ఉచితాలతో అనర్థం - అచ్చంగా తెలుగు

 ఉచితాలతో అనర్థం

కధ రచన: సి.హెచ్.ప్రతాప్
విదర్భ రాజ్యాన్ని ఏలే మగధసేనుడు తన రాజ్యాన్ని ఎంతో ప్రజా రంజకంగా పాలించేవాడు. రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డలవలే చూసుకునేవాడు. వారికి ఏ కష్టం రాకుండా, వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘంతో ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసాడు. బీడు భూములన్నింటినీ ఒక క్రమ పద్ధతిన సాగు భూముల కింద మార్చడం వలన రాజ్యంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ శ్రమపైనే ఆధారపడేలా వ్యవస్థ రూపు దిద్దుకుంది. వారికి ఏ అనారోగ్యం కలగకుండా గ్రామ స్థాయిలో ప్రాధమిక వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశాడు. రాజ్యంలో అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వం హయాంలో గురుకులాలు నిర్మించి సమర్ధులైన గురువులను నియమించడంతో పాటు, పిల్లలందరికీ పన్నెండేళ్ల ప్రాయం వరకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. జనరంజకమైన పాలన వలన ప్రజల మన్నలను పొందడంతో పాటు వారి చేత దైవంగా పూజలందుకున్నాడు.

వృద్ధాప్యం కారణంగా మగధసేనుడు తన మంత్రులు, రాజగురువును సంప్రదించి ఒక శుభముహూర్తాన తన ఏకైక కొడుకు విక్రమ సేను డికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. రాజ్య పాలన ఎలా సమర్ధవంతంగా చేయాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అన్నీ కొడుకుకు సవివరంగా చెప్పి భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు.  
విక్రమసేనుడికి తన తండ్రి యొక్క ప్రజారంజకమైన  పాలన గురించి, దేశ ప్రజలలో ఆయనకు వున్న గౌరవాభిమానాల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ప్రజల హృదయాలలో తన పేరు ప్రతిష్టలు శాశ్వతంగా నిలిచిపోవడానికి  ఆయనకంటే మరింత బాగా పాలన చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా వృద్ధులైన వారిని తమ మంత్రివర్గం నుండి తొలగించి యువకులను నియమించుకున్నాడు. వారి నుండి ఇంకా ప్రజారంజకమైన పధకాల గురించి సూచనలను అందుకొని వాటి సాధ్యా సాధ్యాలను కూడా పరిశీలించకుండా అమలుచేయడం మొదలు పెట్టాడు. వృద్ధులు, వితంతువులకు గౌరవ పింఛనులు, కులవృత్తుల వారికి గౌరవ వేతనాలు, యువతకు విద్యాభ్యాసం  సమయంలో ప్రత్యేక భత్యాలు ప్రారంభించాడు. వ్యవసాయదారులకు వారికి ఇష్టమైన ధరలకు పంట అమ్ముకునే వెసలు కల్పించాడు. ప్రజలందరికీ ఉచిత బియ్యం, పప్పు దినుసులు ఇచ్చే పధకం కూడా ప్రారంభించాడు. ఆలయ అర్చకులకు ప్రత్యేక వేతనాలు ఇచ్చాడు.

ఇలా ఎన్నో ప్రజా కర్షక పధకాలను ప్రారంభించాడు విక్రమసేనుడు. ఈ పధకాల ఫలాలు ప్రజలలోకి వెళ్ళి అవి మంచి ఫలితాలను ఇస్తే ప్రజలు తనను దేవుడిలో కొలవడంతో పాటు ఊరూరా గుళ్ళు కట్టించి తనకు పూజలు చేయడం తధ్యమని మురిసిపోయాడు.  
సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా, వాటి ప్రభావం కోశాగారంపై ఎలా వుందో అధ్యయనం చెయ్యకుండా ఇష్టారాజ్యంగా సంక్షేమ పధకాలను అమలు చేయడం మంచి కాదన్న కొందరు వృద్ధ మంత్రులు, సలహాదారుల సూచనలను విక్రమసేనుడు కొట్టి పడేసాడు. పై పెచ్చు ప్రజలకు చేటు చేసే ఇటువంటి పనికిమాలిన సలహాలు ఇస్తే కారాగారం తప్పదని తీవ్ర హెచ్చరికలు చేసాడు. దానితో మనకెందుకు లెమ్మని వారు మిన్నకుండిపోయారు. కొందరైతే పొరుగు రాజ్యాధీశుల వద్ద కొలువుకు కూడా చేరిపోయారు.  

ఒక సంవత్సర కాలం తర్వాత వేగులను పంపి తాను అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ఫలితాలు ఎలా వున్నాయో తెలుసుకోవాలని సంకల్పించాడు. అంతేకాకుండా తాను కూడా మారు వేషంలో రాజ్య పర్యటన చెసి క్షేత్ర స్థాయిలో తలెత్తిన పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేద్దామనుకున్నాడు.

ఒక నాటి రాత్రి ఒక గ్రామంలో ఒక ఇంటి ముందు జరుగుతున్న తతంగం గమనించాడు.

వీధిలో మంచం వెసుకొని ఒక వ్యక్తి దర్జాగా పడుకున్నాడు. అతని భార్య అతని ముందు కూర్చోని ఏడుస్తొంది.

" మావా, నేటికి నువ్వు పనిలోకి వెళ్ళి ఏడు దినాలయ్యింది. ఇంట్లో నూకలు కూడా నిండుకున్నాయి. శెట్టి గారు దుకాణం తెరిచి రెండు రోజులయ్యింది.లాభాలు అధికంగా వస్తున్నందున హాయిగా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు చక్కా పోయాడు. ఇక నేను ఏమి చేసి నీకు, పిల్లలకు అన్నం పెట్టేది?"
 ఆ వ్యక్తి అసలు చలించడం లేదు. " రెండు రోజుల్లో మనకు రాజుగారిచ్చే ఉచిత బియ్యం , పప్పులు వస్తాయి కదా, అవి ఎంచక్కా ఒక నెల రోజులకు సరిపోతాయి.ఈ రెండు రోజులు సర్దుకోవే. నేను మాత్రం పనికి వెళ్ళనే వెళ్ళను, నాకు విశ్రాంతి అవసరం" అంటూ ముసుగు తన్ని పడుకున్నాడు.
మర్నాడు బజారులో పర్యటిస్తే తెలిసిన విషయం ఏమిటంటే వర్తకులు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ఇష్టారాజ్యంగా సరుకుల ధరలు పెంచేసారు.  జీత భత్యాలు సరిపోక పేద, మధ్య తరగతి వారు సగం రొజులు పస్తులుంటున్నారు.
గురుకులాలలో గౌరవ వేతనాల కారణంగా గురువులు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు. విద్యార్ధులలో సైతం క్రమశిక్షణ లోపించడం తో పాటు విద్యా సముపార్జనపై ఆసక్తి సన్నగిల్లుతోంది.
 చేనేత వృత్తుల వారు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాల కారణంగా తమ పనులు సక్రమంగా చేయడం లేదు. రక్షక భటులు లంచాలకు అలవాటు పడి నిరపరాధులను శిక్షిస్తూ, లంచం ఇచ్చే అపరాధులను వదిలేస్తున్నారు.
న్యాయ పరిరక్షణ వ్యవస్థ కూడా కునారిల్లింది.
సూక్ష్మంగా చెప్పాలంటే ప్రభుత్వ ప్రజాకర్షక పధకాల వలన ప్రజలలో సోమరితనం పెరిగింది. మనం ఏమీ చెయ్యకపోయినా అన్నీ అవే తమ ఒళ్ళో వచ్చి పడతాయన్న ధైర్యం వారిలో ప్రవేశించింది.
వారు మూడు నెలల పాటు రాజ్య పర్యటన చేసి తెచ్చిన వివరాలు అతనికి ఊహించని విధంగా గగుర్పాటు కలిగించాయి. అవి తాను పర్యటనలో తెలుసుకున్న విషయాలతో ఏకీభవిస్తున్నాయి.    
తన అపసవ్య ఆలోచనా విధానం వలన మొత్తం పరిపాలన వ్యవస్థే కుప్ప కూలుతోందన్న విషయం గ్రహించడానికి విక్రమసేనుడికి ఎంతో సేపు పట్టలేదు.    
అత్యవసరంగా మంత్రివర్గాన్ని తన అంతరంగిక మందిరంలో సమావేశపరిచాడు. తన నిర్ణయాలు విఫలమవడానికి గల కారణాలను తెలియజేయమన్నాడు. అయితే మంత్రివర్గ సహచరులందరూ యువకులే, ఉడుకు  రక్తమైతే వుంది కాని పాలనానుభవం లేదు. పైగా తాము ఏం చెబితే రాజుకు కోపం వస్తుందోనన్న భయం కారణంగా అంతా బాగానే వుందన్న విషయాన్ని విక్రమసేనుడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేసారు. అయితే అప్పటికే ప్రత్యక్ష అనుభవం కారణంగా రాజుకు వారి మాటలు ఏ మాత్రం రుచించలేదు. మంత్రివర్గ సమావెసాన్ని రద్దు చెసి కోపంతో వెళ్ళిపోయాడు.

తర్వాత ఈ విషయాన్ని చర్చించేందుకు రాజగురువును మొదటిసారి రప్పించాడు విక్రమసేనుడు. రాజు గారి సందేహాన్ని విన్నాక చిరునవ్వుతో రాజగురువు అసలు విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.


" నాయనా, మీ తండ్రి గారికంటే మంచి పేరు తెచ్చుకోవాలన్న మీ ప్రయత్నం మెచ్చదగినది. అయితే దానికి నీవు ఎంచుకున్న మార్గం సరిగ్గా లేదు. మొదట అనుభవజ్ఞులైన వారిని మంత్రివర్గం నుండి తొలగించి అనుభవరాహిత్యం వున్నవారిని తీసుకున్నారు. అనుభవలేమి కారణంగా వారందరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించారు. ఇక ఏ పధకం అమలుపై సాధ్యాసాధ్యాలను మీరు అధ్యయనం చేయలేదు. పైగా అవన్నీ సంక్షేమ పధకాలంటూ మీరు భ్రాంతిలో పడ్డారు. అసలు అవసరం కంటే ఎక్కువగా ప్రజలకు ధనం, సరుకులు అందుతుండడం వలన వారిలో సోమరితనం పెరిగింది. వాస్తవానికి ప్రజలకు మంచి చేసి వారిని అభివృద్ధి పధంలో నడిపించాలంటే వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ చేయాలి, వారిలో కష్టించి పని చేసే తత్వం చొప్పించి, అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తే వారి శ్రమకు అనుగుణంగా సంపాదించుకోగలరు. అప్పుడు వారికి తమ సంపాదన కష్టం ఏమిటో తెలిస్తుంది. ఒక వరహా అదనంగా  సంపాదించుకోవాలంటే ఒక గంట అధికంగా పని చెయ్యాలని, పని చేస్తేనే సందుకు ప్రతిఫలం లభిస్తుందన్న భావన వారికి కలగాలి.  

 ఈ ఉచితాల వలన వారికి కష్టించి పని చేసే తత్వం పోయింది ఎందుకంటే అన్నీ ఉచితంగా వారి ఒళ్ళో వచ్చి పడుతున్నాయి.. మీ తండ్రి గారు చేపట్టిన పధకాలలో మర్మం ముందు అర్ధం చేసుకోగలిగితే మీకెన్నో పాలనా రహస్యాలు బోధపడతాయి" అని రాజగురువు విక్రమసేనుడికి సవివరంగా బోధించాడు.

రాజగురువు మాటలతో విక్రమసేనుడికీ జ్ఞానోదయమయ్యింది. తాను చేసిన తప్పెమిటో తెలిసివచ్చింది. వెంటనే మంత్రివర్గ ప్రక్షాళనతో ప్రారంభించి సమర్ధవంతమైన పాలనకు శ్రీకారం చుట్టాడు. అనతికాలంలోనే తండ్రి కంటే బహు సమర్ధవంతమైన పాలనను అందించి ప్రజల మెప్పు సంపాదించుకున్నాడు.

***

No comments:

Post a Comment

Pages