క్రొత్తనీరు.(పదవ భాగం ) - అచ్చంగా తెలుగు

క్రొత్తనీరు.(పదవ భాగం )

Share This

క్రొత్తనీరు.(పదవ భాగం )

 టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.




మనోజ్ వస్తున్నాడంటే నాగరాజు దంపతులు కంగారు పడ్డారు. మిత్రకు కూడా దిగులుగానే ఉంది.ఏ గొడవ ఇంటిమీదకు వస్తుందోనని! 

వీళ్ళల్లో కాస్త ధైర్యంగా ఉంది శ్రీదేవి ఒక్కటే! మనోజ్ గురించి శ్రీదేవికి తెలుసు....చిన్నప్పుడు ఆమె క్లాసుమేటు.


"రానీ!మాట్లాడుకుందాం!నువ్వేమీ ఆ అమ్మాయితో హద్దు మీరు ప్రవర్తించలేదు కదా! మన తప్పేం లేనప్పుడు ఎందుకు భయపడటం?" అంది చివరకు.


మనోజ్ వచ్చాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించాడు.మొదట బిగుసుకుపోయి కూర్చున్నా, మనోజ్ తమతో నవ్వుతూ మామూలు విషయాలు మాట్లాడటంతో నాగరాజు వసంతల మొహాల్లోకి కాస్త కళ వచ్చింది. మనోజ్ కు ఇష్టమని మసాలా గారెలు, బెల్లం జిలేబి చేసింది వసంత.


"మీకు నా ఇష్టా యిష్టాలు ఇంకా గుర్తున్నాయా ఆంటీ!"

అంటూ నవ్వాడు మనోజ్.

వాతావరణ ఆహ్లాదంగా ఉంది.

ఒక గంట తర్వాత వెళ్తానని బయలుదేరాడు మనోజ్. వీడ్కోలు పలకటానికి క్రింద దాకా వచ్చాడు మిత్ర.


"పదరా!కాసేపు భద్రకాళి టెంపుల్ దాకా వెళ్ళి వద్దాం! అమ్మవారిని చూసి చాలా ఏళ్లయింది!"అన్నాడు మనోజ్.


"నా బైక్ మీద వెళ్దాం అన్నయ్యా!" అంటూ బైకు తీశాడు మిత్ర.


 గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఎవరూ లేని చోట కూర్చున్నారిద్దరూ.


"మాళవిక గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను!మీ పెళ్లి గురించి మీరిద్దరూ మాట్లాడుకున్నారా?" ప్రశ్నించాడు మనోజ్.


మౌనంగా ఉన్నాడు మిత్ర.


సూటిగా అతడినే చూస్తున్నాడు మనోజ్.


 కాసేపు మౌనం.....


"మీ ఇద్దరూ ఏం నిర్ణయించుకున్నారు?"


"ఇంకా ఏమీ మాట్లాడుకోలేదన్నయ్యా!పెద్దవాళ్లను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు! మీతో పోల్చుకుంటే మా స్థితిగతులు తక్కువ.....అందుకని నేను మల్లితో పెళ్లి  గురించి ఆలోచించడం లేదు!....నేను మల్లితో మాట్లాడి నెల రోజులు దాటింది!.... మంచి సంబంధం చూసి మీరు మల్లికి పెళ్లి చేసేయండి!"


 ఈసారి మౌనంగా ఉండడం మనోజ్ వంతయింది.


" ఇంకో నెల నేను సైలెంట్ గా ఉంటే మల్లి వేరే సంబంధం చేసుకుంటుంది.... నా వల్ల కానీ నా వాళ్ళ కానీ మల్లికి ఏమీ ఇబ్బంది కలగదు.... నేను మాట ఇస్తున్నాను!... "


మనోజ్ అలాగే చిత్తరువులాగా మిత్రని చూస్తున్నాడు.


'సమీర చెప్పింది ఎంత నిజం!మిత్ర నిజంగా మంచివాడు.. తనని ప్రేమించలేదని ఆడపిల్ల మీద యాసిడ్ పోసిన దుర్మార్గులు ఉన్నారు..గొంతు నరికి చంపిన కసాయిలు ఉన్నారు... కానీ ప్రేమించిన పిల్లకు మంచి సంబంధం చూడమని చెప్పిన వాళ్ళు ఈ కాలంలో ఉన్నారా?... ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు... ఇంక ఆలోచించి, అనుమానాలు పెట్టుకోకూడదు....'


"నీ సంఘర్షణ నాకు అర్థమైంది మిత్రా!...ఇరువైపులా పెద్ద వాళ్ళని నేను కన్విన్స్ చేయగలను!మతాంతరాల, ఖండాంతరాల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి!...నన్ను చూడు! ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమ.... ప్రేమ... అంటూ చేసుకున్నాను...

పట్టుమని ఏడాది కూడా కాపురం చేయలేదు... ఎక్కువ తక్కువలు అన్నీ తర్వాత..ముందు పెళ్లికి కావాల్సింది ఒకరి మీద ఒకరికి ప్రేమ,నమ్మకం, జీవితాంతం కలిసి నడవడానికి కాస్త ఓర్పు సహనం,.... సర్దుకుపోయే గుణం...ఇవి చాలు!... మిత్రా!నా చెల్లెలు నిన్ను ప్రేమిస్తుంది నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు.. అయితే ఈ ప్రేమని ఇద్దరూ జీవితాంతం నిలుపుకోగలుగుతారా?చెప్పు!"


మనోజ్ మాటలు విని కదిలిపోయాడు మిత్ర.


"అన్నయ్యా!"అంటూ మనోజ్ ని గట్టిగా పట్టుకున్నాడు.

 అతడికి దుఃఖం పొంగుకొని వచ్చింది..

 ఎన్నో రోజుల నుండీ మనసులో దాచుకున్న బాధ కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చింది. ఏడుస్తున్న   మిత్ర  భుజాలు పట్టుకొని ఓదార్పుగా దగ్గరికి తీసికొన్నాడు మనోజ్.


 కాసేపు అయ్యాక తేరుకున్నాడు మిత్ర..అతని బాధ అంతా తగ్గినట్లు అనిపించింది. మనసు స్వచ్ఛంగా నిర్మలంగా స్పటికంలాగా ఉంది.దానిలో మాళవిక రూపం తేజోవంతంగా ప్రతిఫలిస్తోంది. ఇద్దరూ మాళవిక గురించి మాట్లాడుకుంటూ  ఇంటికి వచ్చారు.

 శ్రీదేవి,నాగరాజు,వసంతలతో  పిల్లల పెళ్లి గురించి మాట్లాడాడు మనోజ్.

వాళ్ళు ఎన్నో సందేహాలు వెలిబుచ్చారు.వాటన్నిటికీ తగిన సమాధానాలు ఇచ్చి కొట్టి పడేశాడుమనోజ్.

మిత్రను తీసుకొని సాయంత్రం హైదరాబాద్ వచ్చాడు.


"నువ్వు మల్లితో మాట్లాడుతూ ఉండు!నేను మా అమ్మ వాళ్ళని ఒప్పిస్తాను!"

అంటూ మాళవిక ఆఫీసు దగ్గర మిత్రను దించి వెళ్ళాడు మనోజ్.


ఫోన్ మోగింది. చూసింది మాళవిక.

 మిత్ర...ఫోన్ లిఫ్ట్ చెయ్యబోయి  ఆగిపోయింది.


'వెధవకి ఇప్పుడు గుర్తొచ్చానా?'అనుకుంటూ తీయలేదు. 

మళ్ళీ ఫోన్ మోగింది.

ఊహు!.... బింకంగా తీయలేదు.


మళ్ళీ మోగుతుందనుకుంది.

ఈసారి ఫోన్ మోగలేదు.


 నిరాశగా అనిపించింది.


' ఎలా ఉన్నాడో?ఎలా ఉంటే తనకేంటి?....'


ఐదు నిమిషాలు గడిచాయి.


'ఫోన్ చేస్తే పోలా!... వద్దులే!.. చెయ్యనా!..'గడియారంలో పెండ్యులంలాగా   ఊగిసలాడుతోంది మాళవిక మనసు. మరో రెండు నిమిషాలు గడిచాయి.


 "మల్లీ!"

పిలుపు వినిపించింది. మిత్ర.. ఎదురుగ్గా నిల్చుని ఉన్నాడు. చిక్కి సగమయ్యాడు.


'ఎంత ధైర్యం? ఆఫీసుకే వస్తాడా?'


"మల్లీ! ...మీ మేనేజర్ తో మాట్లాడాను!కాసేపు బయటికి తీసుకెళ్తానని పర్మిషన్ తీసుకున్నాను! వెళ్దామా!"

అవాక్కయింది మాళవిక.


"నేను రాను!"అంటూ తల అడ్డంగా ఊపింది.


"ప్లీజ్!మల్లీ!" అభ్యర్థించాడు మిత్ర



 చుట్టూ చూసింది మాళవిక.పక్కనే ఉండే కొలీగ్స్  తమ ఇద్దరినీ నవ్వుతూ చూస్తున్నారు.

 తప్పదన్నట్లుగా మిత్ర వెంట కాఫటేరియా దాకా వచ్చింది.


 "ఎందుకొచ్చావ్ ?"తీవ్రంగా అడిగింది మాళవిక.


"సారీ!.... మల్లీ!.. సారీ!..నేనూ...."


"నీతో నాకేం లేదు!వెళ్ళు!...ఇంక నీ మోహం నాకు చూపించకు!..."


తలవంచుకొన్నాడు మిత్ర.


"జన్మలో నిన్ను నమ్మను!నీ వెధవ గుణం తెలిసిపోయింది!...."


"సారీ మల్లీ! నేను చేసింది తప్పే!... కానీ!..."


"ఇంకేమిటి?.. ఇప్పుడు ఇంకేముంది?..."


"నువ్వు శాంతంగా వింటావా? నిన్న మనోజ్ అన్నయ్య వరంగల్ వచ్చాడు... అన్నయ్య, నేను ఇప్పుడే వచ్చాము. నన్ను ఇక్కడ దించి అన్నయ్య మీ ఇంటికి వెళ్ళాడు..."


మాళవిక కళ్ళు పెద్దవయ్యాయి.


" అన్నయ్య  వరంగల్ ఎందుకు వచ్చాడు?

కీచుమంది మాళవిక గొంతు.


తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు మిత్ర.


 "మల్లీ!నాకు నిన్ను పెళ్లి చేసుకొనే ధైర్యం లేదు....మనకు తెలియకుండానే మన మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది... మీకు మాకు అంతరం ఎక్కువ..అందుకని నువ్వు వేరే సంబంధం చేసుకుంటావేమోనని ఇలా నీతో మాట్లాడకుండా ఉన్నాను!.."


 భయం భయంగా చెప్పాడు మిత్ర.


" నీకు బుద్ధుందా? నేను ఎవర్నో ఎందుకు పెళ్లి చేసుకుంటాను?.... నెలరోజుల నుండి ఎంత ఏడ్చాను?... నీ గురించి ఎంత వర్రీ పడ్డాను!...తలకాయలేని వెధవ్వి!..నిన్ను ఏం చేసినా పాపం లేదు!... "

 ఒక్కసారి కట్టలు తెంచుకున్న కోపంతో హ్యాండ్ బ్యాగ్ తో మిత్రను ఫట్ ఫట్ మని కొట్టసాగింది మాళవిక.


"సారీ మల్లీ!సారీ!.. నన్ను క్షమించు!..చెప్పాను కదా!... ఆపు!..ప్లీజ్ మల్లీ!.."అంటూ చేతులు అడ్డం పెడుతున్నాడు మిత్ర.


 చుట్టూ ఉన్నవాళ్లు చిత్రంగా చూస్తున్నారు. ఒక్కసారిగా కుర్చీలో కూలబడి ఏడవ సాగింది మాళవిక.ఆమె భుజాలు పట్టుకొని  లేపి హృదయానికి హత్తుకున్నాడు మిత్ర.అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తోంది మాళవిక.


అక్కడే నిల్చుని ఇదంతా చూస్తున్న  సర్వర్ కి విచిత్రంగా అనిపించింది.

 మేనేజర్ దగ్గరికి వెళ్లి "ఆ అమ్మాయి వాడిని బాగా కొట్టి పైగా తనే ఏడుస్తోందెందుకు?"

అని అడిగాడు.

మేనేజర్ వేదాంతిలా మొహం పెట్టి 


"అంతే కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్లను కొట్టి నవ్వుతుంటారు...దాన్ని కాపురం చేయటం అంటారు.కొంతమంది ఆడవాళ్లు మగవాళ్ళను కొట్టి ఏడుస్తారు.. పైగా దాన్ని ప్రేమ అంటారు!..ఇదే సంసారం అంటే!" అన్నాడు  పట్టించుకోనట్లు.

ఏమీ అర్థం కాలేదు ఆ సర్వర్ కుర్రవాడికి.

'ఎందుకు అర్థం అవుతుంది?ప్రేమలో మునిగితే అంతా అర్థం అవుతుంది.'


*      *       *        *        *      *      *      *       *     *

రెండు రోజులు కూర్చుని తల్లిదండ్రులను మాళవిక మిత్రల పెళ్లి విషయంలో కన్విన్స్ చేయడానికి వాదిస్తున్నాడు మనోజ్.


"మనకూ,వాళ్లకూ ఎలా సరిపోతుంది?.. పుట్టు దరిద్రులు!..దీనికి బుద్ధి లేదు!.. నీకేమైంది?. పెద్దవాళ్ళం కదా!ఆడపిల్ల భద్రత గురించి ఆలోచించాలి! మనం పిల్లను ఇస్తామని అడుక్కుతినే వాళ్ళ ఇంటికి వెళదామా?...". 


ఖయ్యిమంది నీరజ.


"అమ్మా!ఓడలు బండ్లవుతాయి!.బండ్లు ఓడలవుతాయి!మిత్రాగాడు తెలివైనవాడు. కేవలం పుస్తకాలు బట్టీ బట్టి,పెద్ద చదువులు చదివిన వాళ్లే ప్రపంచాన్ని ఏలుతున్నారా?

చేతిలో చిల్లిగవ్వ లేకుండా కుబేరులైన  వాళ్ళ లిస్ట్ గూగుల్లో  వెదికితే లక్షల్లో కనిపిస్తారు!..మిత్రావాళ్లు భయస్తులు..!ఒక్క మాట పడటానికి జంకుతారు!మన పిల్లని నెత్తిన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటారు!

 ఈరోజు డబ్బులు ఆస్తులు ఉన్నాయని ఎగిరి పడడం కాదు!...వీటికంటే గుణం ముఖ్యం! నాలాగా మల్లి మతాంతరం, ఖండాంతరం పెళ్లి చేసుకుంటానందా?... వాడిని చూస్తే నమ్మకం కలుగుతుంది! తెలిసినవాడు.. పరువు కోసం కుటుంబం కోసం తపించేవాడు!.. అర్థం చేసుకోండి!.."  తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు మనోజ్.


చివరకు ఒప్పుకోక తప్పలేదు వాసుదేవరావు, నీరజలకు.


 "ఊ!మీ ఇష్టం!కానీ!వాళ్లకు తగ్గి తగ్గి మర్యాదలు చెయ్యమంటే నా వల్లకాదు!.. వాళ్ళ ఇంటికి వచ్చి నేను మాట్లాడేది లేదు. వాళ్లనే రమ్మను!"


ముక్కుచీదుకుంటూ ఆర్డర్ వేసింది నీరజ.


శ్రీదేవి కుటుంబం, సుభాషిణి కుటుంబం పెళ్లి మాటలు మాట్లాడటానికి వచ్చారు.


సుభాషిణి నాన్నగారు రామారావు మాస్టరుగారు  మధ్యవర్తిగా ఉండి అన్ని విషయాలు మాట్లాడారు.


చి. ల. సౌ.సాయి బిందు మాళవికకు 

చి. వెంకట సత్యాగ్నిమిత్రకు వివాహం కుదిరిపోయింది.



 ప్రణయ్ హైదరాబాద్ వచ్చాడు.మనోజ్ తో సహా ఐదుగురు మిత్రులు వాళ్ల ఫేవరెట్ ప్లేస్ లో కలుసుకున్నారు.


"మీ వివాహం మా ఊరిలో తోటలో పెట్టుకుందామా!మీదే మొదటి వెడ్డింగ్ అవుతుంది!"

 అన్నాడు ప్రణయ్.


" బాగుంటుంది!పెళ్ళికొడుకే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి! ప్రొఫెషన్ అదే కాబట్టి!అన్నాడు మనోజ్ నవ్వుతూ.


 "ఇంక మీ పెళ్లి మాటేమిటి?అడిగింది మాళవిక.


"పిల్లి మెడలో గంట ఎవరు కడతారు?పెద్ద వాళ్లకు ఎలా చెప్పాలి? మా విషయంలో ఎవరు చేస్తారు? నీకంటే అన్నయ్య వచ్చి మొత్తం చేసి పెట్టాడు! నాకు అన్నలేడుగా!"

 అంది దిగులుగా  సమీర.


" దిగులు పడకు!మన పెళ్లి దేవతలు చేస్తారు!ముందు వీళ్ళ పెళ్లి ముహూర్తానికి ఎక్కువ టైం లేదు! పెళ్లి పనులా చాలా ఉన్నాయి!...వాటి గురించి ఆలోచిద్దాము! అన్నాడు ప్రణయ్.

 అందరూ పెళ్లికి ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు విభజించుకొని కదిలారు.


(సశేషం )


***************

No comments:

Post a Comment

Pages