మహర్షిణి "మదాలస" - అచ్చంగా తెలుగు

మహర్షిణి "మదాలస"

అంబడిపూడి శ్యామసుందర రావు 




ప్రాచీన కాలానికి చెందిన ప్రసిద్ధ బ్రహ్మవాదిని, మహర్షిణి మదాలస. విశ్వావసుడు అనే గంధర్వ రాజు కూతురు, అతిలోక సుందరి. మదాలస ఈవిడ హిందూ ధర్మము లో ఒక పురాణ  సంబంధమైన తల్లి, ఎందుకంటే తన సంతానాన్ని జ్ఞాన మార్గంలో నడిపించిన  వ్యక్తి ఈవిడ. ఆదర్శవంతమైన భార్యగా తల్లిగా, వేదాంతపరమైన విషయాలలో,చర్యలలో  ఆరితేరిన వ్యక్తిగా  ప్రసిద్ధి చెందింది. పాతాళ కేతుడు అనే రాక్షసుడు ఆమె అందాన్ని చూసి మోహించి ఆమెను బలవంతంగా ఎత్తుకొని పోయి, తన గుహలో బంధిస్తాడు. ఆ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక చనిపోదామనుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది.

ఆ సమయంలో సురభి అనే దేవత ప్రత్యక్షమై ఆత్మహత్య ప్రయత్నం నుంచి వారించి రాక్షసుని చంపడానికి వచ్చే రాకుమారుడే నీకు భర్త అవుతాడని చెప్పి అంతర్ధానం అవుతుంది. ఈ ఓదార్పు మాటలు మదాలస లో ధైర్యాన్ని సహనాన్ని నింపడంతో రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత గోమతి నది తీరంలోని ఒక రాజ్యానికి రాజైన కువలయాశ్వుడు వరాహ రూపంలో ఉన్న రాక్షసుడిని సంహరించడానికి గుహలోకి వస్తాడు.ఈ రాక్షసుడు గాలవ్య ముని ఆశ్రమం లోకి ప్రవేశించి అక్కడ ఉన్న అమోఘమైన అశ్వాన్ని అపహరించి పాతాళలోకానికి వెళతాడు. ఆ అశ్వాన్ని విడిపించటానికి వరాహ రూపంలో ఉన్న రాక్షసుని వెంట పాతాళ గుహలో ప్రవేశిస్తాడు రాజు. ఆ పాతాళ  గుహలో ఉన్న మదాలస, ఆమె చెలికత్తె అయిన కుండలను చూసి ఆశ్చర్య పోతాడు. మదాలస, కువలయాశ్వుడు ప్రేమలో పడతారు. కువలయాశ్వుడు అ రాక్షసుడైన పాతాళ కేతుని సంహరించి మదాలస ను గాంధర్వ వివాహం చేసుకొని తన రాజ్యానికి తీసుకుని వెళ్లి వివాహం చేసుకొని తన తండ్రి మరణానంతరం రాజై రాజ్యపాలన చేస్తూ, భార్యతో సుఖజీవనము  సాగిస్తాడు.

కొంతకాలానికి కువలయాశ్వుడు దేశ సంచారము చేస్తున్నప్పుడు చనిపోయిన రాక్షసుని ఆత్మ ముని రూపంలో వచ్చి,  రాజు చనిపోయాడు అని  తన మాయ మాటలకు ఆధారముగా మాయా హారాన్ని రాజు ధరించినదే  అని చెప్పి, ఇచ్చి మదాలస కు ఇస్తాడు. మాయ ముని మాటలు నమ్మి మోసపోయిన మదాలస ప్రాణ త్యాగము చేస్తుంది.

తిరిగి వచ్చిన రాజు విషయం తెలుసుకొని వైరాగ్యాన్ని పొందుతాడు. రాజు పరిస్థితి చూసిన యశ్వతరుడు అనే నాగరాజు దీర్ఘ తపస్సు చేసి మదాలసను సజీవురాలిగా చేసి రాజుకు అప్పగిస్తాడు. రాజు, మదాలసతో సుఖ శాంతులతో జీవిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ రాజ్యపాలన చేస్తాడు. ఈ దంపతులకు విక్రాంతుడు, సుబాహువు,శతుమర్ధనుడు,అలర్కుడు అనపడే నలుగురు కుమారులు జన్మించారు. రాజే మొదటి ముగ్గురి పేర్లను నిర్ణయిస్తాడు. మదాలస విక్రాంతుడు పుట్టినప్పుడు మామూలు జోల పాటలు పాడకుండా వేదాంత ధోరణిలో పాటలు పాడుతూ ఆధ్యాత్మికతను పెంపొందించేది. అలాగే మిగిలిన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా వారిని వేదాంత మార్గములోనే నడిపించింది.

ఆ ముగ్గురు కుమారులు వారి పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుసరించి ఋషి జీవనాన్ని ఎన్నుకొని, ఆ రకముగా జీవనము గడుపుతుంటారు. మదాలస కుమారులకు ధర్మములను,బ్రహ్మజ్ఞానమును బోధించి మంచి మార్గంలో మొదటి ముగ్గురినీ పెంచింది. నాలుగో కుమారుడి పేరును రాజు కోరిక ననుసరించి మదాలస అలర్కుడు అనే పేరును నిర్ణయిస్తుంది.నాలుగవ కుమారుడు కూడా అదే మార్గంలో పెంచితే రాజ్య పాలన కు వారసులు ఉండరు అని రాజు చెప్పటం వలన, మదాలస అలర్కునికి రాజధర్మాలు కూడా భోదిస్తుంది.మదాలస అలర్కుడికి చెప్పిన ముఖ్యమైన విషయాలు-

·       అందరికీ మేలు చేయాలనే తలంపును మనసులో పెంచుకోవాలి.

·       భార్యను తప్ప మరొక స్త్రీని కామదృష్టితో చూడకూడదు.

·       మనసులో జనించే చెడు ఆలోచనలు నాశనం చేయమని, మురారిని  ఎల్లవేళలా ప్రార్ధించాలి.

ఆమె బోధనల ప్రకారం అతను రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తుంటాడు.  అలర్కునికి చిన్నతనం నుంచే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి నందు వలన అతడు మహారాజు అయిన తర్వాత కూడా జ్ఞాన యోగ కర్మయోగాన్ని సమన్వయించి చూపించి పరిపాలన సాగించాడు.

ఋషి జీవనము గడపడానికి అరణ్యాల కేగిన సోదరులలో సుబాహువు అలర్కుడి దీక్షా దక్షతలు విని చూసి సంతోషిస్తారు. కానీ అసూయ కారణంగా శత్రు రాజైన కాశీ రాజును ఆశ్రయిస్తాడు. ఇదే తగిన సమయమని భావించి కాశీరాజు అలర్కుని పై అన్ని మాయోపాయాలు ప్రయోగించటం వలన అలర్కుడు శక్తి హీనుడవుతాడు. ఫలితముగా రాజ్య పాలన కష్టముగా భావిస్తాడు.అటువంటి విపత్కర పరిస్థితుల్లో అలర్కునికి తల్లి అతని ఉంగరంలో దాచి ఉంచిన సందేశం గుర్తుకు వచ్చి తీసి చదువుతాడు. ‘విధి నిర్వహణలో విఫలం అయితే సంఘాన్ని పరిత్యజించు’ అని ఉంటుంది. అది చదివిన అలర్కుడు సంఘాన్ని పరిపాలనను త్యజించి శ్రీ దత్తాత్రేయుని శరణు కోరుతాడు. దత్తాత్రేయుడు అతని ఋజువర్తనకు సంతోషించి, "నేనంటే ఎవరు?"అనే విషయాన్ని తెలుసుకొమ్మని చెబుతాడు. దత్తాత్రేయుడి ఉపదేశసారం,మదాలస అలర్కుడికి బోధించిన ధర్మ సూత్రాలు అన్నీ అతి ప్రాచీనమైన శ్రీ మార్కండేయ పురాణంలో ఉన్నాయి. కాబట్టి మార్కండేయ పురాణము చదువుకుంటే బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటో తెలుస్తుంది. మదాలస వృత్తాంతము పిల్లలను తీర్చిదిద్దడం లో తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో వివరిస్తుంది. మొదటి ముగ్గురు కుమారులను వేదాంత ధోరణిలో పెంచి ఋషి జీవనాన్ని ఎన్నుకొనేటట్లు గా  పెంచుతుంది. నాల్గవ కుమారుడైన అలర్కుని భర్త కోరిక మేర రాజ్యపాలననీతివంతంగా ధర్మబద్ధముగా సాగించేటట్లుగా తీర్చిదిద్దుతుంది.సంతానాన్ని జ్ఞాన మార్గంలో నడిపించే తల్లిగా తనను తానూ ఋజువు చేసుకుంది.

No comments:

Post a Comment

Pages