అమ్మనౌతా - అచ్చంగా తెలుగు

 అమ్మనౌతా

నాగమంజరి గుమ్మా




“లక్ష్మీ! నువ్వు పెద్దయ్యాక ఏమౌతావు?” 


“నేను డాక్టరు నవుతాను టీచర్”


“మధు! నువ్వు?


“నేను సినిమా హీరోని అవుతాను టీచర్”


“ఆదిత్య! నువ్వు?”


“నేను మా తాతలా మినిష్టర్ అవుతాను టీచర్”


“రాజ్యం! నువ్వు?”


“నేను అమ్మనౌతాను టీచర్”


తరగతిలో మిగిలిన పిల్లలందరూ నోటికి చేతిని అడ్డు పెట్టుకుని కిసుక్కున నవ్వారు. 


“అవును టీచర్. మా అమ్మ ఈమధ్యనే చనిపోయింది. మా తమ్ముడికి, చెల్లికి ఇంకా మా నాన్నకు కూడా నేనే అమ్మనౌతాను టీచర్.” చెప్పింది ఆరిందాలా పదేళ్ల రాజ్యం. అంతేకాదు అక్షరాలా ఆచరించి చూపించింది కూడా. పదోతరగతి వరకు కష్టపడి చదివినా, తన తమ్ముడు, చెల్లి కూడా చదువులకు అందుకోవడంతో అక్కడితో చదువాపేసి, వారి అభివృద్ధికి ఇంట్లోనే ఉంటూ సహకారం అందించింది. చిన్న ఉద్యోగి అయిన తండ్రి పై ఆర్ధిక భారం పడకుండా ఆ వయసు నుంచే నాలుగిళ్ళలో పనిచేయడం, మిగిలిన సమయంలో ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించి చుట్టుపక్కల వారికి అమ్మడం చేసేది. ఇంటి ఖర్చుల్లో పొదుపుగా వ్యవహరిస్తూ, తమ్ముడి చదువుకు, చెల్లెలి పెళ్లికి డబ్బు కూడబెట్టసాగింది.


తమ్ముడు రమేష్ డిగ్రీ పాసయ్యాడు. పట్టణంలో ఏదో ఆఫీస్ లో ఉద్యోగంలో చేరారు. రోజూ ఇంటి నుంచి తిరిగేవాడు. కానీ వచ్చే జీతంలో ఎక్కువ భాగం తిరుగుడికే ఖర్చు పెట్టాల్సి రావడంతో ఆఫీసుకి దగ్గరగా ఒక చిన్న గది అద్దెకు తీసుకుని, వండుకోవడం మొదలు పెట్టాడు. 


చెల్లి రమ ఇంటర్ పాసయింది. కానీ అంతకంటే చదివిస్తే, ఎక్కువ చదివే మొగుణ్ణి తేలేమని చదువు ఆపించేసి, నారాయణకు ఇచ్చి పెళ్లి చేశారు. నారాయణ ఊరిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తొలి ఆషాఢమాసం రమను పుట్టింటికి తీసుకువచ్చింది రాజ్యం. శ్రావణమాసం సారెతో దిగబెట్టింది. 


రమకు పెళ్లి చేశాక, రమేష్ కి కూడా సుగుణనిచ్చి పెళ్లి చేసి, పట్నానికి పంపింది రాజ్యం. రమ నెలతప్పిందన్న విషయం తెలిసింది. రమకు సీమంతం, పురుడు, పుట్టిన పిల్లకి బాలసార, ఐదు నెలల తర్వాత రమను, పిల్లను మళ్ళీ సారె, చీరలతో సాగనంపింది. ఇంతలో సుగుణ నీళ్ళోసుకుంది. వేవిళ్ళతో బాధపడుతున్న సుగుణకు తోడుగా ఉండటానికి పట్నానికి వెళ్ళింది రాజ్యం. సుగుణ కన్నవారింటికి వెళ్ళేక, తమ్ముడు చెయ్యి కాల్చుకోవాలని కొన్నాళ్ళు అక్కడే ఉంది. కానీ ముసలి తండ్రికి ఇబ్బంది అవుతోందని మళ్ళీ తన ఇంటికి వచ్చేసింది. రమేష్ సుగుణలకు కొడుకు పుట్టేడు. పిల్లాడికి ఐదవ నెల వచ్చాక సుగుణ కొడుకుని తీసుకుని వచ్చింది. మళ్ళీ సాయానికి రాజ్యం వెళ్ళింది. 


కొన్ని నెలలు గడిచేసరికి రమ రెండోసారి నెలతప్పింది. మళ్ళీ పురుడు, బాలసార వగైరా బాధ్యతలు. ఇవన్నీ ముగిసేసరికి రాజ్యం తండ్రి చనిపోయేడు. ఇన్నేళ్లలో ఎవరికీ కూడా రాజ్యానికి పెళ్లి చేయాలనే ఆలోచనే రాలేదు. అసలు రాజ్యం కూడా ఆలోచించలేదేమో. తన కుటుంబంతో తమ్ముడు పట్నంలో స్థిరపడ్డాడు. చెల్లెలు రమ పుట్టిన కొడుకుతో తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది రాజ్యం.


పండుగలకు, పబ్బాలకు ఇంటికి వచ్చే తమ్ముడు, చెల్లెలి కుటుంబాల కోసం ఎదురు చూస్తూ, ఇక్కడ ఇంటిని చూసుకుంటూ, తన కూరగాయల వ్యాపారాన్ని కొనసాగిస్తోంది రాజ్యం. 


కాలం ఒకే రీతిగా గడవదు. రమ పిల్లలకు ఏడేళ్లు, ఐదేళ్లు వచ్చేయి. రమ, నారాయణ పొలంలో పనిచేసుకుంటూ ఉండగా వర్షం వచ్చింది. వర్షానికి తడవకుండా కళ్లంలో ఉన్న చెట్టు కింద నిలబడ్డారు. పిడుగుపాటుకు వారితో పాటు చెట్టు కింద చేరిన మరో ఇద్దరు కూడా గురయ్యారు. క్షణంలోనే ప్రాణం పోయింది. 


రాజ్యం మరోసారి అమ్మ అయ్యింది. రమ కూతురు సౌజన్య, కొడుకు కిరణ్ లను తన ఇంటికి తీసుకువచ్చింది. తమ ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. అక్కడి ఉపాధ్యాయులు వీరి పరిస్థితికి విచారించి, రాజ్యాన్ని ఆ పాఠశాలలో ఆయాగా నియమించారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజు సాయంత్రం పిల్లలందరూ వెళ్ళిపోయాక గదులన్నీ తుడిచింది. తాను చదువుకున్నది కూడా అదే బడిలో అయినా అప్పుడు ఉన్న బడి ఇది కాదు. ఇప్పుడు రూపురేఖలన్ని మారిపోయాయి. అయినా ఆ ఐదో తరగతి గదిలో నిల్చునేసరికి తాను తన టీచర్ తో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి రాజ్యానికి. కడుపున పుట్టిన పిల్లలకు అమ్మ కాలేకపోయినా ఇంతమంది పిల్లలకు సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందించింది రాజ్యం.


***

No comments:

Post a Comment

Pages