దివ్యజ్యోతి (పెద్ద కథ ) - అచ్చంగా తెలుగు

దివ్యజ్యోతి (పెద్ద కథ )

Share This

దివ్యజ్యోతి (పెద్ద కథ )

రోజా రమణి




 మిట్ట మధ్యాహ్నం రెండు గంటలైంది.చమటలు కక్కుతూ, ఆయాస పడుతూ పరిగెత్తుకుని ఇంటికి వచ్చి "అమ్మా! అమ్మా!" అని  గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు 16 ఏళ్ల విక్రమ్. "ఏమిట్రా! ఏమయ్యింది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావ్? ఏం జరిగింది?"  అంటూ నేడో, రేపో గోడలు కూడా కూలిపోతాయేమో అన్నట్టు ఉండే మట్టిగోడలు, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతాయేమో అన్నట్టుగా ఉండే తాటిరేకుల పాక నుంచి 

చిరుగులు పడిన నీరుకావి రంగు చీర కట్టుకుని బయటకు వస్తూ అడిగింది రంగమ్మ. 

      "అమ్మా! అక్క,అక్క " 

       "ఆ! అక్క" 

      "అక్క కనిపించిందటమ్మా! మా ఫ్రెండ్స్ కి"

      "అవునా! ఎక్కడ కనిపించిందట?  అయినా మనకోసం ఆలోచించకుండా వెళ్ళిపోయిన ఆ ముదనష్టపుది కనిపిస్తేనేం? కనిపించకుంటేనేం?  ఇంకా ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే వార్తేమోనని హడలి చచ్చాను. 

సరే నువ్వు రా! ఇంత అన్నం తిందువుగాని. ఎప్పుడో పొద్దుననగా బస్తాలు మొయ్యటానికి వెళ్ళావ్" అంటూ కొడుకు ఏదో చెప్తున్నా  వినిపించుకోకుండా 'రాతెండి మట్టుగిన్నె' లో  గంజిఅన్నం ఉల్లిపాయ  పెడుతున్న రంగమ్మతో 

"అది కాదే అమ్మ, అక్క ఇప్పుడు మామూలు మనిషి కాదట"

మరి? రెండు కొమ్ములు తోక గాని వచ్చాయా ఏం? " 

     "అబ్బ! అదికాదు నేను చెప్పేదివిను . ఇప్పుడు అక్క పెద్ద సినిమాయాక్టర్ అయ్యిందట. పక్కఊళ్ళో ఏదో షాప్ ఓపెనింగ్ కి వచ్చిందట. అక్కను చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలందరు ఎగబడి ఎగబడి వస్తున్నారట. ఏమిటీ!  జనాలు రద్దీ  అని  మన రాము, రవి కూడా వెళ్లారట . చూస్తే మన అక్కట అమ్మా!" వాళ్ళొచ్చి నాకు చెప్తే, నేను నీకు చెప్పటానికి వచ్చాను. 

       "ఏంటీ! అక్క సినిమా యాక్టర్ అయ్యిందా! ఎప్పుడు? ఎలా"? అంటూ ఆశ్చర్యపోయింది రంగమ్మ. 

       "అమ్మా! ఇంకా రెండుగంటలే ఉంటారట. పదవే మనం కూడా వెళ్ళి చూద్దాం." 

" నేను రాలేనురా.. నువ్వు కావాలంటే వెళ్ళు. నేను దాని ముఖం చూడలేను." 

  అమ్మా!  అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనల్ని చూస్తే అక్క తనతో పాటు మనల్ని తీసుకెళుతుందేమో.. ఒక్కసారి చూసొద్దాంరా! పోనీ నీకంతగా ఇష్టం లేకపోతే దూరంనుంచి చూసొద్దాం! రా! అమ్మా! అన్నాడు విక్రమ్.

          కూతుర్ని చూడాలన్న ఆరాటంతోనో లేక కొడుకు మాట కాదనలేకనో మొత్తనికి ఇద్దరూ కలిసి మరో అరగంటలో ఆమె వెళ్ళిపోతుందనగా అక్కడికి చేరుకున్నారు. ఆమె చుట్టూ గుంపులు గుంపులుగా జనం.

ముదురు నీలం రంగు ప్యాంటు, చొక్కా ధరించిన వస్తాదుల లాంటి మనుషులు నలుగురు. వారి మధ్యలో లేతగులాబీ రంగులో తళుకులీనుతున్న చీర, దానికి  కాంట్రస్ట్ కలర్ లో ముదురు ఊదా రంగు స్లీవ్లెస్ జాకెట్టు వేసుకుని మెరిసిపోతోంది రంగమ్మ కూతురు, నేటి ప్రఖ్యాత సినిమాతార అయిన "జ్యోతి". 

         ఎక్కడో దూరంగా ఉన్న గుంపుల మధ్యలోనుంచి జ్యోతిని చూసింది రంగమ్మ. ఆమెను చూడగానే ఒక్కసారిగా రంగమ్మలో గతం జ్ఞాపకాలు తొంగిచూశాయి. 

            'ఆరోజు ఉదయం 8 గంటలయ్యింది. ఎప్పటి లాగానే జ్యోతి తను పనిచేసే బీడీల తయారీ ఫ్యాక్టరీకి బయలుదేరుతోంది. " జ్యోతీ! ఆగు. ఈ రోజు ఫ్యాక్టరీకి వెళ్ళకు. నేను కూడా పనిలోకి వెళ్ళను" అని నవ్వుతూ చెప్పింది రంగమ్మ. 

   " ఎందుకమ్మా?" అడిగింది జ్యోతి. ఏమీ లేదు  "ఇవ్వాళ నిన్ను చూసుకోటానికి పెళ్ళి వారు వస్తున్నారు" అంది రంగమ్మ. ఏంటీ! అప్పుడే పెళ్లా? నాకు ఇప్పుడేమంత వయసు అయిపోయిందని పనికెళుతూ నీకు సహాయపడుతూ.. ప్రైవేట్ గా చదువుకుంటానమ్మా!"  అంది 18 ఏళ్ల జ్యోతి. 

      "అలాకాదు!  మంచి సంబంధం. మనము కట్నం ఇవ్వాల్సిన పనికూడా లేదు. తిరిగి వాళ్లే మనకు 3 లక్షలు ఇస్తామంటున్నారు. తమ్ముడ్ని చదివిస్తామంటున్నారు. మీ నాన్న పోయాక మనకు తిండికి గడవటానికే కష్టంగా ఉంది. అది నీకు తెలుసుకదా! కుటుంబం కోసం ఈ మాత్రం చెయ్యలేవా?  నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు 'నరసింగరావు' గారిని పెళ్ళి చేసుకుని అతని ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉండు చాలు. అతను డబ్బు గలవాడు. నీకేలోటు రాకుండా చూసుకుంటానన్నాడు." అంది రంగమ్మ.

    జ్యోతి గతుక్కు మంది. "నిన్ను,  వారం క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నప్పుడు చూశారట. నువ్వు అతనికి బాగా నచ్చావట. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్ళిచేసుకుంటానంటున్నారు. మన కుటుంబ సంగతులు అన్నీ అతనికి చెప్పాను. తానే స్వయంగా మన కుటుంబబాగోగులు చూసుకుంటానన్నాడు. పైగా 3 లక్షల ఎదురు కట్నం. అన్ని రకాలుగా బాగున్న సంబంధం. ఇంక ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టు విను అంది."  

జ్యోతి అమ్మ మాటకు ఎదురుచెప్పలేక తలవంచింది.  మరునాటి ఉదయం తల్లీ, కూతురు ఉన్న వాటిల్లో కాస్త మంచి బట్టలు కట్టుకున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఒక కార్ వారి ఇంటిముందర ఆగింది. అందులోనుంచి దిగాడు, సుమారు 45 సంవత్సరాలు పైబడిన నరసింగరావు. "క్రికెట్ గ్రౌండ్ని తలపిస్తున్న  బట్టతల, రేపో నేడో ప్రసవం కాబోతున్న స్త్రీకి ఉండే పొట్టను పోలిన పొట్ట, నల్లని నిగనిగ లాడే మేని ఛాయ. రుబ్బురోలు గాట్లు లాంటి స్పోటకం మచ్చలతో ముఖం, సుమారు 5 అడుగుల ఎత్తుగా ఉండే అతను" చూరుదాటి లోపలకు వస్తుంటే చూసి నివ్వెరపోయింది జ్యోతి. 

       రూపం సంగతి అటుంచినా మరీ తన తండ్రి వయసులో ఉన్న ఒకతన్ని పెళ్ళి చేసుకోవాలంటే తన మనస్సు ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదు.  నరసింగరావు లోపలికి వచ్చాడు. ఆకుపచ్చటి లంగా, జాకెట్టు, దాని మీద ఎరుపు రంగు వోణి ధరించి చామనఛాయ మేని రంగు, పెద్ద పెద్ద కాటుక దిద్దిన కళ్ళు, సుమారుగా ఉండే ఎత్తు, చక్కని అంగసౌష్ఠవంతో  చూడటానికి చక్కగా ఉన్న జ్యోతిని చూసి 

'బావుంది. ఇంత  పేదరికంలోనే ఈ అమ్మాయి ముఖంలో ఇంత కళ ఉంటే.. కాస్త దశ తిరిగితే ఇంకెంత అందంగా ఉంటుందో' అని మనసులోనే అనుకున్నాడు నరసింగరావు. ఏదో నామమాత్రపు చూపులు కానీ నరసింగరావు వారం క్రితమే జ్యోతిని చూశాడు. మాట ముచ్చట్లు కూడా పూర్తయ్ పోయాయి. జ్యోతికి తెలియటం కొసం మాత్రమే ఈ పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు అంతే.

        అతన్ని చూసి నివ్వెర పోయిన జ్యోతి ఆ తతంగం అంతా పూర్తిఅయిన తరువాత కాసేపు ఒంటరిగా ఏడ్చింది. 'తండ్రి చనిపోయిన తరువాత ముందు చదువు మాన్పించింది రంగమ్మ, తరువాత బీడీ ఫ్యాక్టరీకి పంపించింది. అలా మూడేళ్లు గడిచాక ఇదిగో ఇప్పుడు ఈ పెళ్ళి సంబంధం తీసుకొచ్చింది. నా కలలు ఆశలు అన్నీ చచ్చిపోయినా ఏదోలా బ్రతుకుతున్నాననుకుంటే ఈ పెళ్ళి నన్ను పూర్తిగా జీవఛ్చవంలా మార్చేసేలా ఉంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. లేదా దీనినుంచి బయటపడాలి'. అని మనసులో బలంగా అనుకుంది. 

         అనుకున్నదే తడవుగా రంగమ్మ దగ్గరకు వెళ్లి మెల్లగా " అమ్మా! ఈ పెళ్ళి నాకిష్టంలేదు " అని ధైర్యంగా చెప్పింది. 

"ఇష్టం లేదూ.. ఎందుకు? ఇంతకన్నా మంచి సంబంధం నీకోస్తుందా? నేను చెయ్యగలననే అనుకుంటున్నావా?" అంది రంగమ్మ. 

       "నాకు పెళ్ళి కాకపోయినా పరవాలేదు. కానీ ఈ పెళ్ళి మాత్రం నేను చేసుకోను. కావాలంటే జీవితాంతం బీడీ ఫ్యాక్టరీలో  పనిచేసి మనకుటుంబం గడవటానికి సహాయపడతాను. దయచేసి ఈ పెళ్ళి మాత్రం చెయ్యకమ్మా!" అంటూ ప్రాధేయపడింది జ్యోతి.   

      "ఓహో! నువ్వు పెళ్ళి చేసుకుంటే ఆ వచ్చిన డబ్బుతో మేమెక్కడ బాగుపడిపోతామేమో అని నీకు భయం. కదూ!

ఇలా బీడీ ఫ్యాక్టరీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా మన బ్రతుకులు మారవు. బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టకు. నోరుమూసుకుని నేను చెప్పినట్టు విను" అంది రంగమ్మ.

      ఇద్దరి మధ్య కాసేపు వాగ్యుద్ధం జరిగింది. ఎంత బ్రతిమిలాడినా రంగమ్మ వినటం లేదు. " ఏంచెయ్యాలి? ఏంచెయ్యాలి? ఇక్కడుంటే ఎలాగైనా ఆ పెళ్ళికి నన్ను బలి చేస్తుంది అమ్మ. తప్పించుకోవాలి. అవును ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి" అని నిర్ణయించుకుంది జ్యోతి.

   మరుసటి రోజు రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో అందరూ నిద్రపోవటం చూసి, ఒక 100 రూపాయల కాగితం పట్టుకుని కట్టుకున్న బట్టలతో ఇల్లు వదలి వెళ్ళిపోయింది జ్యోతి. తరువాత ఏమయ్యిందో రంగమ్మకు తెలీలేదు. ఇదుగో ఇప్పుడు మళ్ళీ ఇలా చూస్తోంది జ్యోతిని రంగమ్మ. 

   జ్యోతి ఇల్లు వదలివెళ్ళిపోయాక  నరసింగరావు చాలాపెద్ద గొడవ పెట్టుకున్నాడు. రంగమ్మను అనరాని మాటలన్నాడు. ఇంక చేసేది లేక  అతని దగ్గర ముందుగానే  'జ్యోతి పెళ్ళికి తీసుకున్న ఎదురు కట్నం 50,000 అడ్వాన్సు' మళ్ళీ అతనికి తిరిగి ఇచ్చేసి 'ఈ జీవితాలు ఇంక బాగుపడవు. ముదనష్టపుది ఎంత పని చేసింది!'  అని తిట్టుకుంది కూతురు మీద కాస్తైనా కనికరం లేని రంగమ్మ. 

 ***

No comments:

Post a Comment

Pages