తెలియడుగాక ద్రిష్టము జీవుడు - అచ్చంగా తెలుగు

తెలియడుగాక ద్రిష్టము జీవుడు

Share This
తెలియడుగాక ద్రిష్టము జీవుడు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి 


రేకు: 0352-01 సం: 04-303

పల్లవి: 

తెలియడుగాక ద్రిష్టము జీవుడు

సులభమిదివో యిచ్చోటనే పరము

చ.1: 

మనసునదలచిన మర్మములు గరగి

చొనుపుచు నింద్రియసుఖ మిచ్చు

అనువుగ నిటువలె హరిదలపోసిన

తనకు బ్రహ్మానందము సమకొనదా

చ.2:

మాటలాడినను మరిగి మానవులు

యీటున మెచ్చిత్తురేమైనను

నాట నిట్ల హరినామము నొడివిన

గాటపువరములు కలుగునె కాదా

చ.3:

చేసినపుణ్యము చేతజుట్టుకొని

రాసి వెనుతగిలి రక్షించు

వేసర కిటు శ్రీవేంకటేశ్వరుని

ఆసల కైంకర్యము ఫలించును


భావం:

పల్లవి:

దేవుడు  తెలియడు( చూడబడినవాడు కాడు) కాని  జీవుడు చూడబడినవాడు.

ఇచ్చోటనే(ఈ లోకంలోనే ) మోక్షమున్నది. ఇది చాలా సులభము.


చ.1:

మనసులో ఇష్టమయిన లౌకిక విషయాలు తలిస్తే ( కాంతా వ్యామోహము మొ.) మర్మములు కరిగి ఇంద్రియసుఖము కలుగుతుంది.

ఈ రకంగా హరిని తలిస్తే తనకు బ్రహ్మానందము లభించదా? (  లౌకిక విషయాలను తలిస్తే ఆనందం- హరిని తలిస్తే బ్రహ్మానందం లభిస్తుందని అందువల్ల హరిని కొలవాలని భావం)


చ.2:

మాటలాడితే  ఆసక్తిగా పలికితే -  మానవులు -పరిమితితో  మెచ్చి ఏమైనా ఇస్తారు.

ఈ రకంగా హరినామము ఆసక్తిగా పలికితే- స్వామివలన - ఇంకా అధికమైన వరములు కలుగుతాయి కదా !


చ.3:

మనము చేసినపుణ్యము చేతిలో చుట్టుకొని(అందుబాటులో అని భావం) ఆ పుణ్యరాశి వెంబడిరచి రాబోయే జన్మలలో రక్షిస్తుంది.

శ్రమపడక ఇట్లు శ్రీవేంకటేశ్వరుని సేవిస్తే ఆశల కైంకర్యము (భగవంతునికిని భగవద్భక్తులకును చేసెడి ఊడిగము.) ఫలిస్తుంది. (చేసే పుణ్యాలకంటె శ్రీవేంకటేశ్వరుని సేవ అధికమైన ఫలితాన్ని ఇస్తుందని భావం)

***

No comments:

Post a Comment

Pages