అనసూయ ఆరాటం -25 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం -25 

చెన్నూరి సుదర్శన్ 
రవీందర్ పనిచేసే కంపినిల కరెంటు మీటర్లు తయారైతై. అందుల మనం ముదుగాల్నే కొన్న కారటు పెడితే ఆకు పచ్చ లైటు ఎలిగి కరంటు నడ్తాంటది. పైసలయ్యే ముందల పసుపు పచ్చ లైటు ఎలుగుతది. పైసలు పురంగ అయిపోగనే ఎర్ర లైటత్తది. పసుపు లైటున్నప్పుడే కారట్ల మల్ల పైసలేసుకోవాలె.

అవి పెట్టుకోవాలంటే  కరంటు బోర్డు అఫీసు నుండి పర్మిసన్ తీసులకోవాలె. అది రవీందర్ కంపిని వాల్లే ఇప్పిత్తరు. అయితే మీటరు కర్సు మాత్రం కస్టమర్లదే.. కాని ఫుకడ్‌కే ఫిట్టింగ్ చేత్తరు.  

ఆ మీటర్ల పనితనం గురించి కాలేజీలు .. పెద్ద, పెద్ద అఫీసులు తిరుక్కుంట మీటింగులు పెట్టి చెప్పేటోడు. పత్యచ్చంగ.. కారటు పెట్టి సూయించేటోడు. 

ఆరోజు నిజాం కాలేజీల మీటింగు కాంగనే స్టాఫ్ రూంకు పోయి కొన్ని ఆర్డర్లు బుక్ చేసుకున్నడు. వాల్లు తెప్పిచ్చిన చాయె తాగి కార్ల తిరిగి వత్తాండు.

దూరంగ చెట్టుకింద ఎవరో ఒకరు కూకున్నట్టు కనబడింది. కొంచెం దగ్గరికి పోగనే.. ఒకలు కాదు. ఒకల ఒల్లె ఇంకోలు కూకున్నడు కనబడింది. నిరంజన్.. సుస్మిత లెక్క అనుమానమేసింది. 

రవీందర్ దగ్గర మీటర్లు చెక్ చేసేటప్పుడు పెట్టుకునే భూతద్దాలున్నై. కారు ఒక చెట్టుకిందాపి వాటిని పెట్టుకొని సూసిండు. ఒల్లు ఝల్లు మన్నది. సుస్మితను అదిమి పట్టుకొని నిరంజన్ గాఢంగ ముద్దు పెట్టుకుంటున్న సీను.. ఏ తండ్రీ కంట పడగూడని సీను. భూతద్దాలను పక్కకు పెట్టి తల్కాయె పట్టుకున్నడు.. ఖాళిగ అన్పిపిచ్చింది. కాని బరువుగనే  ఉన్నది.

ఇంటికి పోయి రజితకు చెప్పిండు. రజిత ముందుగాల నమ్మలేదు గాని సయంగ సూసిన అని అన్నా నమ్మలేదు. సుస్మిత మీద తనకు నమ్మకమెక్కువ. ఏదైనా తను సూత్తనే గాని నమ్మే మనిషి కాదనుకున్నడు రవీందర్. అయినా వాల్ల మీద ఒక కన్నేసి ఉంచితే మంచిదని చెప్పిండు. 

కింద బండి సప్పుడైంది. నిరంజన్  వచ్చిండనుకొని పిట్ట గోడ మీదికెల్లి తొంగి సూసిండు రవీందర్. నిజమే .. అతనే..

“రజితా.. మరో ఐదు నిముషాల తరువాత సుస్మిత వస్తుంది చూడు. నిరంజన్ మనకు అనుమానం రాకుంట కొంచెం దూరంలో దించి ఉంటడు” అన్నడు రవీందర్. 

రవీందర్ అన్నట్టుగనే ఐదునిముషాలకు వచ్చింది సుస్మిత.

రజితకు సుత అనుమానమచ్చింది.

సుస్మితకు దైవ భక్తి ఎక్కువ రజితలెక్కనే.. ఇద్దరు కలిసి వీలున్నప్పు డల్లా గుడికి పోతాంటరు. రవీందర్‌కు గుళ్ళకు పోవుడు.. దండాలు పెట్టుకునుడు నచ్చదు. ఏదైనా మన మన్సుల మొక్కుకోవాలే గాని మంది సూడ మొక్కుడేందని తీసి పారేత్తాంటడు.

ఆరోజు రజిత పుట్టినరోజు. ఇంటికి దగ్గర్నే ఉన్న రామాలయం గుడికి సుస్మిత, రజిత కలిసి పోయిండ్లు. రజిత పేరు మీద అర్చన చేయించుకున్నది. కొంచెం సేపు గుడి మెట్ల మీద కూకున్నరు.  తిరిగి ఇంటికి పోదామని లేచింది రజిత. 

“అమ్మా.. నేను నీకొక గిఫ్ట్ కొనుక్కస్త. నువ్వు ఇంటికి వెళ్ళు” అన్నది సుస్మిత. 

“ఇంటికి పోయినంక పోరాదూ..” అన్నది రజిత. 

“నో.. నువ్వెళ్ళూ” అని బలవంతంగా రజితను ఇంటి మొకం పట్టిచ్చింది.

బహుమతులు దొరికే దుకానాలు మేన్ రోడ్డుకున్నై. శాన దగ్గర. నడిచి పోయి నడిచి వత్తదని అనుకున్నది రజిత. అయినా ఎందుకో అనుమానమచ్చి కొంచెం దూరం పోయి ఆగింది. సుస్మిత పోతాంటే ఆమెకు తెల్వకుంట సూడబట్టింది.

నిరంజన్ బండి మీద వచ్చిండు. సుస్మిత బండెక్కింది. ఇద్దరు రయ్యిన దూస్క పోయిండ్లు.

గంట సేపటికి నిరంజన్ ఒక్కడే వచ్చిండు. ఆతరువాత ఐదు నిముసాలకు సుస్మిత చేతిల గిఫ్ట్ పట్టుకొని వచ్చింది. 

 “అమ్మా .. హాపీ బర్త్ డే.. ఇదేంటో చెప్పుకో..” అని తన చేతిలోని పాకెట్టు రజితకివ్వబోయింది. రజిత తీసుకోలేదు.

“ఏమ్మా.. ఆలస్యమైందని కోపమచ్చిందా.. తోవల నా ఫ్రెండ్ కలిసి తన ఇంటికి తీసుకెల్లింది. సారీ..”

“ఫ్రెండు ఆడా.. మగా..”

(సశేషం)

“అదేంటమ్మా.. అలా అడిగినవ్.. నా మీద అనుమానమా..” 

“అనుమానం కాదు. మీ నాయ్న తన కండ్లతోటి సూసిన అని ఆరోజు చెప్పుతే  నమ్మలేదు. ఈ రోజు నేను సయంగ సూసిన.. నువ్వు నిరంజన్ బండి మీద పోలేదా..” 

“బండి మీద పోతేందమ్మా తప్పా..”

“తప్పు నీది కాదమ్మా.. మాది. నిన్ను హద్దుల పెట్టుకోలేక పోయినందుకు మాది తప్పు”

“నేను హద్దులు మీరుతున్ననా..”

“బుకాయించకు.. మీ నాయ్న మీ ఇద్దరి హాలత్ నిజాం కాలేజీ గ్రౌండుల సూసిండు.. ఆ రాత్రంతా నిద్రపోతే ఒట్టు” అని కడకొంగు తీసుకొని కండ్లల్ల ఉబికిన నీల్లను తుడ్సుకోబట్టింది.

“అమ్మా.. తప్పైంది. ఇంక ఎప్పుడూ అసోంటి పని చెయ్య” అని గిఫ్ట్ రజిత చేతికిచ్చి చెంపలేసుకున్నది. “అమ్మా.. అంతా మర్చిపో.. నీ పుట్టిన రోజున నీకు కండ్ల నీళ్ళు తెప్పిచ్చుడు.. నాకు బాగనిపిస్త లేదు” అన్కుంట అలిగినట్టు మొకం పెట్టి తన కమ్రలకు పోయి దభాల్న తలుపేసు కున్నది.. 

రజితకు మన్సుల మన్సు లేదు. రవీందర్ ఎప్పుడు వత్తడా.. ఎప్పుడు చెబ్దామా అని ఎదురి సూత్తాంది. 

అవ్వాల రజిత పుట్టిన రోజని యాల్ల పొద్దుగాల్నే వచ్చిండు రవీందర్. 

ఇంట్ల కాలు పెట్టుడు పెట్టుడే.. “రజితా.. ఇయ్యాల మనం బిర్లా మందిర్ పోదామోయ్.. నీకు గుళ్ళంటే శాన పీతి కదా.. వచ్చేటప్పుడు తాజ్ ఓటల్ల తిని వద్దాం” అన్కుంట ఉషారుగా బట్టలిడ్సి లుంగీ కట్టుకొన్నడు. కాల్లు రెక్కలు కడుక్కుందామని హమాంఖాన దిక్కు పోతాంటే..

“సుస్మిత నేను పొద్దుగాల్నే గుడికి పోయి వచ్చినం. నేను ఎక్కడికి రాను” అన్నది. 

(సశేషం)

No comments:

Post a Comment

Pages