ఒకటైపోదామా ఊహల వాహినిలో -26 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో -26

Share This

                                                   ఒకటైపోదామా ఊహల వాహినిలో -26

 

 కొత్తపల్లి ఉదయబాబు  




"ఏంటమ్మా... ఏమైంది? నాలుగు కాగితాలు ఫోటోస్టాట్ తీసుకురావడానికి ఇంతసేపా? "

ఇంటికి వచ్చిన హరితను అడిగింది శకుంతల.

 

" కారణం లేకుండా నేను నీ ఏ పని చేయను అని నీకు తెలుసు కదమ్మా. ఫోటో స్టేట్ తీసుకుని బయటికి వస్తుంటే యూనిఫామ్ వేసుకున్న ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి విరాజ్, వాళ్ల నాన్నగారి  షాప్ లో ఉన్నాడని, నన్ను అర్జెంటుగా రమ్మన్నారని చెప్పారు. వాళ్లే ఆటో కూడా పిలిచారు. నేను ఆటో ఎక్కగానే వాళ్లు నన్ను ఫాలో అయి విరాజ్ వాళ్ళ నాన్నగారి  షాప్ దగ్గర దింపేసి వెళ్లిపోయారు.

 

నేను లోపలికి వెళ్లి చూస్తే విరాజ్ లేడు.వాళ్ళ నాన్నగారు కౌంటర్లో కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఇదే నేను మొదటిసారి చూడటం.  వెళ్లి నమస్కారం పెట్టాను. ఆయన నన్ను అడగాల్సినవన్నీ అడిగాడు. కుండబద్దలు కొట్టేట్టు మాట్లాడి వచ్చేసాను. " అని జరిగిందంతా చెప్పింది హరిత తల్లికి.

అయితే విరాజ్ ను తాను  కలిసినట్టు మాత్రం చెప్పలేదు.

 

" అయినా ఫోన్ నీకు ఇచ్చేశాను కదా మమ్ ఫోన్ నా దగ్గరే ఉంటే  కొద్దిగా ఆలస్యం అవుతుంది అని  నీకు ఫోన్ చేసే దాన్ని ." అంది హరిత.

 

" చాలా మంచి పని చేసావ్ తల్లిగాడు. మూర్ఖులకి అలాగే సమాధానం చెప్పాలి. సరే. బట్టలు సర్దుకుందామా మరి... నాకు ప్రయాణం అంటే ఎక్కలేని శక్తి వచ్చింది అనుకో. వారంరోజులు పాటు అలా బయట ప్రపంచంలోకెళ్ళి వస్తే మనసు హాయిగా ఉంటుంది. " అంటూ బీరువా తెరిచింది శకుంతల.

 

హరిత బ్యాగులు మంచం మీద పెట్టి ఓపెన్ చేసింది.

 

తల్లి కూతుర్లు  ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూబ్యాగులు సర్దేసుకున్నారు.

 

" అమ్మ... ఆయన అడిగిన ప్రతి దానికి  నేను అలా ఘాటుగా సమాధానం చెప్తుంటే ఆయనకి కంటి చూపు తప్ప నోట మాట లేదనుకో." అనే పక పక నవ్వేసింది. బ్యాగులసర్దడం పూర్తయ్యాక   అడిగింది హరిత, తల్లిని.

 

" అమ్మ రేపు ఒకసారి శ్రీనగర్ కాలనీ గుడికి వెళ్దాం అమ్మ "

" అలాగే. కానీ... విరాజ్ కి మనం ఇలా ఊరు వెళ్తున్నట్టు నువ్వు చెప్పలేదు కదా. " యధాలాపంగానే అడిగింది శకుంతల.

 

" ఫోన్ నీకు ఇచ్చేసి వెళ్లాను కదా. ఇంక విరాజ్ కి తెలిసే అవకాశం ఎక్కడిది. వస్తే అతను మన ఇంటికే వస్తాడు. లేదా ఫోన్ చేస్తాడు. లేదా ముగ్గురం గుడికి వెళ్తాం. ఈ మూడు అవకాశాలు తప్ప నేను అతన్ని కలిసే అవకాశం లేదుగా. ఏమైనా ఉంటే నీకు చెప్పే వెళ్తానుగా " కూతురు సమాధానంతో సంతృప్తి పడింది శకుంతల.

 

" మనం ఊరు వెళ్ళి వచ్చాక ఈ వారం రోజులు కనిపించలేదేం? అని విరాజ్ అడిగితే ఏం సమాధానం చెప్పాలి? "

 

" రేపు గుడికి వెళ్తాముగా. విరాజ్ ని కూడా రమ్మని మెసేజ్  పెట్టు. 'మా చెల్లికి ఒంట్లో బాగోలేదు ఊరు వెళ్తున్నాము' అని కాజువల్ గా  చెబుతాను. అతను ఏ వివరాలు అడిగినా  మాట మార్చేస్తాను. " అంది శకుంతల.

 

*******

 

మర్నాడు శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి కోవెలలో దర్శనం అనంతరం యథాప్రకారంగా కూర్చున్న స్థానాలలోనే కూర్చున్నారు ముగ్గురు.

 

" బాబు విరాజ్. మా చెల్లెలికి ఒంట్లో బాగుండలేదు. ఒక వారం రోజులు పాటు సాయం రమ్మంటే నేను, నా కూతురు  వెళుతున్నాము.

ఇంతకీ మీ పెళ్లి సంగతి ఏం నిర్ణయించుకున్నారు? మీకంటూ సొంత అభిప్రాయం ఏమైనా ఉందా? లేదా మీ నాన్నగారి నిర్ణయం ప్రకారమే చేద్దామనుకుంటున్నారా?

మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో చెబితే  నేను హరితకి సంబంధాలు చూడమని మా చెల్లెలితో కూడా చెబుతాను. " అంది శకుంతల.

 

ఆ మాటతో అటు విరాజ్ ఇటు హరిత ఒక్కసారిగా  ఉలిక్కిపడ్డారు.

 

" ఒకవేళ మీరు తెగించి హరితని  వివాహం చేసుకోలేకపోతే, తనకి కూడా మీమధ్య స్నేహాన్ని మర్చిపోవడానికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు మా చెల్లెలికి  సంబంధం చూడమని  చెబితే  అది కుదరడానికి కూడా ఓ ఏడాది పడుతుంది.

 

అప్పుడు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరు సుఖంగా ఉండొచ్చు. ఇటు హరిత తన అత్తారింటికి  వెళుతుంది. నా బాధ్యత తీరుతుంది. ఏమంటారు?"

 

" మీరు అలా ఒక్కసారిగా  అడిగేస్తే నేనేం చెప్పను ఆంటీ? " అన్నాడు విరాజ్ అయోమయంగా

 

" కర్ర విరగనివ్వను. పామును చావనివ్వను అంటే సమస్య పరిష్కారం కాదు బాబు. మీ నాన్నగారికి మనవడే కావాలనుకుంటే పెళ్లి చేసుకుని ఆయన కోరినట్టుగా బిడ్డని కని ఇవ్వండి. పెళ్లి చేసుకోకుండా బిడ్డని కనడానికి మాత్రం  నేనే కాదు.. హరిత ఒప్పుకుంటుందేమో అడగండి. హరితే కాదు అభిమానం ఉన్న ఏ ఆడపిల్ల ఒప్పుకోదు.

ఇంతకాలం మీరిద్దరూ  మీ హద్దులు దాటకుండా చక్కని స్నేహితులుగా... మూడు సంవత్సరాలు స్నేహం చేశారు. నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంది బాబు. ఈ విషయంలో తెగించాల్సింది మీరే.

తండ్రి మాట జవదాటలేను అనుకుంటే, మీకు మీ నాన్నగారి కోరిక తీర్చే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయినే చేసుకోండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ మనసు బాధ పెడితే ఏమీ అనుకోకండి బాబు. నేను అలా పైకి వెళ్ళొస్తాను " అని విరాజ్ నుంచి ఏ సమాధానం ఆశించకుండా ఆవిడ మెట్లవైపు వెళ్లిపోయింది.

 

" హరిత! ఏంటి? మీ అమ్మగారు అలా మాట్లాడుతున్నారు? " దీనంగా అడిగాడు విరాజ్.

" నిజమే కదా విరాజ్. సమాజం ఒప్పుకోని పని చేయమంటే ఎవరు మాత్రం చేస్తారు? మనమందరం సంఘజీవులం. గాడిద గుడ్డు.. మనకు ఇష్టమైతే సమాజం ఏం చేస్తుంది అనుకుంటే... ముందుగా బిడ్డను కని పెళ్లి చేసుకుంటే మాత్రం మన మనస్సాక్షులు ఒప్పుకుంటాయా చెప్పు? ఆ బిడ్డను చూసుకుంటూ 'అరెరే..తప్పు చేసామే' అన్న బాధతో సుఖంగా సంసారం చేయగలమా చెప్పు? "

 

" అయితే నన్ను ఏం చేయమంటావో చెప్పు? "

 

" ఒక్కటి మాత్రం చెప్పగలను విరాజ్. జీవితాంతం సుఖంగా బతకవలసింది మనం. మన పెద్దవాళ్ల మీద మనకి ఎప్పుడూ గౌరవం ఉంది.. ఉంటుంది. మీరు సుఖంగా బతకాలనుకుంటే మాత్రం మీ మనసుకి నచ్చిన  నిర్ణయమే తీసుకోండి.  మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సుఖంగా మాత్రం ఉండాలి. మీ స్నేహితురాలుగా నేను కోరుకునేది  అదే. ఇంతకీ నేను ఇచ్చిన కవర్ చూసుకున్నారా "

 

" చూశాను. వాటిలో ఏముంది?  మీ రాను పోను టిక్కెట్లు తప్ప. "

 

" మేము ఎక్కడికి వెళ్తున్నామో అమ్మ మీతో చెప్పొద్దు అంది. అలా అని నా దగ్గర మాట, ఫోను రెండు తీసేసుకుంది.  మేము ఎక్కడికి వెళ్తున్నామో  నాకు నేనుగా 'నోటితో' చెప్పానా? చెప్పలేదుగా "

 

" అమ్మ దొంగా. అందుకేనా అవి ఫోటో స్టాట్ తీసి నాకు ఇచ్చావు. మీరు  ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలిసిపోయిందిగా. " అన్నాడు గుంభనగా నవ్వుతూ.

 

"మీకు తెలియాల్సింది అది కాదు. వచ్చిన అవకాశం  ఎలా ఉపయోగించుకోవాలి అన్నది." అంతలోనే తల్లి రావడం చూసి మాటలు ఆపేసింది హరిత.

 

విరాజ్ కి హరిత ఉద్దేశం  అర్థమైంది.

మొన్న అనుకోకుండా తన తల్లి తండ్రి బయటికి వెళ్ళినప్పుడు హరితను ఇంటికి రప్పించుకోగలిగాడు కదా! అలా ఏదైనా ప్లాన్ ఆలోచించమంటోన్దన్నమాట... అనుకున్నాడు అతను.

 

శకుంతల  వాళ్ల దగ్గరగా వచ్చి

" మరి వెళ్దామా విరాజ్. మళ్లీ ఊరు నుంచి వచ్చాక కలుద్దాం. " అంది విరాజ్ తో.

 

" అలాగే ఆంటీ. మీరు వచ్చేలాగా కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. " స్థిరంగా చెప్పాడు విరాజ్.

 

( ఇంకా ఉంది)

 


No comments:

Post a Comment

Pages