సందడే సందడి
“వంటావిడ రాలేనంది సరే, ఎవరినైనా ఏర్పాటు చేయకపోవటం ఏంటీ. అడిగావా ఆవిడని” భార్యని అడిగాడు అమోఘరావు. “అడిగాను.పెళ్లిళ్ల సీజను,అందువల్ల ఎవరూ ఖాళీ లేరు అన్నది.” “అంటే మన తిప్పలు మనం పడాలి” కోపంగా అరిచాడు అమోఘరావు.
“సరే ఆవిడ రానంది. మనం అందరినీ పిలిచాం. ఇలా కూర్చుంటే అయిపోదు కదా. మనమే రంగంలోకి దిగాలిగా. చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు” అంటూ అప్పటికే వచ్చిన చెల్లెలిని, ఆవిడ పిల్లలిద్దరినీ పలకరించాడు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళని సరదాగా పలకరించాడు. తన భార్య పక్కనే కూర్చున్న మరదలిని, ఆవిడ పిల్లలని పలకరించాడు. తోడల్లుడు ఎందుకు రాలేదు అని ఆరా తీశాడు. పక్కనే వున్న అక్క కొడుకు వినోద్, శ్యామ్ లని “ఏరా అమ్మ, నాన్న వస్తున్నారా” అనడిగాడు, “మేము హైదరాబాదు నుంచీ వస్తున్నాము. వాళ్ళు ఢిల్లీ నుంచీ ఫ్లయిట్లో వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి పది దాటి పోతుంది. అక్క,బావ, పిల్లలు ఇంతకు ముందే ముంబైలో దిగారు. వాళ్ళు వచ్చేసరికి పన్నెండు అవుతుందేమో.”
శర్మ గారికి ఫోన్ చేశాడు. ఆయనే వంటావిడని కుదిర్చాడు. ఎప్పుడూ ఇలా జరగలా. ఆయన చెప్పాడు “ఎవరూ అందుబాటులో లేరు. అందరూ పెద్ద వంటలకి వెళ్లారు. మీకు కుదిర్చిన లక్ష్మికి సూతకం వచ్చిందిట. ఊహించని ఇబ్బంది కదా.“
“బావగారు,అక్క విశాఖలో వస్తున్నారుట. వాళ్ళ పిల్లలు బెంగుళూరు నుంచీ ఫ్లైట్ లో వస్తున్నారుట. వాట్సప్ లో మెసేజ్ పెట్టారు. మా అన్నయ్య వదిన వైజాగ్ లో దిగారుట. టాక్సీలో వస్తారట. ఇంకా మా తమ్ముడూ, మరదలూ వూళ్ళోకి వచ్చేశారు.” భార్య చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అమోఘరావు మేనత్త కూతుళ్ళు, వాళ్ళ పిల్లలతో ఆటోలో దిగారు. వాళ్ళని పలకరించి వాళ్ళ భర్తలు ఎందుకు రాలేదో కనుక్కుని “వినోద్,శ్యాం మీరిద్దరూ మొహాలు కడుక్కు రండి. మనం ఇవాళ నలభీమ పాకం చేసి చూపిద్దాం.” “ ఇందాకే కడిగేసాం మామయ్యా.” అంటూ ఆయన వెనకే వెళ్ళారు ఇద్దరూ ఉత్సాహంగా.
“బావగారూ మీరక్కర్లేదండీ మేం చేస్తాం వంట. మీరు కూచోండి.” అంది మరదలు లేస్తూ. “మీరు ఎంజాయ్ చేయండి. చేయాలనే వుద్దేశం వుంటే ఈపాటికి మొదలెట్టేవారు. రండిరా అబ్బాయిలు” అని ముందుకు వెళ్ళాడు.
“ముందు ఈ గిన్నెలో మూడు మగ్గుల నీళ్ళు పొయ్యి శ్యామ్. నీళ్ళు మరుగుతున్నప్పుడు కాఫీ పౌడరు ఈ పాకెట్టులోది సగం వేసెయి. వినోద్ నువ్వు ఈ పాల పాకెట్లు ఓ పది కట్ చేసి ఈ గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టు. నేను సిలిండర్ ఆన్ చేసి స్టవ్ వెలిగిస్తా. ముందు డికాషను వడగట్టాలి. ఆ తరువాత పాలు అందులో పోయాలి. ముందు అందరికీ కాఫీ ఇస్తే కొంత సేద తీరుతారు .”
ఈలోగా ఆయన నేల మీద కూచుని ఆనపకాయ తరుగుతున్నాడు పులుసులో ముక్కల కోసం. ఆడ వాళ్ళు వచ్చారు చేద్దామని. ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత ఇంకా కొన్ని కూరల ముక్కలు తరిగాడు. ఆ సరికి కాఫీ రెడీ అన్నారు పిల్లలు. అందులో పంచదార వేయించి గ్లాసుల్లో అందరికీ ఇమ్మన్నాడు. పిల్లలకి పాలల్లో బొర్నవిట కలిపించాడు. వినోద్,శ్యాం లని కూడా వాళ్ళకి ఏం కావాలో తాగమన్నాడు. తరువాత వాళ్ళిద్దరినీ ఉప్మాలోకి మిర్చి, అల్లం తరగమన్నాడు. తరువాత ఉప్మా చేసే పనిలో పడ్డారు.
కాఫీ తాగాక అందరినీ తోటలోకి వెళ్లమన్నాడు. కాల కృత్యాలు తీర్చుకోమన్నాడు. రెండు బాత్ రూముల్లో గీజర్లు వున్నాయి అన్నాడు. వాళ్ళందరూ తోటలోకి వెళ్లారు. వాళ్ళకి చెప్పాడు “మొక్కలు ముట్టుకోవద్దు. చూసి రండి అంతే.
అమోఘరావుకి అబ్బాయి ఒక్కడే. అతను,భార్యా పిల్లల్తో అమెరికా నుంచీ వస్తున్నాడు ఐదేళ్ల తరువాత. అక్క కూతురు కూడా ఆస్ట్రేలియా నుంచీ వస్తోంది భర్త పిల్లల్తో. అక్క రాజమండ్రిలో వుంటుంది. మేనకోడలుని కూడా తన దగ్గిరకే వచ్చేయమన్నాడు. బంధువులందరూ వుంటారు. అందరినీ చూడచ్చని. ఆ సందర్భంగా బంధువులందరినీ ఇక్కడికి రమ్మన్నాడు. రెండురోజుల తరువాత ఎవరి వూళ్ళకి వాళ్ళు వెళ్లిపోతారు.
అమోఘరావు రెండేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో డైరెక్టరుగా రిటైర్ అయ్యాడు. సొంత వూళ్ళో అతనికి రెండు ఎకరాల స్థలం వుంది ఆయన తండ్రి కొన్నది. దానిలో ఆయన తండ్రి పెద్ద ఇల్లు వేశాడు ఆరోజుల్లో. దానికి కొద్ది మార్పులు చేసి అందంగా తయారు చేశాడు. మేడ మీద ఒక హాలు కట్టించాడు మూడు వేపుల అద్దాలతో. అందులో ఒక వేపు గోడలోనే అలమర నిండా పుస్తకాలు. ఏ సి వుంది. చక్కటి పడక కుర్చీ, ఓ మంచం వున్నాయి. తోటపని అయ్యాక భోజనం దాకా ఆ పుస్తకాలు చదువుకోవటమో, మిత్రులతో బాతాఖానీయో గడిపేస్తుంటాడు.
ఇక మిగతా ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు వేశాడు. నిజానికి లేనివి లేవు. మామిడి రెండు రకాలు, జామ,వేప,అరటి మూడు రకాలు,దానిమ్మ,నిమ్మ, కమలా ఫలం ఇలా. ఓ పక్క ఆకు కూరలు, దుంప కూరలు, చిక్కుడు, దొండ, కాకర,పొట్ల,ఆనప లాంటి తీగ కూరలు, కేబేజీ, కాలిఫ్లవర్ లాంటివి, మరో పక్క పూల మొక్కలు. చూడటానికి రెండు కళ్ళు చాలవు. నిజానికి అతను ఉదయం లేవగానే కాఫీ కూడా తాగకుండా తోటలోకి వెళతాడు. అన్నిటికీ పాదులు సరి చేస్తాడు. నీళ్ళు డ్రిప్ పద్ధతిలో ఏర్పాటు చేశాడు. ఓ పక్క సహజ ఎరువు తయారీ కోసం టాంకు ఏర్పాటు చేశాడు. ఆకులూ, మట్టి రోజూ అందులో వేసి నీళ్ళు పడుతుంటాడు. మొక్కలని అతను చూసే పద్ధతి చిన్నపిల్లలని చూసినట్టు వుంటుంది. అతను వ్యవసాయ శాఖలో పనిచేయటం వల్ల మేలైన విత్తనాలు సేకరించగలిగాడు. మొక్కలకి చీడ పడితే కుంకుడు రసం, వేప రసం జల్లుతాడు. రసాయన ఎరువులు,పురుగు మందులు వాడడు.
రోజూ కాసే కూర గాయలని ఇంటికి ఆ పూట కావాల్సినవి వుంచుకుని మిగతావి వూళ్ళో వున్న అనాధ శరణాలయానికి పంపిస్తాడు. కూరలతో పాటు పళ్ళు కూడా. అప్పుడప్పుడూ బియ్యం కూడా కొని పంపిస్తాడు.
వాళ్ళందరూ స్నానాలు చేసి వచ్చేసరికి ఉప్మా సిధ్ధమైంది. ఎవరికి వాళ్ళని వడ్డించుకోమన్నాడు. వినోద్,శ్యామ్ లని కూడా తినమన్నాడు.వాళ్ళు కూడా స్నానం చేశాక కూరలు తరిగే పని మొదలెట్టారు. ఆ సమయంలో అతని అన్న వదిన దిగారు ఆటో లోంచి. వాళ్ళకి కాఫీ,ఉప్మా ఇచ్చారు. వదిన గారు మెచ్చుకున్నారు చాలా బాగుంది అని. “వంటావిడ ఇదివరకు వచ్చే ఆవిడేనా” అనడిగారు. అందరూ మీ మరిదే చేశారు అని చెప్పారు. ఆవిడ కోప్పడ్డారు అందరినీ “వంటావిడ రాకపోతే మాత్రం ఇంతమంది వుండి పాపం మా మరిదితో చేయిస్తారా. వుండవయ్యా నేను స్నానం చేసొచ్చాక మేము చేస్తాములే” అన్నారు. అతను చాలాకాలం వాళ్ళింట్లో వుండి చదువుకున్నాడు. ఉద్యోగం వచ్చాక కూడా కొంత కాలం వాళ్ళ దగ్గిరే వున్నాడు. అందువల్ల అతనంటే ఆవిడకి అభిమానం. అతనూ ఆలాగే వాళ్ళకి చేదోడు వాదోడుగా వుండేవాడు.
“వద్దు వదినా మేము ముగ్గురం చేసేస్తాం. మీరు ఆరగించండి. స్నానం చేసి తోటలోకి వెళ్ళి రండి.”
మెంతి పెట్టిన వంకాయ కూర,బెండకాయ వేపుడు, దోస కాయ పప్పు, ఆవ పెట్టిన టొమాటో ముక్కల పచ్చడి, ముక్కల పులుసు, అప్పడాలు,వొడియాలు,గడ్డ పెరుగు, మిల్క్ మైసూర్ పాక్ ,తమలపాకులు,త్రివేణి వక్కపొడి ఇవాల్టి మెను.పన్నెండున్నర అయ్యేసరికి వంటపని అయిపోయింది.
భోజనాల టైముకు అందరూ వచ్చారు. అమెరికా నుంచీ, ఆస్ట్రేలియా నుంచీ కూడా వాళ్ళు సరిగ్గా భోజనాలు అవుతుండగా వచ్చారు. పిల్లలకి ముందు పెట్టేయమన్నారు. పెద్దవాళ్ళు స్నానాలు చేయటానికి వెళ్లారు. అందరూ వంటలు బాగున్నాయంటే బాగున్నాయన్నారు. అసలు వంటావిడ కన్నా చాలా రుచిగా వున్నాయన్నారు.
“మరేంటనుకున్నారు నలభీమ పాకమంటే .” అంటూ అమేఘరావు వినోద్ నీ, శ్యాం నీ రెండువేపులా దగ్గిరకి చేర్చుకుంటూ అన్నాడు .
“మరేంటనుకున్నారు నలభీమపాకమంటే ” గట్టిగా అరుస్తున్నాడు అమోఘరావు. “లేవండి తెల్లారి నాలుగైంది. బావగారు,అక్కయ్య గారు వచ్చే ఫలక్ నామ వచ్చే వేళయింది. స్టేషనుకు వెళతానన్నారు. మా చెల్లి, మరిదీ, పిల్లలు కూడా దురంతోలోనే వస్తున్నారు. అదీ వచ్చే టైమయింది. లేవండి, లేవండి.” అంటూ భర్తని లేపుతోంది. అతను లేస్తూనే ‘ఇదంతా కలా’ ఆని ఆశ్చర్యపోతూ పక్క మీంచి లేచాడు. లేస్తూనే “వంటావిడ వచ్చిందా.” అన్నాడు. “అప్పుడేనా ఆరింటికి వస్తుంది. మీరు వెళ్ళండి స్టేషనుకి ఇద్దరినీ తీసుకురావాలిగా, కారు తీసుకు వెళ్ళండి.”
తనకి వచ్చిన కలని తలుచుకుని ఆశ్చర్యపోతూ స్టేషనుకి బయలుదేరాడు అమోఘరావు.
***
No comments:
Post a Comment