నాను. మీరు వెళ్ళిపోయాక, మనం పిక్నిక్‌లో కలిసిన సంగతి గుర్తుకొచ్చింది. మీరు పుణ్య పేరెత్తటం విన్నాను గనుక, అప్పుడు నేనేసిన కేకలకు దాని ద్వారా క్షమాపణలు చెబుదామని వచ్చాను" రవితో అంటున్న సృజనను ఓరకంటితో చూసింది పుణ్యవతి.

"అన్నయ్యేమో నాన్న వామనావతారం చూపించాడంటాడు. నువ్వేమో కేకలకు మన్నించమంటావు. ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు గనుక మధ్యలో నేనుండటం సభ్యత కాదు. అందుకే నా పని నేను చూసుకుంటాను. మీ సంగతి మీరే తేల్చుకోండి" అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది పుణ్యవతి.  వెంటనే కంగారుగా లేవబోయిన స్నేహితురాలిని బలవంతంగా కూర్చోబెట్టింది ఆమె. 

"అన్నయ్యా! నీ గురించి తెలియక కేకలేసిందట! నేనటు వెళ్ళగానే కొటేషన్లు కొట్టి భయపెట్టకు. సంబంధం మీరు సెటిల్ చేసుకోండి. నాన్నతో నేను మాట్లాడుతా!" పుణ్యవతి మాటలకు రవి, సృజన బిత్తరపోయారు. "అదేనర్రా! ఆ కాపౌండులో నిన్ను ఇది అద్దెకు ఉండనిస్తుందో, లేదో తేల్చి చెప్పమను. నీకిల్లు అద్దెకిమ్మని నాన్నని నేను ఒప్పిస్తాను" నవ్వుతూ అని పుణ్య వంటింట్లోకి వెళ్ళింది.

"క్షమించండి!" సృజన మాటలకు రవి నవ్వాడు.

"దేనికి నవ్వుతున్నారు?"

"మీరు క్షమించమన్నందుకు...అంత తప్పు మీరేమి చేసారని?" రవి ప్రశ్నకు ఆమె జవాబీయలేదు. 

"పుణ్య చెప్పింది విన్నాక, మీ నాన్నగారి మనస్తత్వం నాకు అర్థమైంది. ఆయనకు కూతుళ్ళ మీద విపరీతమైన ప్రేమ. బ్రతికి ఉన్న పెళ్ళానికి కట్టు కథలు  చెప్పి మరో కుటుంబాన్ని నడిపే వాళ్ళున్న ఈరోజుల్లో, ఉన్న కూతుళ్ళు సవతి తల్లి చేత బాధలు పడకూడదని మరొక పెళ్ళి చేసుకోని ఆయన చాలా గొప్పవారు. ఆయన మీ బ్రతుకు మీ అక్క బ్రతుకులా కాగూడదన్న తాపత్రయంలోనే అలా మాట్లాడారు. ఈ నిజం తెలీక విసిగించినందుకు నేనే క్షమాపణలు చెప్పాలి. అది సరె! మీ అక్కయ్య భర్త ఇప్పుడెక్కడ ఉన్నారు?" రవి అడిగాడు.

"ఈ ఊళ్ళోనే! అక్కయ్య పోయిన ఆరు నెలలకే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు."

"పిల్లనిచ్చిన వాళ్ళకు సంగతి తెలియదా?" 

"అక్కయ్య ప్రవర్తన మంచిది కాదని, విషయం తెలిసి నిలదీసినందుకు ఆత్మహత్య చేసుకొందని చెప్పాట్ట."

"ఇదే విషయాన్ని ఇన్సూరెన్స్ క్లయింకి చెప్పాడా? చెప్పడు. అక్కడ ఆత్మహత్య అని చెబితే అరవై వేలు రావు కదా! మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే, వయసులో ఉన్న ఆడపిల్ల చనిపోతే చెడు ప్రవర్తన అంటారు. అరె! ఒక పసిబిడ్డ శవం డ్రయినేజీలో కనిపిస్తే చాలు, కారణాలు ఎవరూ తెలుసుకోవటానికి ప్రయత్నించరు. ఆ బిడ్డను కన్న తల్లికి ఎంత కొవ్వెక్కిందో అంటూ, క్షమించండి, ఆడదానిపై మగజాతికి ఉన్న కామపైత్యాన్నంతా బయటపెడుతూ మాట్లాడుతారు. మగాడు ఎలాంటి పనిచేసినా, వాణ్ణి సమర్థించే లోకం, ఆడపిల్ల విషయంలో మాత్రం ఎందుకు తప్పుగా ఆలోచిస్తుందో! భార్య ఆత్మహత్యలు చేసుకున్న చోట, అన్యాయంగా భార్యను వదిలేసినవాడికి, ఆడపిల్ల తల్లిదండ్రులు తమ పిల్లను ఇవ్వకూడదని నిర్ణయించుకుంటే తప్ప, ఈ సమాజంలో మగాడి ధాష్టీకం తగ్గదు."

"తాము కన్నుమూసే లోగా తమ బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలన్న తాపత్రయం తప్ప, ఆడపిల్లవాళ్ళు మరొకటి ఆలోచించరు" అంది సృజన.

"నిజమే! పెళ్ళాన్ని వదిలేసాడంటే విడాకులు తీసుకున్నాడా, లేదా అనే చూస్తారు తప్ప, ఆ విడాకులకు కారణాలెవ్వరూ చూడరు."

"సంబంధం కుదుర్చుకోవయ్యా అంటే అప్పుడే విడాకులు అంటాడేమిటి అన్నయ్య?" లోనుంచి వచ్చిన పుణ్య తన స్నేహితురాలిని అడిగింది. ఇద్దరి నుంచి బదుల్లేదు. వారిద్దరి యిబ్బందిని గమనించిన పుణ్యవతి, తను తెచ్చిన పాయసం కప్పులను వారి ముందు ఉంచింది.

"పాయసానికి విశేషం?" రవి అడిగాడు.

"మీ ఇద్దరి కలయికే!" తిరిగి వారిద్దరూ మౌనం.  

"ఏంటా బిగిసిపోవటం? ఈరోజు నా పుట్టినరోజర్రా!" నవ్వుతూ చెప్పింది పుణ్యవతి. 

"శుభాకాంక్షలు!" చెప్పింది సృజన.

"ఇదే రోజు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా!" అన్నాడు రవి.

"ఓర్నాయనో! మళ్ళీ ఏడాది వరకూ కనిపించవా?" 

"మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!- అని ఆయన అభిప్రాయమనుకుంటా!" తాగిన పాయసం కప్పును కింద పెడుతూ చెప్పింది సృజన.

"అన్నయ్య మాటల్లో ఆంగ్లభావమేమిటో తెలీదు గానీ అయిదు నిమిషాలు అలా వెళ్ళానో, లేదో రవిగారల్లా 'ఆయన ' అయిపోయారా? ఇంత చిన్న వ్యవధిలో అంత పురోగతా?" 

"పోవే!" అంటూ బయటకు పరుగుతీసింది సృజన.

"నన్ను పొమ్మని అది వెళ్ళిపోతోందేమిటి?" రవిని అడిగింది పుణ్య.

"ఎంత స్నేహితురాలైనా నువ్వలా అనటం బాగోలేదమ్మా!" అన్నాడు రవి. 

"క్షమించు. చిన్నప్పుడే నాన్న పోయారు. బంధువులు మమ్మల్ని దూరం పెట్టారు. మూడేళ్ళ క్రితం అమ్మ కూడా పోయింది. శేఖరం అన్నయ్య జీవితంలో తను పైకి రావాలన్న తాపత్రయంలో నాకు మాట్లాడటం సరిగా నేర్పలేదు. అందుకేనేమో! అన్నయ్య స్నేహితుడైన నీ రూపంలో నాకు మరో అన్నయ్యను చూపించాడు ఆ దేవుడు. ఇకపై జీవితాంతం నీ సంరక్షణలో ప్రవర్తనా నియమావళి నేర్చుకుంటూ బ్రతుకుతాను, సరేనా!" పుణ్యవతి మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. 

"అన్నయ్యా! మీ బంధువుల అమ్మాయిలెవరైనా ఉన్నారా?" అడిగిందామె.

"దేనికమ్మా?" రవి అడిగాడు. 

"నిన్ను పెళ్ళాట్టానికి." 

"ఇద్దరు, ముగ్గురు ఉన్నారనుకో! కానీ నాకు ఇష్టం లేదు."

"సృజీని చేసుకొంటావా?" రవి బదులీయలేదు. 

"మాట్లాడవేంటి? ఇష్టం లేదా?" రెట్టించిందామె. 

"నాకు ఇష్టమైనా రంగనాధంగారు ఒప్పుకోవాలి, నీ స్నేహితురాలు ఇష్టపడాలి.  ప్రేమ విషయంలో పెద్ద అమ్మాయి దెబ్బ తిన్నది గనుక వాళ్ళంత త్వరగా ఒప్పుకోరు."

"నీకు ఇష్టమన్నావ్! మిగతా సంగతి నేను చూసుకొంటాను. పది రోజులుగా కనిపించటం లేదు. నా పుట్టినరోజైన ఈరోజైనా నీ జాడ లేకపోతే, సాయంత్రం కేరేజీ పట్టుకొని నీ ఇంటికి వద్దామనుకున్నాను. అనుకోకుండా రావటమే గాక, అందమైన ఊహ నాలో కలిగించావు. ఆ ఊహ నిజం చేస్తే చాలు. అదే నువ్వు నాకిచ్చే అందమైన బహుమతి" రవి అర్థం కానట్లు తలూపాడు. 

"అదే అన్నయ్యా! సృజీని నువ్వు నాకు వదిన్ని చేయాలి."

"చూడమ్మా! స్నేహం వేరు, ప్రేమ వేరు. నీ స్నేహితురాలి ఆశలేమిటో మనకు తెలియదు. చూద్దాం. అయితే నా వైపు నుంచి అభ్యంతరం లేదు" రవి మాటలకు పుణ్యవతి కళ్ళలో ఆనందం చిగురించింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages