ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం - 3 - అచ్చంగా తెలుగు
ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం - 3
( మూడవ భాగం )
శ్రీరామభట్ల ఆదిత్య 



భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు.
రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము.”

ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్ధతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.

అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

సమాప్తం

No comments:

Post a Comment

Pages