శ్రీథర మాధురి - 120 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 120

Share This

  శ్రీథర మాధురి - 120

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


'జార్జ్ ఇవనోవిచ్ గుర్డ్ జిఎఫ్' అనే ఒక్క గొప్ప రష్యన్ గురువు గురించి నేను విన్న ఒక విషయాన్ని మీకు చెబుతాను.

ఆయన ఒకేసారి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఒకరితో చాలా దయగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. ఆయన మాటలు పూర్తి దయతో కూడుకొని ఉంటాయి. ఆయన మాటలు వినే వారి మనసును ఊరట పరుస్తాయి.

కానీ,

మరొకరితో ఆయన చాలా అమర్యాదగా ఉంటారు. ఆయన మాటలు కటువుగా ఉంటాయి. ఆయన మర్యాద, మన్ననా ఏమీ పాటించరు. ఆయన మాటలు వినే వారి మనసులో పగను రగిలిస్తాయి.

ఈ ఇద్దరు వ్యక్తులు గుర్డ్ జిఎఫ్ గురువు గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇద్దరూ ఆయన గురించి విరుద్ధమైన రెండు భావాలను వెల్లడిస్తారు.

గుర్డ్ జిఎఫ్ గురువర్యులు చాలా తెలివైనవారు. ఇతరుల ఆలోచనలను రెచ్చగొట్టడం లో పేరుపొందినవారు. ఆయన 'పని' యొక్క తత్వశాస్త్రం, జాగరూకత యొక్క వివిధ స్థాయిలలోని లోపాలను బయటకు తీసుకురావడానికి ఉద్దేశించబడింది. తద్వారా వారి అసలు రూపాన్ని వెలికి తీసుకువచ్చి, వారి జ్ఞానాన్ని మెరుగైన ఉనికి యొక్క స్థాయికి తీసుకు వెళ్లడమే ఆయన ఉద్దేశం.

తమకు తెలియకుండానే ప్రతి ఒక్కరూ ఒక ముసుగును ధరిస్తారు. కానీ గుర్డ్ జిఎఫ్ గురువర్యులు తన అసలు ముఖాన్ని తెలిసినవారు.
 
మీ అసలు రూపం ఏమిటో మీకు తెలిసి మీరు ముసుగు ధరించినప్పుడు, అదంతా మీరు తాత్కాలికంగా ఆడే నాటకమని మీకు తెలుసు.
మీరు అజ్ఞానంతో ఉన్నప్పుడు, మీ అసలు రూపం తెలియనప్పుడు, అనేక ముసుగులను ధరిస్తూ ఉన్నప్పుడు, మీరు ధరించిన ముసుగే మీ అసలు నైజంగా మారే దశ వస్తుంది. మీ అసలు ముఖాన్ని మీరు ఎన్నడూ తెలుసుకోలేరు.
  
******
నేను ఒక కథను విన్నాను...

ఉదయాన్నే గుర్రంపై విహారానికి వెళ్లే ఒక రాజు ఉండేవాడు. ఆ సమయంలో ఆయన ఇచ్చే గొప్ప దానాలు, అవసరంలో ఉన్నవారికి బీదవారికి వారి తలరాతను, శాశ్వతంగా వారి జీవితాలనే మార్చి వేసేలా ఉండేవి.

ఒకసారి ఒక ఫకీరు ఆ రాజు ముందు కనిపించి భిక్ష కోసం తన భిక్షాపాత్రను చాచాడు. రాజు అతనికి దానం ఇవ్వడానికి ముందుకు రాగానే ఫకీర్ ఒక విశిష్టమైన మనవిని చేశాడు.
 
ఫకీరు ఇలా అడిగాడు 'ఓ రాజా! దయుంచి ఈ పాత్రను మట్టితో నింపు.'
 
రాజు అహం దెబ్బతింది.
 
ఆయన ఇలా అన్నాడు 'నేను ఈ ప్రదేశానికి రాజును. నేను నీ పాత్రను బంగారంతో నింపుతాను.'
 
ఫకీర్ రాజును చూసి నవ్వాడు...

రాజు బంగారాన్ని నింపుతూ పోసాగాడు, అది అదృశ్యం అవసాగింది. అతడు తన ఖజానా నుంచి బంగారాన్నంతా తెచ్చి వేశాడు. కానీ అంతా మాయమైంది. ఆ తర్వాత విలువైన లోహాలు, మణులు, అమూల్యమైన రత్నాలు నింపారు కానీ ఆ భిక్ష పాత్ర నిండనే లేదు.
 
సాయంత్రం అయింది. రాజు ఇలా అన్నాడు, 'నీవు ఒక మాయగానిలా ఉన్నావు, నీవు చేతబడి చేసే వాడిలా ఉన్నావు. అందుకే అన్నీ నీ పాత్రలో వేయంగానే మాయమవుతున్నాయి.'
 
ఫకీర్ మరొకసారి నవ్వి ఇలా అన్నాడు 'ఓ రాజా! అందుకే నేను ఈ పాత్రను మట్టితో నింపమన్నాను. కానీ మీ అహంకారం దానికి అంగీకరించలేదు. ఇది ఏ క్షుద్ర పూజలు చేసే వాడి పాత్ర కాదు. ఇది మీ దేశంలో మరణించిన ఒక పౌరుడి పుర్రె! అతను అనేక కోరికలతో చనిపోయాడు. నేను దీన్ని అనేక వస్తువులతో నింపడానికి గతంలో ప్రయత్నించాను, అయినా అది నిండ లేదు. రాజు ఉదయాన్నే వచ్చి పేదవారికి భిక్షను ఇస్తాడని, ఎవరో నాకు చెప్పారు. అందుకే ఒకవేళ ఈ దేశానికి రాజు తన అహంకారాన్ని విడనాడి, చనిపోయిన తన దేశ పౌరుడి యొక్క పుర్రెను మట్టితో నింపితే, అతని కోరికలు తీరతాయని నేను భావించాను. నీ దేశంలో జీవించి, చనిపోయిన ఒక సామాన్య పౌరుని యొక్క కోరికలు ఎంత బలీయమైనవంటే, వాటిని తీర్చడానికి మొత్తం దేశ సంపదే సరిపోలేదు.
  
ప్రస్తుత ప్రపంచంలో మనలోని చాలామంది పరిస్థితి ఇదే అని నా భావన.


No comments:

Post a Comment

Pages