మానవ జీవితానికి ఆధారభూతం కర్మయోగం - అచ్చంగా తెలుగు

మానవ జీవితానికి ఆధారభూతం కర్మయోగం

Share This
మానవ జీవితానికి ఆధారభూతం కర్మయోగం

సి.హెచ్.ప్రతాప్



కర్మ అంటే అందరికీ అర్ధమయ్యే భాషలో  చేతలు, పని చెయ్యడము, విధి మరియు కార్యకారణ నియమము అని చెప్తారు. శాస్త్రాల ప్రకారము ఒక వ్యక్తి లేక జీవాత్మ, బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన అనేక  సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. లింగ శరీరము అనగా బాహ్య శరీరమునకు మరియు ఆత్మకు మధ్య గలది ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది.ఈ విధముగా కేవలం కర్మ మాత్రమే ఒక వ్యక్తి మరు జన్మకు, ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది. మరుజన్మలో ఒక వ్యక్తికి వచ్చే కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, మంచి చెడ్డలు అన్నీ కూడా పూర్వ జన్మ కర్మ ఫలం వలనే లభిస్తాయన్నది సుస్పష్టం.

అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్ధం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై అదే విషయం శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞాన యోగంగానూ, యోగులకు కర్మయోగంగానూ చెప్పాను. కర్మలు చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి, ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు అని ప్రభోధించారు.

అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనీ, ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అంతే కాకుండా ఏ పని చెయ్యక కూర్చోవడం ప్రాణుల, ముఖ్యంగా మానవులకు అత్యంత ప్రమాదకరం అని, అది వారిని అధమ పాతాళానికి నెట్టివేస్తుందని భగవానుడు పరోక్షంగా మానవాళిని ఈ కర్మయోగ అధ్యాయం ద్వారా హెచ్చరిస్తున్నాడు.మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధము నుండి విముక్తి పొందజాలడని, అట్లే కేవలం బాహ్య (భౌతిక) సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడని,కాబట్టి మానవులు  వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి.  ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచి పెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అని భగవానుడు అద్భుతంగా కర్మయోగ ప్రాశస్థ్యాన్ని తెలియజేసారు.

***

No comments:

Post a Comment

Pages