మానసవీణ – 48 - అచ్చంగా తెలుగు

మానసవీణ – 48

 కిషన్


ప్రపంచపు అసలు రంగులు చూపించడానికి బాల భానుడు ఉద్యుక్తమవుతున్నాడు... 

కళ్ళు తెరిచిన వెంటనే కనపడాల్సిన ఆవు-దూడ బొమ్మ లేదు. ఏదో మోడరన్ ఆర్ట్. 

          మానస నిదానంగా ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడుతోంది. 

          ‘ఇంటికి చేరాక బద్ధకం మొదలయ్యిందా’?! అయిందింటికే యోగాధ్యానాలతో మొదలయ్యే దినచర్య, నిదానంగా మెత్తటి పరుపులకి అలవాటు పడుతోందా?!! అమ్మ నన్ను మరీ చంటి పిల్లలా చూస్తుంది. నా అంతట నేను లేచేవరకు నిద్ర లేపదు.’ అనుకుంటూ చిరునవ్వుతో బెడ్ దిగుతున్న మానస ఫోన్ రింగయ్యింది. 

        ఇంతపొద్దున్నే ఎవరా? అనుకుంటూ చూస్తే, దినేష్... 

       "నమస్తే సార్... ఇంత పొద్దున్నే..." మాట్లాడబోతున్న మానస మాటలకి అడ్డం పడుతూ... 

       “ఏంలేదు మానసా... మన గూడెం పక్క అడవిలో ఎనిమిది మంది దళ కమాండర్లు ఈరాత్రికి కలుస్తున్నట్టు ఇంటలిజెన్స్ సమాచారం. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే, మొత్తం ఈ ప్రాంతం అంతా ‘క్లీన్’ అయిపోతుంది. చాలా రహస్య సమాచారం. ఈ ప్రయాణంలో తిరిగిరాకపోతే, ఇదే నా ఆఖరి ఫోన్. అనాధగా ఎన్నో అనుభవాలతో నేను అనుకున్న స్థానం చేరాక, ఎంతో సంతృప్తిగా ఉంది. మానసా... నీతో షేర్ చేసుకోవాలనిపించింది. పట్టుదల కోల్పోకు మనసా... గెలుపు ఇచ్ఛే కిక్కు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆగకు. ఒక ఊరిని, ఒక ప్రాంతాన్ని, కనీసం ఒక మనిషిని మార్చినా సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది. 

మనం చెడు మొత్తాన్ని నిర్మూలించక్కర్లేదు. మంచిని పెంచుకుంటూ పోయినా, చెడు చిన్నదయిపోతుంది. సరే... అంతా సవ్యంగా జరిగితే మళ్ళీ కలుస్తాను. రహస్యం అని చెప్పానుగా, జాగ్రత్త. బై” కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు. 

       ఒక్కసారి అయోమయంగా అనిపించి, వెంటనే తిరిగి అదే నంబర్ కి డయల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. 

                                                               * * *

ఎంతో సున్నితమైన సమాచారం తనకెందుకు చెప్పారు ? ఇప్పుడేం చెయ్యాలి ? ఆలోచనల ప్రవాహంతో అయోమయంగా అనిపించింది. దినేష్ సరిగ్గా ఊహించే ఈ విషయం మానస కి చెప్పారు. దినేష్ విసిరిన రాయి సరిగ్గా లక్ష్యానికి తగిలింది. మరో గంటలో మానస గూడెంలో ఉంది. ఎవ్వరికీ చెప్పలేదు. జగ్గయ్య ఇంటికి చేరింది. 

        జోగులమ్మతో, చాలా తక్కువ స్వరంతో... "రాజు ని చాలా త్వరగా పిలవాలి అవ్వా. చాలా ముఖ్యం. నన్నే ప్రశ్నలూ అడక్కుండా, పిలిపించు” అంది మానస. "ఆడెక్కడ తిరుగుతాడో, ఎక్కడుంటాడో, ఎప్పుడొత్తడో నాకేటీ తెలీదమ్మా" భయం కలిసిన స్వరంతో, "ఏదైనా ప్రమాదమా తల్లీ"?!! అడిగింది జోగులమ్మ.

       “నన్నేం అడగద్దన్నానా, నువ్వు పిలిపించగలవని నాకు తెలుసు. తాతకయినా తెలియకపోవచ్చు గానీ, నీకు మాత్రం తెలిసి తీరుతుంది. చాలా ముఖ్యం అవ్వా” ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది మానస. తనలో తాను గొణుక్కుంటూ ఆందోళనతో ఇంటి వెనుక దారిలోంచి బయటకు వెళ్ళింది జోగులమ్మ. 

ఒక నిశ్చయానికి వచ్చినదానిలా ఆలోచిస్తూ ఎదురు చూస్తోంది మానస. 

'నిజమే మంచి పెంచుకుంటూ పోతే చాలు, చెడు కి చుక్క నీరు కూడా పుట్టదు. ఏమీ చేయలేనని తెలిసి తలవంచుకుని నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది.’ 

ఒక సారి తాతయ్య భూషణం కళ్ళముందు మెదిలాడు. ఆలోచన లేకుండా కుసంస్కారంతో ఎన్ని తప్పులు చేయడానికైనా వెనుకాడని భూషణం, ఇప్పుడున్న పరిస్థితి! మంచి ముందు చెడు ఎప్పటికీ ఓడిపోవాల్సిందేనని చెప్తున్నట్టుగా ఉంది. కారణం ఆత్మశోధనో, పశ్చాత్తాపమో... ప్రేమో... ఏదైనా కావచ్చు. 

ఆలోచనల్లో ఉండగానే జోగులమ్మ వగరుస్తూ వచ్చింది. "కొంచెం అలీసం అయ్యేలా ఉందమ్మా, కానీ తప్పకుండా వస్తాడు. కనీసం గంటన్నా పట్టుద్దమ్మా". “ఇంతకీ విషయం చెప్పొచ్చుగా తల్లీ”... అనునయంగా బుజ్జగిస్తూ అడిగింది అవ్వ. ఏం వినిపించుకోనట్టు, "తాతా మనం వెంటనే ఇక్కణ్ణించి పట్నానికి వెళ్ళిపోవాలి. జిటిఆర్ సార్ ఇంటికి. దయచేసి ఆ ఏర్పాట్లు చూడు" చెప్పింది మానస.

       ఏదో జరగబోతోందని అర్ధం అయ్యింది జగ్గన్నకి ... వెంటనే గడ్డి, కుంకుళ్ళు, చింతపండు ఇలాటివన్నీ మార్కెట్ కి తీసుకెళ్లే ట్రాక్టరు తెప్పించి సరుకు లోడ్ చేయించేశాడు. సరుకుతో పాటే ఎవ్వరి దృష్టీ పడకుండా ఊరు చేరి, ఆటోలోకి మారి జిటిఆర్ ఇంటికి చేరిపోయారు. 

       ఎవ్వరికీ ఏమీ అర్ధం కావడం లేదు. మానస ఎవ్వరితోనూ మాట్లాడకుండా అనిరుధ్ ని తీసుకుని జిటిఆర్ ఆఫీస్ రూమ్ లో, అంకుల్ తో మాట్లాడి బయటకి వచ్చింది. 

                                                                 * * *

       చాలా అసహనంగా ఉన్నాడు రాజా. ఇవ్వాళ అతని కలలు నిజమయ్యే రోజు, పెద్ద కమాండర్ లని కలవబోతున్నాడు. ఎలాగో ఒకలా సాయంత్రానికల్లా అడవికి చేరాలి. ‘అసలిదంతా ఇక్కడ ఏం జరుగుతోంది?’ అసహనం అంతకంతకీ పెరిగిపోతోంది. ఇంతలో మానస ఆఫీస్ రూమ్ లోంచి బయటకు వచ్చింది. “రాజాగారూ దయచేసి మరోలా భావించకండి. మనం ఈ రాత్రికే గవర్నర్ ని కలవబోతున్నాం. ఆ అప్పోయింట్మెంట్ ఏర్పాట్లూ అవీ అంకుల్ చూస్తారు” ఇంకా ఎదో చెప్పబోతున్న మానస రాజా ముఖంలో మారుతున్న భావాలు చూసి ఆగిపోయింది. 

       “ఏమనుకుంటున్నారు మీ గురించి?, పోనీ మా గురించి ఏం అనుకుంటున్నారు? అంత ఆలోచన లేనివాళ్ళల్లా కనిపిస్తున్నామా... ఎందరో మేధావులు, సిద్ధాంత కర్తలూ, భవిష్యత్తు నిర్మాతలూ ఉన్నారండీ, జీవితాలు త్యాగం చేసి, ప్రాణాలు పణంగా పెట్టి, బడుగు వర్గాల బాగుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. మావాదం అంత తేలిగ్గా తయారవలేదండీ. మా పోరాటం మీదా, మా సిద్ధాంతం మీదా మాకో క్లారిటీ ఉంది... తీరిగ్గా మరోసారి చెప్తాను. ప్రస్తుతానికి నా మానాన నన్ను వెళ్లనివ్వండి. చాలా అత్యవసరమైన మీటింగ్ ఉంది నాకు. అసలు ఇంతవరకూ కూడా రాకూడదు నేను. అమ్మ చెప్పిందనీ, అయ్య ఖంగారూ చూసి సమయం ఉంది కదా అని మీతో వచ్చాను”. ఒకింత అసహనాన్నీ ఆవేశాన్నీ అదుపుచేసుకుంటూ అన్నాడు రాజా. ఊహించినదే అయినా కొంచెం తొట్రుపాటుకు లోనయ్యింది మానస. అందరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు, ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని ఉద్విగ్నంగా ఉన్నారు. 

       “నిజమే రాజు గారూ.. అమ్మ ఎలా ఉంటుందో, కుటుంబం ఏదో తెలీకుండా ఆశ్రమంలో ఊహ తెలిసిన నేను, ఎవ్వరికీ అక్కర్లేకుండా ఎందుకు నన్నిలా పడేశారా అని ఏడుస్తూ ఉండేదాన్ని. ఈ సమాజం మీద ఎంతో కసి, కోపం, ద్వేషంతో ఒంటరిగా నాలో నేనే రగిలిపోయేదాన్ని. కానీ నేనిలా ఉండటానికి కారణం తెలుసా రాజుగారూ? నాచుట్టూ ఉన్న మంచితనం. జిటిర్ అంకుల్, కృషీవలరావు గారు, వారి కుటుంబం, నేను వారికి రక్తం పంచుకు పుట్టిన సంగతి తెలీనప్పుడు కూడా, నాతల్లీ తండ్రీ, నా లెక్చరర్స్, నా సహచరులూ అందరూ మంచినే పంచారండీ. నా చుట్టూ వెల్లువలా వచ్చిన మంచితనం మానవత్వం, నా మార్గం మార్చేశాయి. అందుకే నాకు ఈ సమాజం మీద ప్రేమే. అక్కడక్కడా చెడు తారసపడుతుందండీ... అలాగని ఉన్న మంచిని పాడుచేసుకోలేం కదండీ. మీ ఆశయాలనే మీరు మరో దార్లో కూడా సాధించచ్చు. ఎంతో సురక్షితంగా… రాజమార్గంలో. మంచి సమాజం నిర్మించాలనే మీ ప్రయత్నం మంచిని పెంచడంతోనే సాధ్యం అని నా ఉద్దేశం. 

అందుకే మిమ్మల్ని గవర్నర్ తో సమావేశ పరచి ఒక మాస్టర్ ప్లాన్ అమలుకు ఆమోదం తీసుకోవాలన్నది నా ఆలోచన. మీరు కొంత సమయం ఆలోచించుకోండి. నా ఆలోచన నచ్చక పోతే ఇక మీ ఇష్టానికి ఎవ్వరూ అడ్డు రారు. ఒక్కటే నా విన్నపం... మీకు నా ప్రతిపాదన నచ్చక పోతే, కనీసం రేపు ఉందయం వరకూ ఆగండి. కొన్ని ఉపద్రవాల్ని, మీ తల్లి తండ్రులకి పుత్రశోకాన్ని తప్పించచ్ఛు” స్థిరంగా చెప్పింది మానస. జోగయ్య, జోగులమ్మ అవాక్కయ్యారు. తల్లి మనసు విలవిలలాడుతోంది. జగ్గయ్య చాలా గంభీరంగా ఉన్నాడు. 

       "చిన్న దానివైనా నీకు చేతులెత్తి దణ్ణం పెట్టాలి తల్లీ. నిన్ను చూస్తుంటే నాకు మాఅడివి తల్లే అనిపిస్తావు. పాపం మా అడవీ అంతే, తనకోసం ఏమీ దాచుకోదు. ఎప్పుడూ, ఎవరు, ఏమి తీసుకుపోతున్నారా అని ఆలోచించదు, అంతకి అంతా ఇస్తూనే ఉంటుంది. తుఫానులూ ఉప్పెనలూ కూడా ఏం చెయ్యలేవు మా అడవి తల్లిని. సప్పుడు లేకుండా ఎన్నో జీవాలకు ఆశ్రయం ఇస్తుంది. చీడలూ, పురుగు పుట్రా, ఈ మనుషులు నాటిన మొక్కలకీ, పంటలకే నమ్మా, ఆ అడవికి ఏ మందూ అక్కర్లేదు. పై పెచ్చు ఎన్నో మందుల్నీ ఇస్తుంది తల్లీ. నిజంగా నీ ఆలోచన చాలా గొప్పది తల్లీ. ఇంక రాజు గాడు ఇంటాడా లేదా ఆడి ఖర్మా, మాఖర్మా తల్లీ. ఎంతో భారంగా చెప్తున్నాడు జగ్గన్న. 

అడవినీ, జీవితాన్నీ కాచి వడపోసినట్టున్న అతని మాటల తూటాలకి శబ్దం చచ్చి పోయి, నిశ్శబ్దం రాజ్యమేలింది. 

తెల్లారి పత్రికల్లో వచ్చిన పతాక శీర్షిక "మన్యంలో ఏడుగురు దళ కమాండర్లు పట్టుపడ్డార"ని, చదివి మానస మనసులో దినేష్ గారికి వెయ్యి దణ్ణాలు పెట్టుకుంది. ఇదంతా ఈమెకి ఎలా తెలుసో అడిగే సాహసం ఎవరూ చెయ్యలేదు కూడా. తరువాత జరగాల్సిన వన్నీ చాలా వేగంగా జరిగిపోయినాయి. గవర్నర్ సమక్షంలో రాజా లొంగుబాటుకు మీటింగ్ జరిగింది.


No comments:

Post a Comment

Pages