దైవమొక్కడే సంతత భజనీయుడు - అచ్చంగా తెలుగు

దైవమొక్కడే సంతత భజనీయుడు

Share This

 దైవమొక్కడే సంతత భజనీయుడు

డా. తాడేపల్లి పతంజలి 





రేకు: 0353-03  సం: 04-311

పల్లవి: 

దైవమొక్కడే సంతత భజనీయుడు

భావము సమబుద్ధి బాయగదగదు

చ.1: 

హరియే నకలాంతరాత్మకుడటుగాన

తిరమై యొకరి నిందింపదగదు

అరయగ లోకములనిత్య మటుగాన

మరిగి కొందరిమీది మమతయు వలదు

చ.2:

బహుకల్పితములెల్ల బ్రకృతిమూలమే కాన

గహనపుదన వుద్యోగము వలదు

సహజవిహారుడు సర్వేశ్వరుడుగాన

వహిదానేవచ్చినవి వలదనదగదు

చ.3: 

తపములు జపములు దాస్యమూలమె కాన

వుపమల సందేహమొగి వలదు

యెపుడును శ్రీవేంకటేశ్వరు సేవించి

చపలచిత్తమువారి సంగమిక వలదు

భావం

పల్లవి:

ఎప్పుడూ జీవులకు పూజనీయుడు  భగవంతుడొక్కడే. స్వామి అంతటా ఉన్నాడు కనుక అందరూ సమానమే.  సమదృష్టిని వీడరాదు.

 చ.1:

అందరికి  అంతరాత్మగా ఉన్నవాడు శ్రీహరియే.

కనుక ఒకరిని ఎప్పుడూ నిందించ కూడదు.

ఈలోకములన్ని అశాశ్వతములు.

ఎవ్వరును మనలను అంటిపెట్టుకొని ఎప్పుడూ ఉండరు. కనుక కొందరిపై మమకారము కూడా పద్ధతి కాదు.

చ.2:

ఈ ప్రకృతినుండి చిత్రవిచిత్రములైన అనేక కల్పనలు వచ్చుచున్నవి.

అంతేకాని జీవులు తమకు తాముగా ప్రయత్నించి సాధించేదేమియు లేదు.కనుక అటువంటి ప్రయత్నము చేయకూడదు.

ఆ పరమాత్మ  సహజ లీలలందు ఆసక్తి కలిగినవాడు  -కాబట్టి

ఆ స్వామి సంకల్పముతో  తమకు తాముగా వచ్చినవాటిని కాదనకూడదు.

చ.3:

తపములుజపములు మొదలయినవి దేవుని దాస్యమూలములు. ( కనుక దాస్య భావము వీడరాదని భావం)

ఆ తపస్సు మొదలైన  సాధనలకు జెందిన ఉపాయముల పట్ల సందేహపడగూడదు.

ఎప్పుడూ  శ్రీవేంకటేశ్వరునే సేవించుచున్నవారికిదేవుని సేవించని చపల బుద్ధులతో ఎటువంటి  సంబంధము పెట్టుకోకూడదు.

No comments:

Post a Comment

Pages