గురు శిష్య సంబంధాలు - అచ్చంగా తెలుగు

గురు శిష్య సంబంధాలు

Share This

గురు శిష్య సంబంధాలు

సి.హెచ్.ప్రతాప్

మన వేదాలలో అనేక శాంతి మంత్రాలను పొందుపరిచారు. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి. అటువంటి శాంతి మంత్రాలలో ముఖ్యమైన ఒక శాంతి మంత్రాన్ని ఇప్పుడు మననం చేసుకుందాం.

ముక్తికోపనిషత్తు పేర్కొన్న ఉపనిషత్తులలో కేనోపనిషత్తు రెండవది. కేన అనగా ఎవరు ? అని అర్ధము. భగవానుడు ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది .

"కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తుకు రెండు శాంతి మంత్రాలున్నాయి. గురుశిష్యులిరువురూ ఏకకాలంలో పఠిస్తారు.

శ్లో:: ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

ఇది లోక ప్రాచుర్యం పొందిన గొప్ప శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రాన్ని అర్ధం చేసుకొని, మనసా వాచా  అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది.
ఈ శ్లోకానికి అర్ధం ఏమిటంటే ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. అతడు మనల నిరువురను పోషించుగాక.  మనము గొప్ప శక్తి తో కలసి పని చేయుదుముగాక. అధ్యయనము చే మనమిరువురమును మేథా సంపదను పొందుదుము గాక!
 మనమితరులను ద్వేషింపకుందుము గాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.  

ఇది గురు, శిష్యులు ఇద్దరికి సంబందించిన శాంతి మంత్రం. గురు శిష్య పరంపరలో ఇరువురి మధ్య గాఢమైన సంబంధ బాంధవ్యాల్య్ ఏర్పడితే శిష్యుడు గురువును నహర్నిశలు సేవించి తద్వారా బ్రహ్మ జ్ఞానం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ  శ్లోకం  నిరంతరం పఠిస్తూ, మననం చేసుకుంటే శిషునికి తెలివి తేటలు పెరుగుతాయి.బ్రహ్మ జ్ఞానం వృద్ధి పొందుతుంది. ఆ తెలివితో శాంతిని పెంచాలి. శిష్యులందరు గురువుతో ఒక్కరితో ఒక్కరు ప్రేమగా, స్నేహంగా ఉండాలి.  ఏ ఒక్కరికి ద్వేషం, కోపం, ఉండకూడదు శాంతిని కలిగి ఉండాలి.  ఇవన్నీ మనకు పరమేశ్వరుడు ఇవ్వాలి." అని దేవుడిని పై శ్లోకం ద్వారా ప్రార్థన చేస్తున్నారు.

కలసి వుంటాము, కలసి భుజిస్తాము కలసి పనిచేసి శక్తిని - ధైర్యాన్ని సృష్టిద్దాము.  కలసి ధ్యానము చేసి తేజస్సును అంటే వెలుగును సృష్టించు కుందాము. వీటి ద్వారా అందరు శాంతి పొందుదాము.నెటి ఆధునిక మేనేజ్మెంట్ థియరీ ప్రకారం దీనినే టీం వర్క్ అంటారు అంటే సమిష్టి కృషి. ఈ సిద్ధాంతాన్ని మన మహర్షులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన విద్యావిధానంలో ఏర్పరిచారు. ఇదే మన హైందవ సంప్రదాయం, ధర్మం యొక్క గొప్పదనం.

ఎక్కడ ఐకమత్యముందో అక్కడ దైవత్వం ఉంటుంది. ఐకమత్యము లేకపోతే చేతి వేళ్ళు ఒక్కొక్కటి ఏమి చేయవు.  చలి చీమలు కలసికట్టుగా పామునైనా చంపగలవు అని మనం పంచతంత్ర కధలలో తెలుసుకున్నాం. గడ్డి పూచలు కలసి తాడు చేస్తే ఏనుగునయినా బందించగలవు. ఐక్యమత్యం మహాబలం, కలసి ఉండడం వలన ప్రేమ సౌభ్రాత్రత్వం, శాంతి,సామరస్యము కలుగుతాయి. ఈ సిద్ధాంతాన్నే పై శాంతి మంత్రం ఉటంకిస్తోంది. పరబ్రహ్మ జ్ఞానం పొందాలంటే సమర్ధుడైన గురువు పర్య వేక్షణలో అధ్యయనం- మననం- విచారణలు తెలుస్తాయి.

జ్ఞానం అమృతత్వానికి గొనిపోతుంది. జ్ఞానం- ధ్యానం రెండూ పరబ్రహ్మ తత్త్వానికి ఆలంబన అంటూ ఈ విశ్వమే పరబ్రహ్మ తత్త్వ జ్ఞానానికి జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చుకుని మనసు ను పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది.

No comments:

Post a Comment

Pages