గణేశినీ!
-సుజాత.పి.వి.ఎల్
వినాయకుడ్ని మనము రకరకాల రూపాల్లో చూశాము. కానీ, స్త్రీ రూపంలో వినాయకుడిని చూడ్డం వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా! ఈ స్త్రీ రూప వినాయకుడిని మనం సుచీంద్ర క్షేత్రంలో దర్శించుకోవచ్చు. స్త్రీ రూప వినాయకుడిని "వినాయకీ", "గణేశిని", " "వ్యాఘ్రపాద వినాయక" అని మూడు పేర్లు ఉన్నాయి. తలభాగం ఏనుగు వలే, శరీరభాగం మెడనుంచి నడుము భాగం వరకు స్త్రీ మూర్తి వలే, నడుము నుంచి పాదాల వరకు పులి పాదాలవలె కనబడతాయి. వినాయకుడు స్త్రీ రూపంలో వున్నాడు కాబట్టి "వినాయకీ" అని, కాళ్ళు పులి పాదాలవలె వున్నాయి కాబట్టి "వ్యాఘ్ర పాద వినాయక" ని భక్తులు పిలుచుకుంటారు.
వినాయకుడు స్త్రీ రూప ధరించడo వెనుక ఒక కథ ఉంది. వినాయకుడు ఎలా ఆవిర్భవించాడనే విషయం మనందరికీ తెలిసిందే! ఒకసారి పార్వతి దేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ , నలుగు పిండితో ఒక బాలుడ్ని సృష్టించి, ఆ పిండి బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడ్ని సింహ ద్వారం దగ్గర కాపలా ఉంచి తను స్నానానికి వెళుతుంది. ఇంతలో పరమశివుడు కైలాసానికి వచ్చి లోపలకు వెళ్ళబోతూండగా సింహద్వారం దగ్గరున్న ఆ బాలుడు లోపలికి వెళ్ళడానికి వీలులేదని అడ్డుకుంటాడు. వెంటనే కోపావేశా పూరితుడైన పరమశివుడు, ఆ బాలుని శిరస్సును ఖండించి లోపలికి వెళతాడు. పార్వతీదేవి భర్త ఎదురెళ్లి కాళ్ళు కడిగి పూజచేస్తూ పరవశించిపోతున్న సందర్భాన మాటల మధ్యలో ద్వారం దగ్గర బాలుని ప్రసక్తి వస్తుంది. కోపోద్రేకంతో బాలుడి శిరస్సు ఖండించిన విషయం శివుడు పార్వతికి చెప్పగా, బాలుని జననం గురించి శివునికి చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభిస్తుంది పార్వతీదేవి. వెంటనే శివుడు తన గణాలను పంపి, ఉత్తరదిశగా తలపెట్టి పడుకున్న జీవి తలను ఖండించి తీసుకురమ్మంటాడు. శివ గణాలు ఉత్తరదిక్కుగా తలపెట్టి పడుకుని వున్న ఒక ఏనుగు తలను ఖండించి తీసుకురాగా, ఆ తలను గణపతికి అమర్చి ప్రాణం పోశాడు శివుడు. ఆ బాలుడే ప్రథమ గణనాథుడు. ఇక్కడిదాకా కథ అందరికి తెలిసిందే! మరి, ఆ తల ఖండించబడిన ఏనుగు ఏమైంది?ఆ ఏనుగు మొండెం అలానే అడవిలో పడి ఉండగా, అటుగా వచ్చిన 'సుయక్ష' అనే రాక్షసి ఆ దృశ్యాన్ని చూసింది. ఆ రాక్షసికి కామరూప విద్య తెలుసు. కామరూప విద్య అంటే ఒక శరీరం నుండి మరో శరీరం లోనికి ప్రవేశించి, మరలా తన శరీరంలోనికి మారవచ్చన్నమాట. ఏనుగు మొండాన్ని చూసిన సుయక్షకి, ఆ ఏనుగుకు తన తల ఉంటే ఎలా ఉంటుందోనన్న ఆలోచన కలుగుతుంది. ఫలితంగా తన తలను ఏనుగు తలలా మార్చి, ఆ ఏనుగు మొండే అమర్చింది. సరిగ్గా ఈ తరుణం కోసమే ఎదురు చూస్తున్న దేవతాగణం, ఆ రాక్షసి మొండాన్ని భస్మం చేసేశారు. మరలా తన శరీరంలోకి ప్రవేశించుదామనుకుంటే ఆ రాక్షసికి, తన తల తప్ప మొండెం కనిపించలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో, ఆ ఏనుగు రూపంలోనే ఉండిపోవాల్సివచ్చింది. ఆ తరువాత కూడా సుయక్ష ఆగడాలు తగ్గకపోగా, మరింతగా పెచ్చుమీరాయి. దేవతలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆ రాక్షసి దుష్కృత్యాలనుంచి తప్పించుకోలేకపోయారు. చివరికి చేసేదేమి లేక ఆ సర్వేశ్వరునికి మొరపెట్టుకునేందుకు కైలాసానికి వెళ్లారు. అప్పుడు జ్యోతిరూపంలో సాక్షాత్కరించిన భగవానుడు, 'సుయక్ష ఓ వరాన్ని పొందింది. ఆ వరాన్ని అనుసరించి ఆ రాక్షసి శరీరానికి సరిగ్గా వ్యతిరేక లక్షణాలున్న వారి చేతిలోనే ఆమెకు మరణం సంభవిస్తుంది' అని చెప్పాడు. దేవతలు, మునులు, అటువంటి లక్షణాలున్న వారెక్కడ దొరుకుతారు,? వారు ఎవరై ఉంటారన్న మీమాంసలో చాలా కాలం తర్జన భర్జనలు పడ్డారు. అప్పుడు అగస్త్య ముని మదిలో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. సుయక్ష శరీరానికి, వ్యతిరేక లక్షణాలుంటే చాలు సుయక్షను సులభంగా సంహరించవచ్చునని అగస్త్యుని వ్యూహం. ఒక మగ ఏనుగు శరీరానికి స్త్రీ అయిన సుయక్ష తల అమరింది కాబట్టి ఏనుగు తలతోనున్న వినాయకుడు స్త్రీ శరీరంలోకొస్తే , సుయక్ష సంహారం సులభతరం కదా ! అనుకుని ఈ ఉపాయాన్ని మిగితా ఋషులకు చెప్పాడు అగస్త్యుడు. మునులందరూ సంతోషంతో తలలూపి వినాయకుడి వద్దకెళ్లి శరణు వేడారు. వారికి అభయమిచ్చిన వినాయకుడు, స్త్రీ రూపాన్ని ధరించి, పులి పాదాలతో ప్రత్యక్షమై సుయక్షను సంహరించాడు. ఇక, సుయక్ష పీడ తప్పినందుకు సంతోషంతో దేవతా గణం, మునిగణం వినాయకుడ్ని భక్తితో ప్రార్థించారు. వెంటనే వినాయకుడు తన స్వరూపంతో వారికి దర్శనమిచ్చాడు. అప్పట్నుంచే కొంతమంది మునులు వ్యాఘ్రపాద గణపతిని పూజించడం మొదలుపెట్టారు. ఆ స్వామే వినాయకీ, గణేశినీ అనే పేర్లతో భక్తులచే పూజలందుకొని వారి కోరికలు తీర్చుతున్నాడు. వినాయకుడు భక్త సులభుడు. ఆయన ముందు నిలబడి చేతులు జోడించి ఒకసారి వినయంగా, మనస్ఫూర్తిగా తమ కోర్కెలను విన్నవించుకుంటే చాలు అన్ని నెరవేరిపోతాయి. అందుకే ప్రథమ గణనాయకునికి ప్రథమ వందనం. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అంధక అనే రాక్షసుడుండేవాడు. ఆ రాక్షసుడికి మహా దేవత అయిన 'పార్వతీదేవిని' భార్యగా పొందాలనే కోరికుండేది. అందుకు ఆమెను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, పార్వతి తన భర్తయిన శివుడిని ప్రార్థించగా, వెనువెంటనే శివుడు ఉగ్రనేత్రుడై ఆ రాక్షసుడ్ని చంపేశాడు. కానీ, ఆ అంధకాసురునికి మాయ శక్తి ఉంది. అతని శరీరం నుండి నేలను తాకిన ప్రతి రక్తపు బొట్టు మరొక అంధకాసురుడిలా మారిపోయింది. శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించినప్పుడు ఆ రక్తపు బొట్టు నేలను తాకకుండా అతనిని చంపటానికి ఏకైక మార్గం ఏమిటా అని ఆలోచించారు శివ పార్వతులు. దైవత్వం ఉన్న ప్రతివారు ఆడా- మగ ప్రతిరూపాలు మిశ్రమమని, అందులో మగవాడు మానసిక దృఢత్వానికి ప్రతీక అయితే ఆడది భౌతిక వనరుల శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుందని పార్వతికి తెలుసు! అందుకే అన్ని శక్తులకు మూలం పార్వతి దేవి అని కొనియాడుతారంతా. ఆమె అభ్యర్థన పై, దైవత్వం కలిగిన ప్రతిఒక్కరూ అంధకాసురుడి రక్తం నేలపై పడకుండా ఆ రక్తాన్ని తాగడం కోసం వారిలో ఉన్న శక్తిని విడుదల చేశారు. తర్వాత, ఆ యుద్ధ భూమి పూర్తిగా దేవతలతో నిండిపోయింది. ఇంద్రుని శక్తిగా 'ఇంద్రాణి ', విష్ణువు శక్తిగా 'వైష్ణవి', బ్రహ్మ శక్తి 'బ్రాహ్మణి' గా ఉద్భవించారు. ఆ శక్తులన్నీ కలిసి అంధకాసురుడి రక్తం నేలను తాకకముందే త్రాగి, అంధకాసురుడ్ని పూర్తిగా హతమార్చడమైనది. మత్స్య పురాణం విష్ణు ధర్మోత్తర పురాణాల్లో వున్న ''మహిళా యోధుల దేవతల'' జాబితాలో వినాయకుడి శక్తికూడా మిళితమై ఉంది. అందుకే ఆ శక్తికి 'వినాయకి' 'గణేశ్వరి 'అని అంటారు. స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణేషుడు' వానా దుర్గ ఉపనిషత్తు'గా పూజింపబడుతున్నాడు.
***
No comments:
Post a Comment