పుణ్యవతి (నవల) - 2
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
@@@@@@@@@
(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్ కార్యాలయంలో శ్రావణికి ఫైనాన్షియల్ మేనేజరు అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దానిలో తన అభివృద్ధికి చేయూతనిచ్చిన పుణ్యవతికి శ్రావణి ఒక బంగారు ఉంగరాన్ని కానుకగా ఇస్తుంది. ఆ సంతోష సంబరాన్ని తన స్నేహితురాలు సృజనకు ఆనందంగా చెబుతుండగా, ఆమె కొడుకు సుధాకర్ అకస్మాత్తుగా ప్రవేశించి తల్లిపై విరుచుకుపడతాడు. తరువాత.....)
@@@@@
సుధాకర్ ఆమె చేతిని విసిరికొట్టడంతో, పుణ్యవతి దూరంగా ఉన్న సోఫాలోకి తూలిపడింది. రవి, సృజన పరుగున అటు వెళ్ళి, ఆమెను లేపి సోఫాలో కూర్చోపెట్టారు.
"పుణ్యా! ఏమిటే ఈ వీరావేశం? అసలు సుధ చెబుతున్నదేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు. వాడు చెప్పేదేమిటో విందాం. విన్న తరువాత వాడి సందేహాన్ని తీర్చి. . ." ఆమె మాటలు పూర్తికాకుండానే పుణ్య అందుకొంది.
"అది కాదే! పెద్ద, చిన్న లేకుండా కయ్యానికి కాలుదువ్వుతూ ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ముఖ్యంగా అన్నయ్యను. . " చెబుతున్న ఆమె గొంతు ఉద్వేగంతో వణికింది.
"పోనియ్యమ్మా! మేనల్లుడేగా! నేనేమీ అనుకోనులే!"
రవి మాటలకు సుధ దూకుడుగా ముందుకొచ్చాడు. "ఎవడండీ మేనల్లుడు? మీరు నాకేం సొంత మేనమామ కాదే! నా మామయ్యకి స్నేహితులు. అన్నయ్యగా యింట్లో చేరి, అమ్మను మామయ్య నుంచి విడగొట్టారు. మధ్యవర్తిగా అమ్మకు ప్రేమపెళ్ళి చేసినట్లు నటించి, మీ పబ్బం కోసం ఆ దంపతుల మధ్య చిచ్చుపెట్టారు. ఇన్నాళ్ళూ నిజం తెలియక, మిమ్మల్ని 'మామయ్యా' అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను."
"ఇదంతా నీకెవరు చెప్పారు?" పుణ్యవతి ఆవేశంగా అడిగింది.
"నాకు బాగా కావలసినవారు" సుధ బదులిచ్చాడు.
"నీకు నా కన్నా కావల్సిన వారెవరున్నారు?"
'అనందరావుగారు!" సుధ జవాబుకి పుణ్య త్రుళ్ళిపడింది. రవికి విషయం చూచాయగా అర్థమైంది. సుధ మాటలకు బదులీయబోయే భర్తను ఆగమని సైగజేసి, సృజన వీధిగుమ్మం వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది.
"సుధా! గుమ్మంలో టాక్సీ ఉంది. ముందు వాడికి డబ్బులిచ్చి పంపెయ్యి. తరువాత మాట్లాడుదాం."
"అది టాక్సీ కాదు. ఆనందరావుగారని చెప్పానే!. .ఈ ఊరిలో పెద్ద బిజినెస్ మాగ్నెట్. . .వారి కారు."
సుధాకర్ మాటలు పూర్తి కాకుండానే పుణ్యవతి ఉద్రేకంతో సోఫాలోంచి లేచింది.
"ఆనందరావా? ఆయన నీకెక్కడ కలిసారు?"
"పెళ్ళిలో. నాన్న గురించి అడిగారు. అనాధల తండ్రులంతా అమెరికాలోనే కద ఉండేది! అదే చెప్పాను. తనకు అమెరికాలో చాలామంది తెలుసునట. నాన్న అడ్రసిస్తే ఎంక్వయిరీ చేయిస్తారట! ఇమ్మంటావా?" వేళాకోళంగా అన్నాడు సుధాకర్.
"ఆయనకి మన గురించి తెలియకనే అడిగారా?" పుణ్యవతి ఆవేశపడింది.
"తనకు తెలిసిన నిజమేదో చెప్పారు. మిగతా కథను నిన్నడిగి తెలుసుకోమన్నారు" సుధ మాటలకు పుణ్యవతి ఉద్రేకంతో ఊగిపోయింది.
"ప్రేమ పేరుతో వాడు నా జీవితంతో ఆడుకొన్నాడురా! అది నిజం. అతని వల్ల మోసపోయిన నేను, నాకు దక్కిన నిన్ను గర్వంగా చెప్పుకోవాలనుకొన్న స్థాయిలో పెంచటం నిజం. నన్నెలాగూ వదిలిపెట్టాడు సరె, ఇన్నాళ్ళు నీ మొహం చూడటానికైనా రాలేదే! అలాంటివాడు ఈరోజు నిన్ను కలవటం వెనుక వాడి కుట్ర నీకు అర్థమైందా? నా కన్నబిడ్డను నాపైనే ఉసిగొల్పాలనే దురాలోచనే తప్ప, నీకు సాయం చేయాలని కాదురా!"
ఆవేశంతో ఊగిపోయే పుణ్య దగ్గరకు సృజన కంగారుగా వచ్చి పట్టుకొంది. వెంటనే పుణ్యవతి తన స్నేహితురాలి ముఖంలోకి కన్నీళ్ళతో చూసింది.
"సృజీ! నా ఆశలు, కలలు అన్నీ వాడేనే! వాడే నా లోకమని, నేనెంత పవిత్రంగా బ్రతికానో నువ్వయినా వాడికి చెప్పవే!" అంటూ భోరుమంది.
సుధాకర్ తల్లి బాధకు చలించకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంటే, రవి నిశ్చేష్టుడై నిలబడ్డాడు. కొద్ది క్షణాల తరువాత, అతను తేరుకొని భార్య సాయంతో పుణ్యవతిని సోఫాలో కూర్చోపెట్టాడు. ముగ్గురి మధ్య అయిదు నిమిషాలు మౌనం రాజ్యమేలింది.
సుధాకర్ పెద్ద లగేజీతో గదిలోకి రావటం గమనించి పుణ్యవతి కంగారుగా అడ్డం వెళ్ళింది. "ఎక్కడికి?"
"నా తండ్రి దగ్గరికి."
"నిన్ను నవమాసాలు మోసి కన్నాను. నా ఆశలన్నీ పణం బెట్టి పెంచాను. ఈరోజు నన్ను మోసం చేసిన వాడి పంచన చేరతానంటే ఊరుకొంటానా? మర్యాదగా లోపలికెళ్ళు" పుణ్య పిచ్చెక్కినట్లు అరిచింది.
"నేనిప్పుడు మేజర్ని, ఆపటానికి నువ్వెవరివి?" సుధ మాటలకు ఆమె తెల్లబోయింది. కొద్ది క్షణాల నిశ్శబ్దం.
సుధ ముగ్గుర్ని తేరిపార జూసి లగేజీతో గుమ్మం దాటబోయాడు. అతన్ని రవి పిలిచాడు.
"సుధా! పసితనంలో మీ నాన్న అమెరికాలో ఉన్నాడని అబద్ధం చెప్పింది నేను. ఇందులో అమ్మ తప్పేమీ లేదు. నాన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడని చెబితే, అమ్మనిలాగే ఆరోజే వదిలి వెళ్ళిపోతావన్న భయంతో ఆ అబద్ధం చెప్పాను. అంతే తప్ప, అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కాదు. పసితనం నుంచి మా యిద్దరినీ చూస్తున్నవాడివి. ఈరోజు ఎవరో కలిసి మాపై ఏదో చెబితే ఎలా నమ్మావో నాకు అర్థం కాలేదు. 'అన్నయ్యా' అని పిలిచే అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొనే నీచుణ్ణి కాదు నేను. ఇవన్నీ నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు తండ్రి మీద మోజుతో ఉన్నావు. అతని చెప్పుడు మాటల ప్రభావం నీపై బాగా ఉందని గ్రహించాను. అందుకే నేనేమీ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. వయసులో ఉన్న నీకు ఆ వయసు కోరికలు ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అలాంటి కోరికలను తట్టుకుంటూ, తను ఎంత పవిత్రంగా బ్రతికిందో ఋజువులు, సాక్ష్యాలతో నీకు సంజాయిషీ యివ్వవలసిన అవసరం ఆమెకు లేదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఆమెపై నింద వేసిన వాడి పళ్ళు రాలగొట్టేవాడివి. చూడు.
వయసుకత్తెలంత వాడవదినెలైతే - మనలో అడవి జాతి మరల పుట్టు-
సతుల నిగ్రహమ్మే సంస్కార భారతి!
నా భార్య విదేశీ వనితలా నలుగురితో పోలేదంటే అది నా గొప్పతనం కాదు. పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలనే తపన, హైందవ స్త్రీ పసితనం నుంచి అలవరుచుకొన్న నిగ్రహమే దానికి కారణం. మీ అమ్మ మీద నీకంత పెద్ద కథ చెప్పిన పెద్దమనిషి, తన సుఖం కోసం మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడే! అది తప్పు కాదా? అమ్మ మాత్రం నాలాంటి వాడితో 'అన్నయ్యా' అని నవ్వుతూ మాట్లాడితే తప్పా? ఇది కేవలం నీ ఒక్కడి కాదు, మన మగజాతి ఆలోచనా విధానందే ఆ తప్పు. నీ కోసం పరితపించే ఆ తల్లి ఆరాటాన్ని ఒక్కసారి చూడు. నీ కోసం ఆ అమాయకురాలు తన సుఖాల్ని పణంబెట్టి నిన్నింతవాణ్ణి చేస్తే, నీచమైన నింద వేసి సంజాయిషీ అడుగుతున్నావని ఎలా తల్లడిల్లపోతోందో చూడు. ఒక్కసారి ఆ తల్లి మనసుతో ఆలోచించు" రవి మాటలను పెడచెవిని బెట్టి, సుధ కారెక్కి వెళ్ళిపోయాడు. అది తట్టుకోలేని పుణ్యవతి సృజన చేతుల్లోంచి నేల మీదకు జారిపోయింది.
@@@
లాన్‌లో కూర్చుని పుస్తకం తిరగేస్తున్న ఆనందరావు గేటు చప్పుడు విని తలపైకెత్తాడు. గేటు తలుపు తీసి లోనికొస్తున్న రవి కనబడగానే, కాళ్ళను పైకెత్తి ఎదురుగా ఉన్న టీపాయిపై ఉంచాడు. రవి సమీపించి గొంతు సవరించగానే, చేతిలోని పుస్తకాన్ని పక్కనున్న ఖాళీకుర్చీలో పడేసి, అతను తలను పైకెత్తాడు.
"హల్లో కవిగారా! ఏమిటిలా దారి తప్పి వచ్చారు?" వ్యంగ్యంగా అడిగాడతను.
"రాచబాటలో వెళ్ళే వాళ్ళని కూడా దారి తప్పించే వాళ్ళుంటారని ఈ మధ్యనే తెలిసింది. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టాలంటే, ఒక్కొక్కసారి అడ్డదారిలో వెళ్ళవలసి ఉంటుంది. అడ్డదారిలో వెళ్ళటానికి, దారి తప్పటానికి చాలా తేడా ఉందని గ్రహించండి."
రవి మాటలకు పగలబడి నవ్వాడు ఆనందరావు. "కవిగారు కదా! మాటల్లో గెలవటం చాలా కష్టం. సరె! అసలు విషయం చెప్పండి. అమ్మాయి పెళ్ళికి చందా కొచ్చారా?" రావు మాటలకు పెల్లుబికిన కోపాన్ని రవి బలవతంగా అణచుకొన్నాడు.
"సారీ! అమ్మాయి పెళ్ళికి చందా అడగవలసిన దుస్థితే వస్తే, మీ గేటుకీపర్నయినా చందా అడుగుతానే తప్ప, ఇంత లోపలకొచ్చి మిమ్మల్ని అడగను. బెంగపెట్టుకోకండి."
"మరెందుకు వచ్చినట్లో?"
"మీ యింట్లో నాక్కావలసిన వస్తువు ఒకటుంది. ఒక ప్రాణం నిలబెట్టడానికి అది చాలా అవసరం. మానవత్వంతో దాన్ని పంపిస్తారని కోరుతున్నాను."
"చాలాకాలం తరువాత కష్టపడి సంపాదించుకున్నాను. దాన్ని వదులుకొంటే నా ప్రాణాలు పోతాయి. తమరు దయచేయవచ్చు" అంటూ ఆనందరావు చేతితో గేటు వైపు చూపించాడు.
"ఆనందరావుగారూ! పుణ్యవతికి హార్ట్ ఎటాక్ వచ్చింది. సుధ కోసం కలవరిస్తోంది. ఆమెని బ్రతికించటానికి సుధను ఒక్కసారి పంపించండి."
"పుణ్యవతి సుధ కోసం కలవరిస్తోందా? వింతగా ఉందే! చిన్నప్పటి నుంచి తోడుగా నిలబడ్డ అన్నను ప్రేమ కోసం వదిలేసినప్పుడు దానికి ఏమీ కాలేదు. కట్టుకొన్న నన్ను కాలదన్నినప్పుడు ఏమీ కాలేదు. ఈరోజు బిడ్డ కోసం ఏదో అయిందంటే ఎలా నమ్మమంటావ్? దాని గుండె చాలా గట్టిది. అదేమీ అయిపోదు. అయినా సుధ ఇక్కడ లేడు. వాడి బాబుని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళాడు. అనాధల తండ్రులంతా అమెరికాలోనే కద ఉండేది!"
"రావుగారూ! ఇది పరాచికాలకు సమయం కాదు. పుణ్యవతిని బ్రతికించటానికి సుధను పంపించండి."
"స్వంత భార్యను పోగొట్టుకుంటున్నట్లు ఎందుకయ్యా బాధపడతావు? వయసులో తోడున్నావు. దాని కష్టసుఖాలు పంచుకున్నావు. నేను చూడు! దానితో కొన్నాళ్ళు కాపురమే వెలగబెట్టాను. వదిలించుకొన్నానా, లేదా? నువ్వూ అంతే. వదిలేయి! పుణ్యని మరిచిపోయి, పెళ్ళికెదిగిన కూతురి గురించి ఆలోచించు" ఉచిత సలహా ఇచ్చాడు.
రవి ఉద్రేకాన్ని అణచుకొని మౌనంగా గేటు వైపు వెళ్ళసాగాడు.
"కవిగారూ! పాపం మొదటినుంచి అది మిమ్మల్నే నమ్ముకొంది కద! ఒకవేళ అది చనిపోతే కర్మకాండ మీరే చేసేయ్యండి. నేనేమీ అనుకోనులే! మళ్ళీ దాని కొడుకు కోసం మాత్రం రావద్దు."
అతని మాటలకు రవి వెనక్కి తిరిగివచ్చి, ఆనందరావు చెంపలు పగలగొట్టాడు. "మైండిట్!"
అనుకోని పరిణామానికి ఆనందరావు బిత్తరపోయి కంగారుగా చుట్టూ చూసాడు. బాల్కనీలోంచి గమనిస్తున్న అతని భార్య హారిక పరుగున కిందకొచ్చింది.
"ఏమైందండీ? ఎవడు వాడు? మీ ఇంటికొచ్చి మిమ్మల్నే కొట్టిపోతున్నాడు? పోలీసులను పిలవండి" గేటు వైపు ఆవేశంగా పోతున్న రవిని చూపిస్తూ అందామె.
"నువ్వు లోపలకెళ్ళు" అంటూ ఆనందరావు తనే ఇంట్లోకి పరిగెత్తాడు.
@@@@@@
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment