త్వష్ట చరిత్ర - అచ్చంగా తెలుగు

 త్వష్ట చరిత్ర

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.



*విశ్వరూపుడు - వృతాసురుడు*

అదితి, కశ్యపులకు పుత్రులుగా పన్నెండు మంది ఆదిత్యలు కలిగారు. వారు వివస్వంతుడు,ఆర్యముడు,పూష,త్వష్ట,సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు,త్రివిక్రముడు అనువారాలు  వీరిలో శ్రీమన్నారాయణుడు వామనుడిగా జన్మించి త్రివిక్రముడు అయ్యాడు.వీరిలో త్వష్ట అనువాని చరిత్రను
తెలిసికొందాము. త్వష్ట భార్య పేరు రచన. ఆమె దైత్యుల యొక్క సోదరి.రచనకు సన్నివేశుడు,విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగారు.అందులో మహాతేజోసంపన్నుడు అయిన విశ్వరూపునికి మూడు శిరస్సులు ఉన్నాయి.అందుకే అతనికి 'త్రిశిరుడు' అనే మరొక పేరు కూడా ఉంది.

*దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట.*


ఇంద్రుడు ముల్లోకాధిపతిగా అమరావతిలో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు.
మదగర్వితుడైన దేవేంద్రుడు ధర్మ మర్యాదలను,సదాచారాలను  ఉల్లంఘింపసాగాడు.ఒకానొకనాడు అతడు నిండు సభతీరి ఉన్నాడు.సిద్ధులు, చారణులు, గంధర్వులు,మునులు విద్యాధరులు,అప్సరసలు,నాగులు అతడిని సేవిస్తూ స్తుతిస్తూ ఉన్నారు.ఆ సమయంలో దేవేంద్రాది దేవతలకు పరమ గురువైన బృహస్పతి అక్కడికి వచ్చాడు. ఒక్క దేవేంద్రుడు తప్ప మిగిలిన వారంతా లేచి నిలబడి బృహస్పతికి భక్తిగా వందనాలు చేశారు.ఇంద్రుడు మాత్రం సింహాసనం నుండి దిగటం కానీ గురువుకు నమస్కరించడం కానీ చేయక తూష్ణీ భావంతో ప్రక్కకు చూస్తూ ఉన్నాడు. త్రికాలదర్శి, సమర్థుడు అయిన బృహస్పతి ఇంద్రుడి చర్య ఐశ్వర్యమద దోషమని భావించి వెంటనే వెనుతిరిగి మౌనంగా తన ఇంటికి మరలిపోయాడు.

గురువును అవమానించిన దోషం  ఇంద్రుడిని పట్టుకుంది.వెంటనే అతడు తేజోవిహీనుడయ్యాడు. గురుకృప లేనివారి గతి ఏమవుతుందో ఇంద్రుని ద్వారా తెలుసుకోవచ్చు . క్షీణబలుడైన ఇంద్రుడిని చూచి మునులు కలవరపడి వెంటనే బృహస్పతిని క్షమాపణ వేడుకొమ్మని ఇంద్రుడిని హెచ్చరిస్తారు. అప్పటికే సమయం మించిపోయింది.బృహస్పతి తన యోగశక్తి ద్వారా అదృశ్యునిగా ఉన్నాడు.గురువు కోసం వెతికి వెతికి ఇంద్రుడు నిరాశతో అమరావతిని చేరుకున్నాడు. రాక్షసులకు ఈ విషయం తెలిసింది.రాక్షసులు అమరావతిపై దండెత్తి అతి సులభంగా దేవతలపై గెలుపును సాధించారు.దేవతలందరూ పారిపోయి బ్రహ్మదేవుడిని శరణు వేడారు.

బ్రహ్మదేవుడు చాలా విచారించి దేవతలను మందలించి" గురువు లేకపోతే మీరు బలహీనులవుతారు కాబట్టి మీరు వెంటనే త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని దగ్గరికి వెళ్లి అతడిని  మీకు పురోహితునిగా  ఉండమని వేడుకోండి.విశ్వరూపుడు విష్ణు భక్తుడు, జితేంద్రియుడు.కానీ అతని తల్లి రచన అసురుల ఆడబిడ్డ.కాబట్టి మీరు అసురులను క్షమించి విశ్వరూపుని గౌరవించండి. " అని చెప్పి పంపివేస్తాడు.
ఆ తర్వాత దేవతలు విశ్వరూపుని ఒప్పించి తమ గురువుగా నియమించుకుంటారు. విష్ణు సేవకుడైన విశ్వరూపుడు ఇంద్రునికి నారాయణకవచమును ఉపదేశిస్తాడు. ఆ కవచ ప్రభావం వలన దేవతలు రాక్షసులను జయించి తమ సంపదలు తిరిగి పొందారు.

 *విశ్వరూపుని వధ*

విశ్వరూపునకు మూడు తలలు ఉన్నాయని చెప్పుకున్నాము కదా!అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుతూ, రెండవ ముఖముతో సురాపానము చేస్తూ, మూడవ ముఖముతో అన్నమును భుజిస్తూ ఉంటాడు. త్వష్ట మొదలైన ద్వాదశాదిత్యులు  అతని పితరులు కనుక అతడు యజ్ఞము చేయునప్పుడు మంత్రాలను బిగ్గరగా పఠిస్తూ దేవతలకు హవ్యభాగాలను అందించేవాడు.


అదే సమయంలో పరోక్షంగా లోలోపల మంత్రాలను పఠిస్తూ  తన తల్లి వైపు అసురులకు కూడా హవ్యభాగాలను అందిస్తూ ఉన్నాడు.ఈ విధంగా విశ్వరూపుడు వంచన చేస్తున్నాడని, దేవతలను అవమాన పరుస్తున్నాడని భావించిన ఇంద్రుడు విశ్వరూపుని మూడు తలలను నరికి వేస్తాడు.విశ్వరూపుని మూడు శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగాను, సురాపానం చేయునది పిచ్చుకగాను,అన్నము భుజించునది తీతువు పిట్టగాను మారిపోతాయి. ఇంద్రునికి విశ్వరూపుని వధ వలన బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది. ఒక సంవత్సరం పాటు ఆ పాతకాన్ని  భరించి ఇంద్రుడు నేలకు,నీరుకు ,చెట్లకు,స్త్రీలకు ఆ పాతకాన్ని పంచివేశాడు. అయితే ఆ నాలుగు జీవాలు ఒక్కొక్క వరాన్ని  పొంది ఆ పాతకాన్ని భరించడానికి సిద్ధపడతాయి.


'భూమిపై ఎక్కడైనా గొయ్యి తనంతట తాను పూడ్చుకొంటుంది 'అనే వరాన్ని పొంది భూమి ఆ పాతకంలో నాల్గవ భాగాన్ని తీసుకుంది. కావున భూమిపై ఉన్న చవిటినేల బ్రహ్మ హత్యాపాతక  రూపము.
 'తెగిన కొమ్మ చిగురించవలెను 'అనే వరాన్ని పొంది చెట్లు ఆ పాతకంలో నాలుగవ భాగాన్ని తీసుకుంటాయి. చెట్లను నరికినప్పుడు వచ్చే బంక( జిగురు) బ్రహ్మహత్యాపాతక రూపము.
'సర్వదా పురుష సహవాసమును కలిగి ఉండటం' అనే వరాన్ని పొంది స్త్రీలు ఆ పాతకంలో నాలుగో భాగాన్ని తీసుకుంటారు. కనుక ప్రతి నెలా స్త్రీలలో రజస్వల అగుట అనునది బ్రహ్మహత్యాపాతక రూపము.
 'నూతులలో నీరు త్రవ్వే కొలది ఊరుచుండవలెను 'అనే వరాన్ని పొంది జలములు ఆ పాతకంలో నాలుగో వంతు పాపాన్ని స్వీకరిస్తాయి. నీటి యందు బుడగలు, నురగల రూపంలో బ్రహ్మహత్యా పాతకం కనిపిస్తుంది.


*వృతాసురుడు*

తన పుత్రుడైన విశ్వరూపుని మరణం తర్వాత ఎంతో దుఃఖించిన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞం తలపెట్టాడు.అయితే "ఇంద్రశత్రూ!నువ్వు వర్ధిల్లము! ఇంద్రుని సంహరించుము!" అనే మంత్రాన్ని ఆవాహన చేసే సమయంలో చిన్న పొరపాటు జరగడం వలన 'ఇంద్రుని సంహరించే పుత్రునికి బదులుగా ఇంద్రుడి చేత సంహరించబడే పుత్రుడు 'అని అర్థంలో ఆవాహన జరిగింది.ఆ విషయాన్ని త్వష్ట కూడా గమనించలేదు. యజ్ఞసమాప్తిలో 'అన్వాహార్య పచనము 'అని పేరుకల దక్షిణాగ్ని నుండి ఒక భయంకరమైన పురుషుడు ప్రభవించాడు.అతని భీకర రూపము చూచి లోకాలన్నీ గజగజ వణికాయి.అతడు ప్రతిదినమూ అన్ని వైపుల నుండి ఒక బాణము ప్రమాణంలో పెరగ సాగాడు.

ఆ పురుషుడు తన విశాలమైన శరీరంతో లోకాలను చీకటిమయం చేశాడు.అందువలన అందరూ అతడిని 'వృతాసురుడు 'అని పిలువసాగారు.వృతాసురుని ధాటికి దేవతలు కాకావికలై శ్రీమన్నారాయణుడిని శరణు వేడారు.
 శ్రీమన్నారాయణుడు దేవతలను ఓదార్చి "దధీచి మహర్షి దగ్గరికి వెళ్లి అతని శరీరాన్ని యాచించండి! ఉపాసనల,వ్రతముల, తపస్సుల బలంతో దధీచి మహర్షి శరీరం ఎంతో దృఢత్వాన్ని సంతరించుకుంది. ఆ మహర్షి ఎముకలతో విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్ఠమైన ఆయుధాన్ని తయారు చేయించుకోండి!మీకు విజయం సిద్ధిస్తుంది!"అని తరుణోపాయం ఉపదేశించాడు.
 దేవతలు ఆలస్యం చేయకుండా దధీచి మహర్షి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు.

దేవకార్యం కనుక దధీచి మహర్షి తన దేహాన్ని దేవతలకు ఇవ్వటానికి అంగీకరించాడు. అతడు తన ఆత్మను పరమాత్మయందు యోగబలముచే లీనమొనర్చి శరీరాన్ని విడిచిపెట్టాడు.అంతట అతడి వెన్నెముక నుండి విశ్వకర్మ వజ్రాయుధాన్ని, మిగిలిన ఎముకలతో వివిధములైన ఆయుధాలను తయారుచేసి ఇంద్రుడికి ఇచ్చాడు.ఆ తర్వాత దేవతలకు, వృతాసురుడికి  మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది.ఆ యుద్ధంలో వృతాసురుని రెండు భుజాలను ఇంద్రుడు వజ్రాయుధంతో ఖండించాడు. అంతట కృద్ధుడైన వృతాసురుడు తన నోటితో ఇంద్రుడిని మ్రింగివేశాడు.అయితే శ్రీమన్నారాయణ కవచ ప్రభావం వలన,తన యోగ బలంతో  ఇంద్రుడు  వృత్తాసురుడి ఉదరంలో సురక్షితంగా ఉన్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో   వృతాసురుడి ఉదరాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు.

బయటికి వచ్చిన ఇంద్రుడు వెంటనే వజ్రాయుధంతో పర్వతంవలె ఉన్న  వృతాసురుని శిరస్సును ఖండింపసాగాడు.ఒక సంవత్సరంపాటు వృత్తాసురుని చుట్టూ తిరుగుతూ వజ్రాయుధం అతడి శిరస్సును ఖండించింది. వృతాసురుడి శరీరం నుండి ఒక దివ్యమైన జ్యోతి వచ్చి శ్రీహరిలో లీనమైంది.వృతాసురుడు అతని అన్న విశ్వరూపుడు కూడా విష్ణుభక్తులు.త్వష్ట,అతని పుత్రుల యొక్క  చరిత్ర విన్న వాళ్లకు పుణ్యలోకాలు లభిస్తాయి./


***

No comments:

Post a Comment

Pages