"బంగారు" ద్వీపం (అనువాద నవల) -8 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -8

Share This

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -8

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton

 



(తిమోతీని తాము ప్రేమిస్తున్నామనగానే జార్జి పిల్లలతో కలిసిపోతుంది. అయితే తిమోతీని తాను వదలలేదన్న సంగతి యింట్లో చెప్పవద్దని జార్జి చెబుతుంది. భోజనాల దగ్గర తిమోతీ విషయమెత్తబోయిన అన్నె ని జార్జి కాలిపై తన్నినందుకు ఆమె తల్లి కేకలేస్తుంది, అన్నె తన తప్పును తెలుసుకొని, రొట్టె, జున్ను పట్టుకొని,తోటలో ఉన్న జార్జి వద్దకొస్తుంది. తరువాత)
@@@@@@@@@@@@@

జార్జి లేచి కూర్చుంది. "శిధిలాల దగ్గరకు నిన్ను తీసుకెళ్ళకూడదని తీర్మానించుకొన్నాను" చెప్పిందామె. "మందబుద్ధీ!"

అన్నె హృదయం జారిపోయింది. దాని గురించే ఆమె భయపడింది. "సరె!" అందామె. "నన్ను తీసుకెళ్ళవలసిన అవసరం లేదులే! కానీ జార్జి! అబ్బాయిలను తీసుకెళ్ళు. తరువాత, వాళ్ళేమీ తెలివితక్కువ పని చేయలేదు. ఏమైనప్పటికీ, నువ్వు నన్ను దారుణంగానే తన్నావుగా! ఈ గాయాన్ని చూడు."

జార్జి దాని వైపు చూసింది. తరువాత అన్నె ముఖం వైపు చూసింది. “కానీ నేను నువ్వు లేకుండా, జూలియన్, డిక్ లను తీసుకెళ్తే నీకు బాధ అనిపించదా?" అడిగిందామె.

"కావచ్చు" చెప్పింది అన్నె. "కానీ నాకు లేదని, వాళ్ళను ఆనందానికి దూరం చేయాలని నేను కోరుకోవటం లేదు."

అప్పుడు జార్జి ఆమె ఆశ్చర్యపోయే పని చేసింది. ఆమె అన్నెను కౌగలించుకొంది. తరువాత కుర్రాడెవడూ తను చేసినట్లు చేయడని అనిపించి, వెంటనే తనలో తనే సిగ్గుపడింది. ఎప్పుడూ తను కుర్రాడిలాగే ఉండాలని ప్రయత్నిస్తుంది కద!

"అంతా బాగుంది" అంటూ ముఖాన్ని చిట్లించి, ఆమె రొట్టె, జున్ను తిన్నది. “ఇంచుమించుగా నువ్వొక తప్పు చేసావు, నేను నిన్ను తన్నాను. కాబట్టి చెల్లుకి చెల్లు. అందుకే ఈ మధ్యాహ్నం నువ్వు రావచ్చు."

అంతా సర్దుకొందని అబ్బాయిలకు చెప్పటానికి అన్నె పరుగున వెనక్కి వెళ్ళింది. మరొక పదిహేను నిమిషాల తరువాత నలుగురు పిల్లలు సముద్రపుగట్టుకి పరుగెత్తారు. పధ్నాలుగేళ్ళ వయసు ఉన్న గోధుమ ముఖం గల జాలరి కుర్రాడు ఒక పడవ దగ్గర ఉన్నాడు. అతనితో తిమోతీ ఉంది.

"పడవ సిద్ధంగా ఉంది మాస్టర్ జార్జి!" చిరునవ్వుతో చెప్పాడా కుర్రాడు. "టిం కూడా సిద్ధమే!"

"ధన్యవాదాలు" అంటూ జార్జి మిగిలిన వాళ్ళను పడవ ఎక్కమని చెప్పింది.

తిమోతీ కూడా లోనికి దూకి తన పెద్ద తోకను వేగంగా ఊపింది. జార్జి పడవను నీటిలోకి నెట్టి, తరువాత లోనికి దూకింది. ఆమె తెడ్లను చేతిలోకి తీసుకొంది.

ఆమె అద్భుతంగా పడవను నడుపుతూంటే, అది నీలి రంగు తీరానికి సమాంతరంగా వేగంగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం అద్భుతంగా ఉంది. పడవ నీటిపై ఊగిసలాడుతుంటే పిల్లలు సంతోషించారు. తిమోతి పడవ ముందుభాగంలో నిలబడి, అల పైకి లేచినప్పుడల్లా మొరగసాగింది.

"అసాధారణంగా ఉన్న రోజు చాలా వినోదంగా ఉంటాడు" దాన్ని గట్టిగా లాగుతూ అంది జార్జి. "పెద్ద అలల్ని చూస్తే పిచ్చిగా మొరుగుతాడు. అవి ముఖాన నీళ్ళు కొడితే చాలా కోపం వస్తుంది. పెద్ద గజ ఈతగాడు."

"మనతో ఒక కుక్క ఉండటం మంచిది కాదా?" అన్నె తన తప్పును సరిదిద్దుకొందుకు ఆత్రుతగా అంది. "నేను దానిలాగే చేస్తాను."

"వూఫ్" అంటూ తన లోతైన గొంతుతో మూలిగి, అన్నె వైపు తిరిగి కుక్క ఆమె చెవిని నాకుతోంది.

"నేను చెప్పింది తనకు అర్ధమైనట్లు ఖచ్చితంగా భావిస్తున్నాను" అన్నె సంతోషంగా అంది.

"కావచ్చు" అంది జార్జి. "ఇది ప్రతి పదాన్ని అర్ధం చేసుకొంటుంది."

“మనమిప్పుడు నీ ద్వీపానికి చేరుకొంటున్నాం" జూలియన్ సంబరపడ్డాడు. "ఇది నేను అనుకున్న దాని కన్నా పెద్దది. కోట ఉత్తేజాన్ని యివ్వటం లేదూ?"

వారు ద్వీపానికి దగ్గరయ్యారు, దాని చుట్టూ వాడిగా ఉన్న రాళ్ళను పిల్లలు గమనించారు. ఎవరికైనా తీరానికి చేరే మార్గం ఖచ్చితంగా తెలియకపోతే, పడవ లేదా ఓడ ఆ చిన్న రాతిద్వీపం గట్టుకి చేరలేవు. ఆ ద్వీపం మధ్యలో ఎత్తు తక్కువగా ఉన్న కొండ మీద శిధిలమైన ఆ కోట నిలబడి ఉంది. అది తెల్లగా ఉండే పెద్ద రాళ్ళతో నిర్మించబడింది. బీటలు వారిన కమాను ద్వారాలు, అక్కడక్కడ కూలిపోయిన బురుజులు, శిధిలమైన గోడలు - ఇవన్నీ ఒకప్పటి అందమైన కోటలో గర్వంగా మరియు బలంగా మిగిలిపోయిన గుర్తులు. ప్రస్తుతం జాక్డా కాకులు దానిలో గూళ్ళు కట్టుకొన్నాయి. సముద్రపు కొంగలు దాని ఎత్తయిన రాళ్ళపై కూర్చుని ఉన్నాయి.

"ఇది చాలా విచిత్రంగా కనిపిస్తోంది" అన్నాడు జూలియన్. "నేను అక్కడ దిగడానికి మరియు కోటను చూడటానికి ఇష్టపడతాను. ఇక్కడ ఒకటి లేదా రెండు రాత్రులు గడపడం సరదాగా ఉండదా!"

జార్జి పడవను ఆపింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. "నేను చెబుతున్నా!" ఆనందంగా అందామె. ""మీకు తెలుసా! అది యింత మనోహరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు! నా ద్వీపంలో ఒక రాత్రి గడపాలని! ఇక్కడ ఒంటరిగా ఉండటానికి మనం నలుగురమే ఉన్నాం. మనం స్వంతంగా భోజనం తయారు చేసుకొని, నిజంగానే అక్కడ నివసిస్తున్నట్లు నటిస్తే. . . గొప్పగా ఉండదా?"

"అవును కదా!" ఆపేక్షగా ద్వీపం వైపు చూస్తూ అన్నాడు డిక్. "మీ అమ్మ మనల్ని అనుమతిస్తుందని నువ్వు అనుకొంటున్నావా?"

"నాకు తెలియదు" జార్జి చెప్పింది. "ఆమె ఒప్పుకోవచ్చు. నువ్వు ఆమెను అడగాల్సింది."

"ఈ మధ్యాహ్నం మనం అక్కడ దిగలేమా?" అడిగాడు జూలియన్.

"లేదు, మీరు శిధిలాలను చూడాలనుకుంటే కాదు" అని జార్జి చెప్పింది. "ఈరోజు మనం టీ కోసం వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ పడవలో కిర్రిన్ ద్వీపం అవతల వైపుకి వెళ్ళి, తిరిగి రావటానికే మన సమయం అంతా అయిపోతుంది."

"సరె! నేను శిధిలాలను చూడాలనుకొంటున్నాను" చెప్పాడు జూలియన్. శిధిలాలా, ద్వీపమా ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నాడు. "జార్జి! ఇక్కడ తెడ్లను నన్ను తీసుకోనీయి. అస్తమానూ నువ్వే పడవ నడపలేవు."

"నడపగలను" చెప్పింది జార్జి. “అయితే మార్పు కోసం కాసేపు పడవలో పడుకొని ఆనందించాలనుకొంటున్నాను. చూడు. నేను మిమ్మల్ని ఈ రాతి ప్రాంతం మధ్య నుంచి తీసుకెళ్తాను. ఇది దాటాక మరొక ప్రమాదకరమైన ప్రాంతం వచ్చే వరకూ నువ్వు తెడ్లను తీసుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ తీరానికి చుట్టూ ఉన్న రాళ్ళు ప్రమాదకరమైనవి."

జార్జి, జూలియన్ పడవలో తమ స్థానాలను మార్చుకొన్నారు. జూలియన్ పడవను బాగానే నడుపుతున్నా, జార్జి అంత బలంగా మాత్రం నడపలేడు. ఆ రాళ్ళ మధ్య నుంచి పడవ సాఫీగా ముందుకు సాగిపోతోంది. వారు ద్వీపానికి కుడివైపుకి మళ్ళారు. కోట తీరానికి అటువైపున కనిపిస్తోంది. సముద్ర ముఖంగా ఉన్న ఆ ప్రాంతమంతా మరింత పాడైపోయినట్లు కనిపిస్తోంది.

"బహిరంగ సముద్రం నుండి బలమైన గాలులు వస్తాయి" అని జార్జి వివరించింది. "ఇటుపక్కన ఈ రాళ్ళ గుట్టలు తప్ప పెద్దగా ఏమీ లేదు. కానీ సరిగా కనుక్కొనే నైపుణ్యం ఉన్నవాళ్ళకు ఈ గొందిలో ఉపయోగకరమైన ఒక చిన్న నౌకాశ్రయం కనిపిస్తుంది."

జార్జి తెడ్లను తాను తీసుకొని పడవను ద్వీపానికి కొంచెం దూరంగా నడిపించింది. తరువాత పడవను ఆపి, వెనక్కి తిరిగి ఒడ్డు వైపు చూసింది.

"నువ్వు శిధిలాలకు దూరంగా ఉన్నప్పుడు, వాటి గురించి ఎలా తెలుస్తుంది?" జూలియన్ అడిగాడు. "నేనైతే ఎప్పటికీ తెలుసుకోలేను."

"చూడు. ద్వీపంలో ఉండే చర్చి గోపురం కనిపిస్తోందా?" జార్జి అడిగింది. "ఆపైన ఉండే కొండ శిఖరాన్ని చూస్తున్నావా? అటు తరువాత, నువ్వు అవి రెంటిని ఒకే వరుసలో వచ్చేలాగా నిలబడి, కోట యొక్క రెండు బురుజుల మధ్య గమనిస్తే, సరిగా నువ్వు ఓడ శిధిలాలకు ఎదురుగా ఉన్నట్లే! చాలా ఏళ్ళ క్రితమే దాన్ని నేను గమనించాను."

పిల్లలు దూరంగా ఉన్న కొండ శిఖరం, యివతల ఉన్న చర్చి గోపురం ఒకే వరుసలో ఉండేలా నిలబడి గమనించారు. తమకు కనిపించిన రెండు పాత బురుజులతో ఉన్న ద్వీపం మీద కోట నుంచి తమ దృష్టిని మెల్లిగా దానికి ఎదురుగా ఉన్న సముద్ర జలాల వైపు మళ్ళించారు. ఆ నీటిలో ఓడ శిధిలాలను కనిపెట్టాలన్న ఆత్రుత వారిలో కలిగింది.

అక్కడ నీరు స్పష్టంగా, నిశ్చలంగా ఉంది. అలలు కూడా చాలా అరుదుగా కదులుతున్నాయి. తిమోతి కూడా ఆ నీటిలోకి తల వంచి, చెవులను రిక్కించి, తనకు తెలిసిన దేన్నో వెతుకుతున్నట్లు చూస్తోంది! దాని వాలకాన్ని చూసి పిల్లలు నవ్వారు.

"మనం ఖచ్చితంగా ఆ ప్రాంతానికి తిన్నగా లేనట్లుంది" అంది జార్జి. "ఈరోజు అలలు లేకుండా నీరు నిశ్చలంగా ఉంది. స్పష్టంగా చాలా లోతుకి చూడగలం. ఇక్కడే ఉండండి. నేను పడవను కొద్దిగా ఎడమకు పోనిస్తాను."

"ఊ!" తిమోతి మెల్లిగా మూలుగుతూ, అకస్మాత్తుగా తోకను ఊపసాగింది. అదే క్షణంలో ముగ్గురు పిల్లలకు నీటి అడుగున బాగా లోపల ఏదో కనిపించింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages