అర్ధం కాని ప్రేమ నాన్నది! - అచ్చంగా తెలుగు

 అర్ధం కాని ప్రేమ నాన్నది!

భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.



ఆ గది అమ్మ,పిల్లల కలయికతో సందడిగా ఉంది.
వాళ్ళ మధ్యన ముచ్చట్లు,మురిపాలతో
ఆనందానికి ఎల్లలు లేవు,
ఆ గదిలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఈ గదిలో ఆలోచనల్తో నిండిన నాన్నమదిలోఅలజడిగా ఉంది.
అతని చుట్టూ నిశ్శబ్దం,నిర్లిప్తతతో
ఆవేదనకి అంతం లేదు,
ఈ గది నిట్టూర్పులతో నివ్వెరపోతోంది.
అక్కడ అమ్మకి పిల్లలతోడిదే లోకం,
ఇక్కడ నాన్నది బయటకు చెప్పుకోలేని శోకం.
నాన్నగురించిన ఆలోచనే లేని పిల్లలు,అమ్మఅక్కడ.
ఆ గదిలోకి వెళ్లాలని ఉన్నావెళ్ళలేక పోతున్న నాన్నఇక్కడ.
తను పిల్లలపై పిచ్చిగా చూపే ఆత్మీయతే,
అమ్మకు పిల్లల మనస్సులో పెద్ద అద్దాలమేడ.
పిల్లల మేలుకోరే ఆచరణలోని కర్కశత్వమే,
నాన్నకు,పిల్లలకు మధ్య నిలిచిన పెద్ద అడ్డుగోడ.
కడుపును చూసే అమ్మప్రేమ
పిల్లల కొలుపుకు నెలవౌతుంది,
భవితను చూసే నాన్నప్రవర్తన
పిల్లల అలుసుకు కొలువౌతుంది.
అదేమిటో,ఏం చేసినా కాని
అమ్మని పిల్లలు ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు,
ఇదేమిటో,ఎంత చేసినా కాని
నాన్నని పిల్లలు ఇప్పటికీ కష్టపెడుతూనే ఉంటారు.
ఇది ఈ లోకంలోని ఒక పెద్ద వింత,
నాన్నకి ఎప్పటికీ తీరని ఒక పెద్ద చింత.
అమ్మది తేలికగా అర్ధమయ్యే వింత పాత్ర,
నాన్నది చీలికతో అపార్ధమయ్యే చింతల యాత్ర.
అమ్మకి పిల్లల తెలివితక్కువ తనమే శ్రీరామ రక్ష,
నాన్నపై దాని ఉసిగొలుపే పిల్లలకు పెరిగిన కక్ష.
అదృష్టం కొద్దీ- అపార్ధం లేనిది,అనర్ధం కానిదీ
పిల్లల దృష్టిలో అమ్మ ప్రేమ ఒక్కటే!
దురదృష్టం కొద్దీ- అర్ధం ఇచ్చేదీ,అర్ధం కానిదీ
ఈ సృష్టిలో నాన్న ప్రేమ ఒక్కటే!

***

No comments:

Post a Comment

Pages