"బంగారు" ద్వీపం (అనువాద నవల) -33 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -33

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -33

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton
@@@@@@@@





(స్టోరు గదిలో కాపలా ఉండటానికి డిక్ అంగీకరిస్తాడు. శత్రువులు వచ్చే సమయానికి మిగిలిన పిల్లలు జూలియన్ పథకం ప్రకారం రాళ్ళ వెనుక నక్కుతారు. బంగారం కోసం స్టోరు గదిలోకి ముగ్గురు వ్యక్తులు అడుగుపెట్టగానే, డిక్ ఆ గది తలుపుకి గొళ్ళెం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అది విఫలం కావటంతో డిక్ వాళ్ళను తప్పించుకొని నూతి మార్గం ద్వారా పైకి వచ్చి, తన ప్రయత్నం విఫలమైందని తన మిత్రులకు చెబుతాడు. వెంటనే పిల్లలంతా తమ పడవ దగ్గరకు పరిగెడతారు. తరువాత. . .)
@@@@

నలుగురు పిల్లలు వసారా వైపు పరుగెత్తారు. వాళ్ళు వెళ్తుండగా జార్జి మధ్యలో చిన్న రాతి గదిలోకి వెళ్ళి గొడ్డలిని తీసుకొంది. ఆమె దేనికలా యిబ్బంది పడుతుందని డిక్ ఆశ్చర్యపోయాడు. టిం పిచ్చిగా మొరుగుతూ వాళ్ళ వెనుకే ఉరికింది.

వాళ్ళు సముద్రపు గొంది వద్దకొచ్చారు. తెడ్లు లేకుండా వాళ్ళ సొంత పడవ అక్కడ ఉంది. మోటారు పడవ కూడా ఉంది. దానిలోకి దూకిన జార్జి ఆనందంతో అరిచింది.

"ఇవిగో మన తెడ్లు!" ఆమె అరిచింది. "వాటిని తీసుకో జూలియన్! ఇక్కడ నేను చేయాల్సిన పని ఉంది. త్వరగా మన పడవను నీటిలోకి దింపండి!"

జూలియన్, డిక్ తెడ్లను తీసుకొన్నారు. తరువాత తమ పడవను గట్టునుంచి నీటిలోకి లాగారు. జార్జి ఏమి చేస్తోందో అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మోటారు పడవ నుంచి అన్ని రకాలుగా పగులుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

"జార్జి! జార్జి! త్వరపడు! ఆ మనుషులు బయటపడ్డారు" అకస్మాత్తుగా జూలియన్ అరిచాడు. అతను ముగ్గురు వ్యక్తులు సముద్రపు గొందికి దారి తీసే కొండ పైకి పరుగెత్తటం గమనించాడు. జార్జి మోటారు పడవ నుంచి దూకి వాళ్ళను కలిసింది. వాళ్ళు తమ పడవను పూర్తిగా నీటిలోకి లాగారు. వెంటనే జార్జి తెడ్లను అందుకొంది. ప్రస్తుతం వాళ్ళందరికీ ఆమె విలువైనది.

ముగ్గురు వ్యక్తులు తమ మోటార్ బోట్ వద్దకు పరుగున వచ్చారు. తరువాత వారు దిగాలు పడుతూ ఆగారు. జార్జి వాళ్ళ పడవను పూర్తిగా నాశనం చేసింది. ఆమె తన గొడ్డలితో యిష్టం వచ్చినట్లు పడవలోని యంత్రాలను పగలగొట్టింది. ఇప్పుడు ఆ పడవ ఏమాత్రం కదిలే స్థితిలో లేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి పనిముట్లతో దాన్ని వాళ్ళు మరమ్మతు చేయలేనంత దారుణంగా ధ్వంసం చేసింది.

"దుర్మార్గురాలా!" తన పిడికిలిని జార్జి వైపు గాలిలోకి బలంగా ఆడిస్తూ అరిచాడు జాక్. "నేను వచ్చేవరకూ ఆగు."

"ఆగుతాను" బదులుగా జార్జి అరిచింది. ఆమె నీలి కళ్ళు తీక్షణంగా మెరుస్తున్నాయి. "నువ్వు కూడా ఆగు. ఇప్పుడు నువ్వు నా దీవిని వదిలి వెళ్ళలేవు."

@@@@@@@@@@@

ముగ్గురు వ్యక్తులు సముద్రపు అంచున నిలబడి, జార్జి బలంగా పడవను నడుపుతూ, తీరానికి దూరంగా వెళ్ళటం చూసారు. వాళ్ళేమీ చేయలేరు. వాళ్ళ మోటారు పడవ ప్రస్తుతం ఎందుకూ పనికిరాదు.

"తీరానికి దూరంగా నిలిపిన, వాళ్ళు తెచ్చుకొన్న చేపల పడవ ఆకారంలో పెద్దది కనుక ఆ చిన్న గొందిలోకి ప్రవేశించలేదు" తెడ్లను బలంగా లాగుతూ జార్జి చెప్పింది. "ఎవరైనా చిన్న పడవతో ఆ లోనికి వెళ్ళేవరకు వాళ్ళక్కడ నిరీక్షించవలసిందే! వాళ్ళు కనిపిస్తున్నంత దుర్మార్గులేనని నేను అనుకొంటున్నాను!"

వాళ్ళ పడవ ఆ పెద్ద చేపల పడవ పక్కనుంచి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా దానిలో ఉన్న ఒక వ్యక్తి వారిని అరిచి పిలిచాడు.

"ఎహోయి మిమ్మల్నే! మీరు కిర్రిన్ ద్వీపం నుండి వచ్చారా?"

"జవాబు చెప్పవద్దు" గొణిగింది జార్జి. "ఒక్క మాట కూడా మాట్లాడకండి." కాబట్టి వాళ్ళు బదులివ్వలేదు సరికదా తమకు వినిపించనట్లు మరోవైపు చూపు మరల్చారు.

"ఎహోయి మిమ్మల్నే!" ఆ వ్యక్తి కోపంగా అరిచాడు. "మీకు చెవుడా? మీరు దీవి నుంచే వస్తున్నారా?"

అయినా పిల్లలు ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఎటో చూస్తూంటే, జార్జి స్థిరంగా పడవను నడుపుతోంది. దానిలో మనిషి వాళ్ళను పిలవటం మాని, దీవి వైపు ఆందోళనగా చూసాడు. వాళ్ళు అక్కడ నుంచే వచ్చారని అతను ఖచ్చితంగా భావించాడు. తన సహచరుల సాహసాలు బాగా తెలుసు కనుక అతను ద్వీపంలో అంతా సవ్యంగా ఉందో, లేదో అని ఆలోచిస్తున్నాడు.

"అతను చేపల పడవలో ఉన్న చిన్న బోటును నీటిలో దించి, దానిలో వెళ్ళి ఏమి జరుగుతోందో తనే చూడవచ్చు" చెప్పింది జార్జి. "అదీ! కొద్ది కడ్డీలతో మనుషులను తీసుకెళ్ళటం తప్ప అతను పెద్దగా ఏమీ చేయలేడు. వాళ్ళు బంగారం ఏదైనా తీసుకునే ధైర్యం చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు మనం సంగతి చెప్పటానికి తప్పించుకొన్నాం. "

జూలియన్ వెనక్కి తిరిగి ఆ ఓడ వైపు చూసాడు. కొంతసేపయ్యాక, ఆ ఓడలో తీసుకెడుతున్న ఒక చిన్న పడవను సముద్రంలోకి దించటం గమనించాడతను. "నువ్వు చెప్పింది నిజమే!" జార్జితో అన్నాడతను. "ఏదో జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులను రక్షించబోతున్నారు. ఎంత పాపం!"

వాళ్ళ చిన్న పడవ తీరాన్ని చేరింది. వాళ్ళు లోతు లేని సముద్రపు నీటిలో దూకి, పడవను తీరానికి లాగారు. టిం తోకను ఊపుతూ, తాడును కూడా లాగుతోంది. పిల్లలు చేస్తున్న ఏ పనిలోకైనా దూరటానికి టిం యిష్టపడతాడు.

"నువ్వు టిమ్‌ని ఆల్ఫ్ వద్దకు తీసుకెళ్తావా?" అడిగాడు డిక్.

జార్జి లేదన్నట్లు తలూపింది. "లేదు" అందామె. "మన సమయం వృధా చేయకూడదు. మనం వెళ్ళి నాన్నతో జరిగినదంతా చెప్పాలి. నేను టింని తోట ముందు కంచెకు కట్టేస్తాను."

వాళ్ళు అత్యధిక వేగంతో కిర్రిన్ కాటేజ్‌కు వెళ్లారు. అక్కడ పిన్ని ఫానీ తోటపని చేస్తోంది. పరుగెత్తుకొచ్చిన పిల్లల్ని ఆశ్చర్యంగా చూసిందామె.

"ఎందుకు?" అడిగింది ఆమె. "మీరు రేపో, ఎల్లుండో గానీ తిరిగి రాననుకొన్నాను. ఏదైనా జరిగిందా? డిక్ చెంప మీద ఏమిటి?"

"పెద్దగా ఏమీ లేదు" డిక్ అన్నాడు.

మిగిలినవారు కలుగజేసుకొన్నారు.

" ఫానీ పిన్నీ! క్వెంటిన్ బాబయ్య ఎక్కడ ఉన్నారు? ముఖ్యమైన విషయమొకటి అతనితో చెప్పాలి."

"అమ్మా, మేము ఎలాంటి సాహసం చేసామంటే....!"

"ఫానీ పిన్నీ! నీతో చెప్పటానికి మాకు చాలా భయంగా ఉంది. నిజంగానే చెబుతున్నాం."

ఫానీ పిన్ని అపరిశుభ్రంగా ఉన్న పిల్లల్ని ఆశ్చర్యంగా చూసింది.

"ఏదైనా జరిగిందా?" అందామె. తరువాత ఆమె యింటి వైపు తిరిగి పిలిచింది. "క్వెంటిన్! క్వెంటిన్! పిల్లలు మనతో ఏదో చెబుతారట!"

క్వెంటిన్ బాబాయి బయటకు వచ్చాడు. అతను పని మధ్యలో ఉండటంతో ఓరగా చూసాడు. "ఏమిటి విషయం?" అని అడిగాడు.

"బాబయ్యా! అది కిర్రిన్ ద్వీపం గురించి" జూలియన్ ఆత్రంగా చెప్పాడు. "ఆ మనుషులు దాన్ని ఇంకా కొనలేదా?"

"అదా? నోటిమాటతో విక్రయించబడింది" అతని బాబయ్య చెప్పాడు. "నా వైపునుంచి నేను సంతకం చేసాను. రేపు వారు తమ వంతు సంతకాలు చేస్తారు. ఎందుకు? దానితో మీరేం చేయాలి?"


"బాబయ్యా!ఆ మనుషులు రేపు సంతకం చేయరు" అని జూలియన్ చెప్పాడు. "వారు ద్వీపాన్ని, కోటను ఎందుకు కొనాలనుకొంటున్నారో మీకు తెలుసా? నిజంగా వాళ్ళు అక్కడ హోటలో, మరలాంటిది ఏదో కట్టాలని కాదు. కానీ కనిపించకుండా మాయమైన బంగారం అక్కడ దాచబడిందని వారికి తెలుసు."

"మీ అర్ధంలేని మాటలు ఏమిటి?" అన్నాడు అతని బాబాయి.

"ఇది అర్ధంలేనిది కాదు నాన్నా!" జార్జి ఆగ్రహంతో అరిచింది . "అదంతా నిజం. పాత కోట యొక్క మ్యాప్ మీరు అమ్మిన పెట్టెలో ఉంది. నా ముత్తాత ముత్తాత ద్వారా కడ్డీలు ఎక్కడ దాచబడ్డాయో ఆ పటంలో చూపబడింది."

జార్జి తండ్రి ఆశ్చర్యంగా, కోపంగా చూసాడు. అతను ఒక్క పదాన్ని కూడా తేలికగా నమ్మలేదు. కానీ అతని భార్య నలుగురు పిల్లల గంభీరమైన మరియు తీవ్రమైన ముఖాలను చూసి,ముఖ్యమైనది ఏదో నిజంగా జరిగిందని గ్రహించింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages