అహోబిల సార్వభౌమ - భావరాజు పద్మినీ ప్రియదర్శని - అచ్చంగా తెలుగు

అహోబిల సార్వభౌమ - భావరాజు పద్మినీ ప్రియదర్శని

Share This

అహోబిల సార్వభౌమ - భావరాజు పద్మినీ ప్రియదర్శని

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవయిత్రి పరిచయం:

'అహోబిల సార్వభౌమ' శతక రచయిత్రి శ్రీమతి భావరాజు పద్మిని ప్రియదర్శని గారు 1978 సంవత్సరంలో శ్రీకృష్ణ ప్రసాద్, పద్మావతి దంపతులకు జన్మించారు.  కర్బన రసాయనశాస్త్రంలో పోష్టుగ్రాడ్యుయేట్ అయిన వీరు కొద్దికాలం లెక్చరర్ గా పనిచేసారు. బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సును, కర్నాటిక్ క్లాసికల్ (వీణ) లో సర్టిఫికెట్ కోర్సును చేసారు. నృత్యంలో కూడా వీరు శిక్షణ పొందారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనమే కాక అనేక కళలలో వీరికి ప్రవేశం ఉన్నది. ఇవి కాక వీరు అనేక సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొని, అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.

వీరు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూద్దాము:
1. చలనచిత్ర పరిశ్రమలో, సాహితీ రంగంలో, సామాజికరంగంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది కళాకారులతో ఆడియో, వీడియో ఇంటర్వ్యూలు.
2. "అచ్చంగా తెలుగు" అంతర్జాల మాసపత్రిక వ్యవస్థాపకురాలు గా, ఎడిటర్ గా
3. అనేక సంస్థల్లో అనువాదకురాలిగా, రచయిత్రిగా
4. MYIndmedia అంతర్జాల రేడియో కు ప్రోగ్రాం డైరెక్టర్ గా
5. దూరదర్శన్ యాదగిరి లో "సాహితీ సౌరభాలు" అనే కార్యక్రమం నిర్వహణ
6. 'అచ్చంగా తెలుగు ప్రచురణలు' అనే సంస్థను స్థాపించి, ఇంతవరకు వందకు పైగా  పుస్తకాలను ప్రచురించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే వీరు చేస్తున్న కార్యక్రమాలు అనేకం.

గుర్తింపులు సత్కారములు:
1. వీరు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలద్వారా రచయిత్రిగా గుర్తింపు పొంది, రెండు రాష్ట్రా లలో మాహిళా రచయిత్రుల పట్టికలో స్థానం సంపాదించుకొన్నారు.
2. అఖిల భారత రచయితల సదస్సు కార్యక్రమంలో వీరు తెలంగాణా ప్రభుత్వం ద్వారా రెండుసార్లు సన్మానించబడ్డారు.
3. 2017 సంవత్సరంలో Director, Foreign Affairs, Srilanka ద్వారా సత్కారం.
4. కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ ద్వారా మహిళా ప్రతిభ పురస్కారం.
5. అనేక సాంస్కృతిక సాహిత్య సభలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
6. అక్షజ్ఞ ప్రచూరణల ద్వారా ప్రచురణకర్తగా 2024 ఉగాది పురస్కారం.
7. లేఖిని  సంస్థ ద్వారా మాతృదేవోభవ పురస్కారం.
8. హాస్యానందం పత్రిక ద్వారా బంగార్తల్లి పురస్కారం.

వీరి రచనలు: 1. వ్యంగాస్త్రం (హాస్య కథలు, ఎమాస్కో) 2. భైరవకోన (జానపద నవల), 3. మా బాపట్ల కథలు, 4. అభిరామి అంత్యాది (అనువాద కావ్యం), 5. తిరుప్పావై (సులభ తెలుగులో) (అనువాద కావ్యం), 6. వాసంతికా పరిణయము (చెంచులక్ష్మీ కల్యాణము) (పద్య కావ్యం). ఇవి కాక, వీరు ప్రస్తుతం 'మూక పంచశతి' ని సులభతెలుగులో రచించుతున్నారు. పైకావ్యలే కాక, వీరు రచించిన కథలు అనేక పత్రికలలో అంతర్జాల పత్రికలో కూడా ప్రచిరించబడ్డాయి. వీరు తన పేరుపై సుమారు పది బ్లాగులను నిర్వహిస్తున్నారు.

శతక పరిచయం: 


"అహోబిల సార్వభౌమ" (శ్రీ అహోబిల నృసింహ శతకము) "సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ" అనే మకుటంతో తేటగీతులలో రచింపబడిన భక్తిరస ప్రధానమైన శతకము. రచయిత్రి ఈశతకానికి మకుటం స్వయంగా నృసింహస్వామియే నిర్దేశించినట్లు చెప్పుకొన్నారు.

తే.గీ. నీవె మకుటము జెప్పియు నీవె నొరసి
నీకృపావృష్టి రూపమే నీశతకము
జదువ శుభముల కూర్చుమా జనుల కెపుడు
సర్వసుఖదా యహోబిల సార్వభౌమ!

రచయిత్రి ఈశతకాన్ని 1. నృసింహ మంత్రరాజ పద స్తోత్రానికి తెనిగీకరణ, 2. అహోబిల క్షేత్ర ప్రశస్తి, 3. నృసింహావతార గాథ, 4. నవనారసింహ చరిత్ర, 5. శ్రీలక్ష్మీ నృసింహ కల్యాణము అనే భాగాలుగా విభజించారు.

1. నృసింహ మంత్రరాజ పద స్తోత్రానికి తెనిగీకరణ. ఈ విభాగంలో 'ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం' అనే నృసింహ మహా మృత్యుంజయ మంత్రంలోని ప్రతి పదానికి ఒక్కొక్క పద్యంలో వివరణ అందించారు. కొన్ని పద్యాలను చూద్దాము.

తే.గీ. కరకు కోరలు వాడి నఖముల తోడ
"ఉగ్ర"రూపాన గాండ్రించె యుర్వి బెదర!
వెన్నమనసట్లె మరినుండె విశ్వరూప
సర్వసుఖదా యహోబిల సార్వభౌమ!

తే.గీ. సగము నరునిగ సగము కేసరిగ నుండి
రాజఠీవి సటము నలరగ "నృసింహ"!
పదును కోరల పాపాల పరిహరించు
సర్వసుఖదా యహోబిల సార్వభౌమ!

తే.గీ. అంత్యకాలమందున చావుయబ్బు నంత
మృత్యువు మధిం చి గాచెడి "మృత్యుమృత్య"!
భక్తరిపు మర్ధన నిరత వరద రక్ష
సర్వసుఖదా యహోబిల సార్వభౌమ!

నృసింహావతారగాధ అనే విభాగంలో జయవిజయుల శాప వృత్తాంతం మొదలుగా ప్రారంభించి హిరణ్యాక్ష హిరణ్యకశిప జన్మవృత్తాంతం ప్రహ్లాద జననం, విద్యాభ్యాసం, హిరణ్యకశిప ప్రహ్లాద సంవాదం,  నరసింహ ఆవిర్భావం, హిరణ్యకశిప సంహారం మొదలైన పురాణ విశేషాలను మనోహరంగా వర్ణించారు. ఈ విభాగంలోని కొన్ని పద్యాలను చూద్దాము.

తే.గీ. లీల గర్భాన ఉన్నట్టి లేతకందు
భాగవత కథలన్నియు భక్తి వినెను
హరి జపమునె కణకణము యమరు కొనెను
సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ!

తే.గీ. నగువు నాహ్లాద పరచెడు నతని జూచి
పేరు ప్రహ్లాదుడనిబెట్టి పిలచిరపుడు
భక్తి నిలువెల్ల నిండిన బాలుడతడు
సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ!

తే.గీ. కొమరునికి విద్యనేర్పగ కూర్మితోను
పంపెగురుకులమునకు విభవముమీర
తనయుడెదుగ చూసి మురియు తండ్రికాద?
సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ!

తే.గీ. దేవుడే హిర ణ్యకశిపు తీరువెలసె
అని తెలిపెనిరు గురువులే యందరికి
హరియె వేల్పని వాదించె యసురసుతుడు
సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ!

ఇట్లు వాదించు బాలుని తీరు తండ్రికి తెలుపగా ఆ అసురుడు కోపమున కొమరుని పిలిచి నయాన భయాన నచ్చచూపిన చెదరని కొడుకుతో కోపమున ఈస్థంభములో చూపించమని కోపంతో స్థంభాన్ని గదతో మోదగా, అందునుండి

సీ. దిశలను నిప్పులు తెరలుచు తొలుకగ, కలకల మసురుల కలిగె వేగ
జగములు గడగడ జడియుచు వణుకగ, గుండెల మిక్కిలి గుబులు మూగ
ఛటఛట రవముల చయ్యన మ్రోగగ, చెవులను శబ్దము  చీల్చె బాగ
సింగపు గర్జన సేతను బెదరిన, అసురులు పరుగిడి అరుపుతీగ

తే.గీ. కంభమునుజీల్చి అరుదెంచె కమలనాభి
వాడికోరలు తీక్షణ పాణిజముల
ఊగ్రనరసింహ రూపున ఉరములదర
సర్వ సుఖదా అహోబిల సార్వభౌమ!


నరసింహోద్భవము తరువాత నవనరసింహ చరిత్ర, తరువాత చెంచులక్ష్మి కల్యాణము మొదలైన సంఘటనలు వర్ణించబడ్డాయి.

చక్కని సులభమైన భాషలో మనోహరంగా రచింపబడిన ఈశతకము మనలను భక్తిపార్వశ్యంతో  తన్మయులను చేస్తుంది.
మీరూ చదవండి. మీమిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages