ఒకటైపోదామా ఊహల వాహినిలో -28 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో -28

Share This

  ఒకటైపోదామా ఊహల వాహినిలో -28

  కొత్తపల్లి ఉదయబాబు






హాల్లో సోఫాలో కూర్చుని చెల్లెలితో కబుర్లు చెప్పుకుంటున్న శకుంతల  స్నానం చేసి వచ్చిన హరితను చూస్తూనే " తల్లిగాడు.. ఈ పెండెంట్ ని నీ చేత్తో సరితకి ఇవ్వమ్మా" అని పెండెంట్ ఉన్న బాక్స్ హరిత చేతికిచ్చింది శకుంతల.

" ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు పెద్దమ్మా? " మొహమాటంగా అంది సరిత.

 

" దాదాపుగా మూడు ఏళ్లయింది దీన్ని చేయించి. అప్పట్నుంచి నీకోసం భద్రంగా దాచ ఉంచానమ్మ." అంది శకుంతల.

 

సరిత మెడలోని  ఒంటి పేట గొలుసు తీసుకుని అందులో ఆ పెండింటిని వేసి, హుక్ గట్టిగా నొక్కి  ఆ గొలుసుని సరిత మెడలో వేసింది హరిత.

 

" దాని మీద హెచ్ - ఎస్ అని రాసి ఉంది కదా. దాని అర్థం ఏంటో చెప్పు? "  హరిత అడిగింది చెల్లెల్ని.

 

" హెచ్ అంటే హరిత ఎస్ అంటే సరిత " అంది  సరిత.

" హెచ్ అంటే హరిత కరెక్టే.. ఎస్ అంటే శకుంతల కూడా " శకుంతల  వివరణ ఇచ్చింది.

 

" పెద్దమ్మ నీకు ఎంత దూరాలోచన. " అంటూ దగ్గరగా వచ్చి శకుంతల బుగ్గ మీద ముద్దు పెట్టింది సరిత.

 

అమ్మ ఎంత దూరాలోచనతో  ఆ రెండు పెండెంట్లు చేయించిందో  దాని అర్థం ఇప్పుడు బోధపడింది హరితకి.

 

" అందరు టిఫిన్ లకి పదండి" బబిత హుకుం జారీ చేసింది.

అందరూ ఆమెను అనుసరించారు.

 

*******

 

ఆ సాయంత్రం  ఐదు గంటలు దాటాక  అందరూ కూడా మురుడేశ్వరస్వామిని దర్శించడానికి బయలుదేరారు శకుంతల, హరిత, బబిత.

 

వంట చేయడం కోసం సరిత ఇంట్లోనే ఉండిపోయింది.

 

స్వామి ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఆ  పరమశివుని విగ్రహాన్ని చూస్తూనే  దాదాపు ఆకాశమంత ఆవరించిన  శివుడిని ప్రత్యక్షంగా చూసినంతగా భక్తిపారావస్యులైపోయారు అయిపోయారు  ఆ ముగ్గురూ.

 

ఎడమ పక్కన ఉన్న చిన్న చిన్న ఉప ఆలయాలని నెమ్మదిగా దర్శించుకుంటూ... నెమ్మదిగా మెట్లు ఎక్కసాగారు.

 

" శివయ్య  విగ్రహం ఉన్న ఆ కొండను  కందుక గిరి కొండ అంటారక్క. ప్రతిరోజు ఉదయం పూట 6 గంటల  సమయంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను . ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే గైడ్స్ ఎవరైనా రాకపోతే ముందు హరీష్ కి ఫోన్ చేస్తారు. అపుడు హరీష్,సరిత కి ఫోన్  చేస్తాడు. తను ఆ రోజంతా వాళ్లకి గైడ్గా వ్యవహరించి  అన్ని వివరంగా చెప్పి మరి చూపిస్తుంది. "అని చెప్పింది బబిత.

కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురు  పైకి చేరారు.

 

అక్కడ నందీశ్వరుని ఎదురుగా  శివలింగం జీవశక్తితో దేదీప్యమానంగా కనిపిస్తోంది. మెట్ల పక్కనే ఉన్న రైలింగ్ సాయంతో శివుని దర్శించుకుని, తీర్థం తీసుకున్నారు. ఆ నాలుగు మెట్లు దిగి  వచ్చాకా

" తల్లిగాడు! నీ మనోవాంఛ నెరవేరాలని  కళ్ళు మూసుకుని స్వామికి మనస్పూర్తిగా నమస్కారం చేసుకో  " అంది శకుంతల.

 

" అదే మాట నాతో కూడా చెప్పి మమ్మల్ని ఆశీర్వదించండి ఆంటీ "

చటుక్కున హరిత పక్కనే నిలబడి కళ్ళు మూసుకున్న యువకుడు అన్న మాటలు విని

ఉలిక్కిపడ్డారు హరిత, శకుంతల.

ఆశ్చర్య ఆనందాలతో కళ్ళు తెరిచింది హరిత.

 

"విరాజ్.. మీరు ఇక్కడ...?" విస్తుపోతూ  అడిగింది శకుంతల.

 

" అవునాంటీ.నేనే. ప్రాణం లేని చోట శరీరం ఉండదు ఆంటీ "అన్నాడు సీరియస్ గా

 

" అది సరే అసలు మేము ఇక్కడికి వచ్చినట్లు మీకు ఎలా తెలుసు? " ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగింది హరిత ఏమీ ఎరగనట్టు.

 

"అదే నేనూ అడుగుతున్నాను హరిత. ఇదేనా మీ పిన్ని గారి ఊరు? ఈవిడేనా మీ పిన్ని గారు? ఆవిడకు ఏదో ఒంట్లో బాలేదు... వారం రోజులు పాటు సాయం రమ్మన్నారు..అని చెప్పారు కదా ఆంటీ...ఈవిడేనా? చూడ్డానికి బాగానే ఉన్నారుగా?"అన్నాడు విరాజ్ చిలిపిగా.

 

" ఏయ్ బాబు....ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? " కోపంగా అడిగింది బబిత.

 

" చెల్లి తొందరపడకమ్మా. అతను తెలిసిన వాడే. అందుకే అలా సరదాగా మాట్లాడుతున్నాడు. నీకన్నీ వివరంగా ఇంటికి వెళ్ళాక చెబుతాను  " అని బబితని వారించింది శకుంతల.

 

" చల్లగా గాలేస్తున్న ఈ విశాల ప్రాంగణంలో హాయిగా కూర్చుని మాట్లాడుకుందాం ఆంటీ."

అంటూ జన సమర్థం లేని చోట నీడగా ఉన్నచోట చతికిల పడ్డాడు  విరాజ్.

 

కాళ్లు లాగుతున్నట్టు అనిపించడంతో వాళ్లు ముగ్గురు విరాజ్ ఎదురుగా కూర్చున్నారు.

 

ఆహ్లాదకర ఆ వాతావరణం ఎంత నీరసంగా వాళ్ళకైనా సరే చైతన్య శక్తి ప్రసాదించేలా ఉంది.

 

"అబ్బా.చెప్పు విరాజ్. మేము సరిగ్గా ఈ ఊరే వచ్చినట్లు మీకు ఎలా తెలుసు?" అడిగింది హరిత ఆసక్తిగా.

 

" తెలుసుకోలేకపోవడానికి అదేమైనా పెద్ద విషయమా. నిన్ను మా నాన్న మా షాప్ కి పిలిపించారట కదా. ఎవరి చేత పిలిపించారు అని ఆయనని అడిగాను. సెక్యూరిటీ గార్డుల చేత అని చెప్పారు. హరిత మీకు ఎక్కడ కనిపించిందిరా అని వాళ్ళని అడిగాను.

నువ్వు మీ ప్రయాణం టికెట్లు ఫోటో స్టాట్  తీయించడానికి ఏదో షాపుకు వచ్చావంట కదా. ఆ షాపు పేరు  చెప్పారు. ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని  ఆ ఫోటోస్టాట్ షాప్ కు వచ్చి అడిగాను.

సాధారణంగా ఫోటో స్టాట్ కాపీలు తీసేవాళ్లు ఏ కాగితం ఫొటోస్టాట్  తీస్తున్నారో చదవరు.

అయినా ఆ అబ్బాయిని మళ్లీమళ్లీ అడిగితే,

" వేరే ఏదో రాష్ట్రానికి ప్రయాణం టికెట్స్ సర్ అవి... మురుడేశ్వర్ అని చూశాను... యధాలాపంగా అన్నాడు అతను.

నా ప్రాణం నన్ను వదిలేసి రైలుమీద అంత దూరం వెళ్లిపోయిందా... అనుకుని

"నాకోసం వెతికించవద్దు.. అని మా నాన్నకి ఉత్తరం రాసిపెట్టి  చెప్పకుండా నా ప్రాణం కోసం గాలిలో ఎగిరి వచ్చేసాను." అని విమానం నేల మీద నుంచి గాలిలోకి  ఎగిరి మళ్లీ నేల మీద దిగినట్టుగా చేతితో చేసి చూపించాడు విరాట్.

 

'విరాజ్ యు ఆర్ గ్రేట్. ప్రేమికులు గోడ కట్టినట్టు అబద్ధాలు ఆడతారని నేను ఎక్కడో పుస్తకంలో చదివింది.అద్భుతంగా కవర్ చేసావ్. నీకు హాట్సాఫ్ విరాజ్.' అనుకుని మనసులోని అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది హరిత.

 

"అంటే అతను హరితను ప్రేమించిన వాడా?" కళ్ళతో సైకిల్ చేస్తూ అడిగింది బబిత శకుంతలని.

 

అవును అని తల ఊపి "నేనిక్కడికొస్తున్నట్టు హరితే నీకు చెప్పి ఉంటుంది. నీతో చెప్పొద్దని నేను ఫోన్ కూడా తీసేసుకున్నాను." అంది శకుంతల చిరు కోపంగా.

 

" అనవసరంగా మీరు నా ప్రాణాన్ని అనుమానిస్తే ఈ శరీరం బాధపడుతుంది ఆంటీ. హరితను ఏమన్నా అన్నారంటే  మీరు నన్ను అవమానించినట్టే. నిజం చెప్పాలంటే నన్ను ప్రేమించినా కూడా మీ మాటకే తను ఎక్కువ విలువ ఇస్తుంది ఆంటీ. నేను నమ్మినా నమ్మకపోయినా  మీ దగ్గరకు వస్తున్నట్లు హరిత నాతో 'చెప్పలేదు'... " చెప్పలేదు అన్నచోట ఒత్తి పలుకుతూ.

 

అతను అంత గట్టిగా ఒత్తి చెప్పేటప్పటికి శకుంతల నిజమే అనుకుంది.

" వెర్రివాడ. ఆ మార్గంలో కాకపోతే వేరే మార్గంలో చెప్పి ఉంటుంది. లేకపోతే మేము ఇక్కడకు  వచ్చినట్టు నీకు తెలిసే అవకాశం లేదు. నీలోని నిజమైన ప్రేమను గుర్తించి నా కూతురు నీతో ఇప్పుడు నిండైన ప్రేమలో పడిపోయింది. నాకు కావలసింది నువ్వు ఇక్కడికి రావడమే. కచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇలాగే జరగాలని ఆ దేవుడిని నేను కోరుకున్నాను. స్వామి నా మొర ఆలకించాడు." అని కళ్ళు మూసుకుని స్వామికి దండం పెట్టుకుంది శకుంతల.

No comments:

Post a Comment

Pages