ఆటోరిక్షా ఆనందయ్య - అచ్చంగా తెలుగు
ఆటోరిక్షా ఆనందయ్య
(మా జొన్నవాడ కథలు)
- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)



“పిల్లకాలయంతా తొందరగా రావాల. లగెత్తుకుంటూ రావాల" అని జొన్నవాడ దేవళం దగ్గర అరుస్తున్నాడు ఆనందయ్య ఆటో హారన్ మోగిస్తూ. పిల్లకాయలంతా బిలబిలమని పరుగులెత్తుకుంటూ వచ్చి చేరిపోయారు. వాళ్ళ బ్యాగులన్నీ నీట్‌గా వెనుక ప్రక్కన సర్దేశాక అందరూ వచ్చారోలేదో అని లెక్కపెట్టుకుని "పోదామా ఇంక.." అన్నదానికి "ఓకే అంకుల్" అన్నారు. ఈ అంకులేందో.. పెంకులేందో అని నవ్వుకుంటూ స్టార్ట్ చేశాడు. ఐదునిముషాలు అవంగానే చిన్నికృష్ణ  "అంకుల్.. నిన్న మిత్రలాభమని ఏదో కథ చెప్తూ ఆపేశావు. అది చెప్పు"  అన్నాడు. ఆనందయ్య నవ్వుతూ "ఎక్కడిదాకా చెప్పానో చెప్పండి" అనగానే పక్షులన్నీ వలతో సహా పైకెగిరాయి అని చెప్పావు" అన్నాడు. "అవును కదా! గుర్తొచ్చింది" అంటూ కథ మొత్తం చెప్పేసరికి వాళ్ళ స్కూల్ రానే వచ్చింది. "బై అంకుల్" అని అందరూ అంటుండగా "మీకు బువ్వదినే వేళయ్యేటప్పటికి ఈణ్ణే ఉంటా. నేనేడికి బోతాను" అని వెళ్ళిపోయాడు.
ప్రతిరోజూ వాళ్ళను దింపేసి, సిటీలో నాలుగు బేరాలు చూసుకోని లంచ్ టైముకు స్కూల్ దగ్గర వాలిపోతాడు. అందరూ అన్నం తిన్నారా లేదా అని ఆయాను వాకబు చేస్తాడు. వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత వాళ్ళకు చాక్‌లెట్లు, బిస్కెట్లు కొనిస్తాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి బేరాలు చూసుకొని సాయంత్రం నాలుగు కొట్టేసరికి అరగంట ముందే అక్కడికి చేరుకుని వాళ్ళను జాగ్రత్తగా ఎక్కించుకొని జొన్నవాడ చేరుస్తాడు. ఆనందయ్య పదో తరగతి తప్పడంతో వళ్ళ నాయన రిక్షా పది సంవత్సరాలు తొక్కాడు. తర్వాత సిటీలో రిక్షాలు ఎవ్వరూ ఎక్కకపోయేసరికి, జొన్నవాడ కోపరేటివ్ బ్యాంకులో అప్పు తీసుకుని ఆటో కొన్నాడు. అప్పు ఐదేళ్ళలో టంచన్‌గా తీర్చేశాడు. పిల్లల తల్లిదండ్రులిచ్చేది కలిపి నెలకు పెట్రోలు ఖర్చులు పోను ముప్పై వేలు ఆదాయం వస్తుంది. పిల్లలు లేకపోవడంతో భార్య చీటీలు కట్టి, కోపరేటివ్ బ్యాంకులో కొద్ది కొద్దిగా డబ్బులు దాచేది.  జొన్నవాడలో సొంత పెంకుటిల్లు. భార్య ఎన్ని మ్రొక్కులు మొక్కుకున్నా పిల్లలు కలగలేదు. ఆనందయ్య మాత్రం రోజూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ, వాళ్ళతోనే ఆనందంగా గడిపేస్తున్నాడు.
పిల్లకాయలూ మీరంతా పెద్దైంతర్వాత గొప్ప గొప్ప ఇంజినీర్లు, డాక్టర్లు, టీచర్లు అయిపోతారు కదా అప్పుడు కూడా మీరు నేను చెప్పిన కథల్లోలాగా నీతి న్యాయంగా ఉండాలి. నన్నంటే మీరు మరచిపోతారు. కనీసం పెద్దవాళ్ళ పట్లా, పేదవాళ్ళ పట్లా దయా జాలి ఉండాలన్న విషయమన్నా గుర్తుపెట్టుకోండి. ఉన్నదాంట్లో కొంత,  లేని వాళ్ళకు ఇవ్వండి. వాళ్ళ కళ్ళల్లో వెలిగే ఆనందం మీకు కోటి రూపాయలిచ్చినా దొరకదు అంటూ చెప్తూ ఉండేవాడు. ఇవన్నీ వద్దు. కథలు చెప్పు అనేవాళ్ళు.
ఎప్పుడైనా ఆనందయ్యకు వంట్లో బాగోలేకపోతే, పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్లు వేరే ఆటోల్లో వెళ్ళేవారే గానీ వాళ్ళ మొహంలో కళా కాంతులు ఉండేవి కావు. రోజూ ఆనందయ్య ఇంటికివెళ్ళి "తగ్గిందా.. రేపట్నుంచీ వస్తావా!" అని అడిగే వారు. భార్య మాత్రం "పోండ్రా పిల్ల సన్నాసుల్లారా! ఆయనకు పేణం బాగాలేకుండా ఉంటే మీగోలేంది" అని గద్దించేది. ఆనందయ్య "అట్టా అనమాకే వాళ్ళందరూ నీ పిలకాయలైతే అట్ట కోప్పడతావా?" అని నవ్వేవాడు.
ఆనందయ్య అలా ఇరవై సంవత్సరాలు గడిపాడు. వయసు మీద పడిపోయింది. అరవై యేళ్ళు దాటే సరికి ఆయాసం, దగ్గు విపరీతంగా వచ్చేది. ఆటో అమ్మేసి డబ్బులు భార్య కిచ్చాడు. భార్య కొంత డబ్బులు దాచినా మందులకు ఖర్చయిపోయేవి. భార్య అక్కడా ఇక్కడా పాచిపనులు, పొలం పనులు చేసి ఇల్లు గడిపి భర్తకు ఏ లోటూ రాకుండా చూసేది. నానాటికి ఆనందయ్య అనారోగ్యం పెరిగిందే తప్ప తగ్గలేదు.
ఒకరోజు పెద్ద పడవ కారొచ్చి ఆనందయ్య ఇంటి ముందు ఆగింది. ఆనందయ్య దగ్గుతూ “ఎవరో వచ్చారు చూడు!” అని భార్యను పంపాడు. ఎవరో ఒక ముప్పై ఏళ్ళ అబ్బాయి కారు దిగి నిలబడి "ఆనందయ్య అనీ.." అనగానే ఆమె "అవును మా ఆయనే వంట్లో బాగాలేదు" అనింది. ఆ అబ్బాయి లోపలికి వచ్చి కుక్కిమంచం మీద పడుకున్న ఆనందయ్యను చూశాడు. వెంటనే అక్కడ ఉన్న చిన్న స్టూల్ లాగి కూర్చున్నాడు. ఆనందయ్య లేచి దగ్గుతూ "అయ్యా మీరు..పెద్దోళ్ళు ఇక్కడ కూచోడం బాగుండదు. ఏమి కావాల మీకు?" అన్నాడు.
నాపేరు చిన్ని కృష్ణ నేను చిన్నప్పుడు మా నాన్న ఇక్కడ పశువుల డాక్టరుగా ఉండేవాడు. ఆయనపేరు శ్రీరాములు అనేసరికి ఆనందయ్య ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చొని ..”అవునా..ఏం నాయనా ఇట్టా వచ్చావు? నువ్వూ మీ నాయనగారు గుర్తేనాకు బాగా " అని అయితే ఇప్పుడెందుకొచ్చావు?" అన్నట్టు చూశాడు.
"చెప్తాను. ఇప్పుడు నేను చెన్నై లో డాక్టరును. నేను చేసే హాస్పిటల్లో నాతో పాటూ ఏభై మంది పనిచేస్తారు" అంటూ చెబుతూ ఉండగా భార్య ఎదురు షాపులో కూల్‌ డ్రింక్ తెచ్చి ఇచ్చింది. తాగకుండా ప్రక్కనపెట్టి కొనసాగిస్తున్నాడు. ఆమె ఆశ్చర్యంగా వింటోంది. "నేను అన్ని కోర్సుల్లోను ఫస్ట్ వచ్చేవాడిని. ఫారిన్ వెళ్ళి చదువుకున్నాను. ఎక్కడికి పోయినా నాకు డాక్టర్లు గానీ పేషంట్లు గాని ఇస్తున్న గౌరవం ఇతరులకు ఇచ్చేవాళ్ళు కాదు. నాకర్ధమయేది కాదు. అందరూ నాకొక్కడికే ఎందుకింత గౌరవం ఇస్తున్నారనే విషయం. నా డ్యూటీ నేను చేసేవాడిని. చివరకు అమెరికాలో ఒక పెద్ద సదస్సులో ఒక డాక్టరు నా ఉపన్యాసం అయ్యాక లేచి " మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ చిన్నప్పటి సంగతులు జ్ఞాపకాలు చెప్పండి. మీ ఈకీర్తికి ప్రేరణ ఎవరు? " అని అడిగాడు. అప్పుడు అన్నీ చెబుతూ చెబుతూ ఉండగా నాకు మీరు మీ నీతి కథలు, పేదలపట్ల, పిల్లల పట్లా జాలి కరుణా ఎలా చూపించాలి అని మీరు చెప్పినవన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ వాళ్ళకు చెప్పాను.  మీ గురించి చెప్పాను. అప్పుడు గుర్తొచ్చింది మీ విలువ. మీ వలననే నేడు నాకీ గౌరవాభిమానాలు" అంటుండగా ఆందయ్య కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి.
"మీ ఆరోగ్యం గురించి దిగులొద్దు. నెలకొకసారి వచ్చి అమ్మ కామాక్షమ్మను, నిన్ను చూస్తాను. నీ ఆరోగ్య బాధ్యతే కాదు. నీకు డబ్బు సహాయం కూడా చేస్తాను" .  ఇద్దరూ నివ్వెర పోయారు. లోకంలో ఇలాంటి  మనుషులుంటారా అని. డాక్టరు కారు తీసి స్టెతస్కోపు, బి.పి మిషన్ తీసుకొని  ఆనందయ్యకు బి.పి పరీక్ష చేసిన తర్వాత ఆనందయ్య డాక్టరు చేయిపట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాడు. డాక్టరు "చెప్పిండి ఇంకా ఏమిటి మీ ప్రాబ్లంస్" అంటున్నాడు. 
ఆనందయ్య డాక్టరు చేయి వదలకుండానే "బాబూ..నా జీవితంలో దాదాపు వంద మందిని తీసుకెళ్ళి నీతి కథలు చెప్పాను. నా పిల్లల్లా భావించి అన్నీ కొనిపెట్టాను. ఇంతవరకూ ఒక్కడు కూడా తిరిగి నాదగ్గరకు రాలేదు. ఒక్కడైనా తిరిగి వస్తాడేమో…చూసి కళ్ళుమూద్దామని ఎదురు చూస్తూనే ఉన్నా. నాకిక చాలు. బ్రతకాలని లేదు. నా ఆశ తీరిపోయింది" అన్నాడు. ఆనందయ్య ఏడ్పు చూసి డాక్టరు అలా బాధ పడొద్దు నేనున్నాను" అన్నాడు. ఆనందయ్య చూపులు డాక్టరు వేపు చూస్తూ చూస్తూ ఆగిపోయాయి. డాక్టరు స్టెతస్కోపు పెట్టి చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఆనందయ్య చేతిలో డాక్టరు చెయ్యి బిగుసుకోవడం చూసి మెల్లిగా వదిలించుకుని లేచి నిలబడ్డాడు.
-o0o-

No comments:

Post a Comment

Pages