వసుంధర - అచ్చంగా తెలుగు

వసుంధర

(మా నర్సాపురం కథలు)
భావరాజు పద్మినీ ప్రియదర్శిని
ఆరోజు మా నర్సాపురంలో, బిజిబిఎస్ ఉమెన్స్ కాలేజీలో వసుంధరగారి 'నిరుపయోగమైన వస్తువులతో గృహాలంకరణ' అనే ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. కె.రోశయ్య గారు ముఖ్య అతిథి. ఆయన సత్కారాన్ని అందుకున్న వసుంధర ను మాట్లాడమని కోరారు. ఎదురుగా ఎంతోమంది విద్యార్థినులు, స్థానిక గృహిణులు.

"కళకు మూలం సృజన. పుట్టుకతోనే ఈ సృజన అనేది ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడంలోనే విఫలమవుతున్నాము. భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యాన్ని పొదిగాడు. ఆ విలక్షణతను అన్వేషించి, కృషి, అంకితభావంతో సాధన చేస్తే, మనిషి సాధించలేనిది ఏదీ లేదు. అందుకు ఉదాహరణగా నా కథనే ఈరోజు మీకు చెప్తాను" అంటూ వసుంధర ఆరంభించగానే ఆ హాలంతా నిశ్శబ్దం ఆవరించింది.

"నేను 1945 లో నర్సాపురంలో జన్మించాను. రాయ్ పేట మిషనరీ స్కూల్ వెనకాల పెద్ద డాబా ఇల్లు మాది. మా తల్లిదండ్రులు యార్లగడ్డ నారాయణమూర్తి, కమలజాక్షి గార్లు. నాకిద్దరు అన్నయ్యలు. మా అన్నయ్యలు డా.వై.వి.కృష్ణారావు, డా.శ్రీనివాసరావు, మంచి డాక్టర్లుగా స్థిరపడ్డారు.

నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా నరసాపురంలో, బి.ఎ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, బీఈడీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఎమ్.ఎ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సాగింది.

1978లో నేను మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయినిగా బాధ్యతలు స్వీకరించాను. అందరు ఉపాధ్యాయుల లాగా కాకుండా,  విద్యా బోధనలో నాదైన వైవిధ్యం చూపాలనుకున్నాను. అందుకు నేను ఎంచుకున్న మార్గం - కళలు. 

ఈ కళాపిపాస నాకు మా అమ్మ నుంచి అలవడింది. చిన్నప్పుడు సంక్రాంతి వస్తోందంటే మా ఇంట్లో సందడే సందడి! పూసలతో, పళ్లపొడి డబ్బా మూతలతో, వాడేసిన బ్లేడ్లతో, అట్టముక్కలతో, గుడ్డముక్కలతో, బంకమట్టితో ఎన్నో రకాల బొమ్మలు చేసేవాళ్లం. తిరుమల కొండ మీద స్వామి, ఆ కొండ ఎక్కే మెట్లు, పెళ్లికొడుకు, పెళ్లికూతురు, సన్నాయి మేళం, తలలూపే కొండపల్లి బొమ్మలు, రకరకాల అంగళ్లు, బాండ్ మేళం, దేవుళ్లు, హరిదాసు, గంగిరెద్దు, అష్టలక్ష్ములు, దశావతారాలు, రకరకాల పళ్లు, కాయగూరలు, కల్పవృక్షం, కామధేనువు... చుట్టూ దీపాలు, అంతెందుకు సాక్షాత్తు స్వర్గమే ఇలకు దిగి వచ్చిందా అన్నట్లుగా బొమ్మలను పేర్చేది మా అమ్మ. అసలు నరసాపురంలోనే ఎవరూ పెట్టనంత అందంగా బొమ్మలకొలువు పెట్టాలని అందరం తాపత్రయపడేవాళ్ళం. అదంతా గొప్ప కోలాహలం!

సంక్రాంతి పండుగ ముగిసాకా, మళ్ళీ వీటన్నింటినీ భద్రంగా తుడిచి, న్యూస్ పేపర్లలో చుట్టి, అటక మీద ట్రంకు పెట్టెలో జాగ్రత్తగా భద్రపరిచే వాళ్ళం. ఐదు పైసలు నాణాలు, బాదం పిస్తా తొక్కలు, పెన్సిల్ చెక్కులు, బ్లేడ్లు, దోస గింజలు, పేస్ట్ మూతలు, అగ్గిపుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, ఇలా 'కావేవీ కళకు అనర్హం' అని ఆ బొమ్మల కొలువు తయారీ ద్వారా అమ్మ నేర్పింది. 

'ఈ లోకంలో వ్యర్థమైనది ఏదీ లేదనీ, మనలో కళాదృష్టి ఉంటే ఆ వ్యర్థాన్ని కూడా అర్థవంతమైన కళారూపంగా మార్చవచ్చని, అలా చేసినప్పుడు మనసుకు అమితానందం కలుగుతుందని' నేను తెలుసుకున్నాను.

'నిరుపయోగమైన వస్తువులతో గృహాలంకరణ' అన్న శీర్షికతో అనేక కళారూపాలను తయారు చేసి, 1980 నుండి విద్యార్థులతో కలిసి అనేక విద్యా, విజ్ఞాన ప్రదర్శనలలో పాల్గొన్నాను. ఇందులో భాగంగా కేవలం నర్సాపురంలోనే కాక జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో కూడా అనేక ప్రదర్శనలలో పాల్గొని, బహుమతులను పొందాను. ఈ కళ ద్వారా నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాను.

అప్పుడే నాలో ఒక ఆలోచన కలిగింది. వ్యర్థమైన వస్తువులలోనే భగవంతుడు ఇంత సత్తాని పెట్టినప్పుడు, చిన్న పిల్లలలో మరెంత సామర్థ్యం ఉండాలి? చదువులో అందరూ మేటి కాకపోవచ్చు. కానీ తరచి చూస్తే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ పట్ల అనురక్తి ఉంటుంది. దాన్ని ప్రోత్సహించినప్పుడు ఆ కళ ద్వారా పొందే చిన్న చిన్న విజయాలు, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, చదువులో కూడా వారు ఆసక్తి చూపేలా చేస్తాయి.

దేన్నైనా చెప్పినప్పుడు అది పిల్లలకి వెంటనే వంట పట్టకపోవచ్చు. కానీ, మనం వారితో పాటు కలిసి చేస్తూ, కలివిడిగా బోధిస్తే, వారూ నేర్చుకోడానికి ఆసక్తి చూపుతారు. అలా నా విద్యార్థుల సార్వత్రిక అభివృద్ధి కి బాటలు వేసాను. వారికి కొత్త కొత్త కళారూపాలను నేర్పడానికి నేను స్వయంగా సాధన చేశాను. NCERT వారు తిరువనంతపురంలో నిర్వహించిన సదస్సులో పత్రం సమర్పించాను. ముఖ్యంగా నేను వ్యర్థమైన బ్లేడ్లతో తయారుచేసిన రథం, శివలింగానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. 

శ్రీహరికోటలోని 'షార్' కేంద్రంలో నేను ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూసిన సైంటిస్ట్ లు ఎంతో ఆనందించారు. ఆయింట్మెంట్ మూతలతో నేను తయారుచేసిన 'క్రికెట్ ఫీల్డ్ నమూనా'ను గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ పేపర్లలో ప్రశంసల జల్లు కురిసింది.

గురివింద గింజలు, గవ్వలు, పాత క్యాలెండర్లు, ఐస్ క్రీమ్ కప్పులు, పక్షి ఈకలు, ఇలా వ్యర్థమైన వస్తువులతో నేను తయారుచేసిన గృహాలంకరణ కళాకృతులు ఇప్పటికి రెండు వందల పైనే! విద్యా బోధనను ఇలా పిల్లలకు ఆకర్షణీయంగా మలచినందుకు విద్యాశాఖ అధికారులు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు.

2002 సెప్టెంబర్ ఐదున నాకు అప్పటి కలెక్టర్ శ్రీ మాలకొండయ్య గారి చేతుల మీదుగా 'ఉత్తమ ఉపాధ్యాయిని' అవార్డును అందించారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి మహిళా క్లబ్ వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు నాకు అనేక సత్కారాలను చేశాయి. ఇవన్నీ నాలో కొత్త స్ఫూర్తిని నింపాయి.

పదవీ విరమణ తర్వాత, స్థానిక YNM కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా శిశు సంక్షేమ కేంద్రంలో అనేకమంది బీదమహిళలకు కుట్లు, అల్లికలలో శిక్షణ ఇచ్చి వారు స్వయంగా సంపాదించుకునేలా చేశాను. 

ప్రస్తుతం అనేక తీర్థయాత్రలు చేస్తూ 'గౌడ ప్రభ' అనే పత్రికలో అనేక హిందూ ఆలయాలను గురించి వాటి చుట్టూ ఉన్న విశిష్టమైన ఉపాలయాలను గురించి కూడా వ్యాసాలు వ్రాస్తున్నాను.

ప్రస్తుతం... సాంకేతికత మనిషిలో ఉన్న సృజనాత్మకతను చంపేస్తుంది. మనం ఏం ఆలోచించాలో, ఏం చూడాలో, ఏం చేయాలో మనకు తెలియకుండానే టెక్నాలజీ నిర్దేశిస్తోంది. 
కరోనా ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని, పిల్లలకు మొబైల్స్, గాడ్జెట్స్ సులభంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, విద్యార్థులు ‌ఆన్లైన్లో గడిపే సమయాన్ని నియంత్రించుకొని, కళల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటే, అని రంగాల్లోనూ మంచి విజయం సాధించగలుగుతారు.

ఇక్కడ ఉన్న మహిళలకు నా సందేశం ఏమిటంటే, ఇంటి పనులు - వంట పనులు అంటూ మీలోని సామర్థ్యాలను పరిమితం చేసుకోకుండా, మీ వల్ల మీకు, ఈ సమాజానికి మేలు కలిగేలాగా నచ్చిన కళలపై దృష్టి పెట్టండి. పట్టుదల, దీక్ష, అంకితభావంతో‌ కృషి చేస్తే, నావంటి వసుంధరలు ఎందరో ఇలా వేదికపై గర్వంగా తలెత్తుకు నిలబడతారు." అంటూ ఆమె ప్రసంగాన్ని ముగించగానే ఒకసారిగా ఆ హాల్లో చప్పట్లు మారుమ్రోగాయి.

అలా‌ మా యార్లగడ్డ వసుంధరాదేవి మా నర్సాపురవోళ్ల గొప్పను అప్పటికీ, ఇప్పటికీ లోకానికి చాటుతానే ఉందండి! ఆయ్! 

***
 

No comments:

Post a Comment

Pages