చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 29 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 29

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 29

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
 

(చంద్రమణికోటలో దొరికిన వ్యక్తి ఏమీ చెప్పటం లేదని పోలీసు చీఫ్ నాన్సీకి చెబుతాడు. నాన్సీ తనకు కోట బురుజులో దొరికిన చీటీని చీఫ్ కిస్తుంది. ఆ ఖైదీ దగ్గర తనకు దొరికిందని చీఫ్ "తోడేలు కన్ను" అని వ్రాసి ఉన్న చీటీని నాన్సీకి యిస్తాడు. జోడీ ఆరంస్ట్రాంగ్ ఆహ్వానంపై వారి యింట్లో కార్యక్రమానికి హాజరై, ఆ కార్యక్రమాన్ని నాన్సీ బాగా ఆస్వాదిస్తుంది. తరువాత. . .)
 
 
నాన్సీ, ఆమె మిత్రబృందం తమకు ఆతిథ్యమిచ్చిన వాళ్ళకు శుభరాత్రి చెప్పటానికి వెళ్ళారు.

జోడీ దగ్గరకు నాన్సీ వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయి, "“ఓహ్! దయచేసి అప్పుడే వెళ్లవద్దు. మేడ మీద నేను మీకు చూపించాలనుకొన్నది ఒకటుంది. మీ స్నేహితులు తప్ప మిగిలిన అతిథులు వెళ్ళేవరకు ఆగండి. ఏమైనప్పటికీ, మా కజిను వాళ్ళతో మాట్లాడాలని అనుకొంటున్నాడు."

"అలాగే!"

నాన్సీ, ఆమె మిత్రులు పూలతోటలో ప్రత్యేకత కలిగిన, ముఖ్యంగా అందంగా కనిపించే ప్రాంతానికి వెళ్ళారు.

ఆక్కడ రెండు బెంచీలు ఉన్నాయి, వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. హార్వీ స్మిత్ వాళ్ళను కలిసాడు.

ప్రస్తుతం యితర అతిథుల్లో చివరి వాళ్ళు శుభరాత్రి చెప్పి వెళ్ళిపోయారు. జోడీ అక్కడకు వచ్చి నాన్సీని తనతో రమ్మని సైగ చేసి పిలిచింది. "ఆమెను ఎక్కువసేపు ఉంచను" అని మిగిలినవారితో చెప్పిందామె.

ఇద్దరు అమ్మాయిలు మేడ మీద ఉన్న జోడీ పడకగదికి వెళ్ళారు. ఆ గది సన్నని నూలు తెరలు, మంచంపై చేతి అల్లికల డిజైన్ల దుప్పట్లతో నాజూకుగాను, మనోహరంగాను ఉంది.

"నిన్న మీరు యిక్కడకు వచ్చినప్పుడు నా చిన్నప్పటి ఫొటోల గురించి పేర్కొన్నారని అమ్మ చెప్పింది" జోడీ చెప్పటం ప్రారంభించింది. "సరె! ఇంతకాలం వాటిని మేము చూడలేదు. అందుకే సరదాకి, నిన్న రాత్రి నేను అటక ఎక్కి, వాటిని బయటకు తీసాను. మీరింకా వాటిని చూడాలనుకొంటున్నారా?"

"ఓహ్! అవును" నాన్సీ ప్రతిస్పందించింది.

చాలా ఫొటోలు పెట్టెల్లో ఉన్నాయి. తన పన్నెండవ ఏట తీయించుకొన్న ఫొటోని జోడీ ముందుగా పైకి తీసింది. ఈ ఫొటోలో ఆ అమ్మాయికి, నాన్సీ పర్సులోని ఫొటోలో ఉన్న మూడేళ్ళ వయసు అమ్మాయికి అసలు పోలికే లేదు.

"మీరు ఎప్పుడూ అందంగానే ఉంటారని ఊహించుకొన్నాను" నవ్వుతూ నాన్సీ చెప్పింది. ఫొటోలో జోడీ కట్టుకొన్న బట్టల గురించి నాన్సీ ప్రస్తావించగా, యిద్దరు అమ్మాయిలు నవ్వుకొన్నారు.

"పిల్లలు తమ పద్ధతులను త్వరగా మార్చుకొంటారన్న విషయం మీరు ఆలోచించరనుకుంటా!" జోడీ వ్యాఖ్యానించింది. "పన్నెండేళ్ళ వయసులో నాకు ఉన్న జుట్టుకి, యీరోజు ఉన్న జుట్టుకి అసలు పోలికే కనిపించదు."

ఆమె తన పాత రోజుల విషయాలు చెబుతుంటే, నాన్సీ తనలోని అసహనాన్ని పైకి కనిపించనీయలేదు. కానీ చివరకు ఆమె తన చివరి పెట్టెను అందుకొంది. "ఈ ఫొటోలు నన్ను అమ్మానాన్నలు దత్తత తీసుకొన్న వెంటనే తీయించుకొన్నవి" అంటూ జోడీ నవ్వింది. "దత్తు పోయిన పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు పెంపుడు తల్లిదండ్రులచే ఎంచుకోబడతారు. అంతేగాక ప్రగాఢమైన యిష్టంతో వాళ్ళని కోరుకొంటారు."

ఆమె మాటలను నాన్సీ అంగీకరించి, ఆరంస్ట్రాంగులు అద్భుతమైన వ్యక్తులని జోడించింది. "మీరు ఒకరినొకరు కనుగొన్న అదృష్టవంతులు."

అదే సమయంలో మిసెస్ ఆరంస్ట్రాంగ్ జోడీని పిలిచింది. "అమ్మా! నువ్వు ఒక్క నిమిషం కిందకొస్తావా?" ఆమె అడిగింది.

"అలాగే అమ్మా!" జోడీ నాన్సీ వైపు తిరిగింది. "నేను ఎంతోసేపు బయట ఉండను. మీరు ఈ ఫొటోలను చూస్తూండండి."

తనను ఒంటరిగా వదిలేసినందుకు నాన్సీ పొంగిపోయింది. త్వరగా ఆమె ఆఖరి పెట్టెను తెరచి, ఒక ఫొటోని పైకి తీసింది. ఆమె తన పర్సును తెరచి దానిలోని జోనీ హోర్టన్ ఫొటోని పైకి తీస్తుంటే, నాడి వేగంగా కొట్టుకొంది. ఆ ఫొటో పెట్టెలోని ఫొటో కన్నా ఆరు నెలలు ముందు తీయించుకొన్నది.

ఇది అదే అమ్మాయి!

"జోడీ ఆరంస్ట్రాంగ్ మరియు జోనీ హోర్టన్ ఒకే వ్యక్తి అన్నమాట!" నాన్సీ ఆలోచించింది. "ఆమె తల్లి ఆమె విషయాలను తనకు తెలియకుండా రహస్యంగా ఉంచలేదు! ఆమె నిజమైన తల్లిదండ్రులు జీవించిలేరు! ఆమె కిడ్నాప్ కి గురయింది! ఆరంస్ట్రాంగ్ దంపతులు, జోడీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని తాను ఖచ్చితంగా విశ్వసిస్తోంది. తమ మనుమరాలు సజీవంగా, ఆనందంగా ఉందని తెలుసుకొంటే, బోవెన్ దంపతులు అంతే సంతోషిస్తారు!

"మిసెస్ హోర్టన్ ఆస్తులకు జోడీయే సరయిన వారసురాలు. వాటికి హక్కుదారుగా ప్రకటించుకొన్న ఆ ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి, న్యూయార్కునుంచి నకిలీ గుర్తింపు పత్రాలను తీసుకొచ్చింది!"

నాన్సీ బుర్రలో అనేక భావాలు పరిగెత్తాయి. అన్నింటిలో మొదటిది, తన తండ్రితో మాట్లాడేవరకూ తను కనుగొన్న విషయాలను రహస్యంగా ఉంచాలి. ఈ మొత్తం ప్రణాళికకి వెనుక ఉన్నదెవరు? చిన్నపాప జోనీని ఎత్తుకుపోయి, ఆమెను దత్తత సంఘం గుమ్మంలో విడిచిపెట్టిందెవరు? తరువాత మరొకరి రూపంలో నటించిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తోంది? శాన్ ఫ్రాన్సిస్కోలోనా? ఈరోజు ఎస్టేట్ డబ్బు ఏమన్నా మిగిలి ఉందా?

"ఒక్క విషయం మాత్రం ఖచ్చితం" నాన్సీ తనలో అనుకొంది. "ఈ మోసానికి బాధ్యులైన వారు, నేను దేనినీ తల్లక్రిందులు చేయనన్న నిశ్చయంతో ఉన్నారు" నాన్సీ తనలో నవ్వుకొంది. "కానీ నేను వారి దుష్ట పథకాన్ని బయటపెట్టాను."

అకస్మాత్తుగా మేడ మీదకొస్తున్న జోడీ అడుగుల చప్పుడు విందామె. తన దగ్గర ఉన్న జోనీ హోర్టన్ ఫొటోని వేగంగా పర్సులో దాచేసింది నాన్సీ.

జోడీ గదిలోకి ప్రవేశించగానే, "ఫొటోలు నాకు చూపించినందుకు ఒక మిలియన్ ధన్యవాదాలు" అంది నాన్సీ. "ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొన్న బంగారుకొండవి నువ్వు. ప్రస్తుతం, నా మిత్రులు నా కోసం యింకా నిరీక్షించకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను."

యువత అంతా మోటెలుకి తిరిగి వెళ్ళేవరకు నాన్సీ తన రహస్యాన్ని తనలోనే దాచుకొంది. అమ్మాయిలు అబ్బాయిలకు శుభరాత్రి చెప్పారు. బెస్, జార్జ్ లతో తన గదిలోకి వచ్చాక, నాన్సీ ఈ ఉత్తేజకరమైన వార్తను వాళ్ళకు చెప్పింది.

"ఓ నాన్సీ! నువ్వు పూర్తిగా అద్భుతమైనదానివి" అంది బెస్. "ఇప్పుడు జోడీ నిజం తెలుసుకొని తన డబ్బంతా పొందవచ్చు."

జార్జ్ ఈ విషయాన్ని మరింత ఆచరణ సాధ్యమైన దృక్కోణంలో చూసింది. "దానిలో ఒక్క సెంట్ కూడా మిగిలి ఉండకపోవచ్చు" అందామె. "ఇప్పుడు ఉన్న విధంగానే విషయాలు ఉంటే మంచిదని నా అభిప్రాయం. జోడీ ఎప్పటికీ కనిపెట్టబడకుండానే ఉండాలి."

"మనం ఏమి చేసినా, మీరు దీన్ని రహస్యంగా ఉంచటంలో నాకు సాయపడాలి" చెప్పింది నాన్సీ.

ఆమె స్నేహితురాళ్ళు అలాగే మాటిచ్చారు. తరువాత, "నువ్వు ఏమి చేయబోతున్నావు?" అని బెస్ అడిగింది. తన తండ్రి ఈ కేసును చేపట్టాలని ఈ సమయంలో తాను భావిస్తున్నట్లు నాన్సీ చెప్పింది. "ఏది ఉత్తమమైన చర్య అన్నది ఆయనే నిర్ణయిస్తాడు. ఈ వార్తను బోవెన్ దంపతులకు ఎలా తెలియజేయాలో నాన్నకు తెలుసు. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో కూడా ఆయనే చూస్తాడు."

"ఇప్పుడు నువ్వు ఈ కేసును పరిష్కరించావు గనుక మనం యింటికి పోవచ్చని అనుకొంటున్నాను" వ్యాఖ్యానించింది బెస్.

"ఓహ్! లేదు" వెంటనే చెప్పింది నాన్సీ. "జోడీ ఆరంస్ట్రాంగ్ గుర్తింపు తప్ప, యింక నేను దేనినీ పరిష్కరించలేదు. ఆమె అమ్మమ్మ సంపద దొంగిలించబడిందన్న విషయాన్ని మరిచిపోవద్దు. మనం యిప్పుడు ఆ రహస్యాన్ని విప్పటంపై దృష్టి పెట్టాలి."

మిస్టర్ సీమన్ని నాన్సీ అనుమానిస్తోందని బెస్. జార్జ్ లకు తెలుసు. మరొక అనుమానించదగ్గ వ్యక్తి ఆమెను అనుసరించిన వాడు మరియు కోటలో పట్టుకొన్న బుంగమీసాలవాడు. తాము ఆమెతోనే ఉండి పని చేస్తామని అమ్మాయిలిద్దరూ చెప్పారు.

ముగ్గురు స్నేహితులు అబ్బాయిలకు వీడ్కోలు చెప్పటానికి ముందుగానే నిద్ర లేచారు. నెడ్, మిగిలిన అబ్బాయిలు తమ గూఢచర్యంలో జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలను వేడుకొన్నారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages