పురాణం కధలు- బసవ పురాణం - 30 - అచ్చంగా తెలుగు

పురాణం కధలు- బసవ పురాణం - 30

Share This
పురాణం కధలు- బసవ పురాణం - 30 
                                                                      పి.యస్.యమ్. లక్ష్మి


30  సోమన్న కధ
పూర్వం హుళగిర అనే పట్టణంలో సోమన్న అనే శివ భక్తుడు వుండేవాడు. ఆయన గొప్ప శివ భక్తుడు.   ప్రతి రోజూ ఆలయానికి వెళ్ళి శివ దర్శనం చెయ్యకుండా ఏమీ తినేవాడు కాదు.  ఒకసారి ఆయన కళ్ళకి  జబ్బు చేసి కళ్ళు ఎర్రగా అయి, నీళ్ళు కారుతూ, బాధ పెట్టటంతో కళ్ళు తెరిచి చూడలేక పోయాడు.  ఆ వూళ్ళో జైన మతస్తులు ఎక్కువగా వుండేవారు.  ఆ కాలంలో జైనులకి, శివ భక్తులకి మధ్య ఎవరికి వారే గొప్ప అనే తగవులుండేవి.

సోమన్నకి ఎవరూ లేక పోవటంతో కంటి జబ్బుతో మూడు రోజులపాటు కళ్ళు తెరచి చూడలేక పోవటంతో శివ దర్శనానికి వెళ్ళలేక అలాగే ఆహారం ఏమీ తీసుకోకుండా పడి వున్నాడు.  అది గమనించి,  సోమన్న నియమం తెలిసిన కొందరు జైనులు సోమన్నని ఆట పట్టించాలని, అతని దగ్గరకెళ్ళి,  ‘సోమన్నా, నువ్వు మీ ఆలయానికి వెళ్ళి మీ దేవుణ్ణి దర్శించ లేదని ఆహారం తీసుకోకుండా వున్నావు.  కానీ ఇలా ఎంత కాలం?  ఎంత నీరసించిపోయావో చూడు! ఇంకెంత కాలం ఇలా ఏమీ తినకుండా వుంటావు?  మేము నిన్ను మీ శివాలయానికి తీసుకు వెళ్తాము.  మనమంతా ఒక వూరివాళ్ళం.  అవసరానికి ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా.’  అని సోమన్నని ఆలయానికని బయల్దేర తీశారు.  కానీ వారి ఉద్దేశ్యం సోమన్నని ఆట పట్టించటం.

అందుకే అందరూ కలిసి సోమన్నని ఒక తోటలోకి తీసుకెళ్ళి, అక్కడ వున్న ఒక జైన గురువు విగ్రహం చూపించి, సోమన్న కళ్ళు తెరవలేడు కనుక, అతని చేతులతో ఆ విగ్రహం తడిమి చూసేటట్లు చేస్తూ, నువ్వు మీ గుడికి వచ్చావు.  మీ శివయ్య దర్శనం చేసుకోమని ప్రోత్సహించారు.

సోమన్న మనసులో శివుడే వున్నాడు.  ఆయన తను స్పృశిస్తున్నది ఆ పరమ శివుణ్ణే అనే భక్తి పారవశ్యంతో శివుణ్ణి అనేక విధాల ప్రార్ధనలు చేస్తుండగా, అతనిని అక్కడికి తెచ్చిన జైనులంతా ఒక్కసారి పెద్దగా అపహాస్యంగా అరుస్తూ,  ‘సోమన్నా, ఇంక చాలించు.  నువ్వు పూజిస్తున్నది మా జినేశ్వరుడిని.  మా జినేశ్వరుడు నీ ప్రార్ధనలు మెచ్చుకుని నిన్ను మాలో కలుపుకున్నాడు.  ఇవాళ్టినుంచి నువ్వుకూడా జైనుడివయ్యావు.  మాలో ఒకడివయ్యావు.’  అన్నారు.

అది విని సోమన్న తోక తొక్కిన తాచులాగా బుస్సుమని లేచి,  ‘ఛీ, ఛీ, దుర్మార్గుల్లారా, నేను ప్రార్ధించింది మీ జినేశ్వరుడిని కాదు.  నేను శివాలయంలో శివ లింగానికి మొక్కాను.  మీరూ ఆలయంలోకి రండి.  ఆ శివ లింగాన్ని దర్శించండి.’  అంటూ బలవంతంగా కళ్ళు తెరిచి చూసేసరికి, సోమన్న వునన చోట శివాలయంగా, ఆయన స్పృశించిన జైన మూర్తి శివలింగంగా కనబడ్డాయి అక్కడివారందరికీ.  అక్కడ వున్న జైనులంతా ఆశ్చర్య చకితులయ్యారు.   నిర్మలమైన ప్రగాఢ భక్తికి ఎదురేమీ లేదని నిరూపించాడు సోమన్న.

ఆ ఆలయం తర్వాత సోమనాధ దేవాలయంగా ప్రసిధ్ధి చెందింది.  అలా సోమన్న శివ భక్తి మూర్ఖంగా ప్రవర్తించిన కొందరు జైనులకి కనువిప్పు కలిగించింది.

***

No comments:

Post a Comment

Pages