శ్రీధరమాధురి - 108
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
భక్తి అంటే భగవంతుని పట్ల బేషరతైన ప్రేమే. అళ్వార్లు, ఆచార్యులు, నాయనార్లు, తుకారాం సురదాస్ వంటి అనేక మంది మునులు, ఋషులు, తమ వ్యక్తిగత జీవితంలోని సమస్యలను పరిష్కరించమని ఏనాడూ భగవంతుని కోరలేదు. వారి జీవితంలో అనేక దుఃఖాలను అనుభవించారు, కానీ భగవంతుని పట్ల వారి భక్తి మాత్రం సడలలేదు. వారు భగవంతుడి నుండి ఎలాంటి ఉపశమనాన్ని కోరలేదు. నిజానికి జీవితంలోని కలతలన్నీ వారు ఆనందంగా అనుభవించారు. భగవంతుని పట్ల ఎటువంటి సంగమూ లేని దివ్య ప్రేమకు వారు చక్కని ఉదాహరణ.
****
ఉదారత తో నిండిన హృదయం, వాత్సల్యంతో కూడుకున్న మాట, దయతో కూడుకున్న చేతలు, ఎటువంటి నిబంధనలు లేని ప్రేమ ఒకరిని సత్యానికి చేరువగా తీసుకువెళ్తాయి.
****
నేను ఒక కథ విన్నాను...
ఒకతను ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందాలనుకున్నా డు. అందుకతడికి ఒక గురువు అవసరమయ్యారు. అతను ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక మనిషిని చూశాడు.
అతనిలో అడిగాడు, ' ఆత్మజ్ఞానం దిశగా నన్ను నడపగల ఒక గురువు నాకు కావాలి. ఈ విషయంలో మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరా?'
చెట్టు కింద కూర్చున్న మనిషి ఇలా అన్నాడు, ' నేను నీ గురువు వైపునకు దారి చూపగలను. నీ గురువు ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఆయనకు విశాలమైన నుదురు ఉంటుంది. ఆయన కళ్లు ప్రేమతో వెలుగుతూ, చామన ఛాయలో ఉంటాయి. ఆయన ముఖం పొడవుగా ఉంటుంది. ఆయనకు దట్టమైన గడ్డం ఉంటుంది. ఆయన అనుసరించే వారు ఎవరూ ఉండరు. నవ్వుతూ ఉంటారు. ఆయన నలుపు రంగులో ఉంటారు.'
ఇప్పుడు అతనికి తన గురువు ఎలా ఉంటారో తెలిసింది కనుక, ఆధ్యాత్మిక ఉన్నతికై కలిగిన తృష్ణ అతడ్ని దహించ సాగింది. తన గురువును వెతుక్కుంటూ అతను దేశమంతా అన్ని ప్రాంతాలూ తిరిగాడు. అతను వెతికాడు, వెతికాడు. అటువంటి లక్షణాలు ఉన్న ఒక్క వ్యక్తి కూడా అతనికి తారసపడలేదు. 30 ఏళ్లు గడిచిపోయాయి. అతడు వృద్ధుడు అయ్యాడు తిరిగి తన పట్టణానికి వచ్చేశాడు.
అప్పుడతడు తన గురువుని గురించి మొదట తనకు చెప్పిన మనిషి వద్దకు వెళ్ళాడు.
ఆశ్చర్యం అతడికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని కింద ఉన్న వ్యక్తికి విశాలమైన నుదురు ఉంది. గోధుమ రంగులో ఉన్న అతడి కళ్ళు ప్రేమతో వెలుగుతున్నాయి. అతడి ముఖం పొడవుగా, దట్టమైన గడ్డంతో ఉంది. అతడి చుట్టూ ఎవరూ లేరు. అతడు ఈ వ్యక్తిని చూసి నవ్వుతున్నాడు. నలుపు రంగు శరీరంతో ఉన్నాడు.
గురువు ఇలా అన్నారు, 'నేను నీ గురువుని గురించిన సూచనలు చేసినప్పుడు నువ్వు ఆయనను వెతికి పట్టుకోవాలని అనుకున్నావు. కానీ ఆ సమయంలో నువ్వు సిద్ధంగా లేవు. నీకు గమనించే శక్తి లేదు. నువ్వు తొందరలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి చూసావు. నువ్వు కలిసిన వ్యక్తులు మంచివారు- చెడ్డవారు, ధర్మపరులు - అధర్మపరులు, నిందాపరులు - సాధువులు ఉన్నారు. వారిని కలవడం వృధా ప్రయాస కాదు, వారు నీకు అనుభవాన్ని ఇచ్చారు. అన్నింటినీ గమనించే ఓర్పును నేర్పారు. ఇప్పుడు నువ్వు అన్ని గమనించ గలుగుతున్నావు. పరిపూర్ణమైన వ్యక్తిగా నా వద్దకు తిరిగి వచ్చావు. ఇప్పుడు నీవు ఆ రోజు నేను చెప్పిన సత్యాన్ని చూడ గలుగుతున్నావు.
ఆరోజున నీ మనసుకు మబ్బులు కమ్మి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పొందిన అపరిమితమైన అనుభవం వల్ల, ఆ మబ్బులు తొలగిపోయాయి. రా, జీవితంలోని సూక్ష్మమైన అంశాలను నీకు బోధిస్తాను. ఇన్నాళ్లు నువ్వు దేన్నయితే కోరుకున్నావో, దాన్ని సాధించేందుకు నీకు సహాయం చేయనివ్వు.
శిష్యుడు చివరికి తన గురువును కనుగొన గలిగినందుకు. సజల నయనాలతో పరమానందం పొందాడు.
అతడు గురువుకి ముమ్మారు నమస్కరించి ఆయనతో తన అభ్యాసాన్ని మొదలుపెట్టాడు.
ఇదంతా కాలానికి సంబంధించిన విషయం. జీవితం ఆశ్చర్యాలను విసురుతుంది. మనం కేవలం గమనించడం, ఆశ్చర్యపోవడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం ద్వారా పొందే జ్ఞానం ప్రయాసతో కూడుకున్నది, ఎంతో కాలం తీసుకుంటుంది. అన్నిటికీ సాక్షి భూతంగా ఉంటూ, గమనిస్తూ, ఆశ్చర్యపోతూ, నమ్మకంతో ఉండడం అనేది ప్రయాస లేనిది. ఇవన్నీ ఒక మనిషి సులభంగా శ్రీమన్నారాయణుడి నివాసమైన వైకుంఠాన్ని చేరుకునేలా చేస్తాయి.
***
No comments:
Post a Comment