తుమ్మమొద్దు - అచ్చంగా తెలుగు
తుమ్మమెద్దు
(మా నర్సాపురం కథలు)
భావరాజు పద్మిని'ఏమే తుమ్మమెద్దూ! ఎక్కడచచ్చావే?' కోపంగా అరిచాడు హనుమంతు.

'అయ్ బాబోయ్... వత్తన్నానండి... ఓ నిముషం!'... అని బదులిచ్చి, 'పేరుకు దగ్గ కుప్పిగంతులీనకు', మనసులో తిట్టుకుంది వేదవతి.

'ఐదు చదివిన పిల్లని మరదలన్న వంకతో నాకంటగట్టారు. ఏ పనీ టయిముకి చెయ్యలేవా? అవతల లేటౌతోంది!'

'ఇంద కారేజీ. తీస్కోండి!' మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ అని, 'చెప్పడం మర్చాను, పక్కింటి జానకి లేస్ పార్క్‌ కు కూడా రమ్మంది. అక్కడేదో లేసులల్లడం నేర్పుతారంట! పిల్లలిద్దరూ చదువులకి అమెరికా ఎల్లాకా నాకూ తోచుబాటు కాట్లేదు. నేనూ ఎల్లొస్తానే!' ఆశగా చూస్తా అంది వేదవతి.

'ఓసోస్... ఇన్నేళ్లూ లేంది, యాభైయేళ్లొచ్చి సగం తల ముగ్గుబుట్టయ్యాకా, నీ పాదరసబ్బుర్రతో ఇంకేం నేర్చుకుంటావ్? సర్లే, ఏదో ఆశపడుతున్నావ్ గా, పోయిరా!' వెటకారంగా 
అంటూ గుమ్మం దాటాడు హనుమంతు.

మనసు చివుక్కుమంది వేదవతికి. ఇలా జరగడం తొలిసారేం కాదు. గత ముప్ఫైరెండేళ్ల కాపరంలో అడుగడుగునా అవమానాలు, విసుర్లే తప్ప ప్రేమగా మాట్టాడిన సందర్భాలు తక్కువే! 'హా పోన్లే, అసలొప్పుకున్నారుగా!' అని సరిపెట్టుకుని, తయారవ్వడానికెళ్లింది.

'ఏమే, జానకీ! మా ఆయన అస్తమానూ నన్ను తుమ్మమొద్దూ, తుమ్మమొద్దూ అని పిలుస్తా ఉంటే, అసలు నేనెందుకూ పనికిరానేమోనని నామీన నాకే నమ్మకం పోయిందే! ఈ లేసులల్లడం నాకొచ్చుద్దంటావా?' అనుమానంగా అడిగింది వేదవతి.

'నవ్విన నాపచేనే పండుద్దని అంటారుగదే! నీకేం చాతగాప్పోతే ఇద్దరు పిల్లల్ని సుబ్బరంగా ఎలా పెంచావు, ఎలా చదివించి ప్రయోజకుల్ని జేసావు? నువ్వు మొద్దువుకాదే, మెరికలాటి దానివి. అంతెందుకు, పిల్లల్తో మాట్టాడాలని ఆశపడ్తా ఉంటే, నేను ఈడియో కాలింగులయీ‌ నేర్పితే ఇట్టే పట్టెయ్యనేదూ? మీ ఆయన మాటలు పట్టించుకోబోక! నువ్వు ఖచ్చితంగా ఈ విజ్జ నేర్చేసుకుంటావు. నీమీద నీకు నమ్మకం నేకపోయినా నాకుందే వేదా! పద లోనికెళ్దాం' ప్రోత్సహిస్తూ అంది జానకి.

ఆమె మాటలకు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేసింది వేదవతి. లోపలకు వెళ్లాకా అందర్నీ కూర్చోబెట్టి, ట్రైనర్ భావన ఇలా చెప్పసాగారు.

'మనిషి తన జీవితంలో ప్రతీ రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకోవాలన్న తపన ఉండాలి కానీ దానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి తపనతో ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం! 

లేసులల్లే కళలో రెండు వందేలేళ్లకు పైగా చరిత్ర ఉంది మన నర్సాపురానికి. మొట్టమొదట స్కాట్లాండ్ నుండి ఇక్కడికి వచ్చిన మిస్ మెక్రే, ఈ‌కళను స్థానికులకు నేర్పిందట. అక్కడినుంచి ముందు తరాలకు ఈ కళ వ్యాపించింది. ఎప్పటినుండో ఇల్లుదాటడానికి ఇష్టపడని వనితలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా దీన్ని ఎన్నుకుని, ఇంటిపన్లయ్యాకా లేసులల్లేవారు. దీనికి‌కావలసిన‌ ముడిసరుకులు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కావు - కేవలం ఒక వంపుతిరిగిన సూది, కాటన్ దారం, అంతే కనుక వాళ్లకీ పని అన్నివిధాలా అనుకూలమైంది. 1979 లో 50 మంది స్త్రీలు కలిసి గోదావరి డెల్టా వుమెన్ లేస్ ఆర్టీషియన్స్ కోఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ (GDWLACC) ను స్థాపించి, ఈ కళ వ్యాప్తికి కృషి చేసారు. 2004 లో ప్రభుత్వం వారు, ఇక్కడ 'అలంకృతి లేస్ పార్క్' ను, 'ఇంటర్నేషనల్‌ లేస్ ట్రేడ్ సెంటర్' ను ఏర్పాటు చేసి, లేసు అల్లికలో మహిళలకు శిక్షణ ఇచ్చి, వారు తయారు చేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శించి, అమ్ముకునే అవకాశమిచ్చారు. 

నర్సాపురంలో ఆరంభమైన ఈకళ నెమ్మదిగా పాలకొల్లు, వీరవాసరం, అమలాపురం వంటి ఊర్లదాకా దాకా వ్యాపించింది. అయితే చైనా వారు‌మెషీన్లతో లేస్ తయారు చేయడంతో, మన లేస్ పరిశ్రమకు గొప్ప పోటీ ఎదురైంది. కరోనా వల్ల కూడా ఈ పరిశ్రమ బాగా దెబ్బతింది. ఒకప్పుడు సాలీనా 350 కోట్ల టర్నోవర్ తో రెండు లక్షల మంది చేతిపనివారితో వెలుగొందిన ఈ పరిశ్రమ ఇప్పుడు 30లక్షల టర్నోవర్, లక్ష మంది పనివారే మిగిలే దశకు చేరుకుంది. అయితే....!' దిగులుగా మొహం పెట్టిన వనితల్ని చూస్తూ, ఒక్క క్షణం ఆగారు భావన.

'సృజన అంటూ ఉండాలే కానీ, ఆకాశమే హద్దు! ఎప్పటినుండో పెద్దలు అల్లుతున్న వాటినే కాదు, కాలానికి, అవసరానికి తగ్గట్టు కొత్తవాటినీ తయారు చెయ్యగలగాలి. వాటిని ఫేస్బుక్, వాట్స్ఆప్ బృందాల ద్వారా కొనుగోలుదారులకు చేరువ చేయవచ్చు. ఇప్పటికీ లేసు ఉత్పత్తులను కొనే వారున్నారు. వారిని చేరుకోవడంలోనే మనం విఫలమవుతున్నాము. కనుక, ఈ కళను నేర్చుకోడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ట్రైనింగ్ ఆరంభిద్దాము.' భావన మాటలకు ఆ హాల్ లో చప్పట్లు మారుమ్రోగాయి. 

పది రోజుల ట్రైనింగ్ లో వేదవతి రకరకాల అల్లికల్ని నేర్చుకుంది. టేబుల్ క్లాత్, గుండ్రని చిన్న టేబుల్ కవర్లు, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, టాప్స్, కర్టైన్స్, కట్ వర్క్ బట్టతో లేస్ కలిపి అల్లే పెద్ద దుప్పట్లు, దిండ్లు వంటి అనేక అల్లికల్ని చూపారు. కొత్త కనుక, సూది, దారం పట్టుకోడంతో వేళ్లు వాచి నొప్పెట్టినా, పట్టుదలగా ఆ విద్యపై పట్టు సాధించింది వేదవతి.

ఇప్పుడేం చెయ్యాలి? కొత్తగా ఆలోచించాలి. వినూత్నమైన ఉత్పత్తులు తయారు చెయ్యాలి... అని తీర్మానించుకుంది. మెరిసే పూసలు, లేసు, కలిపి తేలిగ్గా ఉండే చెవిరింగులు అల్లింది. లేసుతో పూసలు కలిపి ఫాషన్ గా అనిపించే హారాలు, దండలూ అల్లింది. లేసుతో తేలికపాటి గాజులు, కాళ్ల పట్టీలు అల్లింది. 

ఒకసారి కాలేజి ఫంక్షన్ కి వెళ్తున్న జానకి కూతురు మాలతికి ఈ ఆభరణాలన్నీ పెట్టుకోడానికి ఇచ్చింది. అంతే, కాలేజీ అమ్మయిలందరూ అవి చూసి, మాక్కావాలంటే మాక్కావాలని వెంటపడ్డారు. అతి తక్కువ ధరకి వాటిని తయారు చేసి వాళ్లకు అమ్మింది. లేసు, పూసలతోనే వాల్ హాంగింగ్స్, తోరణాలు, ఇంట్లో పార్టిషన్లకు తగిలించుకునే పొడవాటి తాళ్లు వంటివి అల్లింది. మాలతి వేదవతి కోసం"వేదా లేస్ వర్క్స్" అనే పేరుతో ఒక వాట్స్ ఆప్ గ్రూప్, ఫేస్బుక్, ఇన్స్టా పేజి ఓపెన్ చేసిచ్చి, ఎలా పోస్ట్ చెయ్యాలో నేర్పింది.‌ తానల్లిన వినూత్నమైన వస్తువుల్ని ఫోటో తీసి, అందులో పెట్టసాగింది వేదవతి.

నెమ్మదిగా వ్యాపారం పెరగడంతో, తనతోపాటు లేసు అల్లిక నేర్చుకున్న మరికొందరిని తోడు తీసుకుంది. ఎవరిళ్లలో వారే అల్లి పంపేవారు. ఏడాది తిరిగే సరికి కొంత డబ్బు సమకూరింది. నెమ్మదిగా నెట్వర్క్ కూడా పెరిగింది. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఆ ఇంటి నిండా, క్రోషియా లేస్ వర్క్ తో తాను తయారుచేసిన వస్తువులు పెట్టింది. తర్వాతేంటి? ఇంకా వినూత్నంగా ఆలోచించాలి...

ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, కనిపించాలనుకుంటారు. అందుకే విదేశీయుల కోసం, స్వదేశీయుల కోసం "డిజైన్ యువర్ డ్రస్" పేరుతో వివిధ రంగులు, డిజైన్ల ఫోటోలతో ఒక కాటలాగ్ తయారుచేసింది. వాటి కాంబినేషన్స్ బట్టి స్కార్ఫ్స్, పాంఛోస్, షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, టాప్స్ వంటివి ఎలాగైనా ఎంచుకోవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కలంకారీ, పోచంపల్లి వంటి బట్టలను కట్ వర్క్ లో, ఇతర దుస్తులలో వాడి తన డిజైన్లకు మరిన్ని మెరుగులు దిద్దింది.

సృజన, అందుబాటు ధరలు, అవిశ్రాంతమైన కృషి, టైం కి డెలివరీ ఇచ్చే ఖచ్చితత్వం...అన్నీ కలిపి "వేదా లేస్ వర్క్స్" ను సమున్నత స్థానంలో నిలబెట్టాయి. 

ఆరోజు మహిళా దినోత్సవం... వుమెన్ ఎఛీవర్స్ విభాగంలో వేదవతిని సన్మానించాలని సభకు ఆహ్వానించారు. భర్త హనుమంతుతో కలిసి, వెళ్లింది వేదవతి. సన్మాన కార్యక్రమాలవీ అయ్యాకా ఆమెను ప్రసంగించమన్నారు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అందరికీ నమస్కరించి, గొంతు విప్పింది వేదవతి.

"ఒకప్పుడు నన్ను ఇంట్లోవాళ్లు తుమ్మమొద్దు, తుమ్మమొద్దూ అని పిలుస్తూంటే, నిజంగానే, నాకేమీ రాదేమో అనుకున్నాను. ఆ పిలుపు వినీ, వినీ అసలు నాకో పేరుందన్న సంగతే మరిచిపోయాను. కానీ అనుకోకుండా, యాభై ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశంతో, నిరంతర కృషితో... ఇదిగో, ఇలా మీ ముందు నిలబడ్డాను. 

ఓర్పు, సహనం, క్షమ, దయ, ప్రేమ వంటి లక్షణాలు స్త్రీకి పెట్టని ఆభరణాలు! వీటితో మనం దేన్నైనా సాధించవచ్చు. లేసు పనిలో ఆసక్తి ఉన్న మహిళలందరికీ ఈ సందర్భంగా ఉచిత శిక్షణను, ఉపాధిని కల్పిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఈ ఒక్క కళ మాత్రమే కాదు...

నాలాగే, తమలోనే పొదిగి ఉన్న శక్తి సామర్ధ్యాలు తెలియకుండా, యాంత్రికంగా జీవితాలు గడిపేస్తున్న ఎంతోమంది వనితలు మీలో ఉండవచ్చు. మీకు కూడా ఏదో ఒక కళలో ఆసక్తి ఉండవచ్చు. దానివైపు మీరు వేసే తొలి అడుగే... వచ్చే ఏడాది మిమ్మల్ని ప్రేక్షకుల స్థానం నుంచి, ఈ వేదిక మీద ఒక విజేతగా  నిలబెట్టవచ్చు. ఆలోచించండి, ముందడుగు వెయ్యండి, మీకంటూ ఒక గుర్తింపును సాధించండి. 

ఈరోజున నన్ను 'ఏమే, ఒసే, తుమ్మమొద్దూ' అని పిలవాలంటే గొంతులో ఏదో అడ్డంపడినట్టు ఆగిపోతారు! 'వేదా' అనే పిలుస్తారు. అందరూ మర్యాదగా మాట్లాడతారు. వీధిలో కనిపిస్తే గౌరవిస్తారు. కేవలం నా లేసు ఉత్పత్తుల కొనుగోలుకే ఊళ్లోకి వెతుక్కుంటూ వస్తారు. ఎందుకని?

నా పని మాట్లాడింది, నా కృషి నాకు తెలీకుండా పోగొట్టుకున్న నా గౌరవాన్ని, తిరిగి ఇచ్చింది. నా సృజన నన్ను మీ ముందిలా నిలబెట్టింది. వందల వేలమంది వనితలు ఇలాంటి విజయాలు సాధించి, మహిళా శక్తి ఏమిటో నిరూపించాలని మనసారా కోరుకుంటున్నాను."

అప్రయత్నంగా చప్పట్లు కొట్టాడు హనుమంతు. మిగతా సభలోని వారు కూడా అతనితో శృతి కలిపారు. మరెన్నో ప్రస్థానాలకు, తొలిబీజం ఆరోజే ఎన్నో మనసుల్లో నాటుకుంది. 'కృషితో నాస్తి దుర్బిక్షమ్!'

 
***

No comments:

Post a Comment

Pages