ఒకటైపోదామా... ఊహల వాహినిలో! - 4 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా... ఊహల వాహినిలో! - 4

Share This

ఒకటైపోదామా... ఊహల వాహినిలో! - 4 

కొత్తపల్లి ఉదయబాబు 


(విరాజ్, హరిత ప్రేమికులు. పెళ్ళికి ముందు తనకు బిడ్డను కనివ్వాలని, ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు విరాజ్. ఇక చదవండి.)

 ''అదిగో ...అదే మరి...నువ్వు నన్ను, నా ప్రేమని అవమానిస్తున్నావ్. నేను నిన్నేమీ వింత కోరిక కోరలేదే. పెళ్లి తరవాత  కనే పిల్లవాడిని ముందే కని ఇవ్వమంటున్నాను. ఆ తరువాత కూడా నేను నిన్ను ప్రేమించగలిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానని అగ్రిమెంట్ కాగితం కూడా రాసి ఇస్తాను .''అన్నాడు విరాజ్ ఆమెవైపు తిరిగి.

 

 ''అగ్రిమెంటా?'' అని పకపకా నవ్వసాగింది హరిత. ఈసారి విస్తుపోవడం విరాజ్ వంతు అయింది.

 

 ''అవును . అగ్రిమెంటే . దానికి అంత నవ్వెందుకు?'' చిరుకోపంతో గంటు ముఖం పెట్టుకుని అడిగాడు విరాజ్.

 

 '' ఇప్పుడు సమయం ఎంతో  తెలుసా?''

 

తనని ఎవరో నిశితంగా పరిశీలిస్తున్నట్టు  అనిపించిన హరిత  చటుక్కున వెనక్కి తిరిగి చూసింది.  కానీ ఆమెకెవరు కనపడలేదు.

 

 ''ఏడూ దాటింది...'' అన్నాడు అతను చేతికున్న వాచీ చూసుకుని .

 

 ''ఆరుగంటలకే డ్యూటీ అయిపోయి ఇంటికి రావలసిన ఆడపిల్ల ఇంకా రాలేదని కన్నతల్లులు భయపడి ఎదురుచూస్తూ ఉండే సమయంలో నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడటానికి  వచ్చానంటే నీమీద ఎంత నమ్మకం ఉంటే వచ్చానంటావ్? అలాంటి నాకు అగ్రిమెంట్ రాస్తావా? అదీ పెళ్ళయ్యాకా నన్ను నువ్వు ప్రేమించగలిగితే...అంటే నామీద అంత బలహీనమైనదా నీకున్న ప్రేమ?''  విరాజ్ నివ్వెరపోయాడు.

 

 ''అంటే నీమీద నాకున్న ప్రేమ గట్టిది కాదనా నీ ఉద్దేశం?''

 

 ''నాకు బిడ్డ పుట్టాకా కూడా ప్రేమించగలిగితే  అంటే... నీకు పిల్లవాడిని కని ఇచ్చాకా నామీద నీకు ప్రేమ తగ్గిపోతుందనేగా అర్ధం. ప్రేమలో అలా ఏదో జ్వరం వచ్చినట్టు పెరిగిపోవడాలు, మళ్ళీ తగ్గిపోవడాలు ఉంటాయా.. అసలు  ప్రేమికుల మధ్య ప్రేమను కొలిచే స్కేల్ ఏదైనా ఉంటుందా? ఉంటే నాకు చూపించు ,నీవల్ల కాదు చూపించలేవు. నిజమైన ప్రేమకు స్కేల్ కనిపెట్టాలంటే ఆకాశంలోకి నిచ్చనవేయడమే.''శాంతంగా అంది హరిత.

 

ఇంతలో విరాజ్ సెల్ మోగింది.

 

 అతను ముందు పక్కకు వెళ్ళబోయి హరిత ముఖం చూసి ఆగిపోయాడు.

 

''చెప్పండి డాడీ...ఫ్రెండ్స్ తో బయటకి వచ్చాను. నేనా...ఒక గంటలో వచ్చేస్తాను. ఏంటి? మీరు బయటకి వెళ్ళాలా? అబ్బా... ఎంజాయ్ చేసే వయసులో కూడా ఎంజాయ్ చెయ్యనివ్వరు కదా... సరే..అరగంటలో షాపు లో ఉంటాను సరేనా..చెప్పానుగా.. వచ్చేస్తాను.'' అని కట్ చేసాడు విరాజ్.

 

తనకేసి సూటిగా చూస్తూ నిట్టూర్చిన హరితను చూసి జాలివేసి నవ్వు వచ్చింది అతనికి.

 

''సరే...మరి నేను వెళ్ళిరానా?'' అడిగింది అతన్ని.

 

''అదేంటి...ఏ సంగతీ చెప్పకుండా వెళ్ళిపోతాను అంటున్నావ్? ''

 

''దేనిగురించి?''ఆమె కావాలనే అడిగింది.

 

''అరె ...యిందాకా నేను అడిగిన విషయం గురించి.''అన్నాడతను కొంచెం విసుగును ప్రదర్శించబోయి తమాయించుకుంటూ.

 

 ''మన పెళ్లి అవ్వకుండా నేను నీతో   ఒక బాబుని కని ఇవ్వాలన్నావ్...అదే కదా?''

 

అవునన్నట్టు చూసాడతను.

 

''మరి నా ప్రశ్నకు సమాధానం ఉందా  నీదగ్గర ?''

 

 "కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు"

 

 ''ఈ ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్న ఏదీ ఉండదు వీరూ. మన లాజిక్ కి అందకపోవచ్చు .మా  చిన్నప్పుడు ''విత్తు ముందా? చెట్టు ముందా? అని అడిగేవాళ్ళం.ఈవేళ విత్తనం లేకుండా అదే జాతి మొక్కల్ని పెంచుతున్నారు. కోడి ముందా? గుడ్డు ముందా? అని అడిగేవాళ్ళం. ఈవేళ లక్షల సంఖ్యలో హైబ్రిడ్ కోళ్లను పెంచుతున్నారు. సరోగసి పద్దతిలో పిల్లలను కనలేని వాళ్లకు పిల్లలను కనిపించి ఇచ్చి వాళ్ళకు అమ్మానాన్న ప్రేమను అందేలా చేస్తున్నారు. అంతగా పెరిగిన శాస్త్ర పరిధి యొక్క లోతులు మనకు తెలీక ఇవన్నీ వింతగా మనకు కనిపిస్తున్నాయి.అంతే .''

 

 ''అంటే ..కొంపదీసి  ఆ పద్ధతుల్లో  బేబీని కని ఇస్తానంటావా ఏమిటి? నెవర్. నువ్వు స్వయంగా నాతో, మనమిద్దరం స్పృహలో ఉండగా తనివితీరా కలిసాకా తద్వారా వచ్చే బిడ్డ కావాలి నాకు. అర్థమైందా?''అతను  ప్రతీ పదం నొక్కీ పలుకుతూ వివరంగా చెప్పాడు ఆమెకు ఉత్సుకతగా ఆమెను చూస్తూ.

(సశేషం)

No comments:

Post a Comment

Pages