నరులార నేడువో నారసింహజయంతి - అచ్చంగా తెలుగు

నరులార నేడువో నారసింహజయంతి

Share This

నరులార నేడువో నారసింహజయంతి

డా.తాడేపల్లి పతంజలి 




పల్లవి: 

నరులార నేడువో నారసింహజయంతి

సురలకు నానందమై శుభములొసగెను


చ.1: 

సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -

మందు సంధ్యాకాలమున నౌభళేశుడు

పొందుగాగంభములోనబొడమి కడపమీద

కందువ గోళ్ళజించెగనక కశిపుని


చ.2: 

నరమృగ నానాహస్తముల

అరిది శంఖచక్రాది ఆయుధాలతో

గరిమబ్రహ్లాదునిగాచిరక్షించి నిలిచె

గురుతర బ్రహ్మాండ గుహలోనను


చ.3: 

కాంచనపు గద్దె మీద గక్కనగొలువై యుండి

మించుగ నిందిర దొడమీద బెట్టుక

అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై

వంచనసేయక మంచివరాలిచ్చీనదివో


భావం

పల్లవి:

నరులారా !  నేడు నరసింహజయంతి.( వైశాఖ శుక్ల చతుర్దశి)

దేవతలకు ఆనందాన్ని ఇస్తూ ఈ  నరసింహజయంతి శుభములు ప్రసాదిస్తోంది.


చ.1:

వైశాఖ శుద్ద చతుర్దశి శనివారమునాడు  సంధ్యాకాలమున అహోబలక్షేత్రంలో వెలసిననరసింహస్వామి స్తంభములోన పుట్టి గడపమీద  సామర్థ్యముతో హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చాడు.


చ.2:

మానవుడుసింహమురూపములతో కలిసిఅనేక హస్తములతోఅరుదైన శంఖము,చక్రము మొదలైన ఆయుధాలతోగొప్పగా ప్రహ్లాదుని రక్షించినేడు అహోబలంలో గొప్పదైన  బ్రహ్మాండమను  గుహలోన నిలిచాడు.


చ.3:

ఇందిరను (లక్ష్మీదేవిని) తొడమీద పెట్టుకొని  ప్రకాశిస్తూ. నరసింహస్వామి  బంగారపు  గద్దె మీద కొలువై ఉన్నాడు.

వరుసగా తర్వాత అవతారాలలో  శ్రీవేంకటగిరిలో  శ్రీ వేంకటేశునిగా తొలిమూర్తిఆదిదైవముగా ,ఎవరినీ మోసము చేయక ( కోరినవారికి కోరినట్లుగా అనుగ్రహిస్తూ)  మంచివరాలను నరసింహ స్వామి ఇస్తున్నాడు. అదిగో.చూడండి. 

(రేకు: 0353-02  సం: 04-310)

No comments:

Post a Comment

Pages