ప్రత్యేకత - అచ్చంగా తెలుగు

 ప్రత్యేకత

(సి.హెచ్.ప్రతాప్)
 


ఒక అడవిలో అన్ని జంతువులూ ఒక సభకు హాజరయ్యాయి. ఈ సభకు సింహం అధ్యక్షత వహించగా, ఏనుగులు, పులులు, జింకలు, కుందేళ్ళు వంటి ఎన్నో జంతువులు పాలుపంచుకున్నాయి. జంతువులన్నీ తమ సమస్యలను, కష్టాలను ఒకదాని తర్వాత మరొకటి వివరించాయి. వాటికి పరిష్కార మార్గాలను గురించి చర్చించుకున్నాయి.

ఆ సభలో పందులు కనిపించకపోవడం గమనించి సింహం ఆ విషయంపై ప్రశ్నించింది. అప్పుడు నక్క చాలా గర్వంగా, "రాజా, మేము కావాలనే పందిని పిలవలేదు. అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. దాని నుండి వచ్చే దుర్వాసన భరించడం కష్టం. పైగా అది ఎప్పుడూ బురదలో దొర్లుతూ, అశుభ్రమైన పదార్థాలను తింటూ మన జంతువుల జాతికి చెడ్డ పేరు తెస్తోంది. అందుకే దానిని మన జాతి నుండి, సమాజం నుండి వెలివేశాం," అని చెప్పింది.

ఆ మాటలు సింహానికి నచ్చలేదు. కానీ అన్ని జంతువులూ చప్పట్లు కొట్టడంతో, సింహం మౌనంగా ఉండిపోయింది.

ఈ అవమానం గురించి తెలుసుకున్న పంది చాలా బాధపడింది. తన ఆకారం అలా ఉండడం తన తప్పేం కాదని, కానీ తనపై ఉన్న అసహ్యాన్ని తగ్గించుకోవడానికి తాను తినే అశుభ్రమైన పదార్థాలను తినడం మానేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఆ రోజు నుండి అది ఆ అడవిలో అశుభ్రమైన పదార్థాలను తినడం మానేసింది.

కొంతకాలానికి ఆ అడవిలో అశుభ్రమైన పదార్థాల గుట్టలు పేరుకుపోయాయి. దాని వల్ల దుర్గంధం పెరిగి అడవిలో ఉండడం కష్టంగా మారింది. దాంతో పాటు అనేక వ్యాధులు కూడా ప్రబలసాగాయి.

ఆ పరిస్థితిని గమనించిన జంతువులన్నీ మళ్ళీ గుహకు వెళ్ళి సింహానికి తమ బాధలు చెప్పుకున్నాయి. అప్పుడు సింహం, "చూశారా, ప్రతి జంతువు దాని స్వభావంతో, దాని ప్రత్యేకతతో పుడుతుంది. భగవంతుడు ప్రతి ప్రాణిని ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టించాడు. పంది కూడా మనలాగే ఈ భూమిపై పుట్టింది. తన స్వభావానికి అనుగుణంగా అది అశుభ్రమైన పదార్థాలను తింటుంది. దానివల్ల మనకు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. పర్యావరణంలో చెడు పదార్థాల వల్ల వ్యాపించే కాలుష్యాన్ని పంది తన ఆహారంగా తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంది. మనం దానిని అసహ్యించుకోవడం వల్ల అది ఆ పని చేయడం మానేసింది. దాంతో ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమై మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లింది. అంటే, దాని వల్ల మనకు, పర్యావరణానికి మేలే జరిగింది కదా," అని వివరించింది.

సింహం మాటల్లోని నిజాన్ని గ్రహించిన ఇతర జంతువులు సిగ్గుపడ్డాయి. తాము చేసిన తప్పును అర్థం చేసుకుని మళ్ళీ పందితో స్నేహం చేశాయి. ఈ లోకంలో ప్రతి ఒక్క ప్రాణికి ఒక విలువ ఉంటుంది. వాటిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే, ఒకరి బలహీనతగా మనం భావించేది మరొకరి బలం కావచ్చు. మనందరిలో ఎవరికి వారే ప్రత్యేకమైనవారు.

No comments:

Post a Comment

Pages