- అచ్చంగా తెలుగు

    పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -11

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి 



156.
    అపరాధి బలాబలాలెంచి శిక్షనిడువారు,   
అపరాధము బలాబలాలెంచి శిక్షనిడువారు,  
నేరస్థుల, నేరాల తీక్ష్ణతబట్టి దండించెడివారు,   
ఐకమత్యంతో రాజ్యకార్యాలు చక్కబెట్టెడివారు, 
మంత్రులు, శుద్ధమౌ నడవడిక గల్గియుండిరి, సత్య!  
157.
     అయోధ్యలో ఎచ్చటైనను అసత్యమాడెడివాడు, 
రాజ్యములో ఎచ్చోటనైనా దుష్టస్వభావుడు,    
ఇతరుల భార్యపై ఆసక్తి గల్గియున్నవాడు,  
మచ్చుకైనా కానరాకుండె నగరిలో ఒక్కడు,   
దేశంలో, అయోధ్యలో శాంతి నెలకొనియుండె, సత్య! 
158.
     మంచి వస్త్రములు, వేషాలు ధరించినవారు,  
మంచి నడవడిక, శీలము కలిగినవారు,  
నీతినేత్రాలతో సదా మేల్కొనియుండువారు, 
అన్నివేళలా రాజు హితమును కోరువారు, 
దశరథమహారాజుకు మంత్రులై యుండిరి, సత్య! 
159.
     పెద్దలలోని మంచి విషయాలనే గ్రహించెడివారు, 
పరాక్రమవంతులు, విషయావగాహన కలవారు, 
బుద్ధిబలంతో విదేశాలలో ఖ్యాతి గడించినవారు, 
శత్రువులతో మెలిగే మెళకువలెరిగినవారు,  
ఆలోచనల్లో గోప్యత పాటించు నేర్పరులా మంత్రులు, సత్య!  
160.
    సూక్ష్మ విషయాలపై చక్కని గ్రహింపుగలవారు, 
సరైన నిర్ణయములు చేయుటలో సమర్థులు, 
నీతిశాస్త్ర విషయాలన్నియూ తెలిసినవారు, 
పరుల మనసులు నొప్పించక పలికెడివారు, 
అట్టి మంత్రుల సహాయంతో దశరథుడు పాలించె, సత్య !
161.
     దశరథ మహారాజు ఔదార్యవంతుడు, 
చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనువాడు, 
రాజు, పురుషశ్రేష్ఠుడు, ప్రజారక్షకుడు, 
రాజ్య విషయాలపై అవగాహనకలవాడు, 
అధర్మము తొలగించి ధర్మముతో రాజ్యమేలెను, సత్య! 
162.
     దశరథునికి పలువురు మిత్రులు యుండిరి, 
సామంతరాజులంతా అతనికి లొంగియుండిరి, 
అహితులతని ప్రతాపంచే సంహరించబడిరి, 
శత్రువులూ, సరి సమానులతనికి లేకుండిరి, 
     ప్రజారంజకంగా రాజ్యము పాలించె దశరథుడు, సత్య! 
163.
     ఆలోచనలోనూ రాజు హితమునే కోరువారు, 
ఆచరణలోనూ రాజు సంక్షేమమే కోరువారు, 
అనురక్తులు, సమర్థులు, నేర్పుకలవారు, 
దశరథుడికి మంత్రులుగా యుండెడివారు, 
దశరథుడు వారితో కూడి సూర్యునిలా ప్రకాశించె, సత్య!  
                   *****  
8 వ సర్గ
       దశరథుని అశ్వమేధయాగము...
164.  
దశరథ రాజు ధర్మజ్ఞుడు, మహానుభావుడు, 
వంశాన్ని ఉద్ధరించు పుత్రుని కోరుకొనినాడు,   
పుత్రుడు జనియించలేదని చింతించినాడు, 
పుత్రులకై అశ్వమేధయాగం చేయదలచినాడు, 
యాగము గూర్చి మంత్రులను సంప్రదించె దశరథుడు, సత్య! 
165.
దశరథుడు, మంత్రియౌ సుమంత్రుని పిలిపించెను, 
పురోహితులు, గురువులను తోడ్కొని రమ్మనెను,
సుమంత్రుడు రాజాజ్ఞ పాటింప శీఘ్రముగా వెళ్ళెను, 
వామదేవ, సుయజ్ఞ, జాబాలి, కాశ్యపులతో వచ్చెను, 
పురోహితుడౌ వసిష్ఠుని కూడా తోడ్కొని వచ్చెను, సత్య! 
166.
దశరథుడు బ్రాహ్మణ, పురోహితులనాదరించెను, 
అశ్వమేధయాగం చేయదలచితినని వచించెను, 
యథాశాస్త్రముగ యాగము చేయదలచితిననెను, 
తన కోరిక తీరు ఉపాయము చెప్పుమని కోరెను, 
వసిష్ఠాదులు రాజు నిర్ణయాన్ని అభినందించిరి, సత్య! 
167.
దశరథుని నిర్ణయానికి బ్రాహ్మణులానందించిరి,  
మహారాజు నిర్ణయం ధర్మసమ్మతమైనదనిరి,  
యాగానికి వలసిన వస్తు సామగ్రి కూర్చమనిరి, 
యాగాశ్వాన్ని అలంకరించి విడువమని తెలిపిరి, 
రాజుకు ఇష్టులైన పుత్రులు కలుగుదురనిరి, సత్య! 
168.
గురువులు చెప్పిన యజ్ఞసంభారాలు కూర్చుమని, 
యాగాశ్వమును సమర్థులౌ వీరులతో విడువమని, 
అశ్వముతో ప్రశాసకులను కూడా విడువమని, 
సరయూతీరాన యజ్ఞభూమినేర్పాటు చేయుమని, 
దశరథుడు మంత్రులందరిని ఆదేశించెను, సత్య! 
169.
అశ్వమేధ యాగంలో అపచారము జరుగరాదనె, 
అట్లైన యాగయజమానుడు వెంటనే నశించుననె, 
కావున శాస్త్రోక్తంగా  శాంతికార్యాలు జరుపుమనె, 
క్రతువు, శాస్త్ర ప్రకారం, పూర్తియగునట్లు చూడుమనె, 
దశరథుని మాటలకు  మంత్రులు అంగీకరించిరి, సత్య! 
170.
అనుజ్ఞగొని బ్రాహ్మణ సమూహం  తిరిగి వెళ్ళెను, 
మంత్రులనూ పంపి, దశరథుడు గృహానికి వెళ్ళెను,  
అశ్వమేధయాగం గూర్చి ఇష్టపత్నులకు చెప్పెను,
తనతోపాటు యాగదీక్ష గొనుమని ఆదేశించెను,    
అందుకు దశరథుని పత్నులెంతో సంతసించిరి, సత్య!  
       
   9 వ సర్గ
      సుమంత్రుడు, దశరథునికి, ఋష్యశృంగుని గురించి చెప్పుట... 

171.
     ఋషులు చెప్పిన యజ్ఞోపాయం దశరథుడు వినె,
దశరథుని పుత్రప్రాప్తి కథను సుమంత్రుడూ వినె,  
ఋత్త్విక్కుల ఉపాయం పూర్వం చర్చింపబడెననె, 
     సనత్కుమారుడు ఋషులకు చెప్పగా వింటిననె,   
     సుమంత్రుడా కథ, దశరథునికి చెప్పసాగె, సత్య!  

172.
     కాశ్యపునికి, విభండకుడను పుత్రుడుండెను, 
అతనికి ఋష్యశృంగుడను కుమారుడుండెను,  
ఋష్యశృంగుడు తండ్రితో వనములోనే పెరిగెను,  
నిత్యమూ అతడు వనమందే సంచరించుచుండెను,  
అతనికి తండ్రితోడిదే లోకమనె, సుమంత్రుడు, సత్య! 

173.
బ్రహ్మచర్యములు వ్రతిత్వ, ప్రాజాపత్యములని రెండు,  
ఋష్యశృంగుడు తండ్రిని తప్ప అన్యులనెరుగడు, 
ఋష్యశృంగుడు తండ్రిని, అగ్నిని సేవించెడివాడు, 
వ్రతిత్వ బ్రహ్మచారియై స్వల్పకాలం గడుపగలడు, 
అపుడు రోమపాదుడు అంగదేశ మేలుచుండెననె, సత్య!  

174.
     రోమపాదుడు ప్రసిద్ధుడు, ప్రతాపశాలియనె,  
అతనిచే ధర్మాతిక్రమణము సంభవించుననె, 
అందుచే రాజ్యంలో తీవ్రఅనావృష్టి కలుగుననె, 
అది చూచి రాజుకి మిక్కిలి దుఃఖం కలుగుననె, 
విద్యావృద్ధులైన బ్రాహ్మణుల సలహా కోరుననె, సత్య! 

175.
      బ్రాహ్మణ సత్తములు రాజుకి సలహా యిచ్చెదరు,     
 అనావృష్టి కారణము, పాపనివృత్తి తెలిపెదరు, 
 ఋష్యశృంగునెట్లైనా రాజ్యానికి రప్పించమందురు,
 అతని పెండ్లి రాకుమారితో జరిపించమందురు, 
 రాజు, ఋష్యశృంగుని రప్పించు యోచన చేయుననె, సత్య!

No comments:

Post a Comment

Pages