అనసూయ ఆరాటం - 23 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 23 

చెన్నూరి సుదర్శన్ 



 సుశాంత్‌రెడ్డి పుట్టుడు ఆదిరెడ్డి దశ మరింత తిరిగింది. పట్టిందల్లా బంగారమైతాంది.

లోగడ నాచారంల కొన్న ఐదు వందల గజాల ప్లాటుల  ఇల్లు కట్టాలనుకున్నడు. అయితే ఇంకో రెండు వందల గజాల ప్లాటును అమ్మిపెట్టుమని ఒక బ్రోకర్‌కు చెప్పిండు. 

ఆదిరెడ్డి అనుకున్నంత ధర కంటే నాలుగితలు ఎక్కువనే వచ్చింది. అయితే బ్రోకరుకు రెండు శాతం ఇవ్వడమే పానం దస్సుమన్నది. మాలాసు పైసలు.. ఉండబట్టలేక బ్రోకర్‌ను నెలకు ఎన్ని ప్లాట్లు అమ్ముతడో తెల్సుకొని అప్సోసైండు. ‘ఇన్ని రోజులు బాయిల కప్ప లెక్క.. నేను సంపాయించుడే ఎక్కువనుకున్న. అసోంటిది.. మాటల గారడీలతో ప్లాట్లు .. కొనడం.. అమ్మడం చేత్తే.. ఇంతకు పదింతలు సంపాయించ వచ్చని ఆదిరెడ్డి మన్సుల బలంగ నాటుకున్నది.

బ్రోకరు తోటి మరిన్ని కిటుకులు తెల్సుకున్నడు. 

ప్లాటుకు బయాన ఇచ్చి అగ్రిమెంటు రాసుకొని అదే అగ్రిమెంటు కింద ఇంకోనికి అమ్ముకోవచ్చని తెల్సుకున్నడు. గట్ల రెండు, మూడు అగ్రీమెంటుల మీద కమీషన్లు చేతులు మారుతాంటై.. పైసలే .. పైసలు అని లాయిలప్ప లెక్క ఎగిరిండు అద్దిరెడ్డి.

అయితే ఇల్లు కట్టిచ్చుడు కంటే బిల్డరుకిచ్చింది నయమనుకున్నడు. 

ఆఫీసు పని పార్టు టైంగ పెట్టుకొని ఫుల్ టైం.. రియల్ ఎస్టేటు దందాల దూర్చిండు.

***

యాడాది తిరిగేటాల్లకు నాచారంల ఐదస్తుల ఫ్లాట్ నిలబడ్డది. ఆదిరెడ్డి పెద్ద రియల్ ఎస్టేటు వ్యాపారిగా పేరు సంపాయించిండు. ఇప్పుడు ఆదిరెడ్డి హైద్రాబాదుల.. అప్పుడే బొడ్డూసిన పొలగానికి కాన్నుంచి తెలిసి పోయిండు. 

కాని ఏసీలు ఫిట్టింగులప్పుడు వచ్చిన పేరు వేరు. ఇప్పుటి పేరు వేరు. ఆదిరెడ్డి నీయతి పురంగ కరాబైందనే అందరు చెవులు కొరుక్కుంటాంటే..ఆదిరెడ్డి బేఖాతర్ చేసేటోడు. వాల్లందరిని పిచ్చోళ్ళ కింద జమకట్టేటోడు ఆదిరెడ్డి. 

నాచారంల ఫ్లాటుకు ‘శ్రీ సాయి సరితా నిలయం’ అని పేరు పెట్టిండు. 

సుశాంత్‌రెడ్డి మొదటి పుట్టినరోజు పండుగ.. గృహ ప్రవేశం కలిసచ్చింది. ఫ్లాటు కనిపియ్యకుంట బుడ్డ లైట్లు పెట్టిచ్చిండు.  దేశంల ఎప్పుడూ.. ఎవ్వలూ ఇయ్యని విధంగ దావత్ ఇచ్చిండు ఆదిరెడ్డి.

ఈసారి రవీందర్ వచ్చిండు కాని సురేందర్ రాలేదు. 

సురేందర్ ఎందుకు వత్తలేడో అనసూయకు సమఝ్‌గాకచ్చింది. శాన రోజులై సూడక.. అని పానం కొట్టుకోబట్టింది. ఫోనన్న చేత్తలేడని మిడ్కబట్టింది. ఆదిరెడ్డినడిగితెనేమో.. నాకు తెల్వదంటడు. ఒక సారి తీస్కపోరా.. అంటే టైం లేదంటడు. ఫోనన్న చెయ్యిరా.. అంటే ఫోన్ నంబరు నాకు తెల్వదంటడు.

16

బుచ్చిమల్లు కిరాన దుకునం బాగానే నడుత్తాంది. రమేషు ఉషారు పిట్ట. సామాను తెచ్చుట్ల అమ్ముట్ల ఆరితేరిందు. సమ్మయ్యతోని పొత్తులు న్నప్పుడే ఒక్కగానొక్క బిడ్డపెండ్లి సేసిండు.  

కర్సులు పెర్యఉగుతాయని మల్ల బుచ్చిమల్లు బట్టల షాపు  తెర్సిండు. 

రమేషు బిడ్డపెండ్లైన యాడాదికే తాత అయ్యిండు. బిడ్డకు బిడ్డ పుట్టింది.

లచ్మీ దేవి పుట్టిందని బుచ్చయ్య సంబురపడబట్టిండు. ఇంట్ల సుత ఫోను పెట్టిచ్చిండు.

ఇయ్యాల రేపు ఆడోల్లైనా.. మొగోల్లైన..  గాచారం బాగ లేకుంటే వచ్చే కట్టాలు రాక తప్పై. అవి చెప్పి వచ్చేటివి కావు. కొన్ని చేజేతులా కొని తెచ్చుకునేటివి సుత ఉంటయనిపిస్తది

***

అవ్వాల ఐతారం.

ఐతారం.. ఐతారం బుచ్చిమల్లు ఇంట్ల పండుగ లెక్కనే చేత్తరు.

బుచ్చయ్యకు బోటి పేగుల దప్పుడమంటే ఇట్టం. రమేషుకేమో  తల్కాయె బొక్కల సోరువ.. కూరంటే ఇట్టం. 

పొద్దుగాల్నే మార్కెట్టుకు పోయిండు బుచ్చయ్య. తనకిట్టమైన పొడేలు బోటి కిలో తీసుకున్నడు. దానిదే తల్కాయె, కాళ్ళు.. కోతిమీరి తీస్కోని రమేషు పక్కలకెల్లి లేసేటాల్లకే తిరిగి వచ్చిండు.

బోటి బుచ్చయ్య పెండ్లాం వీరమ్మకిచ్చి బొంత ఉడుకబెట్టు మన్నడు. తను ఇంటెంకకు పోయి మూడు రాల్లు పెట్టి పొయ్యి దొరింపు చేసిండు. నాలుగు కట్టె ముక్కలు పెట్టి నిప్పు రాజేసిండు. తల్కాయె ముక్కుల పప్పుదువ్వ కొస నూకి.. మంట మీద కాల్సుకుంట.. తిరిగెయ్యబట్టిండు. పొయ్యి రాల్ల సందుల కాళ్ళు అటో రెండు .. ఇటో రెండు పెట్టిందు. 

దోస్తు బీడి ఎలిగిచ్చి తాప తాపకు ఊదుకుంట.. బీడి కింద పెట్టుకుంట..తల్కాయె ..కాళ్ళ ఎంటికెలు కాలుతాంటే..సన్నని చాకు తీస్కోని గీక బట్టిండు. ఒక్క ఎంటికె లేకుంట పొతం పెట్టినంక బాయి కాడికి పోయి పసుపు రాసి కొబ్బరి పీసేసి రుద్దుకుంట సాఫుగ కడిగిండు. 

ఇంట్ల కచ్చి సాపమీద పీట ఎల్లెల్కలేసి ముక్కలు కొట్టి వీరమ్మ కిచ్చిండు. ఇంతల రమేషు బోటి పేగులు ఉల్టా, పల్టా సేసి మంచిగ కడిగిండు. ఉడ్కపెట్టిన బొంత సుత సాపు చేసి ఈలపీట తోటి చిన్న చిన్న తుకుడలు సేసి వీరమ్మకిచ్కిండు.  

వీరమ్మ వంట పనిల పడ్డది. వీరమ్మ బిడ్డను పొయ్యికాడికి రానియ్యది. ఎంత వంటైనా తనొక్కతే సేత్తది.

అలవాటెంబడి బుచ్చయ్య, రమేషు ఇద్దరు కలిసి చెరో సికిలు మీద బండారుపల్లికి కల్లు తాగ పోయిండ్లు. ములుగు నుండి మూడు కిలోమీటర్ల దూరముంటది.

పోద్దాడు కల్లు పారుతాంది. తియ్యగుంటదని కడుపు నిండ తాగి నాలుగు సీసల కల్లు ఇంటికి తీస్కచ్చిండ్లు. 

రమేషు పెండ్లాన్ని పిల్సిండు. వీరమ్మ సుత వచ్చింది. కటోరలల్ల తల్కాయె బొక్కల కూర.. సోరువ తెచ్చింది. నలుగురు కలిసి రెండు సీసలు తాగి తిన్నరు. పగటి నిద్ర తీద్దామని బుచ్చిమల్లు, రమేషు మంచం మీద వాలిండ్లు. 

నాత్రికి మిగిలిన రెండు సీసలు పట్టిచ్చిండ్లు. కడుపునిండ తిని పండుకొని గుర్రుకొట్టబట్టిండ్లు.

నడి నాత్రి.. ఫోను మోగుతాంది..ఫోను మోగుతాంది..

బుచ్చిమల్లు మెల్లంగ లేచి కండ్లు నల్సుకుంట ఫోనెత్తి..

“హల్లో..” అన్నడు.

అవతలకెల్లి సంగతి తెల్వంగనే..”వీరమ్మా..” అని నోరుకొట్టుకుంట బట్టల మూట లెక్క నిల్సున్న జాగల్నే  కూలబడ్డడు. తాగిన నిస అమాంతం దిగింది.

దెబ్బకు అందరు లేసిండ్లు. తొట్టెల పొల్ల గజ్జున వన్కి ఏడ్వబట్టింది.

“ఏమైందయ్యా..! గట్ల ఒర్రితివీ..” అన్కుంట వీరమ్మచ్చింది.

బుచ్చయ్యకు నోట్లెకెల్లి మాటత్తలేదు. కాళ్ళు చేతులు వన్కబట్టినై. రమేషు వంటింట్లకుర్కి మంచినీల్లు తెచ్చిచ్చిండు. బుచ్చయ్య వల్లనన్నట్టు సైగజేసిండు.

“ఏమైంది మామా..” అని గాబర పడుకుంట అడిగిండు రమేషు.

“రవీందర్ బిడ్డ బంగ్ల మీదికెల్లి కింద పడి సచ్చిపోయిందట” అనంగనే వీరమ్మ అట్లనే గోడకొరిగి కిందికి జారింది. మనిషి జరంత సేపు ఖ్యాల్ తప్పింది. 

ఏడ్పులు.. పెడబొబ్బలు పద్మనగర్ కాలనీ వాల్లనందరినీ లేపి కూకోబెట్టింది. దొంగలు గిట్ల పడ్డరా.. అని ఒగలెన్క ఒగలు ఉర్కచ్చిండ్లు.

సుస్మిత సచ్చిపోయిందన్న సంగతి తెల్సుకొని బావురుమన్నరు.

సంటి పిల్లతోటిసావు కాడికి పోవుడు మంచిది కాదని బుచ్చయ్య బిడ్డను ఇంట్లనే ఉంచి మిగిలిన ముగ్గురు తెల్లారగట్ల బస్సుకు హైద్రాబాదు బైలెల్లిండు.   

***

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages