బంగారు ద్వీపం (అనువాద నవల) -34 - అచ్చంగా తెలుగు

బంగారు ద్వీపం (అనువాద నవల) -34

Share This

 బంగారు ద్వీపం (అనువాద నవల) -34

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton



(శత్రువులను స్టోరుగదిలో బంధించాలన్న ప్రయత్నం విఫలమవటంతో, పిల్లలంతా త్వరగా ద్వీపంనుంచి బయటపడాలని తమ పడవలో బయల్దేరుతారు. దానికి ముందు జార్జి శత్రువుల పడవను గొడ్డలితో విరక్కొట్టి పాడుచేస్తుంది. దారిలో కాపు కాస్తున్న శత్రువుల తాలూకు ఓడ మనిషి చిన్న పడవను సముద్రంలో దింపటం పిల్లలు గమనిస్తారు. పిల్లలు ఇంటికి చేరుకుని, క్వెంటిన్ అమ్మిన పెట్టెలో మాప్ నుంచి ద్వీపంలో బంగారం ఉందని తెలుసుకుని, ఆ వ్యక్తులు ద్వీపాన్ని కొనాలనుకున్నారన్న నిజాన్ని చెబుతారు. తరువాత..)
@@@@@@@

అతని భార్య నలుగురు పిల్లల గంభీరమైన మరియు తీవ్రమైన ముఖాలను చూసి, ముఖ్యమైనది ఏదో నిజంగా జరిగిందని గ్రహించింది. ఆపై అన్నె గట్టిగా అరచి, వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెలో ఉద్వేగం బాగా పెరిగిపోయింది. తాము చెప్పేదంతా నిజమని ఆమె బాబయ్య నమ్మకపోవటాన్ని ఆ అమ్మాయి తట్టుకోలేకపోతోంది.

"ఫానీ పిన్నీ! ఇదంతా నిజం" అంటూ ఆమె వెక్కసాగింది. "క్వెంటన్ బాబయ్య మమ్మల్ని నమ్మకపోవటం దారుణం. ఓ ఫానీ పిన్నీ! ఆ వ్యక్తి దగ్గర ఒక తుపాకీ ఉంది. అంతేగాక ఓ! అతను జూలియన్, జార్జిలను నేలమాళిగలో బందీలను చేసాడు. వాళ్ళను కాపాడటానికి డిక్ బావిలోకి దిగాల్సివచ్చింది. వాళ్ళు తప్పించుకోకుండా జార్జి వాళ్ళ మోటారు పడవని ధ్వంసం చేసింది."

ఆమె పిన్ని, బాబాయి దీని తలాతోకను ఏకం చేయలేకపోయారు. కానీ క్వెంటిన్ అకస్మాత్తుగా విషయం చాలా తీవ్రమైనదే గాక విలువైనదని ఆలోచించాడు. "మోటారు బోటుని ధ్వంసం చేసిందీ!" అన్నాడతను. "దేనికోసం? లోపలకు రండి. నేను మొదటి నుండి చివరి వరకు కథ వినవలసి ఉంటుంది. ఇది నాకు నమ్మశక్యం గాకుండా ఉంది."

వాళ్ళంతా గుంపుగా యింట్లోకి వచ్చారు. అన్నె తన పిన్ని మోకాళ్లపై కూర్చుని వింటోంది. జార్జి మరియు జూలియన్ మొత్తం కథ చెప్పారు. వారు దాన్ని వివరంగా, ఏదీ వదిలిపెట్టకుండా చెప్పారు. అది వింటున్న ఫానీ ఒళ్ళంతా పాలిపోయింది. ముఖ్యంగా ఆమె డిక్ బావిలోకి దిగిన ఘట్టాన్ని విని కలవరపడింది.

"వాళ్ళు నిన్ను చంపేసేవారు. ఓ డిక్! ఎంత సాహసం చేసావురా!"

క్వెంటిన్ బాబయ్య అత్యంత ఆశ్చర్యంతో విన్నాడు. అతను ఎప్పుడూ పిల్లలను యిష్టపడటం కానీ పొగడటం కానీ చేయడు. అతనెప్పుడూ వాళ్ళు అల్లరి చేస్తారని, గొడవలు తెస్తారని, వెర్రిగా ప్రవర్తిస్తారని భావిస్తాడు. కానీ యిప్పుడు, జూలియన్ చెప్పే కథను వింటూంటే, ఈ నలుగురు పిల్లల పట్ల తన బుర్రలో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొన్నాడు.

"మీరు చాలా తెలివైనవారు," అని అతను చెప్పాడు. "చాలా ధైర్యవంతులు కూడా! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. అవును. మీ అందరి గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నేను దీవిని అమ్మకూడదని మీరు కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. అది కూడా జార్జి! నువ్వు లోహపు కడ్డీల గురించి తెలుసుకొన్నాక! కానీ మీరు ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?"

నలుగురు పిల్లలు అతన్ని తెల్లబోయి చూస్తూ బదులివ్వలేదు. వారు సరిగా చెప్పలేకపోతున్నారు. "అదీ. . .ముందుగా మీకు మా మీద నమ్మకం లేదు. రెండవది, మీ కోపం, అన్యాయంగా కేకలేయటం చూసి భయపడ్డాం. మూడవది, సరైన పని చేయటానికి మీరు మమ్మల్ని నమ్మరు" అని చెప్పాలనుకొన్నారు.

"మీరు ఎందుకు సమాధానం చెప్పరు?" వారి బాబయ్య మళ్ళీ రెట్టించాడు. వారి బదులుగా అతని భార్య సున్నితమైన స్వరంతో యిలా బదులిచ్చింది.

"క్వెంటిన్! నువ్వు పిల్లలను భయపెడతావు. నీకు తెలుసా! వాళ్ళు నీ దగ్గరకు వెళ్ళటానికి యిష్టపడతారని నేను భావించను. కానీ యిప్పుడు వారు నీ వద్దకు వచ్చినందున, నువ్వు విషయాలన్నీ నీ చేతుల్లోకి తీసుకోవలసి ఉంటుంది. పిల్లలు యింత కన్నా ఏమీ చేయలేరు. నువ్వు పోలీసులకు ఫోను చేసి, వీటన్నిటి గురించి వారు ఏమి చెబుతారో చూడు."

"సరె!" అని క్వెంటిన్ బాబయ్య ఒక్కసారిగా లేచాడు. అతను జూలియన్ వీపు మీద మెల్లిగా తట్టాడు. "మీరందరూ బాగా చేసారు" అన్నాడతను. తరువాత జార్జి పొట్టి గిరజాల జుట్టుని సవరించాడు. "జార్జి! నీ గురించి కూడా చాలా గర్వపడుతున్నాను" అన్నాడు. "ఏ రోజైనా నువ్వు అబ్బాయిలాగా మంచిగా చేస్తావు."

"ఓ నాన్నా!" ఆశ్చర్యానందాలతో ఆమె ముఖం ఎర్రబడింది. అతన్ని ఆమె చిరునవ్వుతో చూసింది. అతను ఆమెను చిరునవ్వుతో చూసాడు. అతను నవ్వినప్పుడు ముఖం మంచిగా ఉంటుందని పిల్లలు గమనించారు. అతను, జార్జి చూడటానికి దాదాపు ఒకేలా ఉంటారు. విసుగు, కోపంలో ముఖం చిట్లించినప్పుడు చూడటానికి అందవిహీనుల్లా ఉంటారు. చిరునవ్వులోను, పగలబడి నవ్వినప్పుడు మాత్రం చూడముచ్చటగా ఉంటారు!

జార్జి తండ్రి పోలీసుకు, అతని న్యాయవాదికి కూడా ఫోను చేయటానికి బయటకు వెళ్ళాడు. పిల్లలు కూర్చొని బిస్కెట్లు మరియు రేగు పండ్లు తిన్నారు. ఇంతకు ముందు కథ చెప్పినప్పుడు మరిచిపోయిన చిన్న చిన్న విషయాలన్నీ తమ పిన్నికి వాళ్ళు చెప్పారు.

వాళ్ళు అక్కడ కూర్చుని ఉండగా యింటి ముందు తోటలోంచి పెద్దగా, కోపంతో ఉన్న మొరుగు వినిపించింది. జార్జి తలెత్తి చూసింది. "అది టిం" తల్లి వైపు కంగారుగా చూస్తూ చెప్పింది. "అతన్ని ఉంచుకొనే ఆల్ఫ్ దగ్గరకు తీసుకెళ్ళటానికి నాకు సమయం లేదు. అమ్మా! టిం మాకు దీవిలో ఎంత బాగా సాయపడ్డాడో తెలుసా! నన్ను క్షమించు. అతనిప్పుడు మొరుగుతున్నాడు. కానీ తనకి ఆకలి వేస్తోందని నేను ఊహిస్తున్నాను."

"సరే! దాన్ని లోపలికి తీసుకురా!" ఆమె తల్లి ఊహించని విధంగా చెప్పింది. "తను కూడా మంచి హీరోనే! మనం తనకి మంచి విందు యివ్వాలి."

జార్జి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆమె బయటకు పరుగెత్తి టిం దగ్గరకు వెళ్ళింది. ఆమె అతన్ని విడిపించింది. టిం తన పొడవాటి తోకను ఊపుతూ యింట్లోకి వచ్చాడు. అతను జార్జి తల్లిని నాకి, చెవులు రిక్కించి చూసాడు.

"మంచి కుక్క" అంటూ ప్రేమగా దాన్ని తట్టింది. "నేను నీకు కొద్దిగా భోజనం పెడతాను."

టిం అంగలు వేస్తూ ఆమెతో పాటే వంటగదిలోకి వెళ్ళాడు. జార్జి వైపు చూసి జూలియన్ మందహాసం చేసాడు. "బాగుంది. చూసావా? మీ అమ్మ ఎంత మంచిదో! కాదంటావా?"

"నిజమే! కానీ టిం యింట్లోకి రావటం చూసి మా నాన్న ఏమంటాడో?" జార్జి అనుమానం వ్యక్తపరచింది.

అదే నిమిషంలో ఆమె తండ్రి వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. "ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు చాలా తీవ్రంగా ఉన్నారు" అన్నాడతను. "న్యాయవాది కూడా అంతే! వాళ్ళంతా మీ పిల్లలు బాగా తెలివైనవారని, ధైర్యవంతులని అంగీకరిస్తున్నారు. ఆ! జార్జి! మన న్యాయవాది ఆ కడ్డీలు ఖచ్చితంగా మనకే చెందుతాయని చెప్పారు. అవి నిజంగా చాలా ఉన్నాయా?"

"నాన్నా! వందల్లో ఉన్నాయి!" జార్జి హుషారుగా చెప్పింది. "నిష్కపటంగా చెప్పాలంటే వందలే! అవన్నీ ఒక పెద్ద గుట్టగా నేలమాళిగలో పడి ఉన్నాయి. ఓహ్ నాన్నా! మనం యిప్పుడు ధనవంతులమే కదా?"

"అవును" ఆమె తండ్రి అన్నాడు. "మనం అదే! ఎంత ధనవంతులమంటే. . చాలా ఏళ్ళుగా నీకు, మీ అమ్మకు యివ్వాలని మనసులో ఉన్నా, యివ్వలేకపోయిన వస్తువులన్నీ తక్షణం యివ్వగలిగేటంత ధనవంతుణ్ణి. నేను నీ కోసం చాలా కష్టపడ్డాను. కానీ అది చాలా డబ్బుని సంపాదించి పెట్టేటంత పని కాదు. అందుకే నేను చాలా చిరాకుగాను, చెడ్డవాడిగాను ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు కోరుకున్నవన్నీ మీ వద్ద ఉన్నాయి!"

"ప్రస్తుతం నా దగ్గర లేనిదేదీ నాకు నిజంగా అక్కరలేదు" చెప్పింది జార్జి. "కానీ నాన్నా! ప్రపంచంలో అన్నింటికన్నా నేను ఎక్కువగా కోరుకునేది ఒకటుంది. దానివల్ల మీకు ఒక పెన్నీ అయినా ఖర్చు కాదు!"

"అలాగేనమ్మా! తప్పకుండా పొందుతావు" అంటూ ఆమె తండ్రి తన చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకొన్నాడు. ఈ చర్యకు జార్జి ఆశ్చర్యపోయింది. "అదేమిటో చెప్పు. ఒక వంద పౌండ్లు ఖర్చు అయినా, దాన్ని నువ్వు పొందుతావు."

అప్పుడే వాళ్ళు కూర్చున్న గదికి వచ్చే నడవలో పెద్ద పాదాల అడుగుల చప్పుడు వినిపించింది. బాగా వెంట్రుకలు ఉన్న ఒక తల తలుపును తోసుకొచ్చి, గదిలో ఉన్న అందరినీ పరీక్షగా చూసింది.

అది టిం అని చెప్పక్కర్లేదు. క్వెంటిన్ బాబయ్య తనను చూసి తెల్లబోయాడు. "ఏమిటి, అది టిం కదా?" అడిగాడతను. "హలో టిం!"

" నాన్నా! ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా కోరుకొనేది టిం నే!" తండ్రి చేతిని నొక్కుతూ జార్జి బదులిచ్చింది. "ఆ దీవిలో అతను మాకెలాంటి స్నేహితుడో మీరు ఊహించలేరు. ఆ మనుషుల మీదకు ఎగిరి పోరాడాలనుకొన్నాడు. ఓ నాన్నా! నాకు వేరే బహుమతులేమీ వద్దు. అతను ఎప్పుడూ నాతోనే ఉండాలని నేను కోరుకొంటున్నాను. అతన్ని మన యింట్లోనే ఉండనివ్వాలి. ప్రస్తుతం మనం అతను నిదురించటానికి సరైన కెన్నెల్ (కుక్కను ఉంచే గూడు లేదా పంజరం)ను ఏర్పాటు చేయగలం. అతను మిమ్మల్ని యిబ్బంది పెట్టకుండా నేను చూస్తాను."

"సరె! నీతోనే ఉండనివ్వు" ఆమె తండ్రి అంగీకారం తెలిపాడు. వెంటనే తోకను ఊపుతూ టిం ఆ గదిలోకి వచ్చాడు.

(వచ్చే నెలలో చివరిభాగం)

No comments:

Post a Comment

Pages