పుణ్యవతి (నవల) - 3 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 3

Share This

పుణ్యవతి (నవల) - 3

రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
 



(ఒక పెళ్ళిలో కలసిన తండ్రి ద్వారా పుణ్యవతిపై అల్లిన కథ విన్న ఆమె కొడుకు సుధాకర్ తల్లితో దెబ్బలాడి తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. కొడుకుపై బెంగతో పుణ్యవతి హార్ట్ ఎటాక్ వచ్చి ఆసుపత్రిలో చేరిందని, కొడుకుని చూడాలని కలవరిస్తోందని రవి ఆనందరావుతో చెప్పగా, అతన్ని అవమానించి పంపేస్తాడతను. తరువాత. . .)
@@@@@@@

హారికా ఇండస్ట్రీస్ ప్రొప్రయిటర్ హోదాలో సుధాకర్ కంపెనీ మేనేజరుతో కొత్త వర్కార్డర్ గురించి మాట్లాడుతుండగా, ఇంటర్‌కాం బజర్ మోగింది. తన కోసం ఎవరో ఆడపిల్ల వచ్చిందనగానే, ఆమెను లోనికి పంపమని చెప్పి, సుధ చర్చను మధ్యలోనే ఆపేసాడు. బయటకు వెళ్తున్న మేనేజరుని తప్పుకొని లోనికి అడుగుపెట్టింది శ్యామల. ఆమె గుమ్మంలోంచే ఆ గదిని పరిశీలనగా చూసింది.

విశాలమైన గది, గోడపై అక్కడక్కడ అందమైన చిత్రాలు, ఎయిర్‌కూల్‌తో చల్లబడిన వాతావరణం, పొందికగా అమర్చిన ఫోను, పెన్‌స్టాండులతో నిండిన టేబిల్, దాని వెనుక ఖరీదైన రివాల్వింగ్ ఛెయిర్‌లో హుందాగా కూర్చున్న సుధాకర్. . .

గుమ్మంలో శ్యామలను చూసి అతని ముఖం వెలవెలబోయింది.

"కంగ్రాట్స్!" శ్యామల హుషారుగా సుధను సమీపిస్తూ అంది.

"ఎందుకిలా వచ్చావు?" సుధాకర్ ముఖం చిట్లించుకొన్నాడు.

"వా బావా! అనుకోని అదృష్టం పట్టి ఎంత పెద్ద హోదా కొట్టేసావు. నైస్! కానీ ఇంత పెద్ద హోదాలో ఉన్న నీకు కొన్ని మర్యాదలు పాటించాలని తెలియదా? అత్తయ్య గురించి ఎంతో విపులంగా చెప్పిన మీ నాన్న, ఇంత చిన్న విషయాన్ని చెప్పకపోవటం దురదృష్టమే! పోనీలే! అవేమిటో నేను చెబుతాను. ఇంత హోదాలో ఉన్న నీ వద్దకు ఎవరైనా రాగానే, 'దయచేసి ఆసీనులు కండి. . .అదె. . . మీ మోడర్న్ భాషలో ప్లీజ్ టేక్ యువర్ సీట్ ' అని ఆహ్వానించాలి. అఫ్‌కోర్స్! తన యింటికొచ్చిన మా నాన్నను కూర్చోమనకుండా, ముద్దాయిలా నిలబెట్టి మాట్లాడిన ఆయనింట చేరావు కదా! అయినా. . .మునుపు, ముందు నువ్వు ఇలాంటి ఖరీదైన వాతావరణంలో పెరగలేదు. నేను సర్దుకుపోతాలే! నువ్వు చెప్పకపోయినా కూర్చుంటున్నా! సారీ! అదే..... క్షమించు" అంటూ ఆమె అతని ముందు సీట్లో కూర్చుంది. సుధ కృత్రిమంగా నవ్వాడు.

"తరువాత నేను మన వ్యక్తిగత విషయాలు మాట్లాడటానికి వచ్చాను. కనుక మధ్యలో ఎవరూ అంతరాయం కల్గించకుండా రెడ్ లైట్....అదే.... ఎర్ర బల్బు వేయాలి. ఇంటి ముందు లాన్‌లో కూర్చుని లాజిక్కులు మాట్లాడే ఆయన ఇది కూడా చెప్పలేదా? నా పిచ్చిగానీ! నువ్వు వచ్చి మూడు రోజులేగా అయ్యింది. మెల్లిగా తర్ఫీదు ఇస్తారులే!" శ్యామల మాటలకు సుధ కోపాన్ని అణచుకొంటూ తన వైపు టేబిల్‌కి బిగించిన రెడ్ లైట్ స్విచ్చి నొక్కాడు.

"థాంక్స్ బావా!" అంటూ బల్ల మీద ఉన్న నీళ్ళ గ్లాసు తీసుకొంది.

"గ్లాసులో కొద్దిగా నీళ్ళు తగ్గాయంటే, నువ్వు కొద్దిగా తాగి ఉండాలి. బయట మండిపోతోంది కద! దాహంగా ఉంది. చిన్నప్పటినుంచి ఒక్కటిగా కలిసి తిరిగినవాళ్ళం. అందుకే తాగుతున్నా! ఆ! ఎత్తి పోసుకొంటా! ఎంగిలి చేయను. నన్ను తప్పుగా అనుకోకు!" అంటూ శ్యామల గ్లాసులో నీళ్ళను తాగి, రుమాలుతో పెదాలు ఒత్తుకొంది.

తనలో పెరిగే అసహనాన్ని అణచుకొంటూ సుధ ఆమె చర్యలను గమనిస్తున్నాడు.

"ఈ గది పదిహేనేళ్ళుగా నువ్వు, అత్తయ్య కలిసి ఉన్న యిల్లు కన్నా పెద్దదే! క్యూట్! బావా! నువ్వు అదృష్టవంతుడివి, తెలివైనవాడివి కూడా!" చిరునవ్వుతో అంది శ్యామల.

"ఎందుకు?" చిరాగ్గా అడిగాడతను.

"ఎందుకా? భవిష్యత్తు మీద ఆశతో వేలకు వేలు డొనేషన్లు కట్టి సంపాదించిన యింజనీరింగ్ డిగ్రీతో నెలకు నలభై వేల జీతం తెచ్చుకోవలసినవాడు, ప్రస్తుత ప్రభుత్వ విధానాల ధర్మమా అని, ఎనిమిదో తరగతి చదివినవాడితో సమానంగా అయిదు వేల రూపాయిలకు కాంట్రాక్టు లేబరుగా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నాడు. కానీ నువ్వూ? బి.కాం. పాసైన రెండు నెలలకే హారికా ఇండస్ట్రీస్ ప్రొప్రయిటరుగా, పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉన్నావు. అది అదృష్టం కాదంటావా? అంతేకాదు. చట్టపరమైన రిజర్వేషన్లు పెంచామనగానే చప్పట్లు గొట్టి, ఆ పార్టీలను అందలాలెక్కించే అమాయిక ప్రజలు, ప్రభుత్వోద్యోగాల భర్తీ స్థానంలో పెత్తందారీ కూలీ విధానం . .అదే కాంట్రాక్ట్ లేబర్ సిస్టం అమలవుతోందని గుర్తించలేకపోతున్నారు. మరి నువ్వో? ప్రస్తుత పరిస్థితుల్లో, మన డిగ్రీతో మనుగడ అసంభవమని గ్రహించి, ఇన్నాళ్ళూ పెంచిన కన్నతల్లిపై చిన్న నింద పడేసి, ఈ ఊళ్ళోనే ఉంటూ ఏనాడూ నిన్ను పట్టించుకోని ది గ్రేట్ ఫాదర్. . .బిజినెస్ మాగ్నెట్ పక్కన చేరిపోయావు! తెలివైనవాడివి కాదంటావా? ఎంతయినా ఆ తండ్రి బిడ్డవే కదా! పోలికలు రాకుండా ఉంటాయా?"

శ్యామల మాటలకు సుధాకర్‌కి కోపం వచ్చింది.

"శ్యాం! నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు!"

"నీ కన్నానా? ఎక్కువైతే క్షమించు" అంటూ చేతిలోని కవరునుంచి ఒక ఫొటో, ఒక పుస్తకం బయటకు తీసింది.

"ఏమిటది?" చిరాకుగా అన్నాడు.

శ్యామల ఫోటోని అతని ముందుకు తోసింది. "ఇది నువ్వు అత్తయ్యపై నింద వేసిన దాని ఫలితం. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అలాగని వెంటనే పరుగున వచ్చి అత్తయ్యను బ్రతికించమని ప్రాధేయపడటానికి రాలేదు. ఆమె స్త్రీ రూపంలో ఉన్న ఒక ఉద్యమం. నాలాంటి కన్నెపిల్లలెందరికో మార్గదర్శి. ఆమెనెలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. కానీ ఈ ఫోటో ఎందుకు చూపించానంటే, ఆమె అనారోగ్యం కూడా ఒక కట్టుకథ అని నువ్వు అనుకోకూడదని ఆసుపత్రి మంచంపై ఉన్న అత్తయ్య ఫోటోని సాక్ష్యంగా తెచ్చాను. నాలుకను అదుపులో పెట్టుకోకపోతే వచ్చే పర్యవసానం ఏమిటో నువ్వు తెలుసుకోవాలని చూపిస్తున్నాను. చూడు బావా! నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవడో జేబుదొంగ కొట్టేస్తే నువ్వెంత కలవరపడతావో, అదే అత్తయ పడే బాధ. నువ్వు మేజరివే! కాదనను. కానీ ఈరోజు నువ్వు ఈ స్థానంలో నిలబడ్డావంటే, నీ కోసం ఆమె ఎంత కష్టపడిందో ఒకసారి ఆలోచించావా? అత్తయ్య విషయం చెప్పాలని నాన్న మీ యింటికొస్తే, ఆనందరావుగారు చాలా అసహ్యంగా మాట్లాడారట. 'కూతురి పెళ్ళికి చందాకొచ్చావా?' అని హేళన చేశారట!" చెబుతున్న శ్యామల గొంతు బొంగురుపోయింది. అప్రయత్నంగా తడిసిన కళ్ళను రుమాలుతో తుడుచుకొని, ఉద్వేగాన్ని అణచుకోవటానికి కొద్దిక్షణాలు తలవంచుకొంది.

తరువాత గొంతు సవరించుకొంది. "నిజంగా చందాలెత్తి నా పెళ్ళి చేయవలసి వస్తే, మీ గేటు దగ్గర గూర్ఖానైనా చందా అడుగుతారు కానీ నాన్న మీ యింట్లోకి అడుగుపెట్టరు. నరాల్లో నయవంచన నిండిన వారి సొమ్ముతో నా కాపురం సవ్యంగా ఉండదు బావా!" తిరిగి శ్యామల గొంతు బొంగురుపోయింది.

"సారీ!" అంటూ సుధాకర్ రివాల్వింగ్ ఛెయిర్‌లో గోడ వైపుకు తిరిగిపోయాడు.

శ్యామల తిరిగి కళ్ళు తుడుచుకొని చెప్పసాగింది, "అత్తయ్యను చూడటానికి నువ్వు రాలేదని నాన్న బాధపడుతుంటే, చూడలేక యిలా వచ్చాను. మీ నాన్న అత్తయ్య ఆరోగ్యం విషయం నీకు చెప్పలేదనుకున్నాను. కానీ నీకు విషయం తెలిసే రాలేదని ఇప్పుడు నీ ప్రవర్తన వల్ల అర్థమైంది. మా నాన్న సరే, నీ దృష్టిలో మోసగాడు. కానీ నీ ఏజ్‌గ్రూపులో ఉన్నాను. నా మాటలకైనా విలువ ఇస్తావని ఆశపడ్డాను. నాజూగ్గా కనిపించే ప్రతిదాన్నీ సొంతం చేసుకోవాలనే వయసు వాళ్ళం. అఫ్‌కోర్స్! అన్నయ్యా అని పిలిచే ఆడపిల్లలో కూడా అందాలు వెతికే మనకు, నడివయసు వాళ్ళ ఆప్యాయతలు అర్థం కావులే! మనకు తెలిసిందల్లా వెంటపడితే ఎలాంటి ఆడదైనా మన బుట్టలో పడుతుందని. అదేదో పెద్ద హీరోయిజం అనుకుంటాం. బావా! నీకు యోగివేమన తెలుసా? మధ్యయుగాల కవి."

శ్యామల ప్రశ్నకు త్రుళ్ళిపడ్డాడతను. "ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు?"

"ఏమీ లేదు. అత్తయ్య మీద నీచమైన నింద వేసావుగా! అందుకే సందర్భమని చెబుతున్నా! అఫ్‌కోర్స్! విషయం కొంచెం పచ్చిగా ఉంటుందనుకో! కొడుకు, భర్త ఇద్దరూ స్త్రీ హృదయానికి వెంపర్లాడేవారే! భార్య బాహ్య సౌందర్యానికి మురిపాల కోసం భర్త ఆరాటపడతాడు. కొడుకు ఆ హృదయం కురిపించే పాల కోసం ఆరాటపడతాడు. మీ నాన్న సరే, ఆమె మాజీ భర్త గనుక, యింకా మోజు తీరక ఉక్రోషంతో అత్తయ్య గురించి పచ్చిగా నీతో ఏదో చెప్పి ఉండవచ్చు. అత్తయ్య పాలను, ప్రేమను చవి చూసిన వాడివి, కన్నకొడుకువి. నువ్వు కూడా ఆమె సౌందర్యాన్ని ఊహించుకొని పచ్చిగా మాట్లాడితే, ఆ తల్లి మనసు తట్టుకోగలదా? నరం లేని నాలుక ఎలాగైనా తిరగవచ్చని నువ్వు మాట్లాడితే ఎలా? బావా! వృత్తి రీత్యా నలుగురితో తిరిగే వేశ్య అయినా, ఆ నలుగురిలో ఒక్కరికే మనస్ఫూర్తిగా దగ్గరవుతుంది. ఆ వ్యక్తి సాహచర్యంలో ఎక్కువసేపు గడపాలనుకుంటుంది. అదే బావా స్త్రీ హృదయమంటే! కన్నబిడ్డ తాకితే పాలను, భర్త తాకితే కోరికను వర్షించేదే స్త్రీ హృదయమని వేమన మరొకచోట చెప్పాడు. అంతేకానీ, తనను తాకిన ప్రతీవాడికి దాసోహమనేంత బలహీనురాలు కాదు ఆడదంటే!" తనలో రేగిన ఉద్వేగానికి శ్యామల మరికొంతసేపు ఆగింది. సుధాకర్ కుర్చీలోంచి లేచి రోడ్డు వైపున కిటికీలోంచి బయటకు చూడసాగాడు.

"ఏం బావా! అలా వెళ్ళిపోయావు? నా మాటలు కటువుగా ఉన్నాయా?" అతని బదులు కోసం కాసేపు చూసింది. "సరె! నేను వెళ్తున్నా! ఈ డైరీ తీసుకో!" అంటూ లేచింది.

"ఏమిటది?"

"మీ అమ్మ జీవిత కథ. మున్ముందు ఇలాంటి రోజు వస్తుందని నాన్న అత్తయ్య కథను గ్రంధస్తం చేశాడు. మీ నాన్న అల్లిన కథను విన్నావు. దీన్ని కూడా చదువు. రెంటి మధ్య ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాటిలో నిజానిజాలు విశ్లేషించి చూడు. అత్తయ్య నిజాయితీ అర్థమవుతుంది. ఖరీదైన కోర్టు తీర్పులాగ, ఒక వైపునే విని తీర్పిచ్చేస్తే ఎలా?" అని డైరీని బల్లపై వదిలి గుమ్మం వరకూ వెళ్ళిందామె.

"బావా! నిన్నొక విషయం అడుగుతాను. జవాబు చెప్పు" అంటూ తిరిగి శ్యామల వెనక్కి వచ్చింది.

"ఏమిటది?"

"నీ కంటె మీ నాన్న గురించి తెలియదు. కానీ తాను వదిలేసిన మీ అమ్మ కడుపుతో ఉందని, ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తోందని మీ నాన్నకు తెలుసుగా! ఆనాడు అత్తయ్యను రెచ్చగొట్టి విడిపోవటానికి ప్రోత్సహించిన పెద్దమనిషి , నిన్ను పసితనంలోనే కోర్టు నుంచి లాక్కోవచ్చుగా! పోనీ నువ్వు స్కూల్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఒక చాక్లెట్టు అయినా యివ్వవచ్చుగా! అలా ఎందుకు చేయలేదు? ఆలోచించావా బావా? అత్తయ్యకు చేసిన ద్రోహానికి ఆయనకు సంతానం లేదు. ఆస్తి కోసం దాయాదులు వెంట పడుతున్నారు. వారి బారి నుంచి తప్పించుకోవటానికి, ముసలి వయసులో తన అవసరాలు తీర్చటానికి, ఇప్పుడు కొడుకు అవసరమయ్యాడు. అలాగని నీతో పాటు అత్తయ్యను చేరదీయటం తనకు ఇష్టం లేదు. అందుకే నీకు అత్తయ్యపై ద్వేషం కలిగించే కట్టుకథను చెప్పి, నిన్ను తన వైపు తిప్పుకోవాలని పెళ్ళిలో కలిసారు. ఆయన ప్రయత్నం ఫలించింది. బావా! వీరపుత్రుడు అయ్యాకనే దుష్యంతుడు శకుంతలను చేరదీసాడు. అంతవరకూ శకుంతల పడ్డ పాట్లు? ఆ బిడ్డ భరతుడు కాక, మరో శకుంతలైతే ఈ దుష్యంతుడు చేరదీసేవాడా? ఆ దుష్యంతుడు కొడుకు కోసం శకుంతలని కూడా చేరదీసాడు. కానీ ఈ అభినవ దుష్యంతులవారు కేవలం భరతుణ్ణే చేరదీయాలని అనుకున్నారు. అది కూడా ఆలోచించు బావా!" అంటూ ఆమె వెనక్కి తిరిగింది.

"శ్యాం!" సుధ పిలుపుకి శ్యామల కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి.

"ఏం బావా?" తడబడే అడుగులతో అతని సీటు వద్దకు వచ్చిందామె.

"కూర్చో!" అనగానే కూర్చుంది. సుధ కొన్ని క్షణాలు ఆమె కళ్ళల్లోకి చూసాడు.

"నేనొక రాక్షసుళ్ళా కనబడుతున్నా కదూ!" సుధ ప్రశ్నకు ఆమె తడబడింది.

"అది కాదు బావా!" అతను ఆగమన్నట్లు చేతిని చూపగానే ఆమె మౌనం దాల్చింది.

"పసితనం నుంచి తల్లిదండ్రుల ప్రేమ చవిచూసిన నీకు నా బాధ అర్థం కాదులే!"

"బావా!. . ."

"మధ్యలో ఆపొద్దు. నన్ను చెప్పనీయి. నాన్న స్వార్థపరుడే కావచ్చు. అమ్మను రెచ్చగొట్టి ఉండొచ్చు. కానీ తన గర్భంలో నేనున్నానే! నా భవిష్యత్తు కోసమైనా అమ్మ విడిపోకుండా ఉండాల్సింది. మాటపట్టింపులు ఉన్న వాళ్ళకు మనువులెందుకు శ్యాం - నాలాంటి బిడ్డలు నలిగిపోవటానికా? నాన్న గురించి అడిగినప్పుడల్లా 'మా నాన్న అమెరికాలో ఉన్నాడని ' అబద్ధాలు చెప్పారు. 'అమెరికా తండ్రులు ఏడాదికోసారైనా వస్తారు. ఇన్నేళ్ళయినా మీ నాన్న రాడేరా?' అని నా స్నేహితులు అడుగుతుంటే, నేనెంత బాధపడ్డానో? అప్పుడయినా నిజం చెప్పొచ్చుగా? ఇంత గోప్యంగా మీ నాన్న మభ్యపెట్టడానికి కారణం మా నాన్న చెప్పిందే ఎందుకు కాగూడదు?" సుధ ప్రశ్నతో యిద్దరి మధ్య కొద్ది క్షణాల మౌనం.

"నీలా నాకు కథలు రావు. అయినా చెబుతున్నా! ఒక్క అనాధ కర్ణుడి పగ భారత యుద్ధానికి మూలమంటారు. సుయోధనుడికి అతను మంచిగా చెప్పి చూస్తే యుద్ధం నివారించబడేది. కానీ అలా జరగలేదు. ఈరోజుల్లో ఒక్కడు కాదు, నాలాంటి అనాధ కర్ణులెందరో వయసులో ఉన్న వాళ్ళ కాముకత్వానికి జన్మించి. . . సారీ!. . .తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు నోచుకోక తల్లడిల్లిపోతున్నారు. తమ స్వార్థం కోసం వాళ్ళలా చెలరేగిపోతుంటే, నాలాంటి బిడ్డల హక్కు కోసం నేను నిలదీయటం తప్పా?"

"ఇదే ప్రశ్న మీ నాన్నని అడిగావా?" శ్యామల సూటిప్రశ్నకు సుధ తడబడ్డాడు. "అడగలేదు. కారణం? మగాడు ఎన్ని తప్పులు చేసినా ఈ సంఘం ప్రశ్నించదు. అదే తల్లి గురించి ఎవరైనా ఏదైనా చెబితే మాత్రం తట్టుకోలేదు. కారణం అది కూతురైనా, అక్క చెల్లెలైనా, తల్లయినా . . .ఆమె అభిమానం, ప్రేమ, మమకారం అన్నీ తనొక్కడికే ఆడది పంచిపెట్టాలి. దానిలో మరొకరికి భాగం యివ్వకూడదు అనే మగజాతి అహం. నీ కోసం అత్తయ్య ఒంటరిగా ఉండిపోయినా నేరస్తురాలే అయింది. కానీ తను ఒక ఆడదాన్ని వదుల్చుకొని, మరొక ఆడదానితో మనువుకి సిద్ధపడ్డ మీ నాన్న మాత్రం ఉత్తమ పురుషుడు అయ్యాడు. అసలీ సంఘం ఆలోచనా విధానమే అంత" అంటూ ఆమె కొద్ది క్షణాలు ఆగింది. అతని నుంచి బదులులేదు.

"చూడు బావా! నీకిప్పుడేం చెప్పినా వినే స్థితిలో లేవు. అత్తయ్య కథ చదివాక ఆలోచించు. నిజం నీకే అర్థమవుతుంది. మరి వస్తా!" అంటూ శ్యామల లేచి తన చేతిని ముందుకు చాచింది. కానీ సుధ నుంచి స్పందన లేదు.

వెంటనే ఆమె చిన్నగా తల కొట్టుకుంది. "అయ్యో! రానురాను నాది మట్టిబుర్రయిపోతోంది. ఒకప్పటి చనువుతో చేతిని చాచాను. సారీ! స్త్రీ, పురుషులు చేయి కలిపితే పాణిగ్రహణం అనుకునే యింటిలో చేరావుగా! బావా! ప్రతి కరచాలనం పాణిగ్రహణం అవదు. ఆత్మీయంగా మసలే వాళ్ళంతా అక్రమ సంబంధాలు పెట్టుకోరు" అని ఆమె వెళ్ళిపోయింది.

సుధాకర్ ప్రాజెక్టు కాగితాలు తీసుకొని అధ్యయనం చేయబోయాడు. మనసు పనిపై లగ్నం కావటం లేదు. ఇంటర్‌కాంలో తను వెళ్ళిపోతున్నట్లు చెప్పి, శ్యామల ఇచ్చిన డైరీని టేబుల్ సొరుగులోకి విసరికొట్టి, విసురుగా బయటకు నడిచాడు. అతని విసురుకి రివాల్వింగ్ ఛెయిర్ గిర్రున తిరగసాగింది.
@@@@

(ఇంకా ఉంది) 

No comments:

Post a Comment

Pages