అనసూయ ఆరాటం - 26 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 26

చెన్నూరి సుదర్శన్ 


ఆ మాటలింటాంటే.. తను బాధ పడ్తాందనిపిచ్చింది.. రవీందర్‌కు. ఫ్రెషప్పై వస్తూనే “రజితా.. ఏమైంది. నారాజుగున్నవ్.. “అన్కుంట గిఫ్ట్ ప్యాక్ దిక్కు సూసిండు. “సుస్మి ఇచ్చిందా.. ఏంటిది.. ఇప్పలేదేంది”

ఠక్కున రవీందర్ చేతిలున్న పాకెట్టు తీసి సుస్మిత కమ్ర దిక్కు ఇసిరేసింది” 

రవీందర్ బీర్పోయిండు.

“ఏమైంది రజితా.. ఎవలేమన్నరు..”

“నీ బిడ్డనడుగు” అని సోఫాల కూలపడ్డది. 

“సుస్మీ..” అని ఎంతో గారువంగ పిల్సిండు రవీందర్.

“గట్ల గారువం సేసే నెత్తికెక్కిచ్చుకున్నం. నువ్వన్నది 

నిజమే రవీ.. సుస్మి మన చెయ్యి జారిపోకముందే కాపాడుకోవాలి” అని పొద్దున తాను సూసిందంతా చెప్పింది.

ఇంతల సుస్మిత వచ్చి భయం.. భయంగ వచ్చి కూకున్నది.

రవీందర్‌కు చాయె తెద్దామని రజిత వంటింట్లకు పోయింది.  సుస్మితకెదురుంగ సోఫాల కూకున్నడు రవీంద్ర.

“సుస్మీ.. మా పానాలన్ని మీ మీదనే తల్లీ.. అన్నయ్య సూడు సక్కంగ సదువుకొని అమెరికా పోయిండు. అక్కడ్నే ఇప్పుడు నౌకరి సుత చేత్తాండు. మాకెంత సంబురంగన్నదో.. మాటల్ల చెప్పలేను. వాన్ని పెళ్ళి చేసుకోరా.. అంటే చెల్లె పెండ్లైనంకనే నేను సేసుకుంట అంటాండు. నీ పెండ్లికి ఇంకా శాన టైమున్నదన్నా ఇంటలేడు” 

రజిత  మంచినీల్లు.. చాయె తెచ్చిచ్చింది. 

చాయె తాక్కుంట సుస్మిత మొక కవళికలను గమనించసాగిండు రవీందర్. రజిత దిక్కు సూసిండు. ఊ.. కానియ్యి అన్నట్టు తల్కాయె ఊపింది రజిత.

చాయె తాగుడు కాంగనే మల్ల సెప్పుడు షురు సేసిండు.

“డాక్టరు సదువు ఎంతో పవిత్రమైంది.  డాక్టర్లు దేవుని తరువాత  దేవుడంతటోల్లని జనమంతా పూజిత్తాంటరు. నువ్వింకా మూడో సంవత్సరమే సదువుతానవ్. ఇంకా రెండేండ్లు సదువాలె.. హౌజ్ సర్జన్ పూర్తి చెయ్యాలె.. అప్పుడు గాని డాక్టరువు గావు. 

కాని నువ్వు చేస్తున్న పని.. మాకు నచ్చలేదు. చదువు మీద శ్రధ్ధ చూపించకుండా.. నిరంజన్‌తో తిరగడం మంచి పధ్ధతి కాదు. ప్రేమలు.. పెళ్ళిల్లు తప్పనడం లేదు. కాని ఇది నీకు సమయం కాదంటున్నాం. నిరంజన్ మన కులం వాడు కాదు. పోనియ్యి.. కులవృత్తులు కనుమరుగైనంక కులాలెవలూ పట్టిచ్చుకుంటలేరు. కులం సంగతి ఇడ్సి పెడ్దాం. నిరంజన్ సదువేది బి.కాం. జెనెరల్‌గా ఒక డాక్టరు మరొక డాక్టరును పెండ్లి సేసుకుంటనే బాగుంటదని మా అలోసన. ఇద్దరు కలిసి దవాఖాన పెట్టుకోవచ్చు. జీవితం శాన బాగుంటది.. 

సరే.. అన్నీ ఒక నిముసం వదిలేద్దాం. ముఖ్యంగా నేను చెప్పేదేందంటే.. ప్రస్తుతం నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు డాక్టరువైనంక.. నీ నిర్ణయమే..  మా నిర్ణయం. నేను చెప్పేదంత చెప్పిన ఇంక నీ ఇట్టం” అంటాంటే రవీందర్ కండ్లు తడైనై. 

సుస్మిత సూసి గాబర పడ్డది. “నాయ్నా.. నేను నీ మాట కాదన.. సక్కంగ సదువుకుంట” అని ఒక్క మాటతోనే నమ్మబలికింది. “కాని ఎప్పటికైనా నిరంజన్నే పెండ్లి సేసుకుంట” అని కరాఖండిగ సెప్పింది. ఖంగుతిన్నడు రవీందర్.

వెంటనే “సరే నీ ఇట్టం. మాకు కావాల్సింది నువ్వు డాక్టరు  కావాలి. పెండ్లి సంగతి తరువాత సూద్దాం” అన్నడు. 

“సుస్మీ నీ పుట్టిన రోజు వచ్చే వారమే కదా.. విజయవాడ కనకదుర్గమ్మ తానకు పోయి దర్శనం చేసుకొని వద్దాం. అట్లనే నీ సదువుకు అడ్డంకులు రావద్దని మొక్కుకుంట” అన్నది రజిత.

“నిజమే రజితా.. నేను చెప్పడు మర్సిపోయిన. నన్ను విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీకి పొమ్మన్నరు. మా కంపిని మీటర్ల ప్రచారం చెయ్యాలే.. అదీ వచ్చే వారమే..” మంచిగ కలిసచ్చిందని అందరు సంబుర పడ్డరు.

సుస్మిత పుట్టిన రోజు కంటే ఒక రోజు ముందే అంతా కలిసి విజయవాడకు కార్ల పోయిండ్లు. విజయవాడల మంచి పేరున్న ఓటల్ల దిగిండ్లు. డబల్ బెడ్‌రూం కమ్ర తీసుకున్నరు. నాత్రికి తిని ఆరాంగ పండుకున్నరు. 

తెల్లారంగ చార్ బజే లేసి తానాలు సేసి తయారై కన్కదుర్గమ్మ గుడికి పోయిండ్లు. 

సక్కంగ సదువుకుంటనని.. పెండ్లి మాట ఇప్పుడే ఎత్తనని సుస్మిత తోని పమానం సేయించింది రజిత. నువ్వు అనేది నాకినరావాలని పట్టుబట్టింది. సుస్మిత రజిత సెప్పినట్టుగనే సేసింది. 

గుడినుండి ఓటలుకు వచ్చినంక టిఫిన్ సేసి రవీందర్ 

ఇంజనీరింగు కాలేజీకి పొయిండు. సాయత్రం వచ్చినంక అందరం కలిసి నిమాయిషికి పోదామన్నడు. హైద్రాబాదు లెక్కనే యాడాదికోపాలి విజయవాడల నిమాయిషి జరుగుతాంటది. 

పగలు బువ్వ తిన్నంక తల్లీ.. బిడ్డలు  ఒక కునుకు తీసిండ్లు.

పొద్దుమూకి నాలుగింటికి లేసి సుస్మిత తానం సేసచ్చినంక తను సుత సేత్తనని హమాంఖాన్లకు పోయింది రజిత. 

“అమ్మా .. నేను కిందకు పోయి ఉంట.. నువ్వు తాన సేసి తయ్యరై రా..” అన్కుంట బయట పడ్తాంటే.. “ఆగు ఇద్దరం కలిసే పోదాం” అనే రజిత మాటలు ఇనకుంటనే.. కిందికని తంతెలెక్కుకుంట పైకి పోయింది.

రజిత తానం సేసి బైటికి రాంగనే అందరు ఉర్కుతాన సప్పుడు కాబట్టింది. తొందరగ చీరకట్టుకొని కమ్ర బయటికి వచ్చి ఏమైందని. ఒకల నడిగింది. 

“ఎవలో కింద పడ్డరు” అని ఆగకుంటనే తంతెలు దిగబట్టిండు. 

రజిత పానం ఝల్లుమన్నది. సుస్మిత కావద్దు.. దేవుడా.. అని మన్సులమొక్కుకుంట కాళ్ళు వన్కుతాంటే కిందికి దిగింది. గుమి గూడిన మందిని తప్పిచ్చుకుంట సూసే టాల్లకు రవీందర్ ఒల్లె సుస్మిత.. కండ్లకు సీకటచ్చినై.. సొలిగి బిడ్డ కాల్ల మీద పడ్డది రజిత.

ఓటల్ మీదికెల్లి దునికి సుస్మిత అనే అమ్మాయి ఆత్మహత్య సేసుకున్నదని జెమిని టీ.వీ. ఇస్క్రోలింగ్ వత్తాంది. 

హైద్రాబాదుల నిరంజన్ సూసి తట్టుకోలేక పోయిండు. వాల్ల నాయ్న సర్కార్ పిత్తోలు తీసుకొని కాల్సుకొని ఆత్మహత్య సేసుకున్నడు. 

అదే వార్త పేపర్లు ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..’ టాం.. టాం.. సేసినై.

ఆనాత్రి పోస్ట్‌మార్టం సేసి పీనుగనప్పజెప్పేటాల్లకు రెండయ్యింది. ఇంటికచ్చేటాల్లకు తెల్లారి ఆరయ్యింది.

(సశేషం)

No comments:

Post a Comment

Pages